స్వప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ అన్నాడు. తన ఆధీనంలో లేని విషయాల గురించి పట్టించుకోనని.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం తనకు అలవాటని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడైన సంజూ ప్రస్తుతం స్వరాష్ట్రం కేరళలో ఉన్నాడు.
ఈ క్రమంలో కేరళ క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో సంజూ శాంసన్ పాల్గొన్నాడు. శనివారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడుతుండగా.. శ్రీలంక వన్డే సిరీస్ గురించి ప్రశ్న ఎదురైంది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన సంజూ సెంచరీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. లంక సిరీస్‌కు ఎంపిక చేయకపోవడానికి గల కారణం ఏమిటని ఓ విలేఖరి ప్రశ్నించారు.
సానుకూల దృక్పథంతో ఉంటా
ఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్లు ఎప్పుడైతే నన్ను సెలక్ట్ చేస్తారో.. అప్పుడు వెళ్లి ఆడటం మాత్రమే నా చేతుల్లో ఉంది. ఏదేమైనా మన జట్టు బాగా ఆడితే అదే చాలు. లక్ష్యం నెరవేరిందా లేదా అన్నదే ముఖ్యం. అంతేకానీ.. నా ఆధీనంలోలేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించను. వీలైనంత వరకు సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలనే అనుకుంటాను. నేను ఏం చేయగలనో అది మాత్రమే చేస్తాను’’ అని సంజూ శాంసన్ పేర్కొన్నాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లింది టీమిండియా. అక్కడ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. అనంతరం.. శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ టూర్ ద్వారా టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ అరంగేట్రం చేశాడు. అయితే, ఈ పర్యటన సందర్భంగా టీ20 సిరీస్‌కు ఎంపికైన సంజూ శాంసన్‌ను.. వన్డే సిరీస్‌కు మాత్రం పక్కనపెట్టారు సెలక్టర్లు.
రెండుసార్లూ డకౌట్
చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు భారత్ కేవలం ఆరు వన్డేలు మాత్రమే ఆడననున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలను వెనక్కి పిలిపించారు. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చినా సంజూ పూర్తిగా నిరాశపరిచాడు.
రెండుసార్లూ డకౌట్‌గా వెనుదిరిగాడు సంజూ. ఇక ఈ టూర్‌లో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది సూర్యకుమార్ యాదవ్ సేన. అయితే, రోహిత్ కెప్టెన్సీలోని వన్డే జట్టు మాత్రం 0-2తో సిరీస్‌ను ఆతిథ్య లంకకు సమర్పించుకుంది. తద్వారా 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది.
చదవండి: నా కోచింగ్ కెరీర్‌లో అదే ఘోర పరాభవం: ద్రవిడ్
The Kerala Boy at a press conference🔥#SanjuSamson pic.twitter.com/gsdv9SSHlP
— Deepu (@deepu_drops) August 10, 2024
Comments
Please login to add a commentAdd a comment