జిల్లా పరిపాలనకు కేంద్ర బిందువైన కలెక్టరేట్‌లో 36 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయి. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి వికలాంగులే కనీసం 50 మంది వరకు వస్తారు. సునయన ఆడిటోరియం బయట మెట్లు ఏర్పాటు చేశారు తప్ప ర్యాంపు మరిచారు. కీలకమైన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి ర్యాంపు లేదు. ప్రతిరోజు ఎంతో మంది వికలాంగులు, అంధులు ఈ కార్యాలయానికి వస్తూ ర్యాంపులు లేక ఇక్కట్లు పడుతుండటం నిత్యం చూస్తూనే ఉన్న అధికారుల మనసు కరగడం లేదు.
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్:విభిన్న ప్రతిభావంతులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ర్యాంపుల ఏర్పాటు చేయడం లేదు. దీంతో వికలాంగులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిధుల కొరత సాకుతో ర్యాంపుల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పలు ప్రభుత్వ కార్యాలయాలను కింది భాగం(గ్రౌండ్ ఫ్లోర్)లోనే గాక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్‌లలో కూడా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా నిధులు వెచ్చింది ర్యాంపులు నిర్మించాల్సి ఉన్న ఆ దిశగా చర్యలు తీసుకునే నాథులు లేరు.జిల్లా కేంద్రమైన కర్నూలులోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు లేవంటే ఆశ్చర్యం కలగకమానదు. జిల్లాలో వికలాంగులు దాదాపు 1.50 లక్షల మంది ఉన్నారు. ఇందులో శారీరక వికలాంగులు దాదాపు 50 వేల మంది, మిగతావారు లక్షమంది ఉన్నారు. వీరందరికీ ర్యాంపులు అవసరమే. కానీ నిర్మించడంలోనే అధికారులు నిర్లక్ష్యాన్ని చాటుకుంటున్నారు.
సంక్షేమ భవన్‌లో కీలకమైన సంక్షేమ శాఖల కార్యాలయాలు, హౌసింగ్ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి. కానీ ర్యాంపులు లేవంటే వికలాంగుల పట్ల సానుభూతి ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. కీలకమైన కార్యాలయాల్లో జిల్లా పరిషత్ కూడా ఒకటి. జిల్లా పరిషత్‌తో వికలాంగులకు ఎన్నో అవసరాలు ఉంటాయి. కానీ ర్యాంపు నిర్మించడంలో అధికారులో నిర్లక్ష్యం చోటు చేసుకుంది. ఏపీసీపీడీసీఎల్(విద్యుత్) కార్యాలయానికి ర్యాంపు లేక వికలాంగులు అవస్థలు పడుతున్నారు. తపాల, ఆర్‌ఐఓ, టెలికాం, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తదితర కార్యాలయాల్లో ర్యాంపులు లేవు.
ఆదోనిలో పాఠశాలలను పోలింగ్ బూత్‌లకు వినియోగిస్తుననందున ఎన్నికల సమయంలో కొన్ని పాఠశాలలకు మాత్రం ర్యాంపులను ఏర్పాటు చేశారు. కానీ చాలా పాఠశాలలకు ఏర్పాటు చేయలేదు. పట్టణంలోని మెప్మా కార్యాలయం తప్ప ఇతర కార్యాలయాల్లో ఎక్కడా ర్యాంపులు లేవు. గత ఎన్నికల సమయంలో మండల పరిధిలోని సాంబగల్, దిబ్బనగల్, సంతెకుళ్ళూరు తదితర గ్రామాల పాఠశాలల్లో స్థానిక ప్రజాప్రతినిధులు నిర్మించగా అధికారులు బిల్లులు చెల్లించలేదు. మండల పరిధిలోని విరుపాపురం, దొడ్డనగేరి తదితర జిల్లా పరిషత్ పాఠశాలలకు ర్యాంపులు నిర్మించినప్పటకి రైలింగ్ ఏర్పాటు చేయలేదు.
ఆళ్లగడ్డ మండలంలోని 54 పాఠశాలలో ఎక్కడా ర్యాంప్ లేవు. రుద్రవరం, చాగలమర్రి, శిరివెళ్ల మండలాల్లోనూ ఇదే పరిస్థితి.
బనగానపల్లె మండలంలో అధికారుల లెక్కల ప్రకారం మండలంలో 862 మంది వికలాంగులు ఉన్నారు. వీరిలో పూర్తిగా 40శాతం వికలాంగులు 367, 60 శాతం వికలాంగులు 276, 70 శాతం వికలాంగులు 199 మంది ఉన్నారు. పట్టణంలోని 50 పడకల ఆసుపత్రి వద్దను, 24 గంటలు పని చేయు పలుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దను తప్పనిసరిగా ర్యాంప్‌లు ఏర్పాటు అవసరం.
మద్దికెర మండలంలో బురుజుల, మద్దికెర, పెరవలి, బొమ్మనపల్లి, అగ్రహరం గ్రామాలలో 10 స్కూళ్లకు ర్యాంప్‌లు లేక వికలాంగులు అవస్థలు పడుతున్నారు. అలాగే ఎంపీడీఓ, ఎంఈఓ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేయడం అధికారులు పూర్తిగా మరిచారు. పాఠశాలాలు, కార్యాలయాలకు వెళ్లడానికి వికలాంగులు జంకుతున్నారు.
గోనెగండ్లలో ప్రభుత్వ కార్యాలయాల్లో మెట్ల పక్కనే సీసీ ర్యాంపులు కనిపించడం లేదు. స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి సొంత భవనం వున్నా వికలాంగులు వెళ్లేందుకు సరైన సౌకర్యాలు లేవు. అలాగే అద్దె గృహంలో నిర్వహిస్తున్న ఐకేపీ కార్యాలయంలోపలికి వెళ్లాలంటే వికలాంగులు ఇబ్బందులు పడాల్సిందే. ఈకార్యాలయానికి సీసీ ర్యాంప్ నిర్మించలేదు.
కోడుమూరులోని మండల పరిషత్ తహశీల్దార్, తదితర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి.
పగిడ్యాల మండల రిసోర్స్ భవనంలో నిర్వహించే ఫిజియోథెరపి క్యాంప్‌లకు వచ్చే విభిన్న ప్రతిభావంతులు కార్యాలయం మెట్లు ఎక్కడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆత్మకూరులో తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల వద్దకు ఎక్కువ సంఖ్యలో వికలాంగులు పింఛన్ల మంజూరు కోసం, కుల, ఆదాయ, నెటివిటీ, ఇతర ధృవీకరణ పత్రాల మంజూరు కోసం వస్తుంటారు. అయితే వీరు మెట్లు ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
చిన్నచూపు!
Published Thu, Jan 16 2014 4:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
Advertisement
Advertisement