physical handicap
-
అత్యాచార యత్నం.. ఆపై నిప్పంటించి..
మద్దూరు: ఓ దివ్యాంగురాలికి మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. ఆ యువతి ప్రతిఘటించడంతో నిప్పంటించి పారిపోయాడు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన దివ్యాంగురాలైన కృష్ణవేణి(21) కొన్నాళ్లుగా తల్లిదండ్రులు, మానసిక వికలాంగుడైన తమ్ముడుతో కలసి హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లిలో ఉంటోంది. తల్లిదండ్రులు వెంకటమ్మ, గోవిందు దినసరి కూలీలు. మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం వింజమూర్‌వాసి వెంకట్రాములు హైదరాబాద్‌లోనే కూలిపనులు చేసుకునేవాడు. భార్య వదిలేయడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో కృష్ణవేణి తో అతడికి పరిచయం ఏర్పడింది. ఈనెల 8న వెంకట్రాములు మాయమాటలు చెప్పి కృష్ణవేణిని తీసుకెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేర కు రాజేంద్రనగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం కోస్గి పట్టణంలో గ్రామస్తులకు కనిపించడంతో హైదరాబాద్‌కు వెళ్తున్నామంటూ నమ్మించి మద్దూరుకు తీసుకొచ్చాడు. అదేరోజు సాయంత్రం గురుకుల పాఠశాల వెనకాల ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో చీరకు నిప్పంటించి పారిపోయాడు. మంటలు గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా శనివారం తెల్లవారుజామున బాధితురాలు మృతి చెందింది. కాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ యాదవ, వికలాంగ సంఘాల ఆధ్వర్యంలో మద్దూరులో ధర్నా నిర్వహించారు. -
ఓటమి నేనే.. గెలుపూ నేనే
కనీసం తన భావాలను పంచుకునేందుకు నోరుతెరిచి మాట్లాడలేదు.. కానీ చదరంగపు గళ్లలో ఆయన వేసే ప్రతి కదలికా పాఠమే చెబుతుంది... సరిగ్గా భూమిపై రెండు కాళ్లు పెట్టి నిలబడలేదు.. కానీ ఆకాశమంత ఆయన ఆత్మస్థైర్యాన్ని చూసి విధి సైతం తలొంచి నమస్కరిస్తుంది... మనం చెప్పే మాట ఆయన చెవుల వరకు చేరలేదు.. కానీ చందరంగంలో ఆయన వేసేఎత్తులకు దాసోహమవుతున్న విజయఢంకా మాత్రం ప్రపంచం చెవుల్లో మార్మోగుతుంది.. జీవిత చదరంగాన విధి ఆడిన ఆటలో ఓడిన ఆయన.. ఆర్థిక ఇబ్బందులను కన్నీటి పొరల మాటున దాచిపెట్టి ఆత్మవిశాస్వమనే ఆయుధానికి సంకల్ప బలాన్ని జత చేసి చదరంగపు క్రీడలో గెలుపు బావుటా ఎగురవేస్తున్నాడు. తన గమనానికి ప్రభుత్వ చేయూత కోసం ఆర్థిస్తున్నాడు ‘ఫిడే మాస్టర్ ’ కూచిభొట్ల వెంకటకృష్ణ కార్తీక్. గుంటూరు వెస్ట్: కృష్ణా జిల్లాకు చెందిన కూచిభొట్ల వెంకట లక్ష్మీ నరసింహ మూర్తి (70), ఎం వెంకట బాల సరస్వతిలకు (67) వివాహమైన చాలా కాలానికి కార్తీక్ జన్మించాడు. మూడేళ్ల వరకు బాగానే ఉన్నాడు. అప్పుడు వచ్చిన శారీరక మార్పును తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. కొందరు వైద్యుల వద్దకు తిప్పినా సరైన వైద్యం అందలేదు. దీంతో 15 ఏళ్లు వచ్చే సరికి సక్రమంగా నిలబడలేకపోయాడు. మాట్లాడడం రాలేదు. చెప్పినవి వినపడవు. దీంతో తల్లిదండ్రులు కుంగిపోయారు. ఈ సమయంలో కార్తీక్ స్నేహితుడు హరి చెస్ క్రీడాకారుడు కావడంతో.. ఆ ఆటవైపు కార్తీక్ దృష్టి మళ్లింది. చాలెంజ్‌గా తీసుకున్న కోచ్ షేక్ ఖాశిం కొడుకు అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు కార్తీక్‌ను విజయవాడలోని గ్లోబల్ చెస్ అకాడమీ వ్యవస్థాపకుడు, ఇంటర్నేషనల్ కోచ్ షేక్ ఖాశిం వద్దకు తీసుకెళ్లారు.కార్తీక్ ఆసక్తిని గమనించిన కోచ్ శిక్షణ ప్రారంభించారు. అతి కొద్ది సమయంలోనే కార్తీక్‌లో పట్టుదల, ప్రతిభను కోచ్ గుర్తించారు. క్రమేణా అకాడమీలో ఉన్న రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులతో కార్తీక్ పోటీ పడ్డాడు. విజయం ఆయన వైపు నిలిచింది. సాధించిన విజయాలివి.. ♦ ఇంటర్నేషనల్ నార్మ్ రేటింగ్‌లో ఉన్న కార్తీక్ ప్రస్తుతం గుంటూరులో జరుగుతున్న సూపర్ గ్రాండ్ మాస్టర్ చెస్ శిక్షణలో ఉన్నారు. ఆయన సాధించిన విజయాల్లో కొన్ని.. ♦ 2014 లండన్‌లో జరిగిన కామన్వెల్త్ పోటీల్లో వికలాంగుల విభాగంలో బంగారు పతకం సాధించారు. ♦ 2014 సెర్బియాలో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ (ఐపీసీఏ)లో కాంస్య పతకం గెలుపొందారు. ఈ పోటీల్లో రష్యా ఇంటర్నేషనల్ మాస్టర్స్‌ను సైతం ఓడించడం గమనార్హం. ♦ 2015, 2017 సంవత్సరాల్లో తమిళనాడులోని తిరుచునాపల్లిలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో ప్ర«థమ స్థానం కైవసం చేసుకున్నారు. దీంతోపాటు అనేక జాతీయ, రాష్ట్ర , ఓపెన్ చెస్ పోటీల్లో విజయాలు సాధించారు. -
ఉపాధ్యాయుల కాఠిన్యం
-
నా కనులు నీవిగా చేసుకుని చూడు !
ఏ ముహూర్తాన వారు కలిశారో తెలియదు గానీ ఓర్వకల్లు మండలానికి చెందిన ఇద్దరు దివ్యాంగులు వయస్సు తారతమ్యం ఉన్నా స్నేహితులయ్యారు. అంతేకాదు తమ వైకల్యాన్ని ఎదిరించి ఒకరికొక్కరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మండలంలోని బైరాపురం గ్రామానికి చెందిన గోపాల్‌కు చిన్నతనంలోనే పోలియో వచ్చి రెండు కాళ్లు కోల్పోయాడు. ఇతను ఎంఏ, బీఈడీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. అలాగే ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఎ. నాగన్న అంధుడు. ఆయన ప్రస్తుతం ఆర్‌అండ్‌బీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతి రోజూ వీరిద్దరూ కర్నూలు నగరంలో కలుసుకుంటారు. ఎవరికి ఏ పనిపడినా ఒకరికొకరు సహాయపడతారు. ఈ క్రమంలో మంగళవారం వారిద్దరూ సి.క్యాంపు సెంటర్ సమీపంలోని ఓ ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లారు. పని ముగించుకున్న అనంతరం నాగన్నను ఆర్అండ్బీ కార్యాలయానికి తీసుకెళ్లాడు గోపాల్. ట్రైసైకిల్ గోపాల్ నడుపుతుండగా, ఆ వాహనాన్ని పట్టుకుని నాగన్న ముందుకు కదులుతున్న దృశ్యం స్నేహమేరా జీవితమని చాటింది. - డి. హుసేన్, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
ఆదుకోని ఆసరా..?
మందమర్రి రూరల్ : మానవత్వం మంట కలిసిపోతుంది. ప్రభుత్వ పథకాలు ఉన్నవారికే చుట్టాలన్నట్లు సమాజంలో దివ్యాంగులను వెక్కిరిస్తున్నాయి. సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా.. సంబంధిత అధికారులను కలిసినా.. ప్రజాప్రతినిధులకు మొర పట్టుకున్నా.. ప్రభుత్వం దివ్యాంగులకు అందించే ఆసరా ఫించన్ అందడం లేదు. శంకరమ్మ జగన్ లు రామకృష్ణాపూర్‌లోని కాకతీయ కాలనిలో జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. పూర్తిగా కాళ్లు చేతులు లేని జగన్‌కు ప్రభుత్వం అందించే ఫించన్ రాక పోవడంతో శంకరమ్మ చంటి పిల్లాడిలా తనని ఎత్తుకొని కనీసం ఫించన్ ఇప్పించండి సారూ.. అంటూ చేతులు జోడించి వేడుకుంటుంది. ఫించన్ ఇప్పించమని బుధవారం మండల అభివృద్ధి అధికారిని కలిసింది. ఎక్కడికి వెళ్లాలన్నా భర్తను ఎత్తుకుని తీసుకు వెళ్తుంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కనీసం మూడు చక్రాల సైకిల్ అందించాలని శంకరమ్మ ప్రాదేయపడుతోంది. -
పింఛన్ ప్రహసనం
అరండల్‌పేట: వారంతా నిరాధార వృద్ధులు... వికలాంగులు... వితంతువులు. నెలనెలా సర్కారు అందించే పింఛనే ఆధారం. రోజుకో పద్ధతిలో పంపిణీ చేపడుతుండటం వారి ప్రాణాలమీదికొస్తోంది. తాజాగా పోస్టాఫీసులనుంచి పంపిణీ చేపడుతుండటంతో కొత్త సమస్యలు ఎదురవుతున్నారుు. పేర్లు గల్లంతవడం... సర్వస్ మొరారుుంచడం... కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్నట్టు తయారైంది నగరపాలకసంస్థ పరిధిలోని పింఛనర్ల పరిస్థితి. జీఎంసీ పరిధిలో మొత్తం 21,259 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతు, చేనేత పింఛన్లు తీసుకుంటున్నారు. వీరికి గతంలో బిల్కలెక్టర్లు వారి వారి ప్రాంతాలకు వెళ్లి పింఛన్లు అందజేసేవారు. ఆరునెలల క్రితం యాక్సిస్ బ్యాంకు ద్వారా అందజేసేవారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టాఫీసుల ద్వారా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించడంతో ఆ నెల పింఛన్ లబ్ధిదారులకు అందలేదు. ఈ నెల 16వ తేదీనుంచి ఆ మొత్తాలు అందిస్తామని కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ఇందుకోసం ప్రతి 600 మందిని ఒక పోస్టాఫీసుకు కేటారుుంచి, మొత్తం 40 పోస్టాఫీసుల్లో ఏర్పాట్లు చేశారు. పోస్టాఫీసుల కేటారుుంపులోనూ గందరగోళం లబ్ధిదారుల్లో చాలా మందికి వారు నివాసం ఉండే ప్రాంతాల్లో కాకుండా సుమారు 4, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోస్టాఫీసులకు కేటారుుంచారు. దీనివల్ల ఎవరికి ఎక్కడ అందిస్తారో తెలియక గందరగోళంగా మారింది. కొంతమంది తమ ప్రాంతంలోని పోస్టాఫీసులకు ఉదయం 6 గంటల నుంచే ఎదురుచూశారు. తీరా అక్కడి అధికారులు వారి పేర్లు లేవంటూ సమాధానం చె ప్పేసరికి ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. కొందరు కార్పొరేషన్ కార్యాలయానికి క్యూ కట్టారు. అక్కడ వారికి సమాధానం చెప్పేవారు కరువయ్యారు. చాలా మంది వృద్ధులు ఎండతీవ్రతవల్ల కార్పొరేషన్ కార్యాలయంలో సొమ్మసిల్లిపడిపోయారు. అసలు పింఛన్ లిస్టులో పేరు ఉందో లేదో తెలియక తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. జీఎంసీ అధికారుల నిర్లక్ష్యం అసలు ఎవరికి ఎక్కడ పింఛన్లు పంపిణీ చేస్తారో ముందుగా కార్పొరేషన్ అధికారులు లబ్ధిదారులకు తెలియజేయలేదు. దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనేక మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కార్పొరేషన్ కార్యాలయంలోనే గడిపారు. వారికి సమాధానం చెప్పే వారే లేరు. మంగళదాస్‌నగర్‌కు చెందిన వారికి మెడికల్ కళాశాల పోస్టాఫీసు కేటాయించగా, పాతగుంటూరులో నివసించే వారికి ఆటోనగర్ పోస్టాఫీసులో డబ్బులు తీసుకొనేలా చేశారు. ఇలా ప్రతి డివిజన్లో జరగడ ంతో తీవ్ర గందరగోళం నెలకొంది. మొరాయించిన ఆన్లైన్ సర్వర్లు పెన్షన్ లిస్టులో పేర్లు ఉన్న వారికి డబ్బులు అందించేందుకు గంటల తరబడి సమయం పట్టింది. ఆయా పోస్టాఫీసుల్లో సర్వర్లు మొరారుుంచడంతో ఒక్కో అభ్యర్థి మూడు గంటలకు పైగా మెషిన్వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. ఇలా నగరంలోని 40 పోస్టాఫీసు కేంద్రాల వద్ద లబ్ధిదారులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. 600 మందిని ఒక పోస్టాఫీసుకు కేటాయించడంతో అక్కడకు ఒకేసారి అందరూ చేరుకుంటున్నారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు పొరపాట్లు జరగకుండా చూస్తాం పింఛన్ల పంపిణీలో పొరపాట్లు జరగకుండా చూస్తాం. కొందరి వేలిముద్రలు పడకపోవడంతో పోస్టాఫీసుల వద్ద వారికి పింఛన్లు ఇవ్వలేదు. అటువంటి వారి ఇళ్లకే వెళ్లి అందజేస్తాం. అలాగే మరికొందరి పేర్లు వివిధ కారణాలతో తొలగించారు. వారికి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే నెలలో కొంతమందికి పునరుద్ధరిస్తాం. - సింహాచలం, పీఓ, ఉపాసెల్ -
చిన్నచూపు!
జిల్లా పరిపాలనకు కేంద్ర బిందువైన కలెక్టరేట్లో 36 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయి. ప్రతి సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి వికలాంగులే కనీసం 50 మంది వరకు వస్తారు. సునయన ఆడిటోరియం బయట మెట్లు ఏర్పాటు చేశారు తప్ప ర్యాంపు మరిచారు. కీలకమైన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి ర్యాంపు లేదు. ప్రతిరోజు ఎంతో మంది వికలాంగులు, అంధులు ఈ కార్యాలయానికి వస్తూ ర్యాంపులు లేక ఇక్కట్లు పడుతుండటం నిత్యం చూస్తూనే ఉన్న అధికారుల మనసు కరగడం లేదు. కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్:విభిన్న ప్రతిభావంతులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ర్యాంపుల ఏర్పాటు చేయడం లేదు. దీంతో వికలాంగులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిధుల కొరత సాకుతో ర్యాంపుల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు ప్రభుత్వ కార్యాలయాలను కింది భాగం(గ్రౌండ్ ఫ్లోర్)లోనే గాక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లలో కూడా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా నిధులు వెచ్చింది ర్యాంపులు నిర్మించాల్సి ఉన్న ఆ దిశగా చర్యలు తీసుకునే నాథులు లేరు.జిల్లా కేంద్రమైన కర్నూలులోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు లేవంటే ఆశ్చర్యం కలగకమానదు. జిల్లాలో వికలాంగులు దాదాపు 1.50 లక్షల మంది ఉన్నారు. ఇందులో శారీరక వికలాంగులు దాదాపు 50 వేల మంది, మిగతావారు లక్షమంది ఉన్నారు. వీరందరికీ ర్యాంపులు అవసరమే. కానీ నిర్మించడంలోనే అధికారులు నిర్లక్ష్యాన్ని చాటుకుంటున్నారు. సంక్షేమ భవన్లో కీలకమైన సంక్షేమ శాఖల కార్యాలయాలు, హౌసింగ్ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి. కానీ ర్యాంపులు లేవంటే వికలాంగుల పట్ల సానుభూతి ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. కీలకమైన కార్యాలయాల్లో జిల్లా పరిషత్ కూడా ఒకటి. జిల్లా పరిషత్‌తో వికలాంగులకు ఎన్నో అవసరాలు ఉంటాయి. కానీ ర్యాంపు నిర్మించడంలో అధికారులో నిర్లక్ష్యం చోటు చేసుకుంది. ఏపీసీపీడీసీఎల్(విద్యుత్) కార్యాలయానికి ర్యాంపు లేక వికలాంగులు అవస్థలు పడుతున్నారు. తపాల, ఆర్ఐఓ, టెలికాం, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తదితర కార్యాలయాల్లో ర్యాంపులు లేవు. ఆదోనిలో పాఠశాలలను పోలింగ్ బూత్‌లకు వినియోగిస్తుననందున ఎన్నికల సమయంలో కొన్ని పాఠశాలలకు మాత్రం ర్యాంపులను ఏర్పాటు చేశారు. కానీ చాలా పాఠశాలలకు ఏర్పాటు చేయలేదు. పట్టణంలోని మెప్మా కార్యాలయం తప్ప ఇతర కార్యాలయాల్లో ఎక్కడా ర్యాంపులు లేవు. గత ఎన్నికల సమయంలో మండల పరిధిలోని సాంబగల్, దిబ్బనగల్, సంతెకుళ్ళూరు తదితర గ్రామాల పాఠశాలల్లో స్థానిక ప్రజాప్రతినిధులు నిర్మించగా అధికారులు బిల్లులు చెల్లించలేదు. మండల పరిధిలోని విరుపాపురం, దొడ్డనగేరి తదితర జిల్లా పరిషత్ పాఠశాలలకు ర్యాంపులు నిర్మించినప్పటకి రైలింగ్ ఏర్పాటు చేయలేదు. ఆళ్లగడ్డ మండలంలోని 54 పాఠశాలలో ఎక్కడా ర్యాంప్ లేవు. రుద్రవరం, చాగలమర్రి, శిరివెళ్ల మండలాల్లోనూ ఇదే పరిస్థితి. బనగానపల్లె మండలంలో అధికారుల లెక్కల ప్రకారం మండలంలో 862 మంది వికలాంగులు ఉన్నారు. వీరిలో పూర్తిగా 40శాతం వికలాంగులు 367, 60 శాతం వికలాంగులు 276, 70 శాతం వికలాంగులు 199 మంది ఉన్నారు. పట్టణంలోని 50 పడకల ఆసుపత్రి వద్దను, 24 గంటలు పని చేయు పలుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దను తప్పనిసరిగా ర్యాంప్‌లు ఏర్పాటు అవసరం. మద్దికెర మండలంలో బురుజుల, మద్దికెర, పెరవలి, బొమ్మనపల్లి, అగ్రహరం గ్రామాలలో 10 స్కూళ్లకు ర్యాంప్‌లు లేక వికలాంగులు అవస్థలు పడుతున్నారు. అలాగే ఎంపీడీఓ, ఎంఈఓ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేయడం అధికారులు పూర్తిగా మరిచారు. పాఠశాలాలు, కార్యాలయాలకు వెళ్లడానికి వికలాంగులు జంకుతున్నారు. గోనెగండ్లలో ప్రభుత్వ కార్యాలయాల్లో మెట్ల పక్కనే సీసీ ర్యాంపులు కనిపించడం లేదు. స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి సొంత భవనం వున్నా వికలాంగులు వెళ్లేందుకు సరైన సౌకర్యాలు లేవు. అలాగే అద్దె గృహంలో నిర్వహిస్తున్న ఐకేపీ కార్యాలయంలోపలికి వెళ్లాలంటే వికలాంగులు ఇబ్బందులు పడాల్సిందే. ఈకార్యాలయానికి సీసీ ర్యాంప్ నిర్మించలేదు. కోడుమూరులోని మండల పరిషత్ తహశీల్దార్, తదితర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి. పగిడ్యాల మండల రిసోర్స్ భవనంలో నిర్వహించే ఫిజియోథెరపి క్యాంప్‌లకు వచ్చే విభిన్న ప్రతిభావంతులు కార్యాలయం మెట్లు ఎక్కడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూరులో తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల వద్దకు ఎక్కువ సంఖ్యలో వికలాంగులు పింఛన్ల మంజూరు కోసం, కుల, ఆదాయ, నెటివిటీ, ఇతర ధృవీకరణ పత్రాల మంజూరు కోసం వస్తుంటారు. అయితే వీరు మెట్లు ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నారు. -
పాపం... రహిమాన్
ఈ బాలుడి పేరు అబ్దుల్ రహిమాన్.. ఊరు ప్రొద్దుటూరు.. వయసు 11.. పుట్టుకతోనే మానసిక వికలాంగుడు.. ఫొటోను జాగ్రత్తగా గమనిస్తే గొలుసుతో కాలును కట్టేసినట్లు కనిపిస్తుంది.. తోటి పిల్లలను కొట్టడం.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే తల్లిదండ్రులే ఇలా కట్టేశారు.. ఒకటి.. రెండు కూడా చెప్పలేడు.. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కొద్దిసేపు ఇంటి తలుపులు మూసి మళ్లీ ఇలా కట్టేస్తారు.. తండ్రి పాత ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం చేస్తుంటాడు.. తమ శక్తి మేరకు ఆస్పత్రులలో చూపించినా ఫలితం లేదని.. బెంగళూరులోని నిమ్హాన్స్కు వెళ్లమంటున్నారని.. అక్కడికి వెళ్లి వైద్యం చేయించే పరిస్థితులలో లేమని.. దాతలు దయతలచి 9000409301 ఫోన్ ద్వారా సహాయం చేస్తే వైద్యం చేయించుకుంటామని రహిమాన్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. - న్యూస్‌లైన్, ప్రొద్దుటూరు