Rewind 2024: విండీస్‌లో ‘విన్‌’.. మనూ సూపర్‌... చెస్‌లో పసిడి కాంతులు | Rewind 2024 Lookback Sports, India T20 Glory To Gukesh Humpy Manu Success, List Of Major Events In Sports | Sakshi
Sakshi News home page

Rewind 2024: విండీస్‌లో ‘విన్‌’.. మనూ సూపర్‌.. పారాలో ఔరా.. చెస్‌లో పసిడి కాంతులు

Published Tue, Dec 31 2024 9:46 AM | Last Updated on Tue, Dec 31 2024 10:46 AM

Rewind 2024 Lookback Sports: India T20 Glory To Gukesh Humpy Manu Success

2024లో కొత్త శిఖరాలకు భారత క్రీడారంగం 

చెస్‌లో స్వర్ణ వసంతం 

కప్‌తో క్రికెట్‌ వైభవం
 

ఏడాది గడిచింది. క్రీడల్లో గెలుపోటములు సహజం. కానీ సమానమంటే మాత్రం కానేకాదు. ఎందుకంటే కప్, రన్నరప్‌... విజేత, పరాజిత... స్వర్ణం, రజతం... ఒకటి కావు. ఒక రంగులో ఉండవు. ఒక రూపం ఉండదు. అదెప్పటికీ ప్రత్యేకం... అపురూపం!

చాంపియన్‌కు, టైటిల్‌కు, ట్రోఫీకి ఉండే విలువే వేరు. నేటితో గడిచిపోయే ఈ యేడాది స్పోర్ట్స్‌ డైరీలో మరుపురాని విజయాలెన్నో, చిరస్మరణీయ క్షణాలెన్నో ఉన్నాయి. ఓ ప్రపంచకప్‌ విజయం. ‘పారిస్‌’లో పతకాల ప్రతాపం. పారాలింపిక్స్‌లో అయితే పతకాల తోరణం!

చెస్‌లో ప్రపంచ చాంపియన్లు, ఒలింపియాడ్‌లో స్వర్ణాలు. ఇవన్నీ కూడా సొంతగడ్డపై కాదు... విదేశాల్లోనే విజయకేతనం! ఇది కదా భారత క్రీడారంగానికి శుభ వసంతం... ఏడాది ఆసాంతం!  పట్టుదలకు పట్టం, ప్రతిభకు నిదర్శనం...  మన క్రీడాకారుల విజయగర్జన. కొత్తేడాదికి సరికొత్త ప్రేరణ. 

విండీస్‌లో ‘విన్‌ ఇండియా’ 
కపిల్‌దేవ్‌ సారథ్యంలో 1983లో తొలి వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన చాలా ఏళ్లకు మళ్లీ ధోనీ బృందం 2011లో భారత్‌కు రెండో వన్డే ప్రపంచకప్‌ ముచ్చట తీర్చింది. అంతకంటే ముందు ఆరంభ టీ20 ప్రపంచకప్‌ (2007)ను ధోని సారథ్యంలోని యువసేన గెలుచుకొస్తే... 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రోహిత్‌ సేన ఈ ఏడాది(T20 World Cup 2024) కరీబియన్‌ గడ్డపై రెండో టీ20 కప్‌ను అందించింది.

ప్రతీ మ్యాచ్‌లో భారత్‌ గర్జనకు ప్రత్యర్థులు తలవంచారు. అయితే దక్షిణాఫ్రికాతో ఫైనల్‌ మాత్రం కాస్త భిన్నంగా జరిగింది. కోహ్లి ఫైనల్లో రాణించడంతో భారత్‌ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యం కఠినమైందో, క్లిష్టమైందో కాకపోవడం .. క్లాసెన్‌ అప్పటికే ఐపీఎల్‌తో దంచికొట్టిన ఫామ్‌లో ఉండటంతో మ్యాచ్‌ను సఫారీ చేతుల్లోకి తెచ్చాడు.

దాదాపు బంతులు, పరుగులు సమంగా ఉన్న దశలో క్లాసెన్‌ను హార్దిక్‌ అవుట్‌ చేశాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో బుమ్రా, యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ పరుగుల్ని ఆపేశారు. సూర్యకుమార్‌ చరిత్రలో నిలిచే క్యాచ్‌... ఇలా ప్రతిఒక్కరు కడదాకా పట్టుబిగించడంతో భారత్‌ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.

మను భాకర్‌... సూపర్‌
పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుకున్నారు. అరడజను పతకాలైతే పట్టారు. కానీ స్వర్ణమే లోటు! బహుశా వినేశ్‌ ఫొగాట్‌(Vinesh Phogat) (100 గ్రాముల అధిక బరువు) అనర్హతకు గురి కాకుంటే రెజ్లింగ్‌లో పసిడి పట్టేదేమో! షూటర్‌ మను భాకర్‌(Manu Bhaker) టోక్యోలో ఎదురైన నిరాశను అధిగమించేలా పారిస్‌ ఒలింపిక్స్‌ను చిరస్మరణీయం చేసుకుంది.

ఒకే ఒలింపిక్స్‌లో ‘హ్యట్రిక్‌’ పతకం, అరుదైన ఘనత చేజారినా... ఆమె రెండు కాంస్య పతకాలు సాధించింది. మళ్లీ స్వర్ణం తెస్తాడని గంపెడాశలు పెట్టుకున్న జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా రజతంతో సరిపెట్టాడు. స్వప్నిల్‌ కుసాలే (షూటింగ్‌), అమన్‌ సెహ్రావత్‌ (రెజ్లింగ్‌) కాంస్యాలు నెగ్గారు.

హాకీ ఆటకు ఒలింపిక్స్‌లో పునర్‌వైభవం మొదలైనట్లుంది. వరుస ఒలింపిక్స్‌లో మన పురుషుల జట్టు కాంస్యం సాధించింది. షట్లర్‌ లక్ష్యసేన్, లిఫ్టర్‌ మీరాబాయి చాను, షూటర్‌ అర్జున్‌ బబుతా త్రుటిలో ఒలింపిక్‌ పతకాన్ని (కాంస్యం) కోల్పోయారు. ఓవరాల్‌గా 206 మందితో కూడిన భారత బృందం ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో సంతృప్తికరంగా ఈవెంట్‌ను ముగించింది.  

‘పారా’లో ఔరా అనేలా మన ప్రదర్శన 
పారాలింపియన్ల పట్టుదలకు వైకల్యం ఓడిపోయింది. 84 మందితో పారిస్‌కు వెళ్లిన మన బృందం 29 పతకాలతో కొత్త చరిత్ర లిఖించింది. పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచిన భారత్‌ మునుపెన్నడు గెలవనన్నీ పతకాల్ని చేజిక్కించుకుంది. ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్యాలు గెలుచుకుంది.

అవని లెఖరా, సుమిత్‌ అంటిల్, మరియప్పన్‌ తంగవేలు, శీతల్‌ దేవి, నితీశ్‌ కుమార్, ప్రవీణ్‌ కుమార్, నవ్‌దీప్‌ సింగ్, హర్విందర్‌ సింగ్, ధరంవీర్‌ తదితరులు పతకాల పంట పండించారు.  

చదరంగంలో  ‘పసిడి ఎత్తులు
భారత్‌లో చెస్‌ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విశ్వనాథన్‌ ఆనంద్‌! ఆ తర్వాత మరెంతో మంది గ్రాండ్‌మాస్టర్లు వచ్చారు. కానీ అతనిలా భారత చదరంగంలో నిలిచిపోలేదు. అయితే ఈ ఏడాది మాత్రం చదరంగంలో స్వర్ణ చరిత్రను ఆవిష్కరించింది.

చెస్‌ ఒలింపియాడ్, క్యాండిడేట్స్‌ టోర్నీ (ప్రపంచ చాంపియన్‌తో తలపడే ప్రత్యర్థిని ఖరారు చేసే ఈవెంట్‌), ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌షిప్‌ వీటన్నింటా మనదే జేగంట! 

ఓ రకంగా 2024 భారత చెస్‌ గడిల్లో తీపిగీతలెన్నో గీసింది. బుడాపెస్ట్‌లో జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లో దొమ్మరాజు గుకేశ్, అర్జున్‌ ఇరిగేశి, విదిత్‌ గుజరాతి, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణ... ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, వైశాలి, తానియా సచ్‌దేవ్‌లతో కూడిన భారత బృందం విజయంతో పుటలకెక్కింది.

క్యాండిడేట్స్‌ టోర్నీ గెలిచిన దొమ్మరాజు గుకేశ్‌(D Gukesh) ఇటీవల క్లాసికల్‌ ఫార్మాట్‌లో సరికొత్త ప్రపంచ చాంపియన్‌గా ఆవిర్భవించాడు. అనుభవజ్ఞుడు,  డిఫెండింగ్‌ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా) ఎత్తుల్ని చిత్తుచేసి అతిపిన్న వయసులో జగజ్జేతగా గుకేశ్‌ కొత్త రాత రాశాడు. న్యూయార్క్‌లో తెలుగుతేజం, వెటరన్‌ ప్లేయర్‌ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌షిప్‌లో రెండోసారి విజేతగా నిలిచింది. 
 –సాక్షి క్రీడా విభాగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement