మీ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌: సీఎం జగన్‌ | CM YS Jagan Attends 69th National Town And Country Planners Meet | Sakshi
Sakshi News home page

మీ సలహాలు, సూచనలు కావాలి: సీఎం జగన్‌

Published Fri, Feb 26 2021 4:09 PM | Last Updated on Fri, Feb 26 2021 5:08 PM

CM YS Jagan Attends 69th National Town And Country Planners Meet - Sakshi

సాక్షి, అమరావతి:‌ ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 అంశాల్లో 2030 నాటికి స్ధిరమైన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా నేషనల్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌ కాన్ఫరెన్స్‌ జరుపుకొంటున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ సదస్సు ముగిసేనాటికి ఆయా రంగాల్లో ప్రస్తుతం మనమేం చేస్తున్నాం, భవిష్యత్తులో ఏం చెయ్యాలన్నదానిపై ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానర్స్‌ ఇండియా ఆధ్వర్యంలో విశాఖలో జరుగుతున్న 69వ జాతీయ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌ కాన్ఫరెన్స్‌కు సీఎం జగన్‌ వర్చువల్‌ విధానంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా  దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఈ సమావేశానికి హాజరైన టౌన్‌ ప్లానింగ్‌ అధికార్లు, డైరెక్టర్లు, అకడమిస్టులు, పరిశోధకులు, ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ రంగాల నుంచి వచ్చిన నిపుణులకు అభినందనలు తెలిపారు. 

అదే విధంగా ఐటీపీఐ అధ్యక్షుడు శ్రీ ఎన్‌ కె పటేల్, వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీ వి రాములు, సెక్రటరీ జనరల్‌ శ్రీ ఎస్‌ బి కుదాంకర్‌తో పాటు ఏపీ మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీమతి వై శ్రీలక్ష్మికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక కరోనా కారణంగా చోటుచేసుకున్న మార్పుల గురించి సీఎం జగన్‌ మాట్లాడుతూ.. యునైటెడ్‌ నేషన్స్‌ నిర్దేశిత లక్ష్యాల దిశగా అడుగులు వేయాల్సిన ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. అదే విధంగా.. ‘‘కోవిడ్‌ కంటే ముందు కోవిడ్‌ తర్వాత ఏర్పడ్డ పరిస్ధితులు అందరికీ తెలిసినవే. వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ విధానం ఇంకా ఎన్ని రోజులుంటుందో, నెలలుంటుందో తెలియని పరిస్ధితి. పరిస్ధితి ఇలాగే కొనసాగితే దీనికోసం భవిష్యత్తులో ఇంకా ఏ విధమైన మౌలికసదుపాయాలు కల్పించాల్సి వస్తుందనేది ఆసక్తికరమైన అంశం. ఈ ఆంశంలో మీ సూచనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని సభికులను ఉద్దేశించి పేర్కొన్నారు.  

పర్యావరణ పరిరక్షణ
పర్యావరణ పరిరక్షణ గురించి సీఎం జగన్‌ మాట్లాడుతూ... ‘‘రెండో అంశం పర్యావరణం గురించి. వాతావరణ మార్పుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కరూ ఈ సమస్యపై పోరాటం చేస్తున్నారు. అడ్డూ, అదుపూ లేని మానవ చర్యల వల్ల గ్రీన్‌ హౌస్‌ గ్యాసెస్‌, కర్బన ఉద్గారాలు  ప్రమాదకర స్ధాయిలో పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో మనం ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందో గుర్తించాల్సిన అవసరం ఉంది’’ అని అభిప్రాయపడ్డారు.

పట్టణాల్లో పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల
‘‘మూడో అంశం పేద, మద్యతరగతి ప్రజలకు ఇళ్ల నిర్మాణం గురించి మాట్లాడాల్సి వస్తే... నగరాల్లో భూములు ధరలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు ఈ వర్గాల ప్రజలు భరించలేని స్ధాయిలో  అద్దెలు పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిన ధరలు వల్ల అత్యధిక రేట్లతో భూములు సేకరించడం ప్రభుత్వానికి కూడా భారం అవుతుంది. ప్రభుత్వానికి భారం లేకుండా చేసేందుకు ఈ సమస్య పరిష్కారానికి మీ నుంచి వచ్చే ఏ సూచన అయినా తీసుకోవడానికి సిద్ధం.అదే సమయంలో పేద, మద్యతరగతి ప్రజలకు ఇళ్లు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. ఈ విషయం మీ సూచనల కోసం ఎదురు చూస్తున్నాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

నీటి నిర్వహణ- సమగ్ర ప్రణాళిక
అదే విధంగా... ‘‘ఈ సందర్భంగా నీటి నిర్వహణపై కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. మనం ఒక రకంగా ప్లాన్‌ చేస్తే... మరోవైపు గణనీయంగా పెరిగిపోతున్న నగరాలు వల్ల ఆయా ప్రాంతాలకు నీటిసరఫరా పథకాలను పొడిగించాల్సిన అవసరం వస్తోంది. పట్టణాల్లో జనావాసాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. వారికి కూడా తగిన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. దీనిపై ఒక ప్రణాళిక అవసరం’’ అని పేర్కొన్నారు.

సమగ్ర తీర ప్రాంత అభివృద్ధి ప్రణాళిక
‘‘సమగ్ర తీర ప్రాంత అభివృద్ధి ప్రణాళిక అనేది మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశం. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం మనది. ఈ సదస్సు జరుగుతున్న  విశాఖపట్నం ఏదైతే ఉందో... అది కూడా మీ సూచనల వల్ల గణనీయంగా లబ్ధి పొందనుంది. ఈ మూడు రోజుల సదస్సులో కచ్చితంగా  విస్తృత ప్రయోజనం కలిగే అనేక అంశాలపై చర్చ జరుగుతుందని ఆశిస్తున్నాను.

ఈ సదస్సులో సమగ్రంగా మీరు చర్చించిన అంశాలను, సూచనలను నేను కచ్చితంగా ముందుకు తీసుకువెళ్తాను. మీ సలహాలు, సూచనల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని సీఎం జగన్‌ అన్నారు. ‘‘ఐ విష్‌ యు ఆల్‌ ద వెరీ సక్సెస్‌, ఆల్‌ ద వెరీ బెస్ట్’’ అంటూ విషెస్‌ తెలిపారు. ఈ సమావేశంలో సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement