70 కి.మీ నిడివి..రూ.1,400 కోట్ల అంచనా వ్యయం
రైల్వే శాఖ ప్రతిపాదన నేపథ్యంలో ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభం
లైన్ పూర్తయితే ప్రయాణికులకు సౌకర్యం..సరుకు రవాణాకు అనుకూలం
సాక్షి, హైదరాబాద్: సిమెంటు పరిశ్రమల క్లస్టర్‌గా ఉన్న తాండూరు నుంచి జహీరాబాద్ వరకు 70 కి.మీ నిడివితో కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రతిపాదించిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు దాని సాధ్యాసాధ్యాలను తేల్చేందుకు ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభించింది. సికింద్రాబాద్– వాడి మార్గంలో ఉన్న తాండూరు, సికింద్రాబాద్ నుంచి బీదర్ మార్గంలో ఉన్న జహీరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. సిమెంటు, నాపరాయి, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు కూడా భారీగానే ఉంటుంది. వెరసి ఇటు ప్రయాణికులకు, అటు సరుకు రవాణాకు ఈ కొత్త మార్గం అనుకూలంగా ఉంటుంది.
ప్రస్తుతం రైల్లో రెట్టింపు దూరం..
తాండూరు–జహీరాబాద్ మధ్య దూరం (రోడ్డు మార్గం) 54 కి.మీ మాత్రమే. అదే రైలులో వెళ్లాలంటే 104 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. వికారాబాద్ మీదుగా వెళ్లాల్సి రావటమే దీనికి కారణం. జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు తాండూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం చాలామంది వస్తుంటారు. రైలులో చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ఎక్కువగా రోడ్డు మార్గానే వెళ్తారు. ఇక ముంబై వైపు వెళ్లేవారు ముంబై జాతీయ రహదారి మీద ఉన్న జహీరాబాద్‌కు వెళ్లి రోడ్డు మార్గాన వెళ్లే వాహనాలను ఆశ్రయిస్తారు. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణికుల రద్దీ బాగానే ఉంటోంది.
ఇక తాండూరు చుట్టుపక్కల ఉన్న సిమెంటు పరిశ్రమలు, నాపరాయి పరిశ్రమల నుంచి రైళ్ల ద్వారా సరుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంటుంది. బీదర్ మార్గంలో సరుకు వెళ్లాలంటే వికారాబాద్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రూ.1,400 కోట్ల అంచనా వ్యయంతో తాండూరు నుంచి నేరుగా జహీరాబాద్‌కు కొత్త రైల్వే లైన్‌ను గతంలో రైల్వే శాఖ ప్రతిపాదించింది. గతేడాది చివరలో ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరైంది. దీంతో మూడు రోజుల క్రితం ఆ పనులు మొదలయ్యాయి. ఈ లైన్ పూర్తయింతే గంట సేపట్లో రైళ్లు గమ్యం చేరతాయి. జహీరాబాద్ నుంచి వాడీకి ఇది దగ్గరి దారిగా మారుతుంది. అటు వాడీ మార్గంలో, ఇటు సికింద్రాబాద్ మార్గంలో ఒకేసారి రైళ్లు ప్రయాణించేందుకు ఇది ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment