ముకరంపుర: కలెక్టరేట్ ఓ చోట.. పలు జిల్లా కార్యాయాలు మరోచోట.. ప్రజలు పనుల నిమిత్తం ఆఫీసులు తిరగాలంటే సహనానికి పరీక్ష.. ఫలితంగా పనుల్లో జాప్యం.. పర్యవేక్షణలో లోపం.. కరీంనగర్‌లో ప్రస్తుతమున్న పరిస్థితి ఇది. ఇలాకాకుండా ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకేచోట ప్రజలకు, అధికారులు, సిబ్బందికి అందుబాటులో ఉండాలని భావించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయం ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుత కలెక్టరేట్ హెలిప్యాడ్ పార్కులోని ఖాళీస్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని అధికార యంత్రాంగం నిర్ణయానికి వచ్చింది. రూ.వంద బడ్జెట్ అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం ప్రభుత్వానికి పంపించింది. దీనికి ప్రభుత్వ ఆమోదం లభిస్తే బహుళ అంతస్థుల్లో జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట కొలువుదీరనున్నాయి.
ప్రస్తుతం జిల్లాస్థాయిలో నగరంలో ఎనభై ప్రభుత్వ శాఖలు వేర్వేరు సముదాయాల్లో ఉన్నాయి. జిల్లా పరిపాలనా కేంద్రం కలెక్టరేట్‌లో 42 శాఖలుండగా యాభైకి పైగా ఆఫీసులున్నాయి. కలెక్టరేట్‌లో 1200 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా, జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతంలో ఉన్న జిల్లా కార్యాలయాల్లో మరో నాలుగు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నూతన భవనం పూర్తయితే మొత్తం ఐదు వేలకు పైగా ఉద్యోగులంతా ఈ పది అంతస్తుల భవనంలోనే కొలువులు నిర్వర్తించనున్నారు.
ఆధునిక హంగులతో..
ఆధునిక హంగులతో పది అంతస్థులతో భవనాన్ని నిర్మించేందుకు అర్‌అండ్‌బీ ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. విశాలమైనపదహారు ఎకరాల స్థలంలో ఈ భవన సముదాయాన్ని కార్పొరేట్ ఆఫీసుల తరహా నిర్మించనున్నారు. విద్యుత్ అవసరాల కోసం పూర్తిగా సోలార్ విద్యుత్ సిస్టంను ఉపయోగించనున్నారు. సెమీ ఆటోమేటిక్ లిఫ్టులు, ఇంటర్నెట్, వైఫై సౌకర్యంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. బయోమెట్రిక్ ద్వారా ఉద్యోగుల హాజరు శాతాన్ని పరిశీలించనున్నారు. భవనం మొత్తం రాజసం ఉట్టిపడేలా కనిపించనుంది.
ప్రస్తుత కలెక్టరేట్ భవనాన్ని 1984లో నిర్మించారు. ఈ భవనం పలుచోట్ల పగుళ్లు తేలి, పెచ్చులూడుతూ, పైపుల నుంచి నీళ్లు కారుతూ శిథిలావస్థకు చేరుకుంటోంది. ఆగస్టులో జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ కలెక్టరేట్‌లో జిల్లా సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన సమయంలో ఈ భవనం దుస్థితిని కళ్లారా చూశారు. ఆధునాత హంగులతో నూతన భవనం నిర్మిస్తామని ఆనాడే ప్రకటించారు. కొత్త బంగళా నిర్మిస్తే ఇప్పుడున్న కలెక్టరేట్ సముదాయాన్ని ఏం చేస్తారనేది ఇంకా నిర్ణయించలేదు.
రెవెన్యూ డివిజన్లలో సైతం..
రెవెన్యూ డివిజన్లలో సైతం ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు రావడంతో శుక్రవారం కరీంనగర్, పెద్దపెల్లి, మంథని, సిరిసిల్ల, జగిత్యాల డివిజన్ కేంద్రాల్లో నూతన భవనాల నిర్మాణాల కోసం అధికారులను స్థలాలను పరిశీలించారు. ఇప్పటికే స్థలాలు గుర్తించిన మంథని, సిరిసిల్లలో నూతన భవనాల నిర్మాణానికి రూ.2.32 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపించారు. మంథని, సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకుని ఏళ్లు గడుస్తున్నాయి. మిగిలిన మూడు చోట్ల త్వరలో ప్రతిపాదనలు పంపనున్నారు. జగిత్యాల ఆర్డీవో కార్యాలయాన్ని ధరూర్ క్యాంపునకు తరలించాలని భావిస్తున్నారు. ఇదే వరుసలో అన్ని మండలాల్లో తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణాలకు సైతం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
సర్కారు బంగళా
Published Sat, Dec 13 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM
Advertisement