యూఎస్‌ఎలో ప్రథమ స్థానం సాధించి అక్కడి టోర్ని నిర్వాహకులు మరిస్ ఎష్లే నుంచి ప్రైజ్ మనీ అందుకుంటున్న పృథ్వీ
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సెలవుల్లో నాన్నతో ఆడిన చెస్ అతనిలో ఆసక్తిని పెంచింది. అక్క జషితారెడ్డి యోగా క్రీడాకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో రాణించడం స్ఫూర్తి నిచ్చింది. చెస్ క్రీడలో ఆనతికాలంలోనే వాకాటి పృథ్వీకుమార్‌రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అందరినీ అబ్బురపరిచింది. నెల్లూరు నగరంలోని కొండాయపాళెం ప్రాంతంలోని వనంతోపుకి చెందిన వెంకటశేషారెడ్డి, శిరీష దంపతులిద్దరికి మొదటి నుంచే క్రీడలపట్ల అభిమానం. చదువుతో పాటు పిల్లలు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించేవారు. పృథ్వీకుమార్ ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచే చెస్ పట్ల మక్కువ పెంచుకున్నాడు. మొట్ట మొదటి సారిగా 2009లో జిల్లా స్థాయి అండర్–10 చెస్ పోటీల్లో ప్రథమస్థానం సాధించాడు. అప్పటి నుంచే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాల్గొన్న ప్రతి మ్యాచ్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచేవాడు. జాతీయస్థాయి పోటీల్లో రాణించి రెండు సార్లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం తన ప్రతిభకు నిదర్శనం. అంతర్జాతీయ చదరంగంలో రాణించాలంటే ఎంతో వ్యయ, ప్రయాసాలతో కూడిన విషయం. పోటీలో పాల్గొనేందుకు అంతర్జాతీయ శిక్షణకు అయ్యే ఖర్చు సామాన్య కుటుంబం భరించడం అసాధ్యం. దాతలు ముందుకు వచ్చి తనకు సాయం చేస్తే అంతర్జాతీయస్థాయిలో రాణించి దేశానికి మరెన్నో పతకాలు సాధిస్తానని పృథ్వీకుమార్ కోరుతున్నాడు.
పృథ్వీ విజయాల్లో కొన్ని
♦ 2012లో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–14లో మూడోస్థానం
♦ 2014లో రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ –17లో మొదటి స్థానం
♦ 2014లో జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్‌లో అండర్–17లో మూడోస్థానం
♦ 2015లో అండర్–17లో స్టేట్ ఛాంపియన్ షిప్‌లో మూడోస్థానం
♦ 2016లో యూఎస్‌ఎ మిలియనీర్ చెస్ టోర్నమెంట్‌లో భారతదేశానికి బంగారు పతకాన్ని సాధించాడు.
♦ ఇటీవల నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ చెస్ సీడెడ్ పోటీల్లో పాల్గొన్నారు.
ఇలా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్న పృథ్వీకి జిల్లా కలెక్టర్ 2013లో, 2016లో ప్రశంసా పత్రాలు అందచేశారు.
ప్రోత్సాహం ఉంటేఅంతర్జాతీయ స్థాయిలో రాణించగలడు
పృథ్వీలో ఎంతో ప్రతిభ ఉంది. అంతర్జాతీయ స్థాయిలోరాణించాలంటే ఎక్కువ పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. యూరప్, ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాల పోటీల్లో పాల్గొంటేనే అంతర్జాతీయ వేదికపై నిలదొక్కుకోగలడు. అందుకు శిక్షణ, ఎంట్రీ ఫీజులు, ప్రయాణ ఖర్చులు అధిక వ్యయంతో కూడినవి.– సుమన్, చెస్ అసోసియేషన్‌రాష్ట్ర జాయింట్ సెక్రటరీ
గ్రాండ్ మాస్టర్ అవుతా
గ్రాండ్ మాస్టర్ అవడమే లక్ష్యం. చిన్నప్పటి నుంచే చెస్ అంటే ప్రాణం. కోచ్ సుమన్, రియాజ్‌లు శిక్షణ ఇచ్చి నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం చెన్నై ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నా. వాకాటి.పృథ్వీకుమార్,అంతర్జాతీయ చెస్ క్రీడాకారుడు
Comments
Please login to add a commentAdd a comment