Rohit Sharma- Virat Kohli- ODI World Cup 2023: ‘‘రోహిత్ శర్మ బాగానే ఆడుతున్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, చాలా కాలంగా తన ఇన్నింగ్స్‌ను మూడు అంకెల స్కోరుగా మలచలేకపోతున్నాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పెదవి విరిచాడు. విరాట్ కోహ్లి ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడని, రోహిత్ కూడా అతడిలాగే పరుగుల దాహంతో ముందుకు సాగాలని సూచించాడు.
టీమిండియా కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ సెంచరీ చేసి చాలా రోజులు గడిచిపోయింది. గత 50 ఇన్నింగ్స్‌లలో ‘హిట్‌మ్యాన్’ పేరిట ఒక్క శతకం కూడా లేదు. మరోవైపు.. నిలకడలేమి ఫామ్‌తో సతమతమైన కింగ్ కోహ్లి ఇప్పుడు మునుపటి లయను అందుకున్నాడు. వరుస సెంచరీలు బాదుతూ బ్యాట్‌తోనే విమర్శకుల నోళ్లు మూయిస్తున్నాడు.
ఆ విషయంలో రోహిత్ విఫలం
ఇక శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో ఈ రన్‌మెషీన్ మరోసారి సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. తద్వారా అంతర్జాతీయ కెరీర్‌లో 74వ శతకం నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 42 పరుగులకే పెవిలియన్ చేరాడు.
మొదటి వన్డేలో 83 పరుగులతో సత్తా చాటినప్పటికీ తన ఇన్నింగ్స్‌ను సెంచరీలగా మలచడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో కోహ్లితో పోలుస్తూ రోహిత్ గురించి గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
కోహ్లిలాగే రోహిత్‌కు గడ్డు కాలం
‘‘విరాట్ కోహ్లి మూడున్నరేళ్లు సెంచరీ కోసం తపించిపోయాడు. ఇప్పుడు రోహిత్‌కు కూడా ఇలాంటి గడ్డు దశే నడుస్తోంది. 50 ఇన్నింగ్స్‌లలో అతడు ఒక్క శతకం కూడా బాదలేకపోయాడు. ఇదేం అంత తేలికగా తీసుకునే విషయం కాదు. విరాట్ విషయంలో మనం ఎలా ఉన్నామో రోహిత్ పట్ల అదే వైఖరి(విమర్శలు) ఉంటుంది.
ఇలాగైతే వరల్డ్‌కప్ ఎలా?
గత వన్డే వరల్డ్‌కప్ తర్వాత రోహిత్ ఆటలో ఏదో లోపం కనిపిస్తోంది. తన ఇన్నింగ్స్‌ను సెంచరీలుగా మార్చలేకపోతున్నాడు. వరల్డ్‌కప్ సమయానికైనా తను స్థాయికి తగ్గట్లు రాణించాలి. కోహ్లి, రోహిత్ జట్టులో కీలక సభ్యులు. వీరిద్దరు బాగా ఆడితేనే ఇండియా వరల్డ్‌కప్ గెలిచే అవకాశాలు మెరుగుపడతాయి’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
కాగా ఇంగ్లండ్‌తో ఓవల్ మైదానంలో 2021 సెప్టెంబరులో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆఖరిసారి శతకం బాదాడు. మరోవైపు.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ కరువు తీర్చుకున్నాడు కోహ్లి. అదే విధంగా గత నాలుగు వన్డే సిరీస్‌లలో మూడు శతకాలతో సత్తా చాటాడు ఈ పరుగుల యంత్రం.
చదవండి: Virat Kohli: అరుదైన ఘనతకు చేరువలో! రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు.. అయితే!
IND vs SL: వారెవ్వా సిరాజ్.. శ్రీలంక బ్యాటర్‌కు ఊహించని షాక్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment