నలుగురు ‘ఖేల్‌ రత్న’లు | Manu Bhaker Gukesh Harmanpreet and Praveen awarded Khel Ratna | Sakshi
Sakshi News home page

నలుగురు ‘ఖేల్‌ రత్న’లు

Published Fri, Jan 3 2025 3:31 AM | Last Updated on Fri, Jan 3 2025 6:06 AM

Manu Bhaker Gukesh Harmanpreet and Praveen awarded Khel Ratna

మనూ భాకర్, గుకేశ్, హర్మన్‌ప్రీత్, ప్రవీణ్‌లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం

32 మందికి ‘అర్జున’ అవార్డు 

ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ, తెలంగాణ పారాథ్లెట్‌ దీప్తి జివాంజిలకు ‘అర్జున’ 

సాక్షి, న్యూఢిల్లీ: విశ్వవేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన మేటి క్రీడాకారులకు ‘ఖేల్‌ రత్న’ అవార్డు వరించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో మెరిసిన మహిళా షూటర్‌ మనూ భాకర్‌... పిన్న వయసులో చెస్‌ ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌... భారత పురుషుల హాకీ జట్టు  కెప్టెన్  హర్మన్‌ప్రీత్‌ సింగ్‌... పారాథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌... 2024 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ పురస్కారానికి ఎంపికయ్యారు. 

వీరితోపాటు మరో 32 మంది ప్లేయర్లకు ‘అర్జున అవార్డు’ దక్కింది. ఇందులో 17 మంది పారాథ్లెట్లు కూడా ఉండటం విశేషం. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం అవార్డుకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేసింది. ఈ నెల 17న రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడాకారులు ఈ పురస్కారాలు అందుకోనున్నారు.  

»  స్వతంత్ర భారత దేశంలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి ప్లేయర్‌గా మనూ రికార్డు నెలకొల్పింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో హరియాణాకు చెందిన 22 ఏళ్ల మనూ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో, 10 మీటర్ల మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో కాంస్యాలు నెగ్గింది. కొన్ని రోజుల క్రితం ఈ అవార్డు కోసం మనూ భాకర్‌ దరఖాస్తు చేసుకోలేదనే వార్తలు వచి్చనా... చివరకు ‘పారిస్‌’లోని ఆమె ప్రదర్శనకు అవార్డు దక్కింది. 
 
» గత ఏడాది చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టుకు స్వర్ణ పతకం దక్కడంలో కీలకపాత్ర పోషించిన గుకేశ్‌ ఆ తర్వాత సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ను ఓడించి జగజ్జేత అయ్యాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత (1991–1992లో) ‘ఖేల్‌ రత్న’ అవార్డు పొందనున్న రెండో చెస్‌ ప్లేయర్‌ గుకేశే కావడం విశేషం.  

» 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన 28 ఏళ్ల హర్మన్‌ప్రీత్‌ సింగ్‌... ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడలు, చాంపియన్స్‌ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లలో భారత్‌ పతకాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. మూడుసార్లు అతను అంతర్జాతీయ హాకీ సమాఖ్య అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. 

» పారా అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేరును కూడా కమిటీ ‘ఖేల్‌రత్న’ కోసం సిఫారసు చేసింది. పారిస్‌ పారాలింపిక్స్‌ హైజంప్‌ (టి64 క్లాస్‌)లో ప్రవీణ్‌ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రవీణ్‌ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు. 

»‘ఖేల్‌ రత్న’ అవార్డు గ్రహీతలకు అవార్డుతో పాటు రూ. 25 లక్షల నగదు ప్రోత్సాహకం, అర్జున అవార్డీలకు రూ. 15 లక్షల నగదు బహుమతి లభించనుంది.  

జ్యోతి, దీప్తిలకు ‘అర్జున’   
ఆంధ్రప్రదేశ్‌ వర్ధమాన అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ...తెలంగాణ పారాథ్లెట్‌ దీప్తి జివాంజిలకు ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున అవార్డు’ లభించింది. వైజాగ్‌కు చెందిన 25 ఏళ్ల జ్యోతి పారిస్‌ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడింది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచింది. 2023 ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌íÙప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం, 200 మీటర్లలో రజతం సాధించింది. 2023, 2024లలో జరిగిన ఆసియా ఇండోర్‌ చాంపియన్‌షిప్‌లో జ్యోతి 60 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ, రజతాలు గెలిచింది.  

వరంగల్‌ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన 21 ఏళ్ల దీప్తి 2024 పారిస్‌ పారాలింపిక్స్‌లో 400 మీటర్ల టి20 కేటగిరీలో కాంస్యం... 2024 ప్రపంచ పారాథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. 2023 హాంగ్జౌ పారా ఆసియా క్రీడల్లో దీప్తి బంగారు పతకం గెలిచింది. దీప్తికి భారత స్పోర్ట్స్‌ అథారిటీ కోచ్‌ నాగపురి రమేశ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

అవార్డీల వివరాలు
‘ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’: దొమ్మరాజు గుకేశ్‌ (చెస్‌), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ), ప్రవీణ్‌ కుమార్‌ (పారా–అథ్లెటిక్స్‌), మనూ భాకర్‌ (షూటింగ్‌). 

అర్జున అవార్డు (రెగ్యులర్‌): జ్యోతి యర్రాజీ, అన్ను రాణి (అథ్లెటిక్స్‌), నీతు, స్వీటీ బూరా (బాక్సింగ్‌), వంతిక అగర్వాల్‌ (చెస్‌), సలీమా టెటె, అభిషేక్, సంజయ్, జర్మన్‌ప్రీత్, సుఖ్‌జీత్‌ సింగ్‌ (హాకీ), రాకేశ్‌ కుమార్‌ (పారా ఆర్చరీ), దీప్తి జివాంజి, ప్రీతి పాల్, అజీత్‌ సింగ్, సచిన్‌ ఖిలారి, ధరమ్‌వీర్, ప్రణవ్‌ సూర్మ, హొకాటో సీమ, సిమ్రన్, నవ్‌దీప్‌ (పారా అథ్లెటిక్స్‌), నితీశ్, తులసిమతి, నిత్యశ్రీ, మనీషా (పారా బ్యాడ్మింటన్‌), కపిల్‌ పర్మార్‌ (పారా జూడో), మోనా అగర్వాల్, రుబీనా (పారా షూటింగ్‌), స్వప్నిల్‌ కుసాలే, సరబ్‌జోత్‌ (షూటింగ్‌), అభయ్‌ సింగ్‌ (స్క్వాష్‌), సజన్‌ ప్రకాశ్‌ (స్విమ్మింగ్‌), అమన్‌ సెహ్రావత్‌ (రెజ్లింగ్‌). 

అర్జున అవార్డు (లైఫ్‌టైమ్‌): సుచా సింగ్‌ 
(అథ్లెటిక్స్‌), మురళీకాంత్‌ పేట్కర్‌ (పారా స్విమ్మింగ్‌). 

ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్‌): సుభాశ్‌ రాణా (పారా షూటింగ్‌), దీపాలి దేశ్‌పాండే (షూటింగ్‌), సందీప్‌ సాంగ్వాన్‌ (హాకీ). 

ద్రోణాచార్య అవార్డు (లైఫ్‌టైమ్‌): మురళీధరన్‌ (బ్యాడ్మింటన్‌), అర్మాండో అనెలో కొలాకో (ఫుట్‌బాల్‌).  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement