చదరంగంలో భారత దేశానికి ఇది స్వర్ణయుగం. న్యూయార్క్‌లో జరుగుతున్న ‘ఫిడే’ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ పోటీల్లో భారత క్రీడాకారిణి కోనేరు హంపీ ఆదివారం సాధించిన ఘన విజయం అందుకు మరో తాజా నిదర్శనం. న్యూయార్క్‌లో మొత్తం 110 మంది పాల్గొన్న ర్యాపిడ్ చెస్ టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి, ఛాంపియన్ అయ్యారు.
అంతకు ముందు సింగపూర్‌లో క్లాసికల్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్ విజయం, అంతకన్నా ముందు ఈ ఏడాది సెప్టెంబర్‌లో బుడాపెస్ట్‌లోని చెస్ ఒలింపియాడ్‌లో ఓపెన్, ఉమెన్స్ కేటగిరీలు రెంటిలోనూ కనివిని ఎరు గని రీతిలో భారత్ రెండు స్వర్ణాలు సాధించడం... ఇవన్నీ ఈ 2024ను భారత చదరంగానికి చిరస్మరణీయ వత్సరంగా నిలిపాయి. మంగళవారం నుంచి జరగనున్న ‘ఫిడే’ వరల్డ్ బ్లిట్జ్ ఛాంపి యన్‌షిప్ పైనా కన్నేసి, గ్రాండ్‌డబుల్ సాధించాలని హంపీ అడుగులేస్తుండడం విశేషం.
గతంలో 2019లో జార్జియాలో తొలిసారి మహిళల వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన కోనేరు హంపీకి తాజా విజయం రెండో ప్రపంచ టైటిల్. చైనాకు చెందిన జూ వెన్‌జున్ తర్వాత ఈ టైటిల్‌ను ఒకటికి రెండుసార్లు గెలిచింది హంపీయే! నిరుడు పెళ్ళి తరువాత మాతృత్వం కోసం కొన్నాళ్ళు ఆటకు దూరం జరిగిన హంపీ 2018లో చదరంగపు పోటీలకు తిరిగి వచ్చాక కూడా తన హవా కొనసాగిస్తూ వచ్చారు. 2019లో టైటిల్ సాధించారు. గత ఏడాది కూడా ఆమె గెలవాల్సింది. టై బ్రేక్‌లో త్రుటిలో ప్రపంచ టైటిల్‌ను కోల్పోయారు.
అయితేనేం, పట్టుదలతో కృషిని కొనసాగించి మళ్ళీ ఇప్పుడు ఆటలో కిరీటం గెల్చుకొని, తనలో సత్తా చెక్కుచెదరలేదని నిరూపించారు. సామాన్యులతో పాటు ఆటలోని వర్ధిష్ణువులకు సైతం ఇది స్ఫూర్తి మంత్రం. నిజానికి, ఈ భారత నంబర్ 1 చదరంగ క్రీడాకారిణే అన్నట్టు, కచ్చితంగా సరికొత్త టైటిల్ విజయం మన దేశంలోని యువతరాన్ని చదరంగ క్రీడ వైపు మరింతగా ఆకర్షిస్తుంది. అదే సమయంలో పలువురు చెస్ ప్రొఫెషనల్స్‌గా తయారవడానికి ప్రేరణ కూడా అవుతుంది.
ఫస్ట్ రౌండ్‌లో ఓటమి పాలైనా, 11వ, ఆఖరి రౌండ్‌లో గెలవడంతో 8.5 పాయింట్లతో పట్టికలో హంపీ అగ్రస్థానానికి చేరారు. ఇండోనేసియాకు చెందిన ఇరీన్ సుకందర్‌ను ఓడించి, వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలుపుతో 2024కు ఘనంగా వీడ్కోలు పలికారు. చెస్‌లో ఆరితేరిన గ్రాండ్ మాస్టర్ అయినా బిడ్డకు తల్లి అయ్యాక, ఎన్నో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాక, 37 ఏళ్ళ వయసులో హంపీ ఈ అరుదైన విన్యాసం సాధించడం అబ్బురం.
అంతేకాదు... అభినందించాల్సిన అంశం. వయసు, బాధ్యతలు మీద పడుతున్నప్పటికీ పట్టు వదలకుండా, నిత్య కృషితో ముందుకు సాగడం, ఆటలో అదే నైశిత్యాన్ని ప్రదర్శించడం ఆషామాషీ కాదు. ఈ 2024 అంతా ఆశించిన ఆటతీరు కనబరచలేక, ఆత్మవిశ్వాసం కుంటుబడిన హంపీ ఒక దశలో అసలీ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడకూడదనీ అనుకున్నారట.
ఆట నుంచి రిటైరవుతారన్న అనుమానాల నుంచి ఆఖరికి అగ్రపీఠాన్ని అధిష్ఠించే దాకా ఆమె ప్రస్థానం చిరస్మరణీయం. అందుకే, హంపీ గెలిచిన ఈ కొత్త కిరీటం మునుపటి విజయాల కన్నా ఎంతో ప్రత్యేకమైనది. చిన్నారి కూతురును చూసుకోవడంలో ఆమె తల్లితండ్రులు, భర్త పోషించిన పాత్ర మరెందరికో స్ఫూర్తిపాత్రమైనది.
అంతర్జాయ యవనికపై భారత క్రీడాకారులు, అందులోనూ తెలుగువాళ్ళు కొన్నాళ్ళుగా సాధి స్తున్న ఘనతలు అనేకం. తాజా ఘటనలే తీసుకుంటే, తెలుగు మూలాలున్న చెన్నై కుర్రాడు గుకేశ్ ఇటీవల ప్రపంచ చదరంగ ఛాంపియన్‌గా అవతరించాడు. అంతకన్నా ముందు ఆ వెంటనే ఇప్పుడు హంపీ ర్యాపిడ్ చెస్‌లో రెండోసారి వరల్డ్ టైటిల్ సాధించారు.
మరోపక్క భారత క్రికెట్ జట్టులో విశాఖకు చెందిన 22 ఏళ్ళ నవ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి ఆస్ట్రేలియాలో సంచలనం రేపాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న 4వ టెస్టులో ప్రతికూల పరిస్థితుల్లో క్రీజులో పాతుకుపోయి, అద్భుత మైన తొలి శతకం సాధించి, జట్టు పరువు నిలిపాడు. విదేశీగడ్డపై తొలి టెస్ట్ సిరీస్ ఆడుతూ, 8వ నంబర్ ఆటగాడిగా బరిలో దిగి సెంచరీ చేసిన తీరు యువతరంలోని క్రీడాకౌశలానికి నిదర్శనం.
ఇవన్నీ భారత జాతి, మరీ ముఖ్యంగా మన తెలుగువాళ్ళు గర్వించాల్సిన క్షణాలు. అయితే, ఇవి సరి పోవు. మన 140 కోట్ల జనాభాలో ఇంతకు మించి శక్తి సామర్థ్యాలు, ఇంకా ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. వారినీ సరైన రీతిలో ప్రోత్సహించి, ప్రాథమిక వసతి సౌకర్యాలు అందిస్తే ఇలాంటి విజయాలు అనునిత్యం మన సొంతమవుతాయి. తాజా ఘటనలు అదే రుజువు చేస్తున్నాయి.
అయితే, మన దేశంలో ఎవరికి ఎంత ఆసక్తి ఉన్నా క్రీడల్లో కెరీర్‌ను నిర్మించుకోవడం ఇప్పటికీ కష్టసాధ్యంగానే ఉందన్నది నిష్ఠురసత్యం. ఆటల్లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న పలువురు ఆనక కూలీనాలీ చేసుకుంటూ, కష్టంగా బతుకీడుస్తున్న ఉదంతాలు నేటికీ కళ్ళ ముందుకొస్తూ, కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి.
ఈ పరిస్థితులను చక్కదిద్ది, క్రీడల మీద ఆసక్తిని పెంచాల్సింది పాలకులు, ప్రభుత్వాలే. ఆ పని చేయకుండా... పతకాలు, టైటిళ్ళ మీదే ధ్యాసతో, ఆటగాళ్ళను నిందించి ప్రయోజనం లేదు. ఇంట్లో తల్లితండ్రులు, పాఠశాలలో అధ్యాపకుల స్థాయి నుంచి అందుకు తగ్గట్టు వాతావరణం కల్పించడం ముఖ్యం.
అదే సమయంలో క్రీడా సంఘాలు, ప్రభుత్వ ప్రాధికార సంస్థల లాంటి వాటిని రాజకీయాలకు అతీతంగా నడపడం అంతకన్నా ముఖ్యం. అప్పుడే క్రీడాకారుల కలలు ఫలిస్తాయి. క్రీడాభిమాన లోకం ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఒలింపిక్స్‌కు సైతం ఆతిథ్య మివ్వాలని ఆశపడుతున్న మన పాలకులు అంత కన్నా ముందు సరిదిద్దుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టడం అవసరం.
స్ఫూర్తిదాయక విజయాలు
Published Tue, Dec 31 2024 1:20 AM | Last Updated on Tue, Dec 31 2024 12:53 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment