తాండూరు: కర్ణాటక సరిహద్దులోని బషీరాబాద్ మండలం జీవన్గిలో బ్రిడ్జి నిర్మాణం కలగానే మారింది. ఏళ్లుగా ఈ బ్రిడ్జి నిర్మాణానికి చేస్తున్న ప్రతిపాదనలు బుట్టదాఖలవుతూనే ఉన్నాయి. దీంతో బషీరాబాద్ మండలంలోని సుమారు ఇరవై గ్రామాల ప్రజల నిరీక్షణ ఫలించడం లేదు. రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రారెడ్డి హయాంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి అప్పట్లో శంకుస్థాపన జరిగింది. పనులు పునాది దశలోనే ఆగిపోయాయి. పదేళ్ల క్రితం మరోసారి పనులు మొదలుపెట్టినా అంతలోనే ఆపేశారు. తాజాగా ఆర్‌అండ్‌బీ అధికారులు ఈ బ్రిడ్జి నిర్మాణానికి మళ్లీ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపడంతో స్థానకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
దూరం తగ్గుతుంది
బషీరాబాద్ నుంచి తాండూరుకు రావడానికి సుమారు 30 కి.మీ.దూరం అవుతుంది. అయితే ఈ బ్రిడ్జి నిర్మిస్తే జీవన్గీ నుంచి కరన్‌కోట మీదుగా తాండూరుకు వచ్చే అవకాశం ఉండటంతో 12 కి.మీ. దూరం తగ్గుతుంది. బషీరాబాద్ నుంచి జీవన్గీతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కరన్‌కోట్ మీదుగా కర్ణాటకలోని సులేపేట్, చించొళి, గుల్బర్గా, ఉమ్మాబాద్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఆ గ్రామాల ప్రజలు తాండూరుకు వచ్చి కర్ణాటకలోని గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది.
కరన్‌కోట్ నుంచి సేడం హైవేకు...
తాండూరు మండలంలో నాలుగు సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. ఆయా సిమెంట్ కర్మాగారాల నుంచి సిమెంట్ ఉత్పత్తుల లారీలు పెద్ద సంఖ్యలో కర్ణాటకు వెళుతుంటాయి. ఈ బ్రిడ్జి అందుబాటోకి వస్తే ఈ లారీల రాకపోకలకు కూడా దూరం కలిసొచ్చే అవకాశం ఉంది. కర్ణాటకకు వెళ్లే సిమెంట్ లారీలన్నీ గౌతాపూర్, తాండూరు మీదుగా మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మీదుగా కర్ణాటకు వెళుతుంటాయి. భారీ వాహనాలు తాండూరులోకి ప్రవేశించడం వల్ల ట్రాఫిక్ సమస్యలూ తలెత్తుతున్నాయి.
కాగ్నాపై బ్రిడ్జి నిర్మాణం జరిగితే సిమెంట్ లారీలు తాండూరులోకి ప్రవేశించకుండానే నేరుగా కరన్‌కోట్ నుంచి జీవన్గీ, మైల్వార్, ఆడ్కి మీదుగా కర్ణాటకలోని సేడం హైవేకు వెళ్లొచ్చు. దీనివల్ల దూరం తగ్గుతుంది. సరిహద్దులో అంతరాష్ట్ర రవాదారితో లింకు ఏర్పడే ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఇటీవల తాండూరు ఆర్‌అంబీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి కూడా ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలనే పట్టుదలతో ఉన్నారు. మరి ఈసారైనా బ్రిడ్జి నిర్మాణానికి నోచుకుంటుందా లేదా వేచి చూడాల్సిందే.
రూ.6 కోట్లతో ప్రతిపాదనలు: డీఈఈ జానకిరాములు
జీవన్గీలో కాగ్నా నది(వాగు)పై బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవలనే రూ.6కోట్లతో ప్రతిపాదనలు పంపించామని డీఈఈ జానకీరాములు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు.
కర్ణాటక సరిహద్దులో.. కలగా మారిన జీవన్గి బ్రిడ్జి!
Published Sun, Nov 23 2014 12:23 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement