ఓడి గెలిచిన రాజు | Chess Player Raju was recovered | Sakshi
Sakshi News home page

ఓడి గెలిచిన రాజు

Published Mon, Apr 16 2018 8:41 AM | Last Updated on Mon, Apr 16 2018 9:07 AM

Chess Player Raju was recovered - Sakshi

నాడు నేడు... రాజు

ఒకప్పుడు అతనో చెస్‌ క్రీడాకారుడు. ఎత్తుకు పైఎత్తులు వేసి, ప్రత్యర్థులనుచిత్తు చేసి బంగారు పతకాలు కొల్లగొట్టాడు. అయితే తల్లిదండ్రులమరణంతో ఆయన జీవితం గాడితప్పింది. దురలవాట్లతో ఉద్యోగం పోయింది. తినడానికి లేకపోవడంతో యాచకుడిగా మారాడు. మళ్లీ ఇప్పుడు మామూలు మనిషిగా మారిన అతడు... చదరంగంలో ఎత్తులు వేసేందుకు సై అంటున్నాడు. అతడే ఎంవై రాజు.  

తార్నాక: తార్నాకలోని వినాయక దేవాలయంలో భిక్షాటన చేస్తూ జీవితం వెళ్లదీస్తున్న రాజును ‘సాక్షి’ గమనించింది. ఆయన పరిస్థితిపై ‘జీవన చదరంగంలో ఓడిపోయాడు’ శీర్షికతో ఆరు నెలల క్రితం కథనం ప్రచురించింది. అప్పటికే అతడు స్కీజోఫినియా వ్యాధితో బాధపడుతున్నాడు. కథనానికి స్పందించిన రాజు చిన్ననాటి స్నేహితులు, సోదరుడు.. ఆయనకు మంచి వైద్యం అందించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రయత్నిస్తున్న తరుణంలో శంషాబాద్‌లోని ‘ఆశాజ్యోతి రిహాబిలిటేషన్‌’ కేంద్రం వైద్యులు డాక్టర్‌ జగన్నాథం ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకొచ్చారు. దీంతో రాజును అక్కడ చేర్పించగా మూడు నెలలు చికిత్స అందించారు. ఉచితంగానే భోజన సదుపాయాలు, మందులు అందజేశారు. రాజు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని, చెస్‌లో పాల్గొనేందుకు సిద్ధమని డాక్టర్‌ జగన్నాథం తెలిపారు. స్కీజోనిఫియా వ్యాధి పూర్తిగా నయమైందని, ఇక మామూలుగా మందులు వాడితే సరిపోతుందని చెప్పారు.

ఆవాసం కోసంమిత్రుల ప్రయత్నం..  
ఇంతకముందు వరకు దేవాలయంలోనే గడిపిన రాజుకు షెల్టర్‌ లేదు. ఇప్పుడు ఆయన ఉండేందుకు గదిని అద్దెకు తీసుకోవాలని మిత్రులు నిర్ణయించారు. అందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గది కోసం వెతుకుతున్నామని, దొరికిన వెంటనే కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసి.. అన్ని రకాలు సదుపాయాలు సమకూరుస్తామని రాజు మిత్రుడు గుమ్మడి విజయ్‌కుమార్‌ తెలిపారు. అన్ని సెట్‌ అయ్యాక రాజును డిశ్చార్జీ చేసి తీసుకెళ్తామన్నారు.

ఇదీ నేపథ్యం..  
రాజు 1969లో ఒంగోలులో జన్మించాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. రాజుకు చిన్నతనం నుంచి చదరంగం అంటే ఎంతో ఆసక్తి. ఆయన క్రీడాసక్తికి తండ్రి ప్రోత్సాహం తోడవడంతో జాతీయ స్థాయి క్రీడాకారుణిగా రాణించాడు. ఆ ప్రతిభతోనే 1998లో దక్షిణమధ్య రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. అయితే తల్లిదండ్రుల మరణంతో రాజు జీవితం మారిపోయింది. దురలవాట్లకు బానిసవడంతో అటు ఆట.. ఇటు ఉద్యోగం రెండింటికీ దూరమయ్యాడు. మానసిక వ్యాధితో బాధపడుతూ యాచకుడిగా మారాడు.

ఉద్యోగం.. చదరంగం  
మిత్రుల సహకారంతో నేను కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి సంపాదిస్తాను. ఉపాధి కోసం ఉద్యోగమైతే... నా ఆసక్తిని కొనసాగించేందుకు చదరంగం. మళ్లీ చెస్‌ను ప్రారంభిస్తాను. మంచి క్రీడాకారుడిగా రాణిస్తూ.. జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవాలనేదే నా ఆశయం. ఔత్సాహిక క్రీడాకారులకు నావంతుగా శిక్షణనిస్తాను.  – ఎంవై రాజు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement