పారా పోటీల్లో ‘నిధి’సత్తా
పతకాలు కొల్లగొడుతున్న మధురవాడ బాలిక
కష్టాలను జయించి.. స్వప్నాలను సాకారం చేసుకున్న పోరాట యోధురాలు ఆమె. చిన్న వయసులోనే క్యాన్సర్ తన జీవితాన్ని కుదిపేసినా ధైర్యంగా ఎదుర్కొంది. ఈ క్రమంలో కాలు కోల్పోయినా.. ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోలేదు. తన బలహీనతను బలంగా మార్చుకుని.. పోరాటానికి సిద్ధమైంది. పారా క్రీడల్లో తనను తాను నిరూపించుకుంటూ.. రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ఆమే మధురవాడకు చెందిన నిధి. ఆమె ఒక క్రీడాకారిణిగానే కాకుండా.. కష్టాలను ఎలా అధిగమించాలనే దానికి ఒక సాక్ష్యం. ఆమె కథ మనందరికీ స్ఫూర్తినిస్తుంది. ఆమె విజయాలు ప్రేరణగా నిలుస్తాయి. భవిష్యత్తులో నిధి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం. – విశాఖ స్పోర్ట్స్
విశాఖలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి పారా స్విమ్మింగ్ పోటీల్లో నిధి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృత్రిమ కాలుతో నడుస్తూ.. నాలుగు క్రీడాంశాల్లో పోటీపడుతున్న ఆమె చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. మధురవాడ ప్రాంతానికి చెందిన నిధి తండ్రి కేశవరావు, తల్లి జ్యోతి. ప్రస్తుతం ఆమె 10వ తరగతి చదువుతోంది. ఏడేళ్ల వయసులోనే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్ బారిన పడింది.
చికిత్సలో భాగంగా ఆమె ఎడమ కాలును కోల్పోయింది. ఈ క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. క్యాన్సర్‌ను జయించి మామూలు స్థితికి చేరుకుంది. అంగవైకల్యాన్ని మరిచిపోయేందుకు ఆటలను ఎంపిక చేసుకుంది. కృత్రిమ కాలుతో కదన రంగంలోకి దిగింది. పట్టుదలతో స్విమ్మింగ్, చదరంగం, రైఫిల్ షూటింగ్, రన్నింగ్‌లో శిక్షణ పొందింది. పారా క్రీడల్లో తాను తలపడుతున్న అన్ని అంశాల్లోనూ నేడు పతకాలు సాధించే స్థాయికి చేరుకుంది. ఇటీవల రష్యాలో జరిగిన పారా క్రీడల్లో నాలుగు పతకాలను సొంతం చేసుకుంది.
మలుపు తిప్పిన సర్వేవర్స్ క్యాంప్
అంగవైకల్యం ఏర్పడినా క్యాన్సర్‌ను జయించిన నిధి నిబ్బరంగానే నిలిచింది. చదువుకుంటూనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆటలపై ఆసక్తిని పెంచుకుంది. అప్పట్లో ముంబయిలో క్యాన్సర్ చికిత్స తీసుకున్న ఆమె.. క్యాన్సర్ సర్వేవర్స్‌లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు నిర్వహించిన పోటీల్లో పాల్గొంది. తనలాంటి వారితో నిర్వహించే పోటీల్లో పోటీపడగలననే ధీమాతో.. వారిచ్చిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంది. అలా రాంచీలో జరిగిన జాతీయస్థాయి చదరంగం అండర్–19 పోటీల్లో తొలిసారి పాల్గొని సత్తా చాటింది.
జాతీయ పారా స్విమ్మింగ్ పోటీలకు ఎంపిక
2019లో కరోనా కారణంగా పోటీల్లో పాల్గొనడం కాస్త తగ్గించింది నిధి. అప్పటికే ముంబయి నుంచి విశాఖకు తల్లిదండ్రులతో వచ్చేసిన నిధి తిరిగి గ్వాలియర్‌లో జరిగిన పారా స్విమ్మింగ్ పోటీల్లో తన కేటగిరీలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల రష్యాలో జరిగిన రైఫిల్ షూటింగ్‌లో కాంస్య పతకం, చెస్, స్విమ్మింగ్‌లతో పాటు రన్నింగ్‌లో స్వర్ణ పతకాలను అందుకుంది. ఆదివారం విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా స్విమ్మింగ్ పోటీల్లో ఎస్–9 కేటగిరీలో తలపడింది. 50 మీటర్ల ఫ్రీస్టయిల్, బ్యాక్ స్ట్రోక్, వంద మీటర్ల ఫ్రీస్టయిల్ పోటీల్లో విజేతగా నిలిచింది. వచ్చే నెలలో గోవాలో జరగనున్న జాతీయ పారా స్విమ్మింగ్ పోటీలకు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment