భారత చదరంగ క్రీడాకారిణి తానియా సచ్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. చెస్ ప్లేయర్‌గా తనకు సరైన గుర్తింపునివ్వడం లేదంటూ ఢిల్లీ ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఇతర రాష్ట్రాలు ఎంతో ముందున్నాయని.. కానీ ఢిల్లీలో మాత్రం దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితి లేదని వాపోయింది.
స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జట్టులోనూ
ఈ మేరకు.. ‘‘2008 నుంచి దేశం తరఫున వివిధ చెస్ టోర్నీల్లో పాల్గొంటున్నాను. ఎన్నో విజయాలు సాధించాను. అయినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేకపోవడం బాధగా ఉంది. ఇతర రాష్ట్రాలు మాత్రం తమ ఆటగాళ్లలోని ప్రతిభను గుర్తిస్తూ.. వారి విజయాలను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నాయి.
కానీ ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇంత వరకు ఎలాంటి ముందడుగు వేయలేదు. 2022 చెస్ ఒలింపియాడ్‌లో చారిత్రక విజయం సాధించి.. కాంస్యం గెలిచిన జట్టులో నేను సభ్యురాలిని. వ్యక్తిగత పతకం కూడా సాధించాను. రెండేళ్ల తర్వాత.. అంటే 2024 చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జట్టులోనూ నేను భాగమే.
అయినప్పటికీ ఇప్పటిదాకా ఢిల్లీ ప్రభుత్వం నుంచి నాకెలాంటి గుర్తింపు లభించలేదు. ఢిల్లీ, భారత్ తరఫున అంతర్జాతీయ వేదికలపై ప్రాతినిథ్యం వహించడాన్ని గొప్ప గౌరవంగా భావించే నాకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం బాధగా ఉంది.
ఇకనైనా విలువ ఇవ్వండి
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), అతిశి మేడమ్, అరవింద్ కేజ్రీవాల్ సర్.. ఇకనైనా క్రీడలు, క్రీడాకారుల విలువను గుర్తించి చెస్ అథ్లెట్లకు అండగా ఉంటారని ఆశిస్తున్నా’’ అని తానియా సచ్‌దేవ్ సోమవారం సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి మర్లెనాతో పాటు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌లను ట్యాగ్ చేస్తూ తన విజ్ఞప్తిని తెలియజేసింది.
గుకేశ్‌కు భారీ నజరానా
కాగా ఈ ఏడాది చెస్ ఒలింపియాడ్ విజేతగా నిలిచిన భారత జట్టులో తానియా సచ్‌దేవ్ కూడా ఉంది. గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్), వైశాలి (తమిళనాడు), అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), వంతిక అగర్వాల్‌లతో కలిసి పసిడి పతకాన్ని అందుకుంది.
ఇక ఇటీవల ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌పై తమిళనాడు ప్రభుత్వం కనక వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఈ పద్దెమినిదేళ్ల కుర్రాడికి రూ. 5 కోట్ల భారీ నజరానా అందజేసింది. ఈ నేపథ్యంలో 38 ఏళ్ల తానియా సచ్‌దేవ్ తాజా పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
స్పందించిన సీఎం
తానియా సచ్‌దేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అతిశి మర్లెనా స్పందించారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని.. ఏ విషయంలో ఆమెకు అసౌకర్యం కలిగిందో చెప్పాలన్నారు. చెస్ ప్లేయర్ల కోసం తాము ఇంకా ఏమేం చేయగలమో చెప్పాలని సూచించారు. తన కార్యాలయం త్వరలోనే తానియాను సంప్రదించి.. అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుంటుందని అతిశి ఎక్స్ వేదికగా చెస్ ప్లేయర్‌కు హామీ ఇచ్చారు.
చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత
Comments
Please login to add a commentAdd a comment