మియాపూర్ నుంచి జహీరాబాద్‌కు రైల్వేలైన్
* రూ.450 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు
* సంగారెడ్డి నుంచి నాందేడ్ అకోల వరకు నాలుగు లేన్ల రోడ్డు
* జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ వెల్లడి
సదాశివపేట: మియాపూర్ నుంచి సంగారెడ్డి వయా సదాశివపేట మీదుగా జహీరాబాద్ వరకు రైల్వే లైన్ వేసేందుకు రూ. 450 కోట్ల ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. ఆదివారం సదాశివపేట పట్టణంలోని ఐబీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మూడు గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాలను అభివృద్ధి చేయనున్నట్లు బీబీ పాటిల్ వెల్లడించారు.
అందులో భాగంగానే ఇప్పటికే నిజామాబాద్ జిల్లాజుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కవలాస్ గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, రెండవ విడతగా మెదక్ జిల్లాలోని జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఝరాసంగం గ్రామాన్ని దత్తత తీసుకుని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. సంగారెడ్డి నుంచి నాందేడ్, అకోలా వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని ఎంపీ తెలిపారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, మంజీర రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.