తన అన్న చావుకు కారణమంటూ..బాలుడిని చంపేసి తానూ ఆత్మహత్య
బావిలో ఇద్దరి మృతదేహాలు వెలికితీత
చేతబడి నెపంతో కక్ష సాధింపు చర్య
కేటీదొడ్డి: చేతబడి చేసి తన అన్నను చంపారని కక్ష పెంచుకున్న ఓ తమ్ముడు.. అందుకు కారణమైన కుటుంబంలోని బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. ఆ తర్వాత తాను సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్డె మచ్చప్ప, వడ్డె నర్సింహులు సొంత అన్నదమ్ములు.
వడ్డె మచ్చప్ప–లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు రాజు(28), గోవిందు. కాగా, రాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. వడ్డె నర్సింహులుకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. నర్సింహులు కుమారుడు పవన్‌కుమార్(7) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతు న్నాడు. గురువారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన పవన్ సాయంత్రం తిరిగి ఇంటికి రాకపోవడంతో నర్సింహులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోవింద్ బైక్‌పై పవన్‌ను చూసినట్టు గ్రామస్తులు చెప్పా రు. అదే సమయంలో గోవిందు సైతం కనిపించలేదు. దీంతో పోలీసులు మచ్చ ప్ప కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించారు. శుక్రవారం కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా యాపల్‌దిన్నె పోలీస్‌స్టేషన్ పరిధిలో గాలింపు చేపట్టారు.
అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించగా.. సోలార్ పవర్ ప్రాజెక్ట్ వద్ద గోవిందు బైక్ పార్కు చేసి ఉండటం గుర్తించారు. పోలీసులు సెల్‌నంబర్ ట్రేస్ చేయగా, సిగ్నల్స్ ఆధారంగా ఓ పాడు పడిన బావి వద్ద చివరి లొకేషన్ చూపించింది. దీంతో అనుమానంతో పోలీసులు బావిలో వెతకగా గోవిందు మృతదేహం లభ్యమైంది. గజ ఈతగాళ్ల సాయంతో మళ్లీ వెతకగా బాలుడి మృతదేహం సైతం లభ్యమైంది.
ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించారు. కాగా, తన అన్న రాజును నర్సింహులు కుటుంబ సభ్యులు చేతబడి(బాణామతి) చేసి చంపేశారనే కోపంతో గోవింద్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment