
ప్రపంచ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలకు పట్లోళ్ల ఇంద్రా రెడ్డి
ప్రతిష్టాత్మక ప్రపంచ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే భారత బృందాన్ని ప్రకటించారు. అండర్–11 ఓపెన్ విభాగంలో తెలంగాణకు చెందిన పట్లోళ్ల ఇంద్రా రెడ్డి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తనయుడైన పట్లోళ్ల ఇంద్రా రెడ్డి గత జనవరిలో జరిగిన జాతీయ స్కూల్ చెస్ చాంపియషిప్‌లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా భారత జట్టులోకి ఎంపికయ్యాడు.
అండర్–11 ఓపెన్ విభాగంలోనే భారత్ నుంచి రేయాంశ్ వెంకట్ మరో ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. ప్రపంచ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు సెర్బియాలోని వ్రాన్‌జాస్కా బాంజా పట్టణంలో జరుగుతాయి.
బాలికల విభాగంలో ఆరు కేటగిరీల్లో (అండర్–7, అండర్–9, అండర్–11, అండర్–13, అండర్–15, అండర్–17)... ఓపెన్ విభాగంలో ఆరు కేటగిరీల్లో (అండర్–7, అండర్–9, అండర్–11, అండర్–13, అండర్–15, అండర్–17) తొమ్మిది రౌండ్‌లపాటు పోటీలను నిర్వహిస్తారు. భారత్ నుంచి మొత్తం 22 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇండియన్ టూర్ స్క్వాష్ టోర్నీ షురూ
చెన్నై: భారత స్క్వాష్ రాకెట్స్ సమాఖ్య (ఎస్‌ఆర్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నేటి నుంచి జరగనున్న ఇండియన్ టూర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఆటగాళ్లు సౌరవ్ ఘోషల్, జోష్నా చినప్ప ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. చెన్నై వేదికగా జరగనున్న ఈ టోర్నీలో వీరితో పాటు ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా విజయాలు సాధిస్తున్న టీనేజ్ సంచలనం 16 ఏళ్ల అనాహత్ సింగ్ కూడా బరిలోకి దిగనుంది.
తక్కువ కాలంలోనే 9 ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) టైటిళ్లు ఖాతాలో వేసుకున్న అనాహత్ మహిళల విభాగంలో మూడో సీడ్ దక్కించుకుంది. గతేడాది కెరీర్‌కు వీడ్కోలు పలికిన 38 ఏళ్ల సౌరవ్ ఇటీవల రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఆ వెంటనే బరిలోకి దిగిన సిడ్నీ క్లాసిక్ ఈవెంట్‌లో అతడు విజేతగా నిలిచాడు. 19 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన 38 ఏళ్ల జోష్నా గతేడాది నవంబర్ తర్వాత తొలిసారి బాక్స్‌లో అడుగు పెట్టనుంది.
పురుషుల విభాగంలో ఈజిప్ట్ ప్లేయర్ కరీమ్ అల్ హమామీ టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుండగా... ఈజిప్ట్‌కే చెందిన అలీ హుసేన్ రెండో సీడ్ దక్కించుకున్నాడు. భారత్ నుంచి సౌరవ్‌తో పాటు వీర్, సూరజ్, అరిహాంత్, హరిందర్ పాల్ సింగ్, పీఆర్ సంధేశ్ పాల్గొంటున్నారు. మహిళల విభాగంలో భారత ప్లేయర్ ఆకాంక్ష సాలుంఖే టాప్ సీడ్ దక్కించుకుంది.
మన దేశం నుంచి షమీనా రియాజ్, పూజ ఆర్తి, రితిక సీలన్ కూడా పోటీలో ఉన్నారు. ఈ టోర్నీలో ఆస్ట్రియా, బ్రెజిల్, ఈజిప్ట్, ఫ్రాన్స్, ఐర్లాండ్, జపాన్, కువైట్, మలేసియా, నెదర్లాండ్స్, సింగపూర్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, స్విట్జర్లాండ్, వేల్స్ నుంచి ప్లేయర్లు పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment