పింఛన్ ప్రహసనం
అరండల్‌పేట: వారంతా నిరాధార వృద్ధులు... వికలాంగులు... వితంతువులు. నెలనెలా సర్కారు అందించే పింఛనే ఆధారం. రోజుకో పద్ధతిలో పంపిణీ చేపడుతుండటం వారి ప్రాణాలమీదికొస్తోంది. తాజాగా పోస్టాఫీసులనుంచి పంపిణీ చేపడుతుండటంతో కొత్త సమస్యలు ఎదురవుతున్నారుు. పేర్లు గల్లంతవడం... సర్వస్ మొరారుుంచడం... కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్నట్టు తయారైంది నగరపాలకసంస్థ పరిధిలోని పింఛనర్ల పరిస్థితి.
జీఎంసీ పరిధిలో మొత్తం 21,259 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతు, చేనేత పింఛన్లు తీసుకుంటున్నారు. వీరికి గతంలో బిల్‌కలెక్టర్లు వారి వారి ప్రాంతాలకు వెళ్లి పింఛన్లు అందజేసేవారు. ఆరునెలల క్రితం యాక్సిస్ బ్యాంకు ద్వారా అందజేసేవారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టాఫీసుల ద్వారా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించడంతో ఆ నెల పింఛన్ లబ్ధిదారులకు అందలేదు. ఈ నెల 16వ తేదీనుంచి ఆ మొత్తాలు అందిస్తామని కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ఇందుకోసం ప్రతి 600 మందిని ఒక పోస్టాఫీసుకు కేటారుుంచి, మొత్తం 40 పోస్టాఫీసుల్లో ఏర్పాట్లు చేశారు.
పోస్టాఫీసుల కేటారుుంపులోనూ గందరగోళం
లబ్ధిదారుల్లో చాలా మందికి వారు నివాసం ఉండే ప్రాంతాల్లో కాకుండా సుమారు 4, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోస్టాఫీసులకు కేటారుుంచారు. దీనివల్ల ఎవరికి ఎక్కడ అందిస్తారో తెలియక గందరగోళంగా మారింది. కొంతమంది తమ ప్రాంతంలోని పోస్టాఫీసులకు ఉదయం 6 గంటల నుంచే ఎదురుచూశారు. తీరా అక్కడి అధికారులు వారి పేర్లు లేవంటూ సమాధానం చె ప్పేసరికి ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. కొందరు కార్పొరేషన్ కార్యాలయానికి క్యూ కట్టారు. అక్కడ వారికి సమాధానం చెప్పేవారు కరువయ్యారు. చాలా మంది వృద్ధులు ఎండతీవ్రతవల్ల కార్పొరేషన్ కార్యాలయంలో సొమ్మసిల్లిపడిపోయారు. అసలు పింఛన్ లిస్టులో పేరు ఉందో లేదో తెలియక తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
జీఎంసీ అధికారుల నిర్లక్ష్యం
అసలు ఎవరికి ఎక్కడ పింఛన్లు పంపిణీ చేస్తారో ముందుగా కార్పొరేషన్ అధికారులు లబ్ధిదారులకు తెలియజేయలేదు. దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనేక మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కార్పొరేషన్ కార్యాలయంలోనే గడిపారు. వారికి సమాధానం చెప్పే వారే లేరు. మంగళదాస్‌నగర్‌కు చెందిన వారికి మెడికల్ కళాశాల పోస్టాఫీసు కేటాయించగా, పాతగుంటూరులో నివసించే వారికి ఆటోనగర్ పోస్టాఫీసులో డబ్బులు తీసుకొనేలా చేశారు. ఇలా ప్రతి డివిజన్‌లో జరగడ ంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
మొరాయించిన ఆన్‌లైన్ సర్వర్లు
పెన్షన్ లిస్టులో పేర్లు ఉన్న వారికి డబ్బులు అందించేందుకు గంటల తరబడి సమయం పట్టింది. ఆయా పోస్టాఫీసుల్లో సర్వర్‌లు మొరారుుంచడంతో ఒక్కో అభ్యర్థి మూడు గంటలకు పైగా మెషిన్‌వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. ఇలా నగరంలోని 40 పోస్టాఫీసు కేంద్రాల వద్ద లబ్ధిదారులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. 600 మందిని ఒక పోస్టాఫీసుకు కేటాయించడంతో అక్కడకు ఒకేసారి అందరూ చేరుకుంటున్నారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు
పొరపాట్లు జరగకుండా చూస్తాం
పింఛన్ల పంపిణీలో పొరపాట్లు జరగకుండా చూస్తాం. కొందరి వేలిముద్రలు పడకపోవడంతో పోస్టాఫీసుల వద్ద వారికి పింఛన్లు ఇవ్వలేదు. అటువంటి వారి ఇళ్లకే వెళ్లి అందజేస్తాం. అలాగే మరికొందరి పేర్లు వివిధ కారణాలతో తొలగించారు. వారికి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే నెలలో కొంతమందికి పునరుద్ధరిస్తాం.
- సింహాచలం, పీఓ, ఉపాసెల్