నేడు ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలు  | Adudam Andhra closing ceremony On February 13th | Sakshi
Sakshi News home page

నేడు ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలు 

Published Tue, Feb 13 2024 3:33 AM | Last Updated on Tue, Feb 13 2024 6:02 AM

Audham Andhra closing ceremony On February 13th - Sakshi

సాక్షి, అమరావతి/విశాఖ స్పోర్ట్స్‌: రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. మట్టిలోని మాణిక్యాలను ఒడిసిపట్టే మహాయజ్ఞం విశాఖ సాగర తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడింది. గ్రామ స్థాయి నుంచి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూ, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఫైనల్‌ దశకు చేరుకుంది. మంగళవారం విశాఖపట్నంలోని వైఎస్సార్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. 

ఇకపై ఏటా ఆడుదాం.. 
మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ మెగా టోర్నీని నిర్వహించింది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 50 రోజులపాటు ఈ క్రీడా సంబరాలు కొనసాగాయి. మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు తమ ప్రతిభ కనబరిచారు. ఇందులో 17,59,263 మంది పురుషులు, 7,81,709 మంది మహిళా క్రీడాకారులున్నారు. వీరికి దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్‌ కిట్లను ప్రభుత్వం అందించింది.

గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో 3.30 లక్షలు, మండల స్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గ స్థాయిలో 7,346, జిల్లా స్థాయిలో 1,731, రాష్ట్ర స్థాయిలో 260 మ్యాచ్‌లను దిగ్విజయంగా నిర్వహించింది. వివిధ దశల్లో విజే­తలకు రూ.12.21 కోట్ల నగదు బహుమతులిస్తోంది. తొలి ఏడాది పోటీలు విజయవంతం కావడంతో భవి­­ష్యత్‌లో మరింత ఎక్కువ మంది గ్రామీణ క్రీడా­కారులను పరిచయం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇకపై ప్రతి ఏటా ‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహించేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.  

భారీగా నగదు బహుమతులు 
విశాఖ వేదికగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి పోటీలు సోమవారం ముగిశాయి. మెన్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ మంగళవారం విశాఖలోని వైఎస్సార్‌ స్టేడియంలో జరగనుంది. ముగింపు వేడుకలకు హాజరవుతున్న సీఎం జగన్‌ చివరి ఐదు ఓవర్లను వీక్షించనున్నారు. అనంతరం క్రీడల వారీగా విజేతలకు సీఎం జగన్‌ నగదు బహుమతులను అందజేస్తారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు రూ.5 లక్షల చొప్పున, రన్నరప్‌లకు రూ.3 లక్షలు, సెకండ్‌ రన్నరప్‌లకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నారు. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో విజేతలు రూ.2 లక్షలు, రన్నరప్‌ రూ.లక్ష, సెకండ్‌ రన్నరప్‌ రూ.50 వేలు అందుకోనున్నారు.  

ప్రతిభకు ప్రోత్సాహం.. 
ఈ మెగా టోర్నీ ద్వారా ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చెన్నై సూపర్‌ సింగ్స్‌(సీఎస్‌కే)తో పాటు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా క్రికెట్‌లో టాలెంట్‌ హంట్‌ నిర్వహించింది. ప్రో కబడ్డీ, బ్లాక్‌ హాక్స్‌ వాలీబాల్‌ ఫ్రాంచైజీలతో పాటు ఏపీకి చెందిన ఖోఖో, కబడ్డీ క్రీడా సంఘాలు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల బృందాలు కూడా ఈ ఎంపికలో భాగస్వామ్యులయ్యాయి. ఎంపికైన క్రీడాకారులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement