
వస్త్ర తయారీ ప్రక్రియలో రంగుల అద్దకం అంతర్భాగం. రంగులు వేసే పద్ధతులుప్రాంతాన్ని బట్టీ మారుతుంటాయి. అయితే అసలు సమస్య... రసాయన రంగులతోనే. ఈ సమస్యకు పరిష్కారంగా జహీరాబాద్‌లోని దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) సహజ వర్ణాలకు పెద్ద పీట వేస్తోంది. మోదుగు, తంగేడు, నీలగిరి బెరడు... మొదలైన వాటి రంగులను దుస్తుల అద్దకంలో వాడేలా మహిళలకు శిక్షణ ఇచ్చింది.
రసాయన రంగులతో తయారైన దుస్తులు చర్మానికి హానికరంగా మారుతున్నాయి. కొందరికి రసాయన రంగుల బట్టలు అసలు పడవు. హానికరమైన రంగులతో ఒక్కోసారి చర్మ సంబంధిత క్యాన్సర్‌కు సైతం దారితీసే అవకాశాలుంటాయి. వీటిని అధిగమించేందుకు సహజసిద్ధమైన రంగులతో ‘టై అండ్ డై’ పద్ధతిలో కృషి విజ్ఞాన కేంద్ర (కేవీకే)తో కలిసి మహిళలకు శిక్షణ ఇస్తోంది దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ.
మిల్లెట్ సాగునుప్రోత్సహించే దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) సంస్థ ఇప్పుడు మారుమూలప్రాంతాల్లోని మహిళల్లో రకరకాల నైపుణ్యాలను పెంపోందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో సహజ రంగులతో అద్దకం కళ కూడా ఒకటి.
ఈ టై అండ్ డై (అందమైన డిజైన్‌ల అద్దకం)లో ఉండే వివిధ రకాల పద్ధతులను గ్రామీణ మహిళలకు వివరిస్తున్నారు. లహరియ, చెవ్రాన్, ప్లీటింగ్, బండ్లింగ్, క్లమ్పింగ్, బాందిని వంటి వివిధ రకాల ‘టై అండ్ డై’ పద్ధతులలో శిక్షణ ఇస్తున్నారు.
‘మనకు నిత్యం అందుబాటులో ఉండే వాటితో రంగులు తయారు చేయడం, వాటితో బట్టలపై అద్దకం (టై అండ్ డై) నేర్చుకోవడం సంతోషంగా ఉంది. రంగుల తయారీ, అద్దకంపై ప్రతి దశలోనూ మాకు సులభంగా అర్థం అయ్యేలా చెప్పారు. మేము సొంతంగా డిజైన్ లు చేయడం గర్వంగా ఉంది’ అంటుంది శ్రీవాణి.
‘చెట్ల వేర్లు, కాండం నుంచి రంగులు ఎలా తీయవచ్చు అనేది నేర్చుకున్నాను. ఆ రంగులను బట్టలకు ఎలా అద్దాలి అనే దాని గురించి శిక్షణ పోందాము. ఇలాంటి విధానం పర్యావరణానికి మేలు చేస్తుంది. హానికరమైన రసాయనాల కంటే ప్రకృతి సిద్ధమైన రంగులు ఎంతో మేలు’ అంటుంది విజయలక్ష్మి.
దేశవ్యాప్తంగా వస్త్ర తయారీ పరిశ్రమలో సహజ రంగులప్రాముఖ్యత పెరుగుతోంది. ప్రతిప్రాంతంలో వస్త్ర పరిశ్రమ తనదైన మూలాలను వెదుక్కుంటుంది. ఈ నేపథ్యంలో దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ చేపడుతున్న కార్యక్రమాలు ఒకవైపు ప్రకృతికి మేలు చేస్తున్నాయి. మరోవైపు మహిళలలోని సహజ సృజనాత్మకతకు మెరుగులు దిద్దుతున్నాయి. – పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
సృజన ప్లస్ ఉపాధి
కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మహిళల్లో స్వయం ఉపాధిని పెంపోందించడానికి వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ‘టై అండ్ డై’పై గ్రామీణ మహిళలకు ఉచిత శిక్షణ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. మహిళలు ఉత్సాహంగా నేర్చుకోవడం సంతోషంగా ఉంది. – హేమలత, శాస్త్రవేత్త
Comments
Please login to add a commentAdd a comment