Chess player
-
ఎత్తులు వేయడంలో దిట్ట.. ఆమె ఆవేదనకు సీఎం రిప్లై ఇదే(ఫొటోలు)
-
‘నన్నెందుకు గుర్తించడం లేదు.. బాధగా ఉంది’.. స్పందించిన సీఎం
భారత చదరంగ క్రీడాకారిణి తానియా సచ్దేవ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. చెస్ ప్లేయర్‌గా తనకు సరైన గుర్తింపునివ్వడం లేదంటూ ఢిల్లీ ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఇతర రాష్ట్రాలు ఎంతో ముందున్నాయని.. కానీ ఢిల్లీలో మాత్రం దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితి లేదని వాపోయింది.స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జట్టులోనూఈ మేరకు.. ‘‘2008 నుంచి దేశం తరఫున వివిధ చెస్ టోర్నీల్లో పాల్గొంటున్నాను. ఎన్నో విజయాలు సాధించాను. అయినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేకపోవడం బాధగా ఉంది. ఇతర రాష్ట్రాలు మాత్రం తమ ఆటగాళ్లలోని ప్రతిభను గుర్తిస్తూ.. వారి విజయాలను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నాయి.కానీ ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇంత వరకు ఎలాంటి ముందడుగు వేయలేదు. 2022 చెస్ ఒలింపియాడ్‌లో చారిత్రక విజయం సాధించి.. కాంస్యం గెలిచిన జట్టులో నేను సభ్యురాలిని. వ్యక్తిగత పతకం కూడా సాధించాను. రెండేళ్ల తర్వాత.. అంటే 2024 చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జట్టులోనూ నేను భాగమే.అయినప్పటికీ ఇప్పటిదాకా ఢిల్లీ ప్రభుత్వం నుంచి నాకెలాంటి గుర్తింపు లభించలేదు. ఢిల్లీ, భారత్ తరఫున అంతర్జాతీయ వేదికలపై ప్రాతినిథ్యం వహించడాన్ని గొప్ప గౌరవంగా భావించే నాకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం బాధగా ఉంది.ఇకనైనా విలువ ఇవ్వండిఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), అతిశి మేడమ్, అరవింద్ కేజ్రీవాల్ సర్.. ఇకనైనా క్రీడలు, క్రీడాకారుల విలువను గుర్తించి చెస్ అథ్లెట్లకు అండగా ఉంటారని ఆశిస్తున్నా’’ అని తానియా సచ్దేవ్ సోమవారం సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి మర్లెనాతో పాటు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌లను ట్యాగ్ చేస్తూ తన విజ్ఞప్తిని తెలియజేసింది.గుకేశ్‌కు భారీ నజరానాకాగా ఈ ఏడాది చెస్ ఒలింపియాడ్ విజేతగా నిలిచిన భారత జట్టులో తానియా సచ్దేవ్ కూడా ఉంది. గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్), వైశాలి (తమిళనాడు), అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), వంతిక అగర్వాల్‌లతో కలిసి పసిడి పతకాన్ని అందుకుంది.ఇక ఇటీవల ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌పై తమిళనాడు ప్రభుత్వం కనక వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఈ పద్దెమినిదేళ్ల కుర్రాడికి రూ. 5 కోట్ల భారీ నజరానా అందజేసింది. ఈ నేపథ్యంలో 38 ఏళ్ల తానియా సచ్దేవ్ తాజా పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. స్పందించిన సీఎంతానియా సచ్దేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అతిశి మర్లెనా స్పందించారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని.. ఏ విషయంలో ఆమెకు అసౌకర్యం కలిగిందో చెప్పాలన్నారు. చెస్ ప్లేయర్ల కోసం తాము ఇంకా ఏమేం చేయగలమో చెప్పాలని సూచించారు. తన కార్యాలయం త్వరలోనే తానియాను సంప్రదించి.. అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుంటుందని అతిశి ఎక్స్ వేదికగా చెస్ ప్లేయర్‌కు హామీ ఇచ్చారు. చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత -
చదరంగం ఎత్తులే కాదు, డ్యాన్స్ స్టెప్పుల్లోనూ మనోడు తోపు, వైరల్ వీడియో
చెన్నైకి చెందిన ఇండియన్ చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ స్టార్ ఆఫ్ ది సోషల్ మీడియాగా హల్ చల్ చేస్తున్నాడు. 17 ఏళ్ల వయసులోనే ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలిచి అత్యంత పిన్న వయసులోనే వరల్డ్ ఛాంపియన్షిప్ ఛాలెంజర్ గా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి ఫ్యామస్ తమిళ సినిమా పాట స్టెప్పులతో అదర గొట్టాడు. మనసులాయో అంటూ దీనికి సంబంధించిన వీడియోను గుకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. చదరంగంలో ప్రత్యర్థులు తోకముడిచే స్టెప్పులే కాదు,అదిరే స్టెప్పులతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు ‘‘యుద్ధంలో రాణి (చెస్‌లో క్వీన్ పాత్ర)ని ముందు పెట్టి ఎలా నెగ్గాలో తెలిసినవాడు, మొత్తానికి గుకేశ్ రెండో కోణాన్ని ఆవిష్కరించాడు’ అంటూ పలువురు వ్యాఖ్యానించారు. మరి మన ఆటగాడి స్టెప్పులేంటో మీరూ చూసేయండి. Manasilayo...with my family friends!Idhu epdi irukku 😎 pic.twitter.com/r2hkDWYiJE— Gukesh D (@DGukesh) September 29, 2024 -
Erigaisi Arjun: తడబాటు నుంచి తారాస్థాయికి...
స్వీయ అంచనాలతో పాటు... ఫలితాల ఒత్తిడితో సతమతమై కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్... వాటిని పక్కన పెట్టడం వల్లే విజయవంతం అయ్యానని వెల్లడించాడు. ఇటీవల హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు తొలిసారి చాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన ఈ ఓరుగల్లు కుర్రాడు ఇక మీదట కూడా ఇదే జోరు కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.వందేళ్ల చరిత్ర ఉన్న చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు తొలిసారి స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించగా... అందులో తన వంతు పాత్ర ఉండటం ఆనందంగా ఉందని 21 ఏళ్ల అర్జున్ అన్నాడు. ఒలింపియాడ్‌లో ఆడిన 11 గేమ్‌ల్లో తొమ్మిదింట నెగ్గిన అర్జున్... వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణం సాధించడంతో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కెరీర్లో అత్యుత్తమంగా మూడో స్థానానికి దూసుకెళ్లాడు. చెస్ ఒలింపియాడ్ ప్రదర్శన, కెరీర్ లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికలపై అర్జున్ చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే... అతిగా ఆలోచించి... ఒత్తిడిని అధిగమించడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. కెరీర్ ఆరంభంలో పెద్దగా ఆందోళన చెందలేదు. అయితే 2021లో నా ఎలో రేటింగ్ పాయింట్లు 2500 ఉండేవి. కానీ నా సామర్థ్యం కచ్చితంగా అంతకన్నా ఎక్కువే అని నమ్మేవాడిని. ఇక రెండేళ్లు తిరిగేసరికి 2023లో ఎలో రేటింగ్ 2700కు చేరింది. కానీ ఆ సంవత్సరం చాలా కష్టంగా గడించింది. కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అందులో ముఖ్యమైంది క్యాండిడేట్స్ టోర్నీకి ఎంపిక కాకపోవడం. చాన్నాళ్లుగా ఆ టోర్నీలో ఆడాలని అనుకుంటూ వచ్చా. అయితే గత ఏడాది దానికి అర్హత సాధించలేకపోవడం బాధించింది. ఒకప్పుడు సొంత అంచనాలతో సతమతమయ్యేవాడిని. ఎక్కువ ఊహించేసుకొని గందరగోళానికి గురయ్యే వాడిని. ఫలితాల గురించి అతిగా ఆలోచించడం నా ఆటతీరుపై ప్రభావం చూపింది. దాన్ని మార్చుకోవడం అంత సులువుకాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా. ఫలితాలను పట్టించుకోవడం మానేశా. ఏదో సాధించాలని తీవ్రంగా కోరుకుంటూ నాపై నేనే ఒత్తిడి పెంచుకుంటున్నానని అర్థం చేసుకున్నా. వాటిపై దృష్టి పెట్టడం వదిలేశాక మెరుగైన పలితాలు రావడం ప్రారంభమైంది. అదే అతిపెద్ద లక్ష్యం! ప్రపంచ చాంపియన్‌గా నిలవడమే నా అతిపెద్ద లక్ష్యం. అయితే ఒకేసారి పెద్ద లక్ష్యాలను కాకుండా ఎప్పటికప్పుడు చిన్న చిన్న గమ్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకుంటూ ముందుకు సాగుతున్నా. ఒక టోర్నమెంట్లో బరిలోకి దిగితే దాని గురించే ఆలోచిస్తా. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి సానుకూల ఫలితం సాధించాలనుకుంటా. ప్రస్తుతం మన ప్లేయర్లు అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. దీన్ని చదరంగంలో మన ‘గోల్డెన్ ఎరా’గా చెప్పుకొవచ్చు. నాతో పాటు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. మేమంతా స్నేహితులం గుకేశ్, ప్రజ్ఞానందతో మంచి అనుబంధం ఉంది. చాన్నాళ్లుగా కలిసి ఆడుతుండటంతో మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఒకరి విజయాన్ని మరొకరం ఆస్వాదిస్తాం. వాటి నుంచి స్ఫూర్తి పొందుతాం. ఒకరికి ఒకరం అండగా నిలుస్తాం. మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ఇది ఎంతగానో దోహద పడుతుంది. 2003 నుంచి 2006 మధ్య జన్మించిన వాళ్లమే జట్టులో ఎక్కువ మంది ఉన్నాం. అందులో నేనే పెద్దవాడిని. ప్రస్తుతం మన దశ నడుస్తోంది. స్వతహాగా నేను టీమ్ ఈవెంట్లు ఆడేందుకు ఎక్కువ ఇష్టపడతా. గ్లోబల్ చెస్ లీగ్ (జీఎస్ఎల్) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. చెస్ ఐపీఎల్ గ్లోబల్ చెస్ లీగ్‌ను చదరంగ ఐపీఎల్ అని భావిస్తా. సమష్టి ప్రదర్శనలు అంటే నాకు చాలా ఇష్టం. ర్యాపిడ్ ఫార్మాట్లో జరగనున్న గ్లోబల్ చెస్ లీగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నా. ఈ లీగ్‌లో ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. నల్ల పావులతో ఆడి విజయం సాధిస్తే నాలుగు పాయింట్లు... తెల్ల పావులతో గెలిస్తే మూడు పాయింట్లు కేటాయిస్తారు. అంటే తెల్ల పావులతో ఆడిన సహచరుడు పరాజయం పాలైతే... ప్రత్యర్థి జట్టు పాయింట్లను అందుకునేందుకు ఇద్దరు ఆటగాళ్లు విజయాలు సాధించాల్సి ఉంటుంది. దీనివల్ల ‘డ్రా’ల సంఖ్య బాగా తగ్గుతుంది. అందుకే ఈ ఫార్మాట్ నన్ను బాగా ఆకర్షించింది. గత జీఎస్‌ఎల్‌లో ప్రపంచ నంబర్‌వన్ నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్తో కలిసి ఒకే జట్టు తరఫున బరిలోకి దిగడం చాలా సంతోషంగా అనిపించింది. కార్ల్సన్ సహచర్యంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ ఏడాది భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ జట్టు తరఫున ఆడనున్నా. నా ఆటపై ఎంతో ప్రభావం చూపిన గురువు లాంటి విశ్వనాథన్ ఆనంద్‌తో సమయం గడిపేందుకు ఎదురుచూస్తున్నా. మానసికంగా సిద్ధమయ్యా... ప్రయత్న లోపం లేకుండా చూసుకోవడం ప్రారంభించిన తర్వాత ప్రశాంతంగా ఉన్నా. ఫలానా టోర్నీలో ఫలానా ఆటగాడిపై తప్పక గెలవాలని అనుకున్నప్పుడు ఆశించిన ఫలితాలు వచ్చేవి కావు. ఆ తర్వాత అత్యుత్తమ ఆటతీరు కనబరిస్తే ఫలితం కూడా అందుకు తగ్గట్లే ఉంటుందనే విషయం గ్రహించా. ఇది చెప్పినంత సులభం కాదు. ఒత్తిడి నుంచి బయటపడి మెరుగైన ప్రదర్శన చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. దానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. గత ఏడాది క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించలేకపోవడం చాలా బాధించింది. ఈ ఏడాది చాలా బాగా గడిచింది. ఇదే జోరు మున్ముందు కూడా కొనసాగించాలనుకుంటున్నా. -
కెరీర్ బెస్ట్ ర్యాంకులో దివ్య దేశ్‌ముఖ్ (ఫోటోలు)
-
‘ముందు రాయ్‌బరేలీ నుంచి గెలవండి’
లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ కంచుకోట స్థానాలైన రాయ్‌బరేలీ, అమేథీ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఆ పార్టీ తమ అభ్యర్థులు ప్రకటించింది. రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అమేథీలో కిషోర్ లాల్ శర్మను బరిలోకి దించింది. రాహుల్ గాంధీ తాను మూడు సార్లు గెలిచిన అమెథీని వదిలి రాయ్‌బరేలీ బరిలో దిగటంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. బీజేపీ నేతలే కాకుండా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ సైతం రాహుల్‌గాంధీపై విమర్శలు చేశాడు. ‘గ్యారీ కాస్పరోవ్, విశ్వనాథ్ ఆనంద్ వంటి చెస్ ఆటగాళ్లు.. త్వరగా రిటైర్ అవటం మంచిదైంది. వారు.. ఒక చెస్ మెథావిని ఎదుర్కొవల్సిన అవసరం లేదు’ అని ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌కు.. ‘అగ్రస్థానం కోసం సవాల్ చేసే ముందు ముందు రాయ్‌బరేలీ నుంచి గెలివాలి’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి గ్యారీ కాస్పరోవ్ సెటైర్ వేశారు.Traditional dictates that you should first win from Raebareli before challenging for the top! 😂— Garry Kasparov (@Kasparov63) May 3, 2024మరోవైపు.. నటుడు రన్వీర్ షోరే స్పందిస్తూ.. ఈ పరిణామాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారని రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియోతో గ్యారీ కాస్పరోవ్‌ను ట్యాగ్ చేశారు. ‘భారత రాజకీయాల్లో నా చిన్న జోక్ ప్రభావితం చేయదని ఆశిస్తున్నా. అయితే నాకు నచ్చిన చెస్ ఆటలో మాత్రం రాజకీయ నాయకుడు (రాహల్ గాంధీ) ఆడటం చూడకుండా ఉండలేను!’ అని గ్యారీ కాస్పరోవ్ అన్నారు.Nice one, @Kasparov63, but can you handle this move? https://t.co/xrWFf3zLK9 pic.twitter.com/quuw4JGB43— Ranvir Shorey (@RanvirShorey) May 3, 2024రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో పోటీ చేయటంపై కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ వివరణ ఇచ్చారు. ‘రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయటంపై చాలా మందికి పలు అభిప్రాయాలు ఉంటాయి. అయితే అందరూ.. రాహుల్ గాంధీకి రాజకియాలతో పాటు చెస్ ఆట మీద చాలా పట్టుందని మర్చిపోవద్దు’ అని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. దీంతో ఆయన ట్వీట్‌పై బీజేపీ నేతలు, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.Many people have many opinions on the news of @RahulGandhi contesting elections from Rae Bareli.Remember, he is an experienced player of politics and chess. The party leadership takes its decisions after much discussion, and as part of a larger strategy. This single decision…— Jairam Ramesh (@Jairam_Ramesh) May 3, 2024చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను రష్యా ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. పుతిన్ ప్రభుత్వంపై ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించడమే దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వ విధానాలను కాస్పరోవ్ వ్యతిరేకించడం వల్లే అధికారులు ఆయన్ను ఉగ్రవాదులు, తీవ్రవాదులు జాబితాలోకి చేర్చారు. చెస్‌లో పలుమార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన 60 ఏళ్ల గ్యారీ కాస్పరోవ్ చాలా కాలంగా పుతిన్ ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. -
ఛాంపియన్ దేశం
భారత చదరంగ క్రీడావనికి ఇది మరో శుభవార్త. మన దేశం నుంచి మరో చిచ్చరపిడుగు వచ్చాడు. తెలుగు కుటుంబానికి చెందిన దొమ్మరాజు గుకేశ్ పట్టుమని 17 ఏళ్ళ వయసులో ప్రపంచస్థాయిలో సత్తా చాటాడు. అరంగేట్రంలోనే ప్రపంచ చదరంగ క్రీడా పర్యవేక్షక సంస్థ (ఫిడే) వారి ‘క్యాండిడేట్స్ 2024’లో గెలిచాడు. అదీ... చదరంగపుటెత్తుల్లో చలాకీతనం చూపుతూ, చులాగ్గా గెలిచాడు. కొద్ది నెలల్లో జరిగే ప్రపంచ ఛాంపియన్ పోటీలకు ఎన్నికయ్యాడు. 138 సంవత్సరాల ప్రపంచ ఛాంపి యన్షిప్ చరిత్రలోనే చిన్న వయసువాడిగా వరల్డ్ టైటిల్ కోసం పోటీపడనున్నాడు. ఒకవేళ ఆ విశ్వవేదిక పైనా గెలిస్తే, అతి పిన్నవయస్కుడైన వరల్డ్ ఛాంపియన్‌గా కొత్త చరిత్ర సృష్టించనున్నాడు. ఒక్క గుకేశ్ విజయమే కాక భవిష్యత్ ఆశాకిరణాలూ అనేకం ఉండడం గమనార్హం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళు పాల్గొనే ‘క్యాండిడేట్స్’లో ఉన్నదే 16 మంది. అందులో ముగ్గురు మగ వాళ్ళు (గుకేశ్, విదిత్, ఆర్. ప్రజ్ఞానంద), ఇద్దరు ఆడవారు (కోనేరు హంపీ, ఆర్. వైశాలి)తో మొత్తం అయిదుగురి అతి పెద్ద బృందం భారత్‌దే. ఇంతమంది ఆటగాళ్ళు ఈ క్లిష్టమైన అలాగే, 2024 ఏప్రిల్ నాటి ‘ఫిడే’ ర్యాంకింగ్స్‌లో టాప్ 25లో అయిదుగురు భారతీయ పురుషులే. ఇక, మహిళల ర్యాకింగ్స్లో టాప్ 15లో ముగ్గురు మనవాళ్ళే. జూనియర్ ర్యాకింగ్స్‌కు వస్తే టాప్ 20లో ఏడుగురు భార తీయులే. అదే టాప్ 30 జూనియర్స్ని గనక లెక్క తీస్తే మూడింట ఒక వంతు మన దేశీయులే.ప్రపంచ చదరంగ వేదికపై అంతకంతకూ విస్తరిస్తున్న భారతదేశ స్థాయికీ, స్థానానికీ ఇదే సాక్ష్యం. ‘చదరంగంలో భారత్ విశేష కృషి చేస్తోంది. అనతికాలంలో ప్రపంచంలో అగ్రశ్రేణి చదరంగ దేశమవుతుంది’ అని ప్రపంచ మాజీ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సెన్ గత ఏడాది వ్యాఖ్యానించారు. ఇప్పుడదే నిజమవుతోంది. నిజానికి, మన దేశంలో చదరంగ క్రీడ ఇంత శరవేగంతో విస్తరించడానికీ, విస్ఫోటనం చెందడానికీ అనేక కారణాలున్నాయి. ఇంటర్నెట్ డేటా ప్యాక్‌లు చౌక కావడం, మొబైల్ ఫోన్లలో సైతం సులభంగా అందుబాటులో ఉన్న చెస్ యాప్‌లు వగైరా వల్ల జనసామాన్యంలో ఈ క్రీడ వేగంగా, బలమైన పునాది వేసుకుంటోందని నిపుణుల విశ్లేషణ. ఇంటర్నెట్ వ్యాప్తి వల్ల ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని పిల్లలు సైతం మెట్రో నగరాల్లోని అత్యుత్తమ కోచ్‌ల నుంచి ఆన్ లైన్ చెస్ పాఠాలు నేర్చే వీలొచ్చింది. కరోనా అనంతరం ఆన్లైన్ టోర్నమెంట్లు పెరగడం కూడా భారతీయ యువకిశోరాలకు కలిసొచ్చింది. సూపర్ గ్రాండ్ మాస్టర్ల తోనూ, చివరకు ప్రపంచ మాజీ ఛాంపియన్లతోనూ తలపడి అనుభవం, ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించే అవకాశం దక్కింది. అగ్రశ్రేణి క్రీడాకారులు ఆట మానేశాక, కోచ్‌లుగా మారడమూ కొత్త తరానికి వరమైంది.గ్రాండ్ మాస్టర్లు ఆర్బీ రమేశ్ (ప్రజ్ఞానంద, వైశాలికి కోచ్), విష్ణుప్రసన్న (గుకేశ్‌కు కోచ్), శ్రీనాథ్ నారాయణన్ (అర్జున్, నిహాల్ సరీన్‌ల ట్రైనర్), సూర్యశేఖర్ గంగూలీ (విదిత్‌కు కోచ్) లాంటి వారు, వారి శిక్షణలో ఆరితేరిన ఆటగాళ్ళే అందుకు నిదర్శనం. గ్రాండ్ మాస్టర్లు కాకపోయినప్పటికీ, మంచి చదరంగం ఆటగాళ్ళు దాదాపు 50 వేల మందికి పైగా భారత్‌లో ఉన్నారని సాక్షాత్తూ ప్రపంచ చదరంగ క్రీడా పర్యవేక్షక సంస్థ (ఫిడే) డైరెక్టర్ జనరల్ ఎమిల్ సుతోవ్‌స్కీ అనడం విశేషం. ఇవన్నీ కలసి దేశంలో చదరంగ క్రీడకు సంబంధించిన సువ్యవస్థిత వాతావరణ కల్పనకు దోహదం చేశాయి. ‘ఫిడే’ సహకారంతో టెక్ మహీంద్రా ధనసాయంతో నడుస్తున్న గ్లోబల్ చెస్ లీగ్ లాంటి టోర్నమెంట్లు సైతం ఆటకూ, ఆటగాళ్ళకూ కొత్త ఉత్సాహం, ఉత్తేజం తెచ్చాయి. వీటన్నిటి ఫలితంగా ఇవాళ 64 చదరపు గడుల ఆటలో భారత్ అపూర్వంగా ముందుకు దూసుకుపోతోంది. ‘ఈ ప్రపంచంలో ఈ క్షణంలో అత్యంత అస్థిరమైనది ఏమిటంటే, చదరంగంలో భారత నంబర్ 1 స్థానం’ అని అజర్‌బైజాన్‌కు చెందిన ఓ గ్రాండ్ మాస్టర్ ఈ ఏడాది జనవరిలో ట్వీట్ చేశారు. ఛలోక్తిగా చెప్పినా, చెస్‌లో నిత్యం కొత్త ప్రతిభావంతులు రంగంలోకి దూసుకువస్తున్న మన దేశంలో ఇప్పుడది అక్షరసత్యం. ఈ ఏడాదిలో ఈ నాలుగు నెలల్లోనే ఆ నంబర్1 కిరీటం మన ఆటగాళ్ళు అయిదుగురి (విశ్వనాథన్ ఆనంద్, గుకేశ్, ప్రజ్ఞానంద, అర్జున్, విదిత్) మధ్య ఎప్పటికప్పుడు మారుతూ వచ్చిందంటే మనవాళ్ళలో పెల్లుబుకుతున్న ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. యువజన – క్రీడాశాఖ సమకూరుస్తున్న నిధులు, ఆటగాళ్ళ శిక్షణకు అఖిల భారత చదరంగ సమాఖ్య అందిస్తున్న సహకారం, ప్రైవేట్ సంస్థల సహాయం ప్రతిభను పెంచి పోషించడంలో ప్రధానపాత్ర వహించాయి. ఇవాళ దేశంలో 84 మంది గ్రాండ్ మాస్టర్లు, 124 మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు, 23 మంది మహిళా గ్రాండ్ మాస్టర్లు, 42 మంది మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్లు ఉన్నారంటే కారణం అదే! దేశవ్యాప్తంగా 30 వేల మందికి పైగా రేటింగ్ పొందిన రెగ్యులర్ టోర్నమెంట్ చెస్ ఆటగాళ్ళు న్నారని ఒక లెక్క. ప్రపంచమంతటిలో ఇందరు ప్రతిభావంతులున్నది మన దేశంలోనే! ప్రపంచ మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ లాంటివారు చిరకాలంగా ఆదర్శంగా నిలవడంతో, ఎంతో మంది చెస్ వైపు ఆకర్షితులయ్యారన్నది నిజం. సమాజంలోని ఆ ధోరణుల్ని గమనించి, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో తగినంత సహాయ సహకారాలు అందించి, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే ఏ క్రీడలోనైనా ఎంతటి అద్భుతాలు చేయవచ్చో భారతీయ చదరంగావని చాటిచెబుతోంది. కఠోర పరిశ్రమతో, కాలగతిలో ఆ ఆటలో ఛాంపియన్ దేశంగా ఆవిర్భవించిన మనం ఈ పాఠాలను ఇతర క్రీడలకూ అనువర్తింపజేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమూ, ఇతర క్రీడా సంస్థలూ ఆ దిశగా అడుగులు వేస్తే మన క్రీడాలోకం మరిన్ని శుభవార్తలు అందించడానికి సదా సిద్ధంగా ఉంటుంది! -
Sports: ఈ కుర్రాడు.. చదరంగంలో 'అర్జును'డు!
పుష్కర కాలం క్రితం ఒక ఎనిమిదేళ్ల కుర్రాడు చెస్ క్రీడపై ఆసక్తి చూపించాడు.. స్కూల్లో టీచర్ అతనిలోని ప్రతిభను మొదటిసారి గుర్తించగా.. తల్లిదండ్రులు సరైన దిశలో ప్రోత్సహిస్తూ మార్గనిర్దేశనం చేశారు. తొలి ఎత్తు వేసిన దగ్గరినుంచి అతను ఆ 64 గళ్లే ప్రపంచంలా బతికాడు. మరో ఆలోచన లేకుండా 24 గంటలూ ఆటపైనే దృష్టి పెట్టి∙సాధన చేశాడు. సహజంగానే అతని కష్టానికి తగిన ప్రతిఫలాలు వచ్చాయి. స్కూల్ దశ నుంచి అంతర్జాతీయ పోటీల వరకు వేర్వేరు దశల్లో అనేక సంచలనాలు, పెద్ద సంఖ్యలో విజయాలు సాధించి అతను తన స్థాయిని పెంచుకున్నాడు. భారత చెస్‌కు దిక్సూచి, మన దేశంలో చదరంగానికి దారి చూపించిన మార్గదర్శి విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించి ఇటీవలే అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. దాదాపు 38 ఏళ్ల కాలంలో ఇలా ఆనంద్‌ను వెనక్కి తోసి దూసుకుపోగలగడం ఇద్దరికి మాత్రమే సాధ్యమైంది. వారిలో ఒకరు ఈ కుర్రాడు. ఒక అరుదైన ఘనత మాత్రమే కాకుండా.. ఒక యువ ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే మైలురాయి ఇది. భవిష్యత్తులో మరిన్ని పెద్ద విజయాలు అందుకునేందుకు కావాల్సిన ప్రేరణను ఇచ్చే క్షణం ఇది. ఈ రికార్డును సాధించిన కుర్రాడే తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేశి. ప్రొఫెషనల్ చెస్‌లో అడుగుడిన నాటినుంచి ఎన్నో విజయాలతో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నాడు. రెండేళ్ల క్రితం నేదర్లండ్స్లో విక్ ఆన్ జీ టోర్నమెంట్లో అర్జున్ విజేతగా నిలిచాడు. దాంతో 2659.5 ఎలో రేటింగ్‌తో ఏకంగా 49 స్థానాలు ఎగబాకి టాప్–100 ర్యాంకింగ్స్‌లోకి చేరుకున్నాడు. ఆ గెలుపు తర్వాత చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌ను కలిసే అవకాశం వచ్చింది. అతనితో అర్జున్ ఫొటో దిగేందుకు ఆసక్తి చూపించాడు. అందుకు సంతోషంగా అంగీకరించిన కార్ల్సన్.. అర్జున్ విజయాలను ప్రస్తావించి అభినందనలు తెలిపాడు. కుటుంబంతో సాంకేతికంగా మంచి పట్టున్న ఆటగాడని, వేగంగా శైలి మార్చుకోగలడని ప్రశంసిస్తూ త్వరలోనే 2700 రేటింగ్ దాటగల సత్తా ఉన్న కుర్రాడు అంటూ భవిష్యవాణి చెప్పాడు. ఆ ఆశీర్వాదం నిజమైంది. అదే ఏడాది అర్జున్ 2700 రేటింగ్ అందుకున్నాడు. అంతేకాదు కార్ల్సన్పైనా సంచలన విజయాన్ని సాధించాడు. ఎయిమ్‌చెస్ ర్యాపిడ్ ఆన్లైన్ టోర్నీలో మాగ్నస్‌ను ఓడించడంతో అందరి దృష్టీ అర్జున్‌పై పడింది. కొన్నాళ్ల క్రితం జనరేషన్ కప్ ఫైనల్లో కార్ల్సన్ చేతిలో ఓడినా.. ఆ టోర్నీలో అరోనియన్, నీమన్, ఇవాన్ చుక్లాంటి స్టార్లను ఓడించి ముందంజ వేయడం అర్జున్ స్థాయిని పెంచింది. వేగంగా దూసుకెళ్లి.. 2003లో పుట్టిన అర్జున్ చెస్ ప్రస్థానం చాలా వేగంగా సాగింది. వైద్యుడైన తండ్రి అండదండల కారణంగా ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. అతని సహజ ప్రతిభకు తోడు సరైన శిక్షణతో ఆటపై పట్టు పెరిగింది. వరంగల్‌లో చెస్ ఓనమాలు నేర్చుకున్న తర్వాత ఆటపై మరింతగా దృష్టి పెట్టేందుకు అర్జున్ హైదరాబాద్‌కు మారాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరో లోకం లేకుండా అతను చదరంగం పావులతోనే గడిపాడు. మొదటినుంచి మితభాషి అయిన అర్జున్ సన్నిహితులు, కుటుంబసభ్యులను కలిసినా చెస్ గురించి, తన ఎత్తుల గురించి తప్ప మరో మాట మాట్లాడేవాడు కాదు. ‘ఇంటికి కూడా రాకుండా పగలు, రాత్రి చెస్ కోచింగ్ సెంటర్లోనే ఉండిపోయేందుకు అర్జున్ సిద్ధమయ్యవాడు. ఒక దశలో ఇది మాలో కాస్త ఆందోళననూ పెంచింది. అందుకే అక్కడినుంచి తప్పించి బలవంతంగా విరామం ఇవ్వాల్సి వచ్చింది’ అని చెప్పాడు అర్జున్ తండ్రి శ్రీనివాసరావు. రాష్ట్రస్థాయి మొదలు జాతీయ స్థాయిలో వివిధ వయో విభాగాల్లో అర్జున్ మంచి విజయాలు సాధించాడు. ఈ సానుకూల ఫలితాల కారణంగా మరో ఆలోచన లేకుండా మరింత పెద్ద లక్ష్యాలపై గురి పెట్టాడు. అండర్–14 జాతీయ స్థాయి చాంపియన్‌గా నిలవడంతో 13 ఏళ్ల అర్జున్‌కు వెంటనే ఒక మంచి అవకాశం దక్కింది. వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్, ఆసియా చాంపియన్‌షిప్‌కు అతను అర్హత సాధించడంలో సఫలమయ్యాడు. అయితే ఆ అర్హతతో ఆగిపోకుండా ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో రజతపతకం కూడా సాధించాడు. గ్రాండ్‌మాస్టర్ వేటలో.. ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌మాస్టర్ హోదాను అందుకోవడంలో కూడా అర్జున్ ఎదుగుదల వేగంగా సాగింది. 2018 ఏడాది ఆరంభమయ్యే సమయానికి అతను ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) కూడా కాదు. జనవరిలో కోల్‌కతాలో తొలి ఐఎం నార్మ్ సాధించడంతో పాటు మొదటిసారి 2500 రేటింగ్‌ను అతను దాటాడు. తర్వాతి రెండు నెలల్లో మరో రెండు ఐఎం నార్మ్‌లు అతని ఖాతాలో చేరాయి. ఐఎం సాధించిన తర్వాత అర్జున్ వరుసగా విదేశీ టోర్నీల్లో ఆడాడు. నేషనల్ టైటిల్‌తో, విశ్వనాథన్ ఆనంద్‌తో అదే ఏడాది అక్టోబర్‌కు వచ్చే సరికి గ్రాండ్‌మాస్టర్‌గా మారడం విశేషం. ఆర్మేనియా, సెర్బియా, హంగరీ, స్విట్జర్లండ్లలో ఆడి తన రేటింగ్‌ను మెరుగుపరచుకున్నాడు. అబుదాబిలో అతనికి మూడో జీఎం నార్మ్ దక్కింది. ఆ సమయంలో పదో తరగతి చదువుతున్న అర్జున్ 14 ఏళ్ల 11 నెలల 13 రోజుల్లో గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున 32వ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందిన అర్జున్.. తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి గ్రాండ్‌మాస్టర్‌గా నిలవడం విశేషం. ఈ మైలురాయి తర్వాత కొద్ది రోజులకే టర్కీలో జరిగిన అండర్–16 చెస్ ఒలింపియాడ్‌లో అతను భారత జట్టుకు ఎంపికయ్యాడు. వరుస విజయాలతో.. ఏ క్రీడలోనైనా జూనియర్ స్థాయిలో వరుస విజయాలు సాధించి, ప్రత్యేక గుర్తింపుతో సీనియర్ స్థాయికి వచ్చేసరికి అంచనాలు పెరిగిపోతాయి. వాటితో పాటు తీవ్రమైన పోటీ, బలమైన ప్రత్యర్థులతో తలపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆటగాళ్లకు పెద్ద స్థాయిలో భిన్నమైన ఫలితాలు కూడా వస్తాయి. కానీ అలాంటి ప్రతికూలతలను దాటి ముందుకు వెళ్లినప్పుడే ఆటగాడి సత్తా ఏమిటో తెలుస్తుంది. చెస్‌లో అర్జున్ కూడా అలాంటి అంచనాలను పెంచడమే కాదు వాటిని అందుకోవడంలోనూ సఫలమయ్యాడు. బాలమేధావి అనే పేరుతోనే సరిపెట్టుకోకుండా దిగ్గజ ఆటగాళ్లతో తలపడి పెద్ద టోర్నీల్లో విజయాలు అందుకుంటూ ఈతరం భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2021లో చాంపియన్స్ చెస్ టూర్లో, లిండార్స్ బ్లిజ్ టోర్నమెంట్లో చెప్పుకోదగ్గ విజయాలు అందుకున్నాడు. ప్రతిష్ఠాత్మక టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ విభాగంలో విజేతగా నిలవడం అర్జున్ కెరీర్లో కీలక మలుపు. తర్వాతి ఏడాది కూడా అతను టాటా స్టీల్ చాలెంజర్స్ టోర్నమెంట్‌ను గెలుచుకు న్నాడు. 2022లో జాతీయ చెస్ చాంపియన్‌గా నిలిచిన అర్జున్ మరో పెద్ద టోర్నీలో ఢిల్లీ ఓపెన్‌లో కూడా టైటిల్ గెలుచుకున్నాడు. అబూధాబీ ఇంటర్నేషనల్ చెస్ గెలిచిన తర్వాత మరోసారి టాటా స్టీల్ బ్లిట్జ్‌లో అతను చాంపియన్‌గా నిలిచాడు. అటు క్లాసిక్‌తో పాటు ఇటు ర్యాపిడ్, బ్లిట్జ్ ఈవెంట్లలో కూడా అదే స్థాయిలో అర్జున్ మంచి ప్రదర్శన కనబరు స్తుండటం చెప్పుకోదగ్గ అంశం. గత ఆసియా క్రీడల్లో రజతం సాధించిన భారత జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. అర్జున్ ప్రస్తుతం 2756 ఎలో రేటింగ్‌తో ఆనంద్ (2751)ను అధిగమించి వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో నిలిచాడు. మున్ముందు 2800 రేటింగ్‌ను దాటడంతో పాటు ప్రపంచ చాంపియన్‌గా నిలవడాన్ని అతను దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకున్నాడు. అర్జున్ ప్రతిభ, ఇటీవలి ప్రదర్శనను చూస్తే ఎంతటి పెద్ద విజయమైనా అసాధ్యం కాదనిపిస్తుంది. — మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: హై హై హెట్‌మైర్... -
ఒకేసారి పదిమందిని ఓడించాడు! కారణం తెలిస్తే ఫిదా..
Chess Player Plays 10 Games Simultaneously: నైజీరియా చెస్ క్రీడాకారుడు టుండే ఒనకోయ తన నైపుణ్యాలతో అభిమానులను ఫిదా చేశాడు. ఒకేసారి పది మందితో చెస్ ఆడి.. అందరినీ ఓడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను టుండే సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలో టుండే ఈ గేమ్ ఆడటానికి గల అసలు కారణాన్ని తెలుసుకున్న నెటిజన్లు అతడి మంచి మనసును కొనియాడకుండా ఉండలేకపోతున్నారు. నైజీరియాకు చెందిన టుండే ఒనకోయ చెస్ ప్లేయర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన ప్రతిభను ప్రపంచానికి చాటుకోవడానికే పరిమితం కాకుండా.. ‘చెస్ ఇన్ స్లమ్స్’ అనే ఫౌండేషన్ స్థాపించి పేద విద్యార్థులకు సాయం చేస్తున్నాడు. సామాజిక అంతరాలను తగ్గించే క్రమంలో చెస్‌ను ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటూ.. ఆటపై మక్కువ ఉన్న చిన్నారులకు మెళకువలు నేర్పిస్తున్నాడు. కేవలం ఆట వరకే తన శిక్షణను పరిమితం చేయకుండా.. జీవిత పాఠాలు, సమస్యలు ఎదురైనపుడు సహనంగా, ఓర్పుగా వాటిని పరిష్కరించుకోవడం వంటి విషయాలు నేర్పుతూ వారిలో సానుకూల దృక్పథం పెంపొందిస్తున్నాడు టుండే ఒనకోయ. తాజాగా పది మందితో ఒకేసారి చెస్ ఆడాలన్న ఈవెంట్ కూడా ఫండ్ రైజింగ్‌లో భాగంగా నిర్వహించినదే. ఈ చెస్ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వంద మంది విద్యార్థుల చదువుకు సాయం చేసేందుకు వినియోగిస్తామని టుండే ఒనకోయ సోషల్ మీడియాలో వెల్లడించాడు. రెండు గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తాను పది మందిని ఒకేసారి ఓడించడం సంతోషంగా ఉందన్నాడు. జనవరి 17 నాటి ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. చదవండి: Sachin Tendulkar: వరుసగా రెండుసార్లు డకౌట్.. సాకులు చెప్పా.. ఆ ఒక్క పరుగు వల్ల On day two of the DLD conference, I played a simultaneous chess match against 10 players at once. After an almost two hour battle of wits ,I managed to win all the games. The Chess exhibition helped us raise enough money to support the education of 100 children in our academy. pic.twitter.com/fnrOcxQe8p — Tunde Onakoya (@Tunde_OD) January 17, 2024 -
చెస్ ఆడుతూ సీనియర్ క్రీడాకారుడి మృతి
హైదరాబాద్: చెస్ ఆడుతూ సీనియర్ క్రీడాకారుడు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్ర, శని, ఆదివారాల్లో స్లాన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలకు దాదాపు 15 రాష్ట్రాలకు చెందిన 700 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. కాగా శనివారం మధ్యాహ్నం అంబర్‌పేట, 6వ నెంబర్ సర్కిల్ సాయిమిత్ర ఎస్టేట్స్‌లో నివాసం ఉంటున్న సీనియర్ చెస్ క్రీడాకారులు వి.ఎస్.టి.సాయి (72) కూడా క్రీడను కొనసాగిస్తున్నారు. ఐదవ రౌండ్లో ఉండగా ఒక్కసారిగా గుండెలో నొప్పి వచ్చి పడిపోయాడు. హుటాహుటిన స్లాన్ సంస్థ సిబ్బంది, ఆడిటోరియం సెక్యూనిటీ అంబులెన్స్‌ను పిలిపించి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాయి మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈయనకు భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. ఎల్ఐసీలో అధికారిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. చెస్ అంటే ప్రాణంగా భావించేవారు. ఎక్కడ టోరీ్నలు జరిగినా తప్పకుండా హాజరయ్యేవారని చెస్ క్రీడాకారులు తెలియజేశారు. నగరానికి చెందిన పలువురు సీనియర్ చెస్ ప్లేయర్లు ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. -
ఉజ్బెకిస్తాన్ గడ్డపై తెలంగాణ బిడ్డల సత్తా
తాష్కెంట్లో జరుగుతున్న ఆసియా స్కూల్స్ ర్యాపిడ్ అండ్ చెస్ చాంపియన్‌షిప్–2023లో తెలంగాణ ఆటగాళ్లు సత్తా చాటారు. దాంతో భారత్ ఖాతాలో 2 స్వర్ణాలు, ఒక కాంస్యం చేరాయి. అండర్–15 బాలుర విభాగం ర్యాపిడ్, బ్లిట్జ్ ఈవెంట్లలో విఘ్నేశ్ అద్వైత్ వేముల రెండు స్వర్ణాలు సాధించడం విశేషం. అండర్–15 బాలికల కేటగిరీ బ్లిట్జ్‌లో యశ్వి జైన్ కాంస్యం పతకం సొంతం చేసుకుంది. -
International Chess Tourney: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్‌కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: బుకారెస్ట్ గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ కాంస్య పతకం సాధించాడు. రొమేనియాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 10 రౌండ్ల తర్వాత మాక్సిమ్ చిగయెవ్ (రష్యా), డేనియల్ బొగ్డాన్ (రొమేనియా), హరికృష్ణ 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. చిగయెవ్కు టాప్ ర్యాంక్ దక్కగా... బొగ్డాన్కు రెండో ర్యాంక్, హరికృష్ణకు మూడో ర్యాంక్ లభించాయి. హరికృష్ణ మొత్తం ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ రౌనక్‌తో జరిగిన గేమ్‌లో ఓడిపోయాడు. -
సీఎం జగన్ కలిసిన చెస్ క్రీడాకారిణి కోలగట్ల మీనాక్షి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి కలిశారు. చిన్నారిని ప్రత్యేకంగా అభినందించిన సీఎం జగన్, అంతర్జాతీయ స్ధాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టేలా చదరంగంలో మరింతగా రాణించాలని సీఎం ఆకాంక్షించారు. మీనాక్షికి అవసరమైన విధంగా పూర్తిస్ధాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. మీనాక్షికి విశాఖపట్నంలో వెయ్యి చదరపు గజాల ఇంటిస్ధలం, ఆమె చెస్‌లో కెరీర్‌ను కొనసాగించేందుకు కార్పస్ ఫండ్ నుంచి రూ.1 కోటి నిధిని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో రికార్డులు నెలకొల్పిన మీనాక్షి.. ఇటీవల ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2023 పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. వరల్డ్ నెంబర్ 1 అండర్ 12 గర్ల్స్ చెస్ 2023 (ఫిడే ర్యాంకింగ్స్), వరల్డ్ నెంబర్ 1 అండర్ 11 గర్ల్స్ చెస్ 2022, వరల్డ్ నెంబర్ 2 అండర్ 10 గర్ల్స్ చెస్ డిసెంబర్ 2021, ఉమెన్ ఫిడే మాస్టర్ 2022, ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ 2021 టైటిల్స్ గెలుచుకోవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో పలు పతకాలు సాధించిన విషయాన్ని ముఖ్యమంత్రితో మీనాక్షి, తల్లిదండ్రులు పంచుకున్నారు. మీనాక్షి ప్రతిభను సీఎం ప్రశంసించారు. వివిధ క్రీడా రంగాల్లో ప్రతిభ కనపరిచి ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతలు అంతర్జాతీయ వేదికలపై చాటుతున్న క్రీడాకారులకు తమ ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చదవండి: ఆశా మాలవ్యకు సీఎం జగన్ అభినందనలు.. రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం -
'ఇరాన్లో అడుగుపెడితే చంపేస్తాం'
ఇరాన్‌కు చెందిన చెస్ ప్లేయర్ సారా ఖాదిమ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కొందరు ఆకతాయిలు వెంటనే ఇరాన్‌కు తిరిగి రావాలని డిమాండ్ చేస్తుండగా.. మరికొందరేమో ఇరాన్ అడుగుపెడితే చంపేస్తాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. సారా ఖాదిమ్ తల్లిదండ్రులకు కూడా ఇదే మాదిరి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో కజకిస్తాన్ పోలీసుల సహకారంతో చెస్ ఆటగాళ్లకు భద్రత కల్పించేందుకు టోర్నమెంట్ నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా సారా ఖాదిమ్ ఉంటున్న హోటల్ గది వెలుపల నలుగురు సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. ఇరాన్‌కు చెందిన స్టార్ చెస్ ప్లేయర్ సారా ఖాదిమ్ ప్రస్తుతం కజికిస్తాన్‌లోని ప్రపంచ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్నది. అయితే, చెస్ టేబుల్‌పై ఆమె తలకు హిజాబ్ ధరించకుండా కూర్చుండి ఆడుతున్న ఫొటోలు మీడియాలో ప్రత్యక్ష్యమయ్యాయి. దాంతో ఆమెకు బెదిరింపు కాల్స్ మొదలయ్యాయి. హిజాబ్ ధరించకుండా చెస్ పోటీల్లో ఎలా పాల్గొంటామని ఆకతాయిలు హెచ్చరిస్తున్నారు. పోటీలను అర్దాంతరంగా ముగించి వెంటనే స్వదేశానికి రావాలని కొందరు హెచ్చరిస్తుండగా.. మరికొందరేమో ఇక్కడికి వస్తే నీ అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. -
‘గ్రాండ్‌మాస్టర్’ రాహుల్
సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ తెలంగాణ యువ చెస్ ప్లేయర్ రాహుల్ శ్రీవత్సవ్ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదాను దక్కించుకున్నాడు. భారత్ తరఫున 74వ గ్రాండ్‌మాస్టర్‌గా రాహుల్ నిలిచాడు. హర్ష భరతకోటి, ఇరిగేశి అర్జున్, రాజా రిత్విక్ తర్వాత తెలంగాణ నుంచి గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందిన నాలుగో ప్లేయర్‌గా రాహుల్ నిలిచాడు. జీఎం టైటిల్ ఖరారు కావాలంటే ఓ చెస్ ప్లేయర్ మూడు జీఎం నార్మ్‌లను అందుకోవడంతోపాటు 2500 ఎలో రేటింగ్ పాయింట్లను సాధించాలి. 19 ఏళ్ల రాహుల్ 2019లోనే మూడు జీఎం నార్మ్‌లను సాధించినా 2500 ఎలో రేటింగ్ పాయింట్లకు దూరంగా నిలిచాడు. దాంతో అతనికి జీఎం టైటిల్ ఖరారు కాలేదు. అదే సమయంలో అమెరికాలోని యూనివర్సీటీ ఆఫ్ టెక్సాస్‌లో రాహుల్ ఎకనామిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేరాడు. ఒకవైపు చదువు కొనసాగిస్తూ యూనివర్సిటీ చెస్ జట్టులో తన ప్రావీణ్యానికి మరింత పదును పెట్టాడు. నెల రోజుల క్రితం 2468 ఎలో రేటింగ్ పాయింట్లతో ఇటలీ చేరుకున్న రాహుల్ అక్కడ మూడు టోర్నీలలో బరిలోకి దిగాడు. తాజాగా కాటోలికా చెస్ ఫెస్టివల్లో రాహుల్ ఎనిమిదో రౌండ్లో జార్జియా గ్రాండ్‌మాస్టర్ లెవాన్ పంత్సులైతో జరిగిన గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవడంతో అతను 2500 ఎలో రేటింగ్ పాయింట్ల మైలురాయిని అందుకొని జీఎం టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. -
'క్షణక్షణం.. భయం భయంగా'.. మాజీ చెస్ చాంపియన్
భారత చెస్ ఆటగాడు అన్వేష్ ఉపాధ్యాయ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయాడు. 2017లో జాతీయ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన అన్వేష్ ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. 2012 నుంచి ఉక్రెయిన్‌లో ఉంటున్న అన్వేష్ ఈ మార్చిలో భారత్‌కు తిరిగి రావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. అయితే ఇంతలో రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై దాడికి దిగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం పరిస్థితి ఏం బాగాలేదని.. ఎప్పుడు ఏమవుతుందోనని క్షణంక్షణం.. భయంభయంగా గడుపుతున్నట్లు అన్వేష్ పేర్కొన్నాడు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయ విద్యార్థుల్లో అన్వేష్ కూడా ఒకడిగా ఉన్నాడు. రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్ తమ ఎయిర్‌బేస్‌ను మూసేయడంతో ఆ దేశం నుంచి విమానాల రాకపోకలు స్తంభించాయి. కాగా తనను సురక్షితంగా భారత్‌కు పంపించాలని ఇప్పటికే అన్వేష్ ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కార్యాలయానికి వెళ్లి అధికారులను విజ్ఞప్తి చేశాడు. కాగా ఉక్రెయిన్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వం అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. చదవండి: 'యుద్ధం ఆపేయండి'.. సొంత దేశాన్ని ఏకిపారేసిన టెన్నిస్ స్టార్ Ranji Trophy 2022: కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే.. -
చెస్ ఒలింపియాడ్ ‘విజేత’పై విమర్శలు
మాస్కో: ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో సంయుక్త విజేతను ప్రకటించడంపై తాజాగా విమర్శలు మొదలయ్యాయి. ఎంతటి ప్రాధాన్యమైన టోర్నీ అయినా సరైన విజేత లేకుంటే అది విఫలమైన టోర్నీగానే మిగులుతుందని రష్యా జట్టు సభ్యుడు డానీల్ డుబోవ్ విమర్శించాడు. 2018 ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ అయిన డుబోవ్ ఇరు జట్లకు పసిడి పతకాన్ని అందించడం తనకు నచ్చలేదని పేర్కొన్నా డు. ఆటగాళ్లెవరినీ సంప్రదించకుండానే సంయుక్త విజేతలుగా ‘ఫిడే’ ప్రకటించడం తనకు నిరాశ కలిగించిందని అన్నాడు. చివరి రెండు గేములు మళ్లీ ఆడేందుకు ఆటగాళ్లంతా సుముఖంగానే ఉన్నారు. కానీ మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. ఇలా గెలవాలని మేమెప్పుడూ అనుకోలేదు’ అని డుబోవ్ వ్యాఖ్యానించాడు. చదవండి: ఇకనైనా గుర్తించాలి సంయుక్త విజేతలుగా భారత్, రష్యా -
క్రీడంటే ప్రాణం.. కళంటే లక్ష్యం
నెల్లూరు ,వెంకటగిరి: కళల కాణాచి అయిన వెంకటగిరిలో కళాకారులు, క్రీడాకారులకు కొదవలేదు. ఈ రెండు రంగాల్లోనూ రాణిస్తూ సత్తాచాటుతున్నాడు. ఏ రంగంపై అయినా మక్కువ, సృజన ఉంటే రాణించవచ్చునని నిరూపిస్తున్నాడు. ఒక్క పక్క గేయ రచయితగా మరో పక్క చెస్ క్రీడాకారులను ఉనత్న స్థాయికి చేర్చేలా వెంకటగిరికి చెందిన నర్రా విజయ్‌కుమార్ అవిరళ కృషి చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఉపాధ్యాయుడు నర్రా మురళీకృష్ణ, వేదవతి దంపతుల కుమారుడు విజయ్‌కుమార్‌కు చిన్నతనం నుండే చెస్ ఆట అంటే మక్కువ. ఆ రోజుల్లో తన కుటుంబ పరిస్థితుల కారణంగా చెస్ క్రీడలో ఉన్నత స్థాయికి వెళ్లలేకపోయాడు. చెస్‌లో ప్రావీణ్యం సంపాదించుకుని వెంకటగిరి ప్రాంతంలోని బాల, యువ చెస్ క్రీడాకారులను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లాలనే సంకల్పంతో దాతల సహకారంతో ఉచితంగా నిస్వార్థంగా శిక్షణ ఇస్తున్నాడు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు తనవంతు ప్రోత్సాహన్ని అందించేందుకు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చెస్ పోటీలను వెంకటగిరిలో నిర్వహిస్తున్నారు. 2019లో జాతీయ స్థాయి చెస్ పోటీలను వెంకటగిరిలో నిర్వహించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకేసారి 50 మంది చెస్ క్రీడాకారులు ఒక వైపు తను ఒక వైపు ఉండి ఆడి గెలవగల అసమాన నైపుణ్యం కలిగిన విజయ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. గీత రచయితగా ప్రస్థానం విజయ్‌కుమార్ ఓ వైపు చెస్ క్రీడాభివృద్ధికి పాటు పడుతూనే మరో వైపు అతనిలో ఉన్న మరో కోణం గేయ రచయిత గా అడుగులు వేస్తున్నాడు. 2008లో సినీ గేయ రచయితగా సినీ రంగంలో అరంగేట్రం చేసి పదేళ్లలో 9 తెలుగు చలన చిత్రాలకు గేయ రచయితగా, మరో 30 చిత్రాలకు సహాయ రచయితగా పనిచేశారు. పదహారేళ్ల వయసు (కొత్తది) సినిమా గేయ రచయితగా తన మొదటి చిత్రం కాగా ఉదయ్‌కిరణ్ నటించిన చిత్రం చెప్పిన కథ, ప్రేమ ప్రయాణం, శ్రీరంగనాయక వంటి చిత్రాలకు రాసిన పాటలకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. తన తల్లి వేదవతి పేరును తాను రాసిన మొదటి పాటకు పెట్టుకున్నాడు. సినీ రంగంలో ప్రముఖ గీత రచయితలు అయిన భోలేషావలి, కాసర్ల రాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో సినీ కళాకారులు నిర్వహించే కచేరీలు, ఇతర కార్యక్రమాలకు అసిస్టెంట్ ఈవెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి పాటలకు రచయితగా, సహాయ రచయితగా పనిచేశాడు. అగ్రహీరోల చిత్రాలకు పాటలు రాయడమే ధ్యేయం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్రహీరోల చిత్రాలకు గేయ రచయితగా పనిచేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నా. తెలుగు చలన చిత్రగీతాకు మంచి సాహిత్యాన్ని అందించి గేయ రచయితగా గుర్తింపు పొందాలన్నదే సంకల్పం. -
జీఎం టైటిల్‌కు చేరువలో హర్ష
ఇస్తాంబుల్ (టర్కీ): గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా ఖరారు చేసుకోవడానికి తెలంగాణ చెస్ ప్లేయర్ హర్ష భరతకోటి మరింత చేరువయ్యాడు. ఇప్పటికే మూడు జీఎం నార్మ్‌లు దక్కించుకున్న హర్ష ఎలో రేటింగ్ 2500 లేకపోవడంతో జీఎం టైటిల్ ఇంకా లభించలేదు. శనివారం ముగిసిన ప్రపంచ అండర్–20 చెస్ చాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల హర్ష ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హర్ష 7.5 పాయింట్లతో మరో పది మందితో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హర్ష తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ మెగా ఈవెంట్లో ఆరు గేముల్లో గెలిచిన అతను, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో రెండు గేముల్లో ఓడిపోయాడు. ఆరుగురు గ్రాండ్మాస్టర్లతో ఆడిన హర్ష... అలెన్ పిచోట్ (అర్జెంటీనా), సునీల్‌దత్ లైనా నారాయణన్ (భారత్), లియాంగ్ అవండర్ (అమెరికా)లపై గెలుపొంది... అలెగ్జాండర్ డాన్‌చెంకో (జర్మనీ)తో గేమ్‌ను ‘డ్రా’గా ముగిం చాడు. పర్హామ్ మగ్సూద్లు (ఇరాన్), ఆమిన్ (ఇజ్రాయెల్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఓవరాల్‌గా ఈ ప్రదర్శనతో హర్ష 18 పాయింట్లు సంపాదించి తన ఓవరాల్ ఎలో రేటింగ్‌ను 2492కు పెంచుకున్నాడు. తదుపరి టోర్నీల్లో హర్ష మరో ఎనిమిది పాయింట్లు సాధిస్తే అతనికి అధికారికంగా జీఎం టైటిల్ ఖాయమవుతుంది. మరోవైపు ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో భారత్‌కే చెందిన అభిమన్యు పురాణిక్ రజత పతకం సాధించాడు. 8.5 పాయింట్లతో అతను రెండో స్థానంలో నిలిచాడు. ఇరాన్‌కు చెందిన పర్హామ్ మగ్సూద్లు 9.5 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. -
ఓటమి నేనే.. గెలుపూ నేనే
కనీసం తన భావాలను పంచుకునేందుకు నోరుతెరిచి మాట్లాడలేదు.. కానీ చదరంగపు గళ్లలో ఆయన వేసే ప్రతి కదలికా పాఠమే చెబుతుంది... సరిగ్గా భూమిపై రెండు కాళ్లు పెట్టి నిలబడలేదు.. కానీ ఆకాశమంత ఆయన ఆత్మస్థైర్యాన్ని చూసి విధి సైతం తలొంచి నమస్కరిస్తుంది... మనం చెప్పే మాట ఆయన చెవుల వరకు చేరలేదు.. కానీ చందరంగంలో ఆయన వేసేఎత్తులకు దాసోహమవుతున్న విజయఢంకా మాత్రం ప్రపంచం చెవుల్లో మార్మోగుతుంది.. జీవిత చదరంగాన విధి ఆడిన ఆటలో ఓడిన ఆయన.. ఆర్థిక ఇబ్బందులను కన్నీటి పొరల మాటున దాచిపెట్టి ఆత్మవిశాస్వమనే ఆయుధానికి సంకల్ప బలాన్ని జత చేసి చదరంగపు క్రీడలో గెలుపు బావుటా ఎగురవేస్తున్నాడు. తన గమనానికి ప్రభుత్వ చేయూత కోసం ఆర్థిస్తున్నాడు ‘ఫిడే మాస్టర్ ’ కూచిభొట్ల వెంకటకృష్ణ కార్తీక్. గుంటూరు వెస్ట్: కృష్ణా జిల్లాకు చెందిన కూచిభొట్ల వెంకట లక్ష్మీ నరసింహ మూర్తి (70), ఎం వెంకట బాల సరస్వతిలకు (67) వివాహమైన చాలా కాలానికి కార్తీక్ జన్మించాడు. మూడేళ్ల వరకు బాగానే ఉన్నాడు. అప్పుడు వచ్చిన శారీరక మార్పును తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. కొందరు వైద్యుల వద్దకు తిప్పినా సరైన వైద్యం అందలేదు. దీంతో 15 ఏళ్లు వచ్చే సరికి సక్రమంగా నిలబడలేకపోయాడు. మాట్లాడడం రాలేదు. చెప్పినవి వినపడవు. దీంతో తల్లిదండ్రులు కుంగిపోయారు. ఈ సమయంలో కార్తీక్ స్నేహితుడు హరి చెస్ క్రీడాకారుడు కావడంతో.. ఆ ఆటవైపు కార్తీక్ దృష్టి మళ్లింది. చాలెంజ్‌గా తీసుకున్న కోచ్ షేక్ ఖాశిం కొడుకు అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు కార్తీక్‌ను విజయవాడలోని గ్లోబల్ చెస్ అకాడమీ వ్యవస్థాపకుడు, ఇంటర్నేషనల్ కోచ్ షేక్ ఖాశిం వద్దకు తీసుకెళ్లారు.కార్తీక్ ఆసక్తిని గమనించిన కోచ్ శిక్షణ ప్రారంభించారు. అతి కొద్ది సమయంలోనే కార్తీక్‌లో పట్టుదల, ప్రతిభను కోచ్ గుర్తించారు. క్రమేణా అకాడమీలో ఉన్న రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులతో కార్తీక్ పోటీ పడ్డాడు. విజయం ఆయన వైపు నిలిచింది. సాధించిన విజయాలివి.. ♦ ఇంటర్నేషనల్ నార్మ్ రేటింగ్‌లో ఉన్న కార్తీక్ ప్రస్తుతం గుంటూరులో జరుగుతున్న సూపర్ గ్రాండ్ మాస్టర్ చెస్ శిక్షణలో ఉన్నారు. ఆయన సాధించిన విజయాల్లో కొన్ని.. ♦ 2014 లండన్‌లో జరిగిన కామన్వెల్త్ పోటీల్లో వికలాంగుల విభాగంలో బంగారు పతకం సాధించారు. ♦ 2014 సెర్బియాలో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ (ఐపీసీఏ)లో కాంస్య పతకం గెలుపొందారు. ఈ పోటీల్లో రష్యా ఇంటర్నేషనల్ మాస్టర్స్‌ను సైతం ఓడించడం గమనార్హం. ♦ 2015, 2017 సంవత్సరాల్లో తమిళనాడులోని తిరుచునాపల్లిలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో ప్ర«థమ స్థానం కైవసం చేసుకున్నారు. దీంతోపాటు అనేక జాతీయ, రాష్ట్ర , ఓపెన్ చెస్ పోటీల్లో విజయాలు సాధించారు. -
చదరంగంలో అంతర్జాతీయ ప్రతిభ
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సెలవుల్లో నాన్నతో ఆడిన చెస్ అతనిలో ఆసక్తిని పెంచింది. అక్క జషితారెడ్డి యోగా క్రీడాకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో రాణించడం స్ఫూర్తి నిచ్చింది. చెస్ క్రీడలో ఆనతికాలంలోనే వాకాటి పృథ్వీకుమార్రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అందరినీ అబ్బురపరిచింది. నెల్లూరు నగరంలోని కొండాయపాళెం ప్రాంతంలోని వనంతోపుకి చెందిన వెంకటశేషారెడ్డి, శిరీష దంపతులిద్దరికి మొదటి నుంచే క్రీడలపట్ల అభిమానం. చదువుతో పాటు పిల్లలు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించేవారు. పృథ్వీకుమార్ ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచే చెస్ పట్ల మక్కువ పెంచుకున్నాడు. మొట్ట మొదటి సారిగా 2009లో జిల్లా స్థాయి అండర్–10 చెస్ పోటీల్లో ప్రథమస్థానం సాధించాడు. అప్పటి నుంచే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాల్గొన్న ప్రతి మ్యాచ్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచేవాడు. జాతీయస్థాయి పోటీల్లో రాణించి రెండు సార్లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం తన ప్రతిభకు నిదర్శనం. అంతర్జాతీయ చదరంగంలో రాణించాలంటే ఎంతో వ్యయ, ప్రయాసాలతో కూడిన విషయం. పోటీలో పాల్గొనేందుకు అంతర్జాతీయ శిక్షణకు అయ్యే ఖర్చు సామాన్య కుటుంబం భరించడం అసాధ్యం. దాతలు ముందుకు వచ్చి తనకు సాయం చేస్తే అంతర్జాతీయస్థాయిలో రాణించి దేశానికి మరెన్నో పతకాలు సాధిస్తానని పృథ్వీకుమార్ కోరుతున్నాడు. పృథ్వీ విజయాల్లో కొన్ని ♦ 2012లో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–14లో మూడోస్థానం ♦ 2014లో రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ –17లో మొదటి స్థానం ♦ 2014లో జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్‌లో అండర్–17లో మూడోస్థానం ♦ 2015లో అండర్–17లో స్టేట్ ఛాంపియన్ షిప్లో మూడోస్థానం ♦ 2016లో యూఎస్ఎ మిలియనీర్ చెస్ టోర్నమెంట్లో భారతదేశానికి బంగారు పతకాన్ని సాధించాడు. ♦ ఇటీవల నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ చెస్ సీడెడ్ పోటీల్లో పాల్గొన్నారు. ఇలా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్న పృథ్వీకి జిల్లా కలెక్టర్ 2013లో, 2016లో ప్రశంసా పత్రాలు అందచేశారు. ప్రోత్సాహం ఉంటేఅంతర్జాతీయ స్థాయిలో రాణించగలడు పృథ్వీలో ఎంతో ప్రతిభ ఉంది. అంతర్జాతీయ స్థాయిలోరాణించాలంటే ఎక్కువ పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. యూరప్, ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాల పోటీల్లో పాల్గొంటేనే అంతర్జాతీయ వేదికపై నిలదొక్కుకోగలడు. అందుకు శిక్షణ, ఎంట్రీ ఫీజులు, ప్రయాణ ఖర్చులు అధిక వ్యయంతో కూడినవి.– సుమన్, చెస్ అసోసియేషన్రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గ్రాండ్ మాస్టర్ అవుతా గ్రాండ్ మాస్టర్ అవడమే లక్ష్యం. చిన్నప్పటి నుంచే చెస్ అంటే ప్రాణం. కోచ్ సుమన్, రియాజ్‌లు శిక్షణ ఇచ్చి నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం చెన్నై ఎస్ఆర్ఎం కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నా. వాకాటి.పృథ్వీకుమార్,అంతర్జాతీయ చెస్ క్రీడాకారుడు -
ఓడి గెలిచిన రాజు
ఒకప్పుడు అతనో చెస్ క్రీడాకారుడు. ఎత్తుకు పైఎత్తులు వేసి, ప్రత్యర్థులనుచిత్తు చేసి బంగారు పతకాలు కొల్లగొట్టాడు. అయితే తల్లిదండ్రులమరణంతో ఆయన జీవితం గాడితప్పింది. దురలవాట్లతో ఉద్యోగం పోయింది. తినడానికి లేకపోవడంతో యాచకుడిగా మారాడు. మళ్లీ ఇప్పుడు మామూలు మనిషిగా మారిన అతడు... చదరంగంలో ఎత్తులు వేసేందుకు సై అంటున్నాడు. అతడే ఎంవై రాజు. తార్నాక: తార్నాకలోని వినాయక దేవాలయంలో భిక్షాటన చేస్తూ జీవితం వెళ్లదీస్తున్న రాజును ‘సాక్షి’ గమనించింది. ఆయన పరిస్థితిపై ‘జీవన చదరంగంలో ఓడిపోయాడు’ శీర్షికతో ఆరు నెలల క్రితం కథనం ప్రచురించింది. అప్పటికే అతడు స్కీజోఫినియా వ్యాధితో బాధపడుతున్నాడు. కథనానికి స్పందించిన రాజు చిన్ననాటి స్నేహితులు, సోదరుడు.. ఆయనకు మంచి వైద్యం అందించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రయత్నిస్తున్న తరుణంలో శంషాబాద్‌లోని ‘ఆశాజ్యోతి రిహాబిలిటేషన్’ కేంద్రం వైద్యులు డాక్టర్ జగన్నాథం ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకొచ్చారు. దీంతో రాజును అక్కడ చేర్పించగా మూడు నెలలు చికిత్స అందించారు. ఉచితంగానే భోజన సదుపాయాలు, మందులు అందజేశారు. రాజు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని, చెస్‌లో పాల్గొనేందుకు సిద్ధమని డాక్టర్ జగన్నాథం తెలిపారు. స్కీజోనిఫియా వ్యాధి పూర్తిగా నయమైందని, ఇక మామూలుగా మందులు వాడితే సరిపోతుందని చెప్పారు. ఆవాసం కోసంమిత్రుల ప్రయత్నం.. ఇంతకముందు వరకు దేవాలయంలోనే గడిపిన రాజుకు షెల్టర్ లేదు. ఇప్పుడు ఆయన ఉండేందుకు గదిని అద్దెకు తీసుకోవాలని మిత్రులు నిర్ణయించారు. అందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గది కోసం వెతుకుతున్నామని, దొరికిన వెంటనే కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసి.. అన్ని రకాలు సదుపాయాలు సమకూరుస్తామని రాజు మిత్రుడు గుమ్మడి విజయ్‌కుమార్ తెలిపారు. అన్ని సెట్ అయ్యాక రాజును డిశ్చార్జీ చేసి తీసుకెళ్తామన్నారు. ఇదీ నేపథ్యం.. రాజు 1969లో ఒంగోలులో జన్మించాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. రాజుకు చిన్నతనం నుంచి చదరంగం అంటే ఎంతో ఆసక్తి. ఆయన క్రీడాసక్తికి తండ్రి ప్రోత్సాహం తోడవడంతో జాతీయ స్థాయి క్రీడాకారుణిగా రాణించాడు. ఆ ప్రతిభతోనే 1998లో దక్షిణమధ్య రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. అయితే తల్లిదండ్రుల మరణంతో రాజు జీవితం మారిపోయింది. దురలవాట్లకు బానిసవడంతో అటు ఆట.. ఇటు ఉద్యోగం రెండింటికీ దూరమయ్యాడు. మానసిక వ్యాధితో బాధపడుతూ యాచకుడిగా మారాడు. ఉద్యోగం.. చదరంగం మిత్రుల సహకారంతో నేను కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి సంపాదిస్తాను. ఉపాధి కోసం ఉద్యోగమైతే... నా ఆసక్తిని కొనసాగించేందుకు చదరంగం. మళ్లీ చెస్‌ను ప్రారంభిస్తాను. మంచి క్రీడాకారుడిగా రాణిస్తూ.. జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవాలనేదే నా ఆశయం. ఔత్సాహిక క్రీడాకారులకు నావంతుగా శిక్షణనిస్తాను. – ఎంవై రాజు -
ఘనంగా హరికృష్ణ వివాహం
సాక్షి, హైదరాబాద్ : భారత గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ పెంటేల ఓ ఇంటి వాడయ్యాడు. సెర్బియాకు చెందిన మాజీ చెస్ ప్లేయర్ నడ్జాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మార్చి 3 శనివారం, హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఘనంగా జరిగింది. విశ్వనాథన్ ఆనంద్ స్ఫూర్తితో చదరంగంలోకి అడుగుపెట్టిన.. హరికృష్ణ అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగాడు. .. గుంటూరు జిల్లాకు చెందిన హరికృష్ణ అతిపిన్న వయసులో గ్రాండ్ మాస్టర్‌గా హోదా సాధించిన భారతీయుడిగా రికార్డ్ నెలకొల్పాడు. హరికృష్ణ ప్రేమకథ చదవండి -
హిజబ్ వేసుకోలేదని ఆమెను...
టెహ్రాన్ : ఇస్లాం దేశాల చట్టాలు ఎలా ఉంటాయో తెలియంది కాదు. ముఖ్యంగా సాంప్రదాయాలను ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలే ఉంటాయి కూడా. డోస్రా డెరాక్షని అనే చెస్ గ్రాండ్ మాస్టర్ ఇప్పుడు అలానే నిషేధానికి గురైంది. ఈ యేడాది ఫిబ్రవరిలో గిబ్రాల్టర్‌లో జరిగిన పోటీల్లో డోస్రా యూఎస్ జాతీయ ఫెడరేషన్ తరపున పాల్గొంది. అయితే ఆమె బురఖా లేకుండానే పోటీలో పాల్గొనటంతో విమర్శలు వెలువెత్తాయి. చివరకు ఆమెపై నిషేధం విధిస్తున్నట్లు ఇరాన్ చెస్ ఫెడరేషన్ ప్రకటించింది. ఆమె బ్యాన్ వార్తలపై చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మెహ్రదద్ స్పందించారు. అసలు 2014లో ఒక్కసారి మాత్రమే ఇరాన్ తరపున ఆడిందని.. ఆమెకు సభ్యత్వం కూడా లేదని, తర్వాత 2015లో ఆమె బార్సిలోనాకు తరలి వెళ్లిపోయిందని ఆయన చెబుతున్నారు. అయినప్పటికీ డోస్రాతోపాటు ఆమె సోదరుడు బోర్నాపై కూడా బ్యాన్ విధించినట్లు ఆయన ప్రకటించారు. ‘ఇరాన్ 1979 చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మహిళలు బురఖా ధరించటం తప్పనిసరి. ఇరాన్ పాలనీ ప్రకారం ఇజ్రాయిల్ అథ్లెట్లతో పోటీ పడకూడదు. కానీ, డోస్రా సోదరుడు బోర్నా డెరాక్షని నిబంధనలను ఉల్లంఘించి ఇజ్రాయిల్ ఆటగాడితో పోటీపడ్డాడు. అందుకే అతనిపైనా నిషేధం విధించామ’ని మెహ్రదద్ తెలిపారు. కాగా, పోటీల్లో బురఖా ధరించకూడదన్న ఆమె నిర్ణయాన్ని అమెరికా ఛెస్ ఫెడరేషన్ స్వాగతించింది. -
బెజవాడకు స్వచ్ఛ పరీక్ష
నేటి నుంచి నగరంలో సర్వే స్వచ్ఛ సర్వేక్షణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కోనేరు హంపి నగరంలో నేటి నుంచి మూడు రోజుల పాటు స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరగనుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ టీం సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయడంతోపాటు ప్రజాభిప్రాయాలు సేకరిస్తారు. 500 నగరాలతో పోటీ పడుతున్న బెజవాడను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ విజయవాడ అంబాసిడర్‌గా ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపిని నియమించారు. విజయవాడ సెంట్రల్ : స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు టీం సభ్యులు నగరంలోని మురికివాడలు, కాలనీలు, కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలు, మార్కెట్, రైల్వే, బస్స్టేషన్లలో పర్యటిస్తారు. మరుగుదొడ్లను పరిశీలించడంతో పాటు నగరపాలక సంస్థ అందిస్తు న్న సేవలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారు. బ్రాండ్ అంబాసిడర్‌గా కోనేరు హంపి.. స్వచ్ఛ సర్వేక్షణ్ విజయవాడ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపిని నియమించారు. ఈ మేర కు సోమవారం మేయర్ చాంబర్లో మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు ఆమెకు దుశ్శా లువా కప్పి, పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛసర్వేక్షణ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏడాదిగా నగరంలో ఎంతోమార్పు కనిపిస్తోందన్నారు. మేయర్, కమిషనర్ల కృషి ఫలితంగానే నగరం అభివృద్ధి పథంలో ముందుకుసాగుతోం దన్నారు. స్వచ్ఛభారత్ కల సాకారం కావాలంటే ప్రజల్లో చైతన్యం అవసరం అన్నారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ఇలా..... స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడ పాల్గొంటున్నట్లు మీకు తెలుసా.. మీ ప్రాంతం గతం కంటే ఇప్పుడు పరిశుభ్రంగా ఉందా ఈ ఏడాది మీ ప్రాంతంలోని మార్కెట్లలో చెత్త వేసేందుకు డస్ట్, లిట్టర్ బిన్స్ అందుబాటులో ఉన్నాయా .. ఇంటి నుంచి చెత్త సేకరణ నూరుశాతం జరుగుతోందా ప్రజా, సామాజిక మరుగుదొడ్లు అవసరానికి తగ్గట్లు ఉన్నాయా మరుగుదొడ్ల నిర్వహణ మెరుగ్గా ఉందా. మిస్డ్‌కాల్ ఇస్తేచాలు..: స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో పాల్గొనదల్చి నవారు 1969 నెంబర్‌కు మిస్డ్‌కాల్ ఇస్తే చాలు. వెంటనే ఫోన్ వస్తోంది. పైన పేర్కొన్న ప్రశ్నలను టీం సభ్యులు అడుగుతారు. ప్రజలు ఇచ్చే సమాధానాలను పరిగణనలోకి తీసుకొని మార్కు లు కేటాయిస్తారు. ప్రజా భిప్రాయ సేకరణకు సంబంధించి సర్వే బృందం వెయ్యిమందికి మాత్రమే ఫోన్ చేస్తోంది. ఆసక్తి గలవా రు 1969నెంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. మార్కుల కేటాయింపు ఇలా..: మొత్తం మార్కులు 2000 కాగా, 34 అంశాలకు సంబంధించి అధికారులు రూపొందించిన డాక్యుమెంట్లు, ఫొటోలకు 900, క్షేత్రస్థాయి పరిశీలనకు 550, సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌కు 450 చొప్పున మార్కులు కేటాయిస్తారు. వీటి ఆధారంగానే ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతోంది. దేశ వ్యాప్తంగా అమృత్ పథకం కింద ఎంపికైన 500 నగరాలతో బెజవాడ పోటీలో తలపడుతోంది. గతంలో ఐదు లక్షల పైబడి జనాభా ఉన్న 73 నగరాలతో పోటీ పడగా 23వ స్థానంలో నిలిచింది.