కనీసం తన భావాలను పంచుకునేందుకు నోరుతెరిచి మాట్లాడలేదు.. కానీ చదరంగపు గళ్లలో ఆయన వేసే ప్రతి కదలికా పాఠమే చెబుతుంది... సరిగ్గా భూమిపై రెండు కాళ్లు పెట్టి నిలబడలేదు.. కానీ ఆకాశమంత ఆయన ఆత్మస్థైర్యాన్ని చూసి విధి సైతం తలొంచి నమస్కరిస్తుంది... మనం చెప్పే మాట ఆయన చెవుల వరకు చేరలేదు.. కానీ చందరంగంలో ఆయన వేసేఎత్తులకు దాసోహమవుతున్న విజయఢంకా మాత్రం ప్రపంచం చెవుల్లో మార్మోగుతుంది.. జీవిత చదరంగాన విధి ఆడిన ఆటలో ఓడిన ఆయన.. ఆర్థిక ఇబ్బందులను కన్నీటి పొరల మాటున దాచిపెట్టి ఆత్మవిశాస్వమనే ఆయుధానికి సంకల్ప బలాన్ని జత చేసి చదరంగపు క్రీడలో గెలుపు బావుటా ఎగురవేస్తున్నాడు. తన గమనానికి ప్రభుత్వ చేయూత కోసం ఆర్థిస్తున్నాడు ‘ఫిడే మాస్టర్ ’ కూచిభొట్ల వెంకటకృష్ణ కార్తీక్.
గుంటూరు వెస్ట్: కృష్ణా జిల్లాకు చెందిన కూచిభొట్ల వెంకట లక్ష్మీ నరసింహ మూర్తి (70), ఎం వెంకట బాల సరస్వతిలకు (67) వివాహమైన చాలా కాలానికి కార్తీక్ జన్మించాడు. మూడేళ్ల వరకు బాగానే ఉన్నాడు. అప్పుడు వచ్చిన శారీరక మార్పును తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. కొందరు వైద్యుల వద్దకు తిప్పినా సరైన వైద్యం అందలేదు. దీంతో 15 ఏళ్లు వచ్చే సరికి సక్రమంగా నిలబడలేకపోయాడు. మాట్లాడడం రాలేదు. చెప్పినవి వినపడవు. దీంతో తల్లిదండ్రులు కుంగిపోయారు. ఈ సమయంలో కార్తీక్ స్నేహితుడు హరి చెస్ క్రీడాకారుడు కావడంతో.. ఆ ఆటవైపు కార్తీక్ దృష్టి మళ్లింది.
చాలెంజ్‌గా తీసుకున్న కోచ్ షేక్ ఖాశిం
కొడుకు అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు కార్తీక్‌ను విజయవాడలోని గ్లోబల్ చెస్ అకాడమీ వ్యవస్థాపకుడు, ఇంటర్నేషనల్ కోచ్ షేక్ ఖాశిం వద్దకు తీసుకెళ్లారు.కార్తీక్ ఆసక్తిని గమనించిన కోచ్ శిక్షణ ప్రారంభించారు. అతి కొద్ది సమయంలోనే కార్తీక్‌లో పట్టుదల, ప్రతిభను కోచ్ గుర్తించారు. క్రమేణా అకాడమీలో ఉన్న రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులతో కార్తీక్ పోటీ పడ్డాడు. విజయం ఆయన వైపు నిలిచింది.
సాధించిన విజయాలివి..
♦ ఇంటర్నేషనల్ నార్మ్ రేటింగ్‌లో ఉన్న కార్తీక్ ప్రస్తుతం గుంటూరులో జరుగుతున్న సూపర్ గ్రాండ్ మాస్టర్ చెస్ శిక్షణలో ఉన్నారు. ఆయన సాధించిన విజయాల్లో కొన్ని..
♦ 2014 లండన్‌లో జరిగిన కామన్‌వెల్త్ పోటీల్లో వికలాంగుల విభాగంలో బంగారు పతకం సాధించారు.
♦ 2014 సెర్బియాలో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ (ఐపీసీఏ)లో కాంస్య పతకం గెలుపొందారు. ఈ పోటీల్లో రష్యా ఇంటర్నేషనల్ మాస్టర్స్‌ను సైతం ఓడించడం గమనార్హం.
♦ 2015, 2017 సంవత్సరాల్లో తమిళనాడులోని తిరుచునాపల్లిలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో ప్ర«థమ స్థానం కైవసం చేసుకున్నారు. దీంతోపాటు అనేక జాతీయ, రాష్ట్ర , ఓపెన్ చెస్ పోటీల్లో విజయాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment