టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే క్రమంలో గౌతం గంభీర్ ఆది నుంచే తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. సీనియర్లు విశ్రాంతి పేరిట సిరీస్‌లకు దూరం కావడానికి తాను వ్యతిరేకం అంటూ గౌతీ ఆటగాళ్లకు సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
అంతేకాదు ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో(టెస్టు, వన్డే, టీ20)నూ ఆడాలని కుండబద్దలు కొట్టాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటన నుంచే తన ప్రణాళికలు అమలు చేసేందుకు గంభీర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కాగా రాహుల్ ద్రవిడ్ స్థానంలో భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడైన మాజీ క్రికెటర్ గంభీర్.. శ్రీలంక టూర్‌తో శిక్షకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. జూలై 27 నుంచి ఇరు జట్ల మధ్య టీ20 మ్యాచ్‌తో ద్వైపాక్షిక సిరీస్ మొదలుకానుంది.
అయితే, ఈ పర్యటనకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యారు. వన్డే, టెస్టుల్లో మాత్రం కొనసాగనున్నారు.
అందుబాటులో ఉండలేం..
కానీ.. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు మాత్రం తాము అందుబాటులో ఉండలేమని వీరిద్దరు బీసీసీఐకి చెప్పినట్లు సమాచారం. వీరితో పాటు బుమ్రా కూడా ఈ పర్యటనకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గంభీర్ మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం.
కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ప్రస్తుతం సెలవులను ఆస్వాదిస్తున్నారు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. స్వదేశంలో సంబరాల అనంతరం ఈ దిగ్గజ బ్యాటర్లు విదేశాలకు చెక్కేశారు.
అదేం కుదరదు
మరోవైపు.. బుమ్రా వంటి మరికొందరు సీనియర్లు కూడా కుటుంబానికి సమయం కేటాయించారు. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటనకు వీరు అందుబాటులో ఉండేందుకు మొగ్గు చూపడం లేదని బీసీసీఐ సన్నిహిత వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొన్నాయి.
అయితే, గంభీర్ మాత్రం రోహిత్, విరాట్ సెలవులు ముగించుకుని జట్టుతో చేరాలని కోరినట్లు సమాచారం. బుమ్రా కూడా ఈ సిరీస్‌లో ఆడాలని అతడు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
చాంపియన్స్ ట్రోఫీ-2025కి సన్నద్ధమయ్యే క్రమంలో ఏ ఒక్క సిరీస్‌కు కూడా విశ్రాంతి పేరిట దూరం కావొద్దని తన మాటగా గంభీర్ చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి గంభీర్ ఆజ్ఞలను రోహిత్, విరాట్, బుమ్రా పాటిస్తారా? లేదంటే సెలవులను పొడిగించుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది.
చదవండి: 'కెప్టెన్ అయ్యాక కోహ్లి చాలా మారిపోయాడు.. కానీ రోహిత్ అలా కాదు'
Comments
Please login to add a commentAdd a comment