![Meltwater Champions: Arjun Erigaisi beat Azerbaijani GM Shakhriyar Mamedyarov - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/19/ARJUN-CHESS-0V3F1.jpg.webp?itok=TLsIekKJ)
మెల్ట్‌వాటర్ చాంపియన్స్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ తొలి విజయం నమోదు చేశాడు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో అర్జున్ 3–1తో షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్‌బైజాన్)పై గెలుపొందాడు. తొలి గేమ్‌ను 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న అర్జున్, రెండో గేమ్‌లో 58 ఎత్తుల్లో నెగ్గాడు.
మూడో గేమ్‌ను 37 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించిన అర్జున్ చివరిదైన నాలుగో గేమ్‌లో 33 ఎత్తుల్లో గెలిచాడు. భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్, చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద టోర్నీలో తొలి ఓటమి చవిచూశాడు. ప్రజ్ఞానంద 1–2తో వెస్లీ సో (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఎనిమిది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద నాలుగు పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో, అర్జున్ మూడు పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment