హైదరాబాద్: చెస్ ఆడుతూ సీనియర్ క్రీడాకారుడు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్ర, శని, ఆదివారాల్లో స్లాన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలకు దాదాపు 15 రాష్ట్రాలకు చెందిన 700 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు.
కాగా శనివారం మధ్యాహ్నం అంబర్‌పేట, 6వ నెంబర్ సర్కిల్ సాయిమిత్ర ఎస్టేట్స్‌లో నివాసం ఉంటున్న సీనియర్ చెస్ క్రీడాకారులు వి.ఎస్.టి.సాయి (72) కూడా క్రీడను కొనసాగిస్తున్నారు. ఐదవ రౌండ్‌లో ఉండగా ఒక్కసారిగా గుండెలో నొప్పి వచ్చి పడిపోయాడు. హుటాహుటిన స్లాన్ సంస్థ సిబ్బంది, ఆడిటోరియం సెక్యూనిటీ అంబులెన్స్‌ను పిలిపించి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే సాయి మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈయనకు భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. ఎల్‌ఐసీలో అధికారిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. చెస్ అంటే ప్రాణంగా భావించేవారు. ఎక్కడ టోరీ్నలు జరిగినా తప్పకుండా హాజరయ్యేవారని చెస్ క్రీడాకారులు తెలియజేశారు. నగరానికి చెందిన పలువురు సీనియర్ చెస్ ప్లేయర్లు ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment