అర్జున అవార్డుకు ఎంపికైన జ్యోతి యర్రాజీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో రాష్ట్రానికీ, దేశానికీ పేరు తెచ్చిన ఈ అథ్లెట్‌ను అభినందించారు. కఠిన శ్రమ, అంకితభావం, నిబద్ధత వల్లే జ్యోతి ఈస్థాయికి చేరుకుందని ప్రశంసలు కురిపించారు.
జాతీయ స్థాయిలో రికార్డులు
ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు, 400 మీటర్ల హార్డిల్స్ విభాగంలో సరికొత్త బెంచ్ మార్కులు సృష్టిస్తున్న జ్యోతి యర్రాజీ క్రీడా నైపుణ్యాలను వైఎస్ జగన్ ఈ సందర్భంగా కొనియాడారు. విశాఖపట్నంలోని సాధారణ కుటుంబంలో జన్మించి.. జాతీయ స్థాయిలో రికార్డులు సాధించిన జ్యోతి దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అదే విధంగా.. జ్యోతి యర్రాజీ భవిష్యత్తులోనూ తన విజయపరంపరను కొనసాగించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ప్రపంచ వేదికపై సత్తా చాటి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని జ్యోతిని విష్ చేశారు.
మొదటి భారత అథ్లెట్‌గా జ్యోతి రికార్డు
కాగా విశాఖ వాసి జ్యోతి యర్రాజీని ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడామంత్రిత్వ శాఖ గురువారం ఇందుకు సంబంధించి గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా అథ్లెటిక్స్ విభాగంలో జ్యోతి కి అర్జున అవార్డు వచ్చింది. ఈ నెల 17 వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా జ్యోతి పురస్కారం అందుకోనుంది.
ప్రపంచ విశ్వవిద్యాలయాల పోటీల్లో ఒక పతకం, జాతీయ పోటీల్లో పది పతకాలను జ్యోతి యర్రాజీ సొంతం చేసుకుంది. వరల్డ్ ర్యాంకింగ్స్ కోటాలో ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న ఆమె..100 మీటర్ల హర్డిల్స్‌లో బరిలోకి దిగింది. ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడిన మొదటి భారత అథ్లెట్‌గా ఆమె రికార్డులకెక్కింది.
దీప్తి జీవాంజికి వైఎస్ జగన్ అభినందనలు
జ్యోతి యర్రాజీతో పాటు అర్జున అవార్డు గెలుచుకున్న తెలంగాణ పారా అథ్లెట్, వరంగల్‌కు చెందిన దీప్తి జీవాంజికి కూడా వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.
ఖేల్‌రత్న అవార్డులకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు
అదే విధంగా.. ఖేల్‌రత్న అవార్డులకు ఎంపికైన దొమ్మరాజు గుకేశ్(చెస్), మనూ భాకర్(షూటింగ్), హర్మన్‌ప్రీత్ సింగ్(హాకీ), ప్రవీణ్ కుమార్(పారా అథ్లెట్)లను కూడా వైఎస్ జగన్ ఈ సందర్భంగా అభినందించారు.
అసాధారణ విజయాలతో వీరంతా దేశం గర్వించేలా చేశారని... రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు, అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. భారతీయ క్రీడలను మరింత ఎత్తుకు తీసుకుని వెళ్లటంలో వీరి కృషి అభినందనీయమని వైఎస్ జగన్ ప్రశంసించారు.
చదవండి: జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment