
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఆడుదాం–ఆంధ్రా రాష్ట్ర స్థాయి క్రీడలు ఫిబ్రవరి ఆరు నుంచి పదో తేదీ వరకు విశాఖ వేదికగా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 6న ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆడుదాం–ఆంధ్రా పోటీలు ప్రారంభమవుతాయని, పదో తేదీన వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే ముగింపు కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 26 జిల్లాల నుంచి క్రీడాకారులు విశాఖ వస్తారని, ఒక్కో జిల్లా నుంచి 130 నుంచి 150 మంది వరకు క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
త్వరలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ సంయుక్త నిర్వహణలో త్వరలో రూ.1,500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు సీఎం జగన్ చేతుల మీదుగా జరుగుతాయని కలెక్టర్ వివరించారు. ఇప్పటికే అనేక పనులు పూర్తయ్యా యని చెప్పారు. వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో వైజాగ్ స్కై గ్లాస్ బ్రిడ్జి, సైక్లింగ్ వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామని, వీటికి టెండర్లు కూడా పిలిచా మన్నారు. త్వరలో సీఎం చేతుల మీదుగా వీటికి శంకుస్ధాపనలు జరుగుతాయన్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు 14 వేల మంది సిబ్బంది హాజరవుతారని కలెక్టర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment