![Is Rohit To Come Out Of T20I Retirement Big Tournament Coming Up Remark Viral](/styles/webp/s3/article_images/2024/08/2/ro2.jpg.webp?itok=HetLBr92)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటాడా? భారత్ తరఫున మళ్లీ పొట్టి ఫార్మాట్ బరిలో దిగుతాడా? టీ20 సిక్సర్ల కింగ్‌గా తన పేరును పదిలం చేసుకుంటూ మరిన్ని భారీ షాట్లు బాదుతాడా? అంటూ హిట్‌మ్యాన్ అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇందుకు కారణం రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలే!
టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి స్థానంలో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు రోహిత్. ద్వైపాక్షిక సిరీస్‌లో అనూహ్య విజయాలతో మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ను వరల్డ్ నంబర్ వన్‌గా నిలిపాడు. అయితే, ప్రపంచకప్ గెలవాలన్న కల మాత్రం టీ20 ప్రపంచకప్-2024తో తీరింది. అంతకు ముందు.. రోహిత్ సారథ్యంలో టీ20 వరల్డ్‌కప్-2022లో సెమీస్‌లోనే టీమిండియా నిష్క్రమించగా.. వన్డే వరల్డ్‌కప్-2023లోనూ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.
లంకతో వన్డే సిరీస్‌తో
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు రాగా.. ఐసీసీ టైటిల్ గెలిచి విమర్శకులకు గట్టిగా సమాధానమిచ్చాడు. వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడగానే తాను అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్న హిట్‌మ్యాన్.. మళ్లీ శ్రీలంకతో వన్డే సిరీస్‌తో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పినందుకు మీరు ఎలా ఫీలవుతున్నారు అని విలేకరులు అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘గతంలో మాదిరే ఇప్పుడు కూడా నేను టీ20ల నుంచి విశ్రాంతి తీసుకున్నట్లే అనిపిస్తోంది. ఇక ఏదైనా కీలక టోర్నీ వస్తోందంటే మళ్లీ టీ20లు ఆడేందుకు సిద్ధంగా ఉండాలేమోనన్న ఫీలింగ్ వస్తోంది.
పొట్టి ఫార్మాట్ నుంచి పూర్తిగా బయటకు రాలేదు
ఇప్పటికీ నేను పొట్టి ఫార్మాట్ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపించడం లేదు. ఏదో కొన్నాళ్లు సెలవు తీసుకుని మళ్లీ ఆడాలి కదా అన్న ఫీలింగ్‌లోనే ఉన్నాను’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. దీంతో అభిమానుల ఆశలకు కొత్త రెక్కలు తొడిగినట్లయింది. కాగా గతంలో చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఇటీవల.. ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ వన్డేలకు గుడ్‌బై చెప్పినా.. వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది చాలాసార్లు రిటైర్మెంట్ ఇచ్చి మళ్లీ బరిలోకి దిగాడు.
ఆ అవకాశం లేదు.. కానీ
కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత విరాట్ కోహ్లితో పాటు దాదాపు ఏడాది కాలం అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న రోహిత్.. వరల్డ్‌కప్-2024కు ముందే రీఎంట్రీ ఇచ్చాడు. కోహ్లితో కలిసి ఓపెనింగ్ చేసిన హిట్‌మ్యాన్.. భారత్ తరఫున మహేంద్ర సింగ్ ధోని తర్వాత రెండో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌గా నిలిచాడు.
ఇక 2026లో మరోసారి టీ20 వరల్డ్‌కప్‌నకు రంగం సిద్దం కాగా.. రోహిత్ శర్మ వయసు అప్పటికి 39 ఏళ్లు అవుతుంది. కాబట్టి అతడు తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం దాదాపుగా ఉండదు. ఇక రోహిత్ స్థానంలో టీమిండియా టీ20 నూతన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో భారత్ శ్రీలంక తాజా పర్యటనలో టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది.
చదవండి: లంకతో తొలి వన్డే.. అందరి కళ్లు సిరాజ్‌పైనే..!
Even we are not over your T20I retirement, @ImRo45 🥹
What's your take? 💬#SonySportsNetwork #SLvIND #RohitSharma pic.twitter.com/AMt7HXLR6U— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2024
Comments
Please login to add a commentAdd a comment