indra reddy
-
ఆదేశాలు కరువు: తెలంగాణ ప్రైవేటు స్కూళ్లలో ఆన్‌లైనా.. ఆఫ్‌లైనా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో నూరుశాతం ప్రత్యక్ష బోధన చేపట్టాలని కచ్చితమైన ఆదేశాలిచ్చిన విద్యాశాఖ, ప్రైవేటు స్కూళ్ల విషయంలో ఈ సాహసం చేయలేకపోతోంది. సెప్టెంబర్ ఒకటి నుంచి అంతా ప్రత్యక్ష తరగతులే ఉంటాయని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించినా, మార్గదర్శకాలేవీ ఇప్పటివరకూ జారీ కాలేదని, అలాంటప్పుడు ప్రైవేటు స్కూళ్లను ఆఫ్‌లైన్ పెట్టాలని తామెలా కట్టడి చేయగలమని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్ష విద్యాబోధనపై విద్యామంత్రి సోమవారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కోవిడ్ నిబంధనల అమలుపై జరుగుతున్న కసరత్తు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే స్కూళ్లలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా క్లాసులు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. రోజు విడిచి రోజుగానీ, సెక్షన్లు పెంచిగానీ విద్యాబోధన చేయబోతున్నట్టు మంత్రి దృష్టికి తెచ్చారు. క్లాసురూంలో ఎక్కువమందికి కోవిడ్ నిర్ధారణ అయితే తాత్కాలికంగా స్కూల్ నిర్వహణ ఆపి, పూర్తిస్థాయి పరీక్షల తర్వాతే పునఃప్రారంభించాలని పేర్కొన్నట్టు తెలిసింది. ప్రైవేటు రూటే వేరు.. ప్రైవేటు స్కూళ్ల గురించిన పలు విషయాలను అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రైవేటు స్కూళ్లు ఇప్పటికే సగానికిపైగా సిలబస్ పూర్తిచేశాయని, కార్పొరేట్ స్కూళ్లు చాలావరకూ ఫీజులు వసూలు చేశాయని, దీంతో ప్రత్యక్ష బోధనతోపాటు ఆన్లైన్ విధానం కొనసాగుతుందని అవి చెబుతున్నాయని పేర్కొన్నారు. అయితే ప్రైవేట్‌లోనూ ఆఫ్‌లైన్ మాత్రమే ఉండాలన్న కచ్చిత నిబంధన పెడితే బాగుంటుందని అధికారులు మంత్రికి తెలిపినట్టు సమాచారం. దీనిపై మంత్రి స్పందించలేదని తెలిసింది. ఓ వారంపాటు ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్లో బోధన చేసినా పెద్దగా పట్టించుకోవద్దన్న అభిప్రా యం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ స్కూళ్లలో ఆఫ్‌లైన్ కచ్చితమని చెప్పి, ప్రైవేటు స్కూళ్లకు వెసులుబాటు ఇవ్వడంపై విద్యాశాఖ అధికారులే పెదవి విరుస్తున్నారు. కాలేజీ విద్యార్థులకు వ్యాక్సిన్ ధ్రువీకరణ ఇంటర్, ఆపై తరగతుల విద్యార్థులు టీకా వేయించుకున్నట్టు ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని నిర్ణ యించారు. హాస్టల్ విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు చేయించి ప్రవేశం కల్పించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే ఉన్నతవిద్యను అభ్యసించే విద్యార్థులకు ఆన్లైన్ బోధన కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. హాజరుశాతం తప్పనిసరి అనే నిబంధన ఉండబోదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి పేర్కొన్నారు. విద్యాసంస్థలు మొదలైన వారం తర్వాతే వాస్తవ పరిస్థితిని అంచనా వేయవచ్చని మంత్రి, విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు, క్లాసు రూంల శుభ్రతపై పారిశుధ్య కార్మికులు విముఖత వ్యక్తం చేస్తున్నారని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. కాగా, కోవిడ్ నిబంధనలకు లోబడి సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లను ప్రారంభించేలా జాగ్రత్తలు తీసుకునే బాధ్యత ప్రధానోపాధ్యాయులదే అని విద్యా శాఖ సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. జిల్లా అధికారులు రోజూ పర్యవేక్షిస్తూ నివేదికలు పంపాలని పేర్కొంది. సామాజిక దూ రం పాటించేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కోరింది. తల్లిదండ్రుల మనోభావాలకే ప్రాధాన్యం : సబిత విద్యాసంస్థల్లో తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సమావేశం వివరాలను ఆమె మీడియాకు వివరిస్తూ, రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనల అమలులో అలసత్వాన్ని ప్రభుత్వం సహించబోదన్నారు. పారిశుధ్య నిర్వహణ, శానిటైజేషన్ పూర్తి చేసేందుకు మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు విధిగా మాస్కులు ధరించేలా చూడాలన్నారు. విద్యార్థుల్లో ఎవరికైనా జ్వర సూచన ఉంటే ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపళ్లు వెంటనే సమీపంలోని పీహెచ్‌సీకి తీసుకువెళ్లి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఒకవేళ కోవిడ్ నిర్ధారణ అయితే విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు. సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు సందీప్ సుల్తానియా, దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
నాన్నే లేనప్పుడు.. మేమెందుకు?
- తల్లీ కుమారుని ఆత్మహత్య - ‘సివిల్స్’ లక్ష్యం నెరవేరకుండానే కుమారుని మృతి కమలాపురం: ఇంటిపెద్ద లేని బతుకు వృథా అని భావించిన ఓ తల్లీ, కుమారుడు పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నారు. ఈ విషాద సంఘటన వైఎస్సార్ జిల్లా కమలాపురం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన చావలి ప్రసాద్‌రెడ్డి అనారోగ్యంతో గత ఏప్రిల్ పదిన కన్నుమూశారు. ఆయన మరణాన్ని భార్య గౌరి(45), కుమారుడు ఇంద్రారెడ్డి తట్టుకోలేకపోయారు. మానసికంగా కుంగిపోయారు. జీవితంపై విరక్తి చెందారు. జీవితం చాలించాలని నిర్ణయానికి వచ్చారు. సోమవారం రాత్రి తమ నివాసంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎక్కడికైనా వెళ్లి ఉండొచ్చన్న భావంతో ఇరుగుపొరుగున ఉన్నవారు మంగళవారం అంతగా పట్టించుకోలేదు. బుధవారం సైతం ఇంటి నుంచి అలికిడి లేకపోవడంతో అనుమానమొచ్చి తలుపు తట్టారు. అయితే తలుపు తెరిచే ఉండడంతో లోనికి వెళ్లి చూడగా.. తల్లీ, కుమారుడు శవాలుగా పడి ఉన్నారు. ఈ విషయాన్ని వెంటనే స్థానికులు వారి బంధువులకు, పోలీసులకు తెలియజేశారు. ఎర్రగుంట్ల సీఐ శ్రీనువాసులరెడ్డి, ఎస్ఐ మహమ్మద్ రఫీ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాల్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో.. వారు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, వైవీయూలో పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్న ఇంద్రారెడ్డి సివిల్స్ మెయిన్స్ రెండుసార్లు అటెంప్ట్ చేయడం విశేషం. ఐఏఎస్ సాధించడం తన లక్ష్యమని పలువురితో చెప్పేవాడు. అయితే తండ్రి మరణం అతన్ని కుంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా పురికొల్పింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇంద్రారెడ్డి అర్ధంతరంగా తనువు చాలించడం పట్ల బంధువులు కన్నీరు పెట్టుకున్నారు. -
కర్ణాటక సరిహద్దులో.. కలగా మారిన జీవన్గి బ్రిడ్జి!
తాండూరు: కర్ణాటక సరిహద్దులోని బషీరాబాద్ మండలం జీవన్గిలో బ్రిడ్జి నిర్మాణం కలగానే మారింది. ఏళ్లుగా ఈ బ్రిడ్జి నిర్మాణానికి చేస్తున్న ప్రతిపాదనలు బుట్టదాఖలవుతూనే ఉన్నాయి. దీంతో బషీరాబాద్ మండలంలోని సుమారు ఇరవై గ్రామాల ప్రజల నిరీక్షణ ఫలించడం లేదు. రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రారెడ్డి హయాంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి అప్పట్లో శంకుస్థాపన జరిగింది. పనులు పునాది దశలోనే ఆగిపోయాయి. పదేళ్ల క్రితం మరోసారి పనులు మొదలుపెట్టినా అంతలోనే ఆపేశారు. తాజాగా ఆర్అండ్బీ అధికారులు ఈ బ్రిడ్జి నిర్మాణానికి మళ్లీ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపడంతో స్థానకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దూరం తగ్గుతుంది బషీరాబాద్ నుంచి తాండూరుకు రావడానికి సుమారు 30 కి.మీ.దూరం అవుతుంది. అయితే ఈ బ్రిడ్జి నిర్మిస్తే జీవన్గీ నుంచి కరన్‌కోట మీదుగా తాండూరుకు వచ్చే అవకాశం ఉండటంతో 12 కి.మీ. దూరం తగ్గుతుంది. బషీరాబాద్ నుంచి జీవన్గీతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కరన్‌కోట్ మీదుగా కర్ణాటకలోని సులేపేట్, చించొళి, గుల్బర్గా, ఉమ్మాబాద్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఆ గ్రామాల ప్రజలు తాండూరుకు వచ్చి కర్ణాటకలోని గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. కరన్‌కోట్ నుంచి సేడం హైవేకు... తాండూరు మండలంలో నాలుగు సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. ఆయా సిమెంట్ కర్మాగారాల నుంచి సిమెంట్ ఉత్పత్తుల లారీలు పెద్ద సంఖ్యలో కర్ణాటకు వెళుతుంటాయి. ఈ బ్రిడ్జి అందుబాటోకి వస్తే ఈ లారీల రాకపోకలకు కూడా దూరం కలిసొచ్చే అవకాశం ఉంది. కర్ణాటకకు వెళ్లే సిమెంట్ లారీలన్నీ గౌతాపూర్, తాండూరు మీదుగా మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మీదుగా కర్ణాటకు వెళుతుంటాయి. భారీ వాహనాలు తాండూరులోకి ప్రవేశించడం వల్ల ట్రాఫిక్ సమస్యలూ తలెత్తుతున్నాయి. కాగ్నాపై బ్రిడ్జి నిర్మాణం జరిగితే సిమెంట్ లారీలు తాండూరులోకి ప్రవేశించకుండానే నేరుగా కరన్‌కోట్ నుంచి జీవన్గీ, మైల్వార్, ఆడ్కి మీదుగా కర్ణాటకలోని సేడం హైవేకు వెళ్లొచ్చు. దీనివల్ల దూరం తగ్గుతుంది. సరిహద్దులో అంతరాష్ట్ర రవాదారితో లింకు ఏర్పడే ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఇటీవల తాండూరు ఆర్‌అంబీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి కూడా ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలనే పట్టుదలతో ఉన్నారు. మరి ఈసారైనా బ్రిడ్జి నిర్మాణానికి నోచుకుంటుందా లేదా వేచి చూడాల్సిందే. రూ.6 కోట్లతో ప్రతిపాదనలు: డీఈఈ జానకిరాములు జీవన్గీలో కాగ్నా నది(వాగు)పై బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవలనే రూ.6కోట్లతో ప్రతిపాదనలు పంపించామని డీఈఈ జానకీరాములు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. -
ఇంద్రారెడ్డికి ఘన నివాళులు
చేవెళ్లరూరల్, న్యూస్‌లైన్ : మాజీ హోంమంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి 14వ వర్ధంతిని మంగళవారం కౌకుంట్ల గ్రామంలో నిర్వహించారు. ఆయన సతీమణి సబితారెడ్డి, తనయుడు కార్తీక్‌రెడ్డి తదితర కుటుంబ సభ్యులు గ్రామంలోని ఇంద్రారెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని ఇంద్రారెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాజీ హోం మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ఇంద్రారెడ్డిపై అభిమానంతో ఎందరో తమ కుటుంబానికి అండగా నిలుస్తున్నారని, వారి ఆదరాభిమానాలతోనే మూడు దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. తొలిసారిగా చేవెళ్ల లోక్‌సభ స్థానానికి తమ కుటుంబం నుంచి కార్తీక్‌రెడ్డి పోటీ చేస్తున్నారని, ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాంత ప్రజలను తమ కుటుంబం మరిచిపోదనీ, మరింత ఎక్కువ కాలం సేవ చేసే అవకాశం కల్పించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, చేయబోయే అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. తెలంగాణ ప్రజల అకాంక్ష నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. దివంగత ఇంద్రారెడ్డి కన్న తెలంగాణ కల నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఆయన అభిమానులపై ఉందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పి.వెంకటస్వామి, నాయకులు కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, రమణారెడ్డి, ఎం.బాల్‌రాజ్, వెంకటేశం గుప్తా, రవికాంత్ రెడ్డి, శివానందం, బల్వంత్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అలీ, వనం మహేందర్‌రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ దీక్షాదక్షతలే అండ
ఇంద్రారెడ్డి ఆదర్శాల సాధనకే రాజకీయాల్లోకి వచ్చా ఆయన హఠాన్మరణం తర్వాత మూడ్రోజులకే ఉప ఎన్నికల నోటిఫికేషన్ కష్టాల కడలి నుంచి రాజకీయరంగంలోకి ప్రవేశించా జనం సమస్యలే అజెండాగా ముందుకు సాగుతున్నా వైఎస్సార్ తన తోబుట్టువులా ఆదరించారు మనవరాలే నా ప్రపంచం రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అమ్మమ్మ ఇంట్లోనే అక్షరాభ్యాసం నాన్న మహిపాల్‌రెడ్డి, అమ్మ వెంకటమ్మ. పుట్టినిల్లు తాండూరు మండలం కోటబాస్పల్లి కంటే అమ్మమ్మ ఊరు మెదక్ జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లితోనే అనుబం దం ఎక్కువ. రైతు కుటుంబమే అయినా నాన్న కాంట్రాక్టులు చేసేవారు. లారీలు కూడా ఉండేవి. ఇంటికి పెద్ద కూతురుని నేనే. నాతోపాటు చెల్లి సౌజన్య, తమ్ముడు నర్సింహారెడ్డి. మేనమామ గోపాల్‌రెడ్డికి సంతానం లేకపోవడంతో చిన్నతనంలో వారింట్లోనే పెరిగా. అక్కడే అక్షరాభ్యాసం చేశా. ఆ తర్వాత ప్రాథమిక విద్య కోసం నన్ను తాండూరులోని మిషనరీ స్కూల్లో చేర్పించారు. అక్కడే థర్డ్ వరకు చదివా. కానీ నా మనస్సంతా అమ్మమ్మ ఇంటి చుట్టే తిరిగేది. ఇది గమనించిన నాన్న నన్ను మళ్లీ అమ్మమ్మ ఇంటికి పంపారు. 3 నుంచి 5వ తరగతి వరకు మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని మిషనరీ స్కూల్లో చదువుకున్నా. అక్క డే గది తీసుకొని మరీ విద్యాభ్యాసం కొనసాగించా. అక్కడి నుంచి మకాం మలక్‌పేటకు మార్చాం. స్థానిక ప్రైవేటు పాఠశాలలో 5, 6 తరగతులు చదివిన తర్వాత.. చాదర్‌ఘాట్‌లోని భాగ్య మెమోరియల్ స్కూల్లో టెన్త్ పూర్తి చేశా. రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్.. నారాయణగూడ రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్ బైపీసీలో చేరా. చదువులో యావరేజీ స్టూడెంట్‌నే.. తె లుసుకోవాలనే జిజ్ఞాస మాత్రం మెండుగా ఉండేది. అక్కడి నుంచి డిగ్రీ వనితా కాలేజీలో చేశా. డిగ్రీ ద్వితీయ సంవత్సరంలోనే నా వివాహం జరిగింది. దాంతో చదువుకు ఫుల్స్టాప్ పడింది. అలా కుదిరింది నా పెళ్లి విచిత్రంగా కుదిరింది. ఇంద్రారెడ్డిగారి బావ శర్వారెడ్డి మా నాన్న క్లోజ్ ఫ్రెండ్స్. ఆయనతో నాకు మ్యాచ్ చూడమని నాన్న చెప్పారట. దాంతో సంబంధాలను వెతుకుతున్న శర్వారెడ్డి ఈ విషయాన్ని ఇంద్రారెడ్డి చెవిన వేశారట. ఆయన కూడా తన ఫ్రెండ్స్‌లో సరిజోడిని చూసే పని లో పడ్డారట. ఈ సమయంలో ఓ ఫ్రెండ్ అన్న మాట మా వివాహానికి దారితీసింది. ‘ఎవరినో చూడడం ఎందుకు ను వ్వే చేసుకోవచ్చు గదా’ అన్నారట. దీంతో ఈ విషయా న్ని చెప్పేందుకు కామన్ ఫ్రెండ్ ద్వారా నన్ను కలిశారు. అప్పటికే ప్రగతిశీల భావాలు కలిగిన నేతగా, ఎమర్జెన్సీలో జైలు జీవితం గడిపిన వ్యక్తిగా ఆయన గురించి విన్నా. అప్పుడు ‘లా’ సెకండ్ ఈయర్ చదువుతున్న ఇంద్రారెడ్డి తన ఇష్టాయిష్టాలను నాతో పంచుకున్నారు. ఇష్టమైతేనే పెళ్లి చేసుకుందామని... కష్టమైతే ఎవరి దారి వారిదేనని చెప్పారు. సమాజంలో ఉన్నతస్థాయికి ఎదగాలనే ఆయన పట్టుదల చూసి కాదనలేకపోయా. నా అభీష్టానికి పెద్దలు కూడా అంగీకరించారు. లా పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఈ రెండేళ్లలో ఆయన వ్యక్తిత్వాన్ని ఆర్థం చేసుకున్నా. డాషింగ్.. డేరింగ్ 11 మంది సభ్యులు గల ఆ ఇంటికి చిన్న కోడలుగా వెళ్లినా..పెద్దతరహా బాధ్యతలు నిర్వర్తించా. ఇంద్రారెడ్డిది ముక్కుసూటితనం. కోపం వచ్చినా... సంతోషం వచ్చినా తట్టుకునేవారు కాదు. కొన్నిసార్లు బయటి ఒత్తిళ్లను మాపై చూపేవారు. ఆ కోపం నీటి బుడగలాంటిదే. నిమిషం తర్వాత కూల్ అయ్యేవారు. ‘సారీ.. ఈ రోజు ఫలానా సంఘటన జరిగింది. ఆ కోపాన్ని మీ మీద చూపాను. ఏమీ అనుకోవద్దనేవారు. ఆయన మనసెరిగిన మేం కూడా సీరియస్‌గా తీసుకునేవాళ్లం కాదు. ఆయన మాటలు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి ఎదురుపడిన ప్రతివారికీ నమస్కారం పెడుతుంటే మా వారిని టీజ్ చేసేదాణ్ని. ముక్కూ మొహం తెలియని వారిందరికీ దండాలు పెట్టడమేమిటీ? ఇదేం ఖర్మ అనే దానిని. అప్పుడు ఆయన అన్న మాటలు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి. ‘రాజకీయాల్లో ఉన్న మజా అనుభవిస్తేనే తెలుస్తుంది. పేదోళ్ల దీవెనలు పొందడం కన్న జీవితంలో ఇంతకంటే తృప్తేం ఉంటుంది’ అనేవారు. అదీ నా మనస్సులో ఇప్పటికీ మెదులుతూ ఉంటుంది. ఆ పద్నాలుగు రోజులు మావారి హఠాన్మరణం నన్ను కుంగదీసింది. ఆయన చనిపోయిన మూడోరోజే ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడింది. ఇది మరింత బాధించింది. 14 రోజుల వ్యవధిలో రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి రావడం మనోవేదనకు గురిచేసింది. ఒకవైపు అంతులేని విషాదం.. మరోవైపు ఏ పార్టీలో చేరాలనే మీమాంసతో తీవ్ర మానసిక వ్యధను అనుభవించా. టీడీపీ తరపున దేవేందర్, హరీశ్వర్‌రెడ్డి తదితరులు పరామర్శకు వచ్చి... ఏ నిర్ణయమైనా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీసుకో అమ్మా. మీకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ మరుసటి రోజు వచ్చిన అప్పటి సీఎల్పీ నేత వైఎస్సార్ ‘నా కుడిభుజం విరిగింది. తక్కువ సమయంలోనే ఇంద్రారెడ్డితో ఎక్కువ అనుబంధం ఏర్పడింది. నువ్వు మాతో ఉం టే చెల్లెలుగా చూసుకుంటా.అన్నగా అడుగుతున్నా. నిర్ణ యం నీదే’నని అన్నారు. రాజకీయ ప్రవేశాన్ని తొలుత నా ఇష్టానికే వదిలేసిన సమీప బంధువులు చివ రకు నిర్ణయా న్ని మార్చుకున్నారు. టీడీపీలో చేరాలని ఒత్తిడి తెచ్చారు. ఈ విషయంలో మా అత్తయ్య నాకు సపోర్ట్‌గా నిలిచారు. పిల్లలను కూడా అడిగా.. రాజకీయ ప్రవేశంపై పిల్లల అభిప్రాయం కూడా తీసుకున్నా. అప్పటివరకూ గహిణి బాధ్యతల్లో ఉన్న నేను.. రాజకీయాల్లోకి వెళితే పిల్లల బాగోగులు పట్టించుకునేదెవరని.. వారి మనోగతాన్ని కూడా తెలుసుకోవాలనుకున్నా. అత్తయ్య, నాన్న, అమ్మను కూర్చోబెట్టి పిల్లలు కార్తీక్, కౌశిక్, కళ్యాణ్‌లతో మాట్లాడా. వారి అంతరంగాన్ని తెలుసుకున్నాకే నామినేషన్ వేశా. అన్నలా ఆదరించారు వైఎస్ నన్ను తోబుట్టువులా ఆదరించారు. ‘చేవెళ్ల చెల్లెమ్మ.. సబితమ్మా’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. ఏ కార్యక్రమమైనా చేవెళ్ల నుంచే మొదలుపెట్టేవారు. ఆయనతోనే నాకు ఈ గుర్తింపు, ప్రాధాన్యత లభించాయి. అడిగిన పనిని కాదనకుండా చేసి నా పెద్దన్నలా వ్యవహరించేవారు. అందుకే ప్రతి రక్షాబంధన్కూ నా తమ్ముడితోపాటు వైఎస్‌కూ రాఖీ కట్టేదాణ్ని. మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నా వైఎస్ మరణంతో శూన్యం ఆవహించినట్లయింది. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు కూడా నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న సమయంలో శాంతిభద్రతలు కాపాడే అంశంపై మానసిక ఒత్తిడి అనుభవించా. తెలంగాణ కోసం పోరాడిన భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఉద్యమాన్ని నిలువరించలేక.. శాంతి భద్రతలను అదుపు తప్పకుండా చూడాల్సిన పరిస్థితుల్లో అంతులేని మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నా. అంతా విధిరాత.. నేనొక్క పల్లెటూరు అమ్మాయిని. నేనేంటి.. మంత్రి పదవిని చేపట్టడమేమిటి అని ఊహించుకుంటే విధి వింత నాటకమేనని అనిపిస్తుంది. సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసినప్పుడు కూడా ఒత్తిడికి లోనయ్యా. రాజకీయాల్లోకి వచ్చాక ఇవన్నీ సర్వసాధారణమేనని సర్దుకుపోతున్నా. పాపను పెంచుకున్నాం.. మాకు కూతురు లేకపోవడంతో మేనమామ కుమార్తెను పెంచుకున్నాం. చిన్నప్పుడు నన్ను సాకిన మేనమామ కుమార్తె మనీషాను కూతురులా చూసుకోవడమేగాకుండా పెళ్లి చేసి ఆయనతో రుణం తీర్చుకున్నా. ఈ విషయంలో మావారి గొప్ప హృదయానికి హాట్సాఫ్ చెప్పాల్సిందే. అసెంబ్లీ రికార్డుల్లో తనపై ఆధారపడినవారి జాబితాలో మనీషాను కూతురుగా నమోదు చేయడం ఆయన ఉదార మనస్తత్వానికి నిదర్శనం. సినిమాలు బాగా చూసేదాణ్ని కాలేజీ రోజుల నుంచి సినిమాలకు తెగ వెళ్లేదాణ్ని. రాజకీయాల్లోకి రాకముందే సినిమాలు, పాటలతోనే కాలక్షే పం. ఎప్పుడైతే రాజకీయాల్లో బిజీ అయ్యానో సినిమాలకు ఫుల్స్టాప్ పడింది. ప్రత్యేకంగా అభిమాన నటులంటూ ఎవరూ లేకపోయినా.. మంచి సినిమాలను వీక్షించేదాణ్ని. షాపిం గ్‌కు కూడా దూరమయ్యా. కిచెన్ వైపు కూడా వెళ్లలేదు. రా త్రిపూట డిన్నర్ మాత్రం కుటుంబసభ్యులమంతా కలిసే చేస్తాం. సందడే సందడి ముగ్గురు కుమారులు కార్తీక్, కౌశిక్, కళ్యాణ్. కోడలు స్రవంతి, మనవరాలు అక్షయని. 30 ఏళ్ల తర్వాత మనవరాలి రూపంలో మా ఇంట్లోకి ఆడ పిల్ల రావడం మా కుటుంబంలో సంతోషాన్ని నింపింది. 15 నెలల అక్షయని చేసే అల్లరిచేష్టలు అన్నీఇన్నీ కావు. సంతోషం కలిగింది చేవెళ్లలో విత్తనాల కోసం ధర్నా చేసిన రైతులపై పోలీసులు ఫైరింగ్ జరపడంతో కౌకుంట్లకు చెందిన ఓ రైతు చనిపోయారు. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ను అభ్యర్థించాను. ఎప్పుడో చనిపోయిన కుటుంబానికి భూమి ఎందుకు అని ప్రశ్నించకుండా..తన తొలి పర్యటనలోనే భూ పంపిణీ చేశారు. ఇది నాకు అత్యంత సంతోషాన్ని కలిగించిన సంఘటన.