హైదరాబాద్, సాక్షి: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో రాజ్ పాకాల పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజులు సమయం ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారమే విచారణలో ముందుకు వెళ్లాలని కోర్టు పోలీసులకు సూచించింది.
మోకిలా పోలీసులు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు నోటీసులు ఇచ్చారు. బీఎన్ఎస్ యాక్ట్ 35(3) సెక్షన్ ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజ్ పాకాల ఇంట్లో లేకపోవడంతో ఓరియన్ విల్లాస్‌లోని నెంబర్ 40 విల్లాకు ఈ నోటీసులను పోలీసులు అంటించిన విషయం తెలిసిందే. పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో రాజ్ పాకాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్ పాకాల దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారించింది. పిటిషన్ తరఫు న్యాయవాది మయూర్ రెడ్డి.. వాదనలు వినిపించారు.
‘‘రాజ్ పాకాల ఇంట్లో పార్టీ చేసుకుంటే అక్రమంగా పోలీసులు వచ్చి దాడి చేశారు. రాజ్ పాకాల ఉద్యోగికి డ్రగ్ పాజిటివ్ వస్తే.. రాజ్ పాకాలను నిందితుడిగా చేర్చారు. డ్రగ్స్ టెస్ట్‌కు సాంపుల్ ఇవ్వాలని మహిళలను ఇబ్బంది పెట్టారు. ప్రతిపక్ష నేత కేటీఆర్ బావమరిది కనుకనే ఆయన్ను టార్గెట్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారు’’ అని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘ మేము అరెస్ట్ చేస్తామని ఎక్కడ చెప్పలేదు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అక్రమంగా మద్యం బాటిళ్లు లభించడంతో పాటు ఒక వ్యక్తికి డ్రగ్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది. ఇందులో రాజకీయ దురుద్దేశం లేదు. రాజ్ పాకాలకు నిబంధనల ప్రకారమే 41a నోటీసులు ఇచ్చాం’’ అని కోర్టుకు ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
తర్వత మళ్లీ.. రాజ్ పాకాల న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు నిపించారు. ‘‘ రాజ్ పాకాలకు ఈరోజు ఉదయం 9:30 గంటలకు నోటీసు ఇచ్చి ఉదయం 11.00 గంటలకు విచారణకు రమ్మన్నారని తెలిపారు. ‘‘ మాకు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు. విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. విచారణలో సమాచారం లేదా ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటాం’’ అని ఏఏజీ కోర్టుకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment