గతేడాది టీమిండియాకు మధుర జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాల్నీ మిగిల్చింది. పొట్టి ఫార్మాట్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత జట్టు.. దాదాపు పదిహేడేళ్ల తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) గెలిచింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007లో తొట్టతొలి పొట్టి కప్ గెలుచుకున్న భారత్.. మళ్లీ 2024లో రోహిత్ కెప్టెన్సీలో ట్రోఫీని ముద్దాడింది.
చాంపియన్లుగా వీడ్కోలు
అయితే, ఈ మెగా టోర్నీలో టీమిండియా టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli)లతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఇకపై వీరు కేవలం ఫ్రాంఛైజీ క్రికెట్‌లో మాత్రమే టీ20 ప్రేమికులను అలరించనున్నారు.
ఇక.. ఐసీసీ టోర్నమెంట్ తర్వాత శుబ్‌మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేను టీ20 సిరీస్‌లో చిత్తు చేసింది టీమిండియా. ఇక భార టీ20 జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిష్క్రమించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అతడి స్థానాన్ని అధికారికంగా భర్తీ చేశాడు. సూర్య సారథ్యంలో తొలిసారి శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు 3-0తో ఆతిథ్య జట్టును క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ దుమ్ములేపింది.
సౌతాఫ్రికా గడ్డపై సత్తా చాటిన సూర్య సేన
ఆ తర్వాత సౌతాఫ్రికా గడ్డపై కూడా సూర్య సేన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. పొట్టి ఫార్మాట్ సంగతి ఇలా ఉంటే.. టెస్టుల్లో ఆరంభంలో అదరగొట్టిన రోహిత్ సేన.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 4-1తో గెలిచిన భారత్.. బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
మర్చిపోలేని వైట్‌వాష్ పరాభవం
అయితే, స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవం ఎదుర్కొంది. పర్యాటక జట్టు చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురై చరిత్రలోనే తొలిసారిగా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రత్యర్థి చేతిలో క్లీన్‌స్వీప్ అయిన జట్టుగా రోహిత్ సేన చెత్త రికార్డు మూటగట్టుకుంది.
ఆసీస్‌తో సిరీస్‌లోనూ
ఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఈ వైఫల్యాలను కొనసాగిస్తోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లిన భారత్.. తొలి టెస్టులో గెలుపొందినా.. ఆ తర్వాత అదే ఫలితాన్ని పునావృతం చేయలేకపోయింది.
అడిలైడ్‌లో ఓడి.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. అలా చేదు అనుభవంతో గతేడాదిని ముగించింది.
ఒక్క వన్డే కూడా గెలవలేదు
ఇదిలా ఉంటే.. 2024లో భారత జట్టుకు ఎదురైన మరో ఘోర అవమానం ఏమిటంటే.. గతేడాది టీమిండియా ఒక్కటంటే ఒక్క వన్డే కూడా గెలవలేదు.శ్రీలంక పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో ఓ మ్యాచ్‌ను టై చేసుకున్న రోహిత్ సేన.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది.
తద్వారా దాదాపు రెండు దశాబ్దాల అనంతరం లంకతో వన్డే ద్వైపాక్షిక సిరీస్‌లో ఓటమిని చవిచూసింది. ఇలా ఓ ఏడాదిలో వన్డేల్లో భారత్ ఒక్కటి కూడా గెలవకపోవడం 45 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1979లోనే టీమిండియా ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది. అదీ విషయం!!
వచ్చే ఏడాది మరింత బిజీ
ఇక ఆసీస్‌తో సిడ్నీ టెస్టుతో 2025ను మొదలుపెట్టనున్న టీమిండియా.. తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇందులో ఐదు టీ20లతో పాటు మూడే వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది.
ఇక ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ నాలుగు టెస్టులు ఆడుతుంది. తదుపరి బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లతోనూ సిరీస్‌లు ఆడాల్సి ఉంది.
చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్
Comments
Please login to add a commentAdd a comment