‘‘మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే ఛేదించగల స్కోరే ఇది. నిజానికి మేము బాగానే ఆడాం. అయితే, నిలకడలేమి బ్యాటింగ్ వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. పది ఓవర్ల తర్వాత.. ఒక్కసారి స్పిన్నర్లు బరిలోకి వచ్చారంటే మ్యాచ్ స్వరూపం మారిపోతుందని ముందే ఊహించాం. అందుకే ఆరంభంలో దూకుడుగా ఆడుతూ వీలైనన్ని పరుగులు స్కోరు చేశాం.
లక్ష్య ఛేదన మొదలుపెట్టిన సమయంలో మాదే పైచేయి. అయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. కేఎల్ రాహుల్- అక్షర్ పటేల్ వల్ల తిరిగి పుంజుకున్నాం. అయితే, ఆఖర్లో 14 బంతులు ఉండి కూడా ఒక్క పరుగు తీయలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది.
ఆటలో ఇలాంటివన్నీ సహజమే. అయితే, శ్రీలంక ఈరోజు అద్బుతంగా ఆడింది. పిచ్ మొదటి నుంచి ఒకేలా ఉంది. తొలి 25 ఓవర్లలో మేము కూడా బాగా బౌలింగ్ చేశాం. తర్వాత వికెట్.. బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా మారింది. ఏదేమైనా మేము చివరిదాకా పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉంది.
రెండు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. మేము కనీసం ఒక్కటంటే ఒక్క పరుగు చేయాల్సింది’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. శ్రీలంకతో తొలి వన్డే ‘టై’గా ముగియడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తొలిసారిగా లంకతో వన్డే సిరీస్‌లో పాల్గొంటున్నారు.
దంచికొట్టిన రోహిత్
ఈ క్రమంలో శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టుకు నిరాశే ఎదురైంది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. ఆతిథ్య జట్టును 230 పరుగులకు పరిమితం చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించినా మిడిలార్డర్ విఫలం కావడంతో కష్టాల్లో పడింది.
ఓపెనర్ రోహిత్ శర్మ 47 బంతుల్లో 58 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(35 బంతుల్లో 16 రన్స్) మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆదుకుంటాడని భావిస్తే.. అతడు కూడా 32 బంతుల్లో కేవలం 24 పరుగులకే పరిమితమయ్యాడు.
విజయానికి ఒక పరుగు దూరంలో
వాషింగ్టన్ సుందర్(5) తేలిపోగా.. రీఎంట్రీ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(31), అక్షర్ పటేల్(33) కాసేపు పోరాడగా.. శివం దూబే 25 పరుగులతో గెలుపు ఆశలు రేపాడు.
అయితే, కేవలం 14 బంతుల్లో ఒక్క పరుగు అవసరమైన వేళ.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 48వ ఓవర్లో దూబే, అర్ష్‌దీప్ సింగ్(0)ను అవుట్ చేయడంతో టీమిండియా ఆలౌట్ అయింది. విజయానికి ఒక పరుగు దూరంలో నిలిచి.. మ్యాచ్‌ను టై చేసుకుంది. భారత ఓపెనర్ల వికెట్లు తీసిన శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలగే(2/39) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment