శ్రీలంకతో తాజా వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వరుస వైఫల్యాల నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కోహ్లి అవుటైన తీరును జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి కోహ్లి కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, రెండుసార్లూ అతడు స్పిన్నర్ల చేతికే చిక్కాడు.
అది కూడా రెండుసార్లు లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగడం గమనార్హం. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి.. దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కూడా దూరంగా ఉండాలని భావించినప్పటికీ కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సంప్రదింపుల నేపథ్యంలో అందుబాటులోకి వచ్చాడు.
రోహిత్ శర్మతో కలిసి వన్డే సిరీస్ ఆడేందుకు శ్రీలంకలో అడుగుపెట్టాడు. ఇక ఇప్పటి వరకు రెండు వన్డేల్లో కలిపి రోహిత్ శర్మ 122 పరుగులతో ఫామ్‌లో ఉండగా.. కోహ్లి మాత్రం తడబడుతున్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ కోసం కోహ్లి పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు కనిపించడం లేదని విమర్శించాడు.
‘‘ప్రపంచంలోని నంబర్ వన్ బ్యాటర్.. గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లి. కానీ వరుసగా రెండుసార్లు ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ లేదంటే శివం దూబే విషయంలో ఇలా జరిగితే పర్లేదనుకోవచ్చు. కానీ విరాట్ కోహ్లి.. విరాట్ కోహ్లియే. తన స్థాయికి ఇది తగదు. దీనిని బట్టి అతడు పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ చేయలేదని అర్థమవుతోంది’’ అని బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.
ఇక రెండో వన్డేలో లంక స్పిన్నర్ జెఫ్రే వాండర్సె ధాటికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ప్రపంచ క్రికెట్‌ను ఏలే బ్యాటింగ్ ఆర్డర్‌లా ఏమాత్రం అనిపించలేదు. శ్రేయస్ అయ్యర్, కేఎల్‌రాహుల్ కూడా తగినంత ప్రాక్టీస్ చేసినట్లు కనబడటం లేదు. ప్రాక్టీస్ లేకుండానే మ్యాచ్ ఆడటానికి వచ్చేసినట్లు ఉన్నారు.
అసలు అయ్యర్ ఇలా ఎందుకు ఆడుతున్నాడో అర్థమే కావడం లేదు. అయ్యర్ స్థానంలో రిషభ్ పంత్ లేదంటే.. రియాన్ పరాగ్, రింకూ సింగ్ జట్టులోకి వచ్చే సమయం ఆసన్నమైందనిపిస్తోంది. దేశవాళీ వన్డే ఫార్మాట్(లిస్ట్-ఏ)క్రికెట్ నుంచి కొంతమందిని గంభీర్ సెలక్ట్ చేసుకోకతప్పదు’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం నిరాశపరుస్తోంది. తొలి వన్డే టై కాగా.. రెండో వన్డేలో శ్రీలంక గెలుపొంది.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment