సాక్షి, అమరావతి: మహా క్రీడా సంబరం ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖకు రానున్నారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు ఆయన బహుమతులు అందజేయనున్నారు.
కాగా సీఎం జగన్.. రేపు(మంగళవారం) సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ పీఎం పాలెం వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి చేరుకుంటారు.
చివరి రోజు తలపడనున్న జట్లు ఇవే..
మహిళా క్రికెట్: తొలి సెమీస్‌లో పల్నాడు జట్టుపై ఎన్టీఆర్ జిల్లా జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది. మూడో స్థానం కోసం సోమవారం జరిగే పోటీలో పల్నాడు జట్టు ఆడనుంది. టోర్నీ 19వ మ్యాచ్‌గా రెండో సెమీస్ తూర్పుగోదావరి, తిరుపతి జట్ల మధ్య సోమవారం జరగనుంది. గెలిచిన జట్టు ఫైనల్స్‌లో ఎన్టీఆర్ జిల్లా జట్టుతో ఆడనుంది. ఓడిన జట్టు మూడోస్థానం కోసం పల్నాడు జిల్లా జట్టుతో తలపడుతుంది.
పురుష క్రికెట్: ఏలూరు, తూర్పుగోదావరి జట్లు ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. క్వార్టర్ ఫైనల్స్‌లో గుంటూరుతో వైఎస్సార్ కడప, అనంతపురంతో ఎన్టీఆర్ జట్టు తలపడనున్నాయి. ఇందులో విజయం సాధించిన జట్లు సెమీస్‌కు అర్హత సాధించనున్నాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు ఫైనల్ ఆడతాయి.
మహిళా బ్యాడ్మింటన్: సెమీస్‌లో కర్నూలుతో బాపట్ల జట్టు తలపడనుండగా.. ఇప్పటికే పశ్చిమగోదావరి జట్టు సెమీస్‌కు చేరుకుంది.
పురుష బ్యాడ్మింటన్: సెమీస్‌లో తిరుపతితో వైఎస్సార్ కడప జట్టు, ఏలూరుతో పల్నాడు జట్టు తలపడనున్నాయి. గెలిచిన జట్లు ఫైనల్స్ ఆడనుండగా ఓడిన జట్లు మూడోస్థానానికి పోటీపడనున్నాయి.
మహిళా వాలీబాల్: సెమీస్‌కు అన్నమయ్య జట్టుతోపాటు విశాఖ జట్టు చేరుకున్నాయి. క్వార్టర్‌ఫైనల్స్ చివరి రెండు మ్యాచ్‌లలో గెలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధించనున్నాయి.
పురుష వాలీబాల్: క్వార్టర్ ఫైనల్స్‌లో విజయంతో అనకాపల్లి, పార్వతీపురం మన్యం జట్లు సెమీస్‌కు అర్హత సాధించగా వీటితో తలపడేందుకు క్వార్టర్ ఫైనల్స్‌లో చివరి రెండు మ్యాచ్‌లు గెలిచిన జట్లు సిద్ధపడనున్నాయి.
మహిళా కబడ్డీ: సెమీస్‌లో అనకాపల్లి జట్టుతో ప్రకాశం జట్టు, అనంతపురం జట్టుతో విశాఖ జట్టు తలపడనున్నాయి. విజయం సాధించిన జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధించనుండగా ఓడిన జట్లు మూడోస్థానానికి పోటీ పడనున్నాయి.
పురుష కబడ్డీ: క్వార్టర్‌ఫైనల్‌లో విశాఖ జట్టుతో కర్నూలు జట్టు తలపడనుంది.
మహిళా ఖోఖో: క్వార్టర్‌ఫైనల్స్‌లో అనకాపల్లితో కృష్ణా, ప్రకాశంతో ఏలూరు, కాకినాడతో నెల్లూరు, విజయనగరంతో అనంతపురం జట్లు తలపడనున్నాయి. విజయం సాధించిన జట్లు సెమీస్‌కు అర్హత సాధించనున్నాయి.
పురుష ఖోఖో: క్వార్టర్‌ఫైనల్స్‌లో కాకినాడతో ప్రకాశం, కర్నూలుతో కృష్ణా, అనంతపురంతో బాపట్ల. శ్రీకాకుళంతో అనకాపల్లి జట్లు తలపడనున్నాయి. విజయం సాధించిన జట్లు సెమీస్‌కు చేరుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment