బెజవాడకు స్వచ్ఛ పరీక్ష
- నేటి నుంచి నగరంలో సర్వే
- స్వచ్ఛ సర్వేక్షణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కోనేరు హంపి
- స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడ పాల్గొంటున్నట్లు మీకు తెలుసా..
- మీ ప్రాంతం గతం కంటే ఇప్పుడు పరిశుభ్రంగా ఉందా
- ఈ ఏడాది మీ ప్రాంతంలోని మార్కెట్లలో చెత్త వేసేందుకు డస్ట్, లిట్టర్ బిన్స్ అందుబాటులో ఉన్నాయా ..
- ఇంటి నుంచి చెత్త సేకరణ నూరుశాతం జరుగుతోందా
- ప్రజా, సామాజిక మరుగుదొడ్లు అవసరానికి తగ్గట్లు ఉన్నాయా
- మరుగుదొడ్ల నిర్వహణ మెరుగ్గా ఉందా.
నగరంలో నేటి నుంచి మూడు రోజుల పాటు స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరగనుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ టీం సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయడంతోపాటు ప్రజాభిప్రాయాలు సేకరిస్తారు. 500 నగరాలతో పోటీ పడుతున్న బెజవాడను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ విజయవాడ అంబాసిడర్‌గా ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపిని నియమించారు.
విజయవాడ సెంట్రల్ : స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు టీం సభ్యులు నగరంలోని మురికివాడలు, కాలనీలు, కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలు, మార్కెట్, రైల్వే, బస్‌స్టేషన్లలో పర్యటిస్తారు. మరుగుదొడ్లను పరిశీలించడంతో పాటు నగరపాలక సంస్థ అందిస్తు న్న సేవలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారు.
బ్రాండ్ అంబాసిడర్‌గా కోనేరు హంపి..
స్వచ్ఛ సర్వేక్షణ్ విజయవాడ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపిని నియమించారు. ఈ మేర కు సోమవారం మేయర్ చాంబర్‌లో మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు ఆమెకు దుశ్శా లువా కప్పి, పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛసర్వేక్షణ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏడాదిగా నగరంలో ఎంతోమార్పు కనిపిస్తోందన్నారు. మేయర్, కమిషనర్‌ల కృషి ఫలితంగానే నగరం అభివృద్ధి పథంలో ముందుకుసాగుతోం దన్నారు. స్వచ్ఛభారత్ కల సాకారం కావాలంటే ప్రజల్లో చైతన్యం అవసరం అన్నారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ ఇలా.....
మిస్డ్‌కాల్ ఇస్తేచాలు..: స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో పాల్గొనదల్చి నవారు 1969 నెంబర్‌కు మిస్డ్‌కాల్ ఇస్తే చాలు. వెంటనే ఫోన్ వస్తోంది. పైన పేర్కొన్న ప్రశ్నలను టీం సభ్యులు అడుగుతారు. ప్రజలు ఇచ్చే సమాధానాలను పరిగణనలోకి తీసుకొని మార్కు లు కేటాయిస్తారు. ప్రజా భిప్రాయ సేకరణకు సంబంధించి సర్వే బృందం వెయ్యిమందికి మాత్రమే ఫోన్ చేస్తోంది. ఆసక్తి గలవా రు 1969నెంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.
మార్కుల కేటాయింపు ఇలా..: మొత్తం మార్కులు 2000 కాగా, 34 అంశాలకు సంబంధించి అధికారులు రూపొందించిన డాక్యుమెంట్లు, ఫొటోలకు 900, క్షేత్రస్థాయి పరిశీలనకు 550, సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌కు 450 చొప్పున మార్కులు కేటాయిస్తారు. వీటి ఆధారంగానే ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతోంది. దేశ వ్యాప్తంగా అమృత్ పథకం కింద ఎంపికైన 500 నగరాలతో బెజవాడ పోటీలో తలపడుతోంది. గతంలో ఐదు లక్షల పైబడి జనాభా ఉన్న 73 నగరాలతో పోటీ పడగా 23వ స్థానంలో నిలిచింది.