training program
-
వాణిజ్య పంటలవైపు రైతులను ప్రోత్సహించాలి
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పంటల సాగువైపు రైతాం గాన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ప్రధా నంగా పంటల మార్పిడిపైన విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన వ్యవసాయ అధికారులకు శనివారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రానున్న ఐదేళ్లలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా ని లబెట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేస్తోం దని అన్నారు. ప్రభుత్వ సంకల్పంలో వ్యవసాయాధికారులంతా భాగస్వామ్యం కావాలన్నారు. సాంకేతికంగా వస్తున్న మార్పుల ను, పద్ధతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్డేట్ కావా లన్నారు. నూతన విషయాలు తెలుసుకునే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి, కోర్సు కోఆర్డినేటర్ ఉషారాణి, ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ శశాంక్ గోయల్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా నియమితులైన అధికారులు ముఖ్యమంత్రి సహాయనిధి కోసం రూ.51 వేల చెక్కును మంత్రి తుమ్మలకు అందచేశారు. -
గిరిజన భూ వివాదాలకు సత్వర పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గిరిజన భూ వివాదాల సత్వర పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని గిరిజనులకు చెందిన షెడ్యూల్డ్ ఏరియా ‘భూ బదలాయింపు నిబంధనలు (ఎల్టీఆర్) 1/70’ ప్రకారం వారి హక్కులను కాపాడేలా పక్కా కార్యాచరణ చేపట్టింది. దాదాపు 1976 నుంచి పేరుకుపోయిన వేలాది ఎల్టీఆర్ కేసుల్లో వేగంగా విచారణ జరిపి సత్వర న్యాయం అందించే దిశగా ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చడంతోపాటు ఇటీవల ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ఎల్టీఆర్ కేసులు విచారణ వేగవంతం చేయడం, పాత కేసుల్లోని భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, కొత్తగా నమోదైన కేసులను 6 నెలల గడువులోను, అప్పీల్‌కు వెళ్లిన కేసులు రెండు నెలల్లో పరిష్కరించాలని ఆదేశాలిచ్చింది. అప్పటికీ వివాదం కొలిక్కిరాకపోతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కమిషనర్ విచారణకు వెళుతుంది. కేసుల్లో గిరిజనులకు అనుకూలమైన ఉత్తర్వులను వేగంగా అమలులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. గిరిజనులకు వ్యతిరేకంగా వచ్చింన వాటి వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయడంతోపాటు ఆయా గ్రామ సచివాలయాల వద్ద ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎల్టీఆర్ కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఐటీడీఏ పీవోలు, మైదాన ప్రాంత కలెక్టర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదిక పంపించాలి. ఎల్టీఆర్ కేసులు, హక్కులపై ఐటీడీఏల పరిధిలో వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా గిరిజనులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలు ఇచ్చింది. గిరిజన భూములకు రక్ష 1/70 యాక్ట్ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించారు. భూములకు సంబంధించి 1/70 (1959 చట్ట సవరణ) సెక్షన్–3తో గిరిజనులకు భూములపై హక్కులున్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులకు చెందిన భూములు వారే అనుభవించాలి. గిరిజనులు నుంచి గిరిజనులు భూములు పొందచ్చు. గిరిజనుల నుంచి గిరిజనేతరులు కొనుగోలు చేయడం, ఆక్రమించడం వంటివి చెల్లవు. భూముల అన్యాక్రాంతాన్ని నిరోధించడమే దీని ఉద్దేశం. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతం (షెడ్యూల్డ్ ఏరియా) 37 మండలాల పరిధిలోని 3,512 గ్రామాల్లో నివసించే వారికి ఈ హక్కులు వర్తిస్తాయి. గిరిజనులకు చెందిన భూవివాదాల పరిష్కారం కోసం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాలకు చెందిన రంపచోడవరం, పాడేరు, పార్వతీపురం, సీతంపేట, కోట రామచంద్రపురం, పోలవరం ఐటీడీఏల పరిధిలో ఐదు ప్రత్యేక ఎల్టీఆర్ కోర్టులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో భూ వివాదాలను తొలుత డిప్యూటీ తహసిల్దార్ (డీటీ) గుర్తించి నోటీసులు జారీ చేస్తారు. తగిన సమాచారం సేకరించిన అనంతరం ఐటీడీఏల పరిధిలోని పాడేరు, రంపచోడవరం, ఎల్వీఎన్ పేట, కేఆర్ పురం, పోలవరం కోర్టుల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు విచారణ చేపడతారు. ఈ వివాదాల్లో తగిన పత్రాలు, ఆధారాలను సమర్పించడం ద్వారా భూమి ఎవరిదో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎల్టీఆర్ ఆర్డర్ అమలు ఇలా ♦ ప్రారంభం (1976) నుండి ఈ ఏడాది జూన్ వరకు 29,810 ఎల్టీఆర్ వివాదాలు(1,47,554 ఎకరాలు) గుర్తించారు. ♦ 12,678 కేసులు (56,882 ఎకరాలు) గిరిజనులకు అనుకూలంగా ఉత్తర్వులు అమలయ్యాయి. ♦ 11,754 కేసుల్లో 51,278 ఎకరాలను గిరిజనులకు స్వాదీనం చేశారు. ♦ 924 కేసుల్లో 5,604 ఎకరాలను అప్పగించాల్సి ఉంది. మరికొన్ని కేసులు పలుస్థాయి (కోర్టు)ల్లో పెండింగ్‌లో ఉన్నాయి. -
వైద్య ఆరోగ్య రంగంలో అగ్రగామి ఏపీ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య రంగంలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్), శిశు మరణాల రేటు (ఐఎంఆర్)లో జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉందన్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం నూరా హెల్త్ సంస్థ, యూనిసెఫ్ల సహకారంతో వైద్య శాఖ కేర్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంపై ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బందికి విజయవాడలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడారు. ప్రతి లక్ష ప్రసవాలకు దేశంలో ఎంఎంఆర్ 97గా ఉంటే ఏపీలో 45గా ఉందని, ఐఎంఆర్ దేశంలో 28గా ఉంటే రాష్ట్రంలో 24కు తగ్గిందని చెప్పారు. ఎంఎంఆర్, ఐఎంఆర్‌ను సింగిల్ డిజిట్‌కు తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఈ కేర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాతా శిశు సంరక్షణ, రక్తహీనత సమస్య నివారణ.. ఇలా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో దేశంలోనే ఒకటి, రెండోస్థానాల్లో రాష్ట్రం ఉండాలన్న సీఎం జగన్ లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, నూరా హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సీమామూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ కె.వి.ఎన్.ఎస్.అనిల్‌కుమార్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.అర్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు ఆగవు రాష్ట్రంలో మే ఒకటో తేదీ నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు సేవలను నిలిపేస్తున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కృష్ణబాబు కోరారు. ఆరోగ్యశ్రీ పథకానికి అత్యంత ప్రా«దాన్యం ఇస్తున్న సీఎం జగన్ బిల్లుల చెల్లింపు విషయంలోను తీవ్రజాప్యం లేకుండా చూస్తున్నారని చెప్పారు. ఇటీవల బిల్లు చెల్లింపుల్లో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమేనని, పెండింగ్ బిల్లుల్లో కొంత భాగాన్ని త్వరలోనే చెల్లిస్తామని తెలిపారు. రూ.రెండువేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నది వాస్తవం కాదని, రూ.800 కోట్ల మేర మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. గతంలో ఆరోగ్యశ్రీ, అనుబంధ సేవలకు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తుంటే.. ప్రస్తుతం రూ.మూడువేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. దీన్నిబట్టి ఈ పథకంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థం అవుతోందని చెప్పారు. -
నాయకత్వాభివృద్ధికి హార్వర్డ్ కిటుకులు!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఎక్కువగా పాఠ్యాంశాల అభ్యసనకే పరిమితమవుతుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిజ జీవితంలో, వృత్తి పరమైన అంశాల్లో ఎదుగుదలకు సబ్జెక్టు ఉంటేనే సరిపోదు. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటేనే పోటీ ప్రపంచంలో నెగ్గుకువచ్చే అవకాశాలుంటాయి. ఈ ఉద్దేశంతోనే మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), బీసీ సంక్షేమ శాఖలు ఆ దిశగా సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చాయి. ‘2023 ప్రోగ్రామ్ ఫర్ సైంటిఫికల్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప్ (పీఎస్‌ఐఎల్)’ పేరిట గురుకుల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల పెంపుదల కోసం అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ది లక్ష్మీ మిట్టల్ అండ్ ఫ్యామిలీ సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంతో బీసీ గురుకుల సొసైటీ అవగాహన కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వారం రోజుల పాటు ప్రత్యేక అవగాహన, శిక్షణా కార్యక్రమాలను ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 108 మంది బీసీ గురుకుల సొసైటీ విద్యార్థులు, బీసీ హాస్టల్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. హార్వర్డ్ వర్సిటీ నుంచి ప్రత్యేకంగా ఐదుగురు ఇన్స్ట్రక్టర్లు, ఓయూ నుంచి ఐదుగురు ఇన్స్ట్రక్టర్ ఫెలోస్ విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అవగాహన కుదుర్చుకున్న మూడు సంస్థల ప్రతినిధులతో పాటు బీసీ గురుకుల సొసైటీ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలలు, బీసీ సంక్షేమ హాస్టళ్లలోని ఎనిమిదో తరగతి, ఆపై తరగతుల్లో చదువుతున్న విద్యార్థుల్లో చురుకైన 108 మందిని బీసీ గురుకుల సొసైటీ గుర్తించి ఎంపిక చేసింది. ఇందుకోసం అంతర్గతంగా ప్రత్యేక పరీక్షను నిర్వహించింది. తొలిదశలో ఇలా ఎంపికైన విద్యార్థులకే ప్రత్యేక అవగాహన, శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సైంటిఫిక్ రేసిజం, ది ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇఫ్ స్టార్ట్స్ విత్ అన్ అబ్జర్వేషన్, ది ఎసెన్షియల్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్, సినిమా అండ్ సోషల్ చేంజ్ అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వా లీబాల్, రగ్బీ వంటి క్రీడలతో పాటు నృత్యం, ఆ త్మరక్షణ, కరాటేపై కూడా సామూíßæ క చర్చలు జరిపి స్తున్నారు. శిక్షణా నంతరం సంబంధిత ఇన్స్ట్రక్టర్లు, ఇన్స్ట్రక్టర్ ఫెలోస్‌తో నిరంతర అనుసంధాన వ్యవస్థను సొసైటీ ఏర్పాటు చేయనుంది. ఇలా శిక్షణ పొందిన గురుకుల విదార్థులను జిల్లాల వారీగా విభజించి గురుకుల పాఠశాలల్లోని పిల్లలకు రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరిస్తూ వాటిల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహింపజేయనున్నారు. మొత్తంగా ప్రతి గురుకుల విద్యార్థిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించేందుకు బీసీ సంక్షేమ శాఖ, బీసీ గురుకుల సొసైటీ ముందుకు సాగుతున్నాయి. ఆలకించడం, భావ వ్యక్తీకరణ కీలకం ఇతరులు చెప్పే విషయాల్ని ముందుగా శ్రద్ధగా వినాలి. ఆ తర్వాత మనం చెప్ప దలచుకున్న విషయాన్ని ఎలాంటి భయం లేకుండా స్పష్టంగా తెలియజేయాలి. ఈ నైపుణ్యాన్ని క్రమంగా మెరుగుపరుచుకుంటే ఎక్కడైనా, ఎలాంటి వారితోనైనా ధైర్యంగా మాట్లాడగలననే నమ్మకం కుదిరింది. – సాయికిరణ్, బీసీ గురుకుల పాఠశాల, జైనథ్, ఆదిలాబాద్ జిల్లా ఆత్మవిశ్వాసం పెరుగుతోంది.. స్టేజీపైన మాట్లాడాలంటే ఎంతో ఆందోళన చెందేదా న్ని. ఈ ప్రత్యేక కార్యక్రమంతో నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఇతరులతో మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజీ, భాషపై పట్టు పెంచుకోవడంలో మెళకువలెన్నో నేర్చుకుంటున్నా. – సంఘవి, బీసీ గురుకులం, రామచంద్రాపురం, సంగారెడ్డి జిల్లా -
30 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా భవిష్యత్ ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. 40 శాతానికి పైగా రాష్ట్ర జనాభా పట్టణాల్లో నివసిస్తోందని, ఐదారేళ్లలో రాష్ట్రంలోని మెజారిటీ జనాభా పట్టణాల్లో నివసించే అవకాశముందని చెప్పారు. అత్యధిక శాతం పట్టణ జనాభా గల రాష్ట్రంగా త్వరలో తెలంగాణ మారుతుందన్నారు. పెరుగుతున్న పట్టణీకరణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణం రానున్న 30 ఏళ్లలో ఏర్పడనున్న అవసరాలను తెలుసుకుని, ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ప్రారంభించాలని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లు, హైదరాబాద్ పరిసర మున్సిపాలిటీల కమిషనర్లు, జిల్లా అదనపు కమిషనర్లకు ఎంసీఆర్‌హెచ్చార్డీలో నిర్వహించిన రెండ్రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో బుధవారం మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఆదాయ పెరుగుదలకు వినూత్న పద్ధతులు.. హైదరాబాద్ చుట్టుపక్కల పురపాలికల్లో, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ పట్టణీకరణ వేగంగా జరుగుతుందని, అక్కడ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతను పెంచాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు. ప్రతి పురపాలిక తన ఆదాయ వనరుల విషయంలో ప్రత్యేక ఆడిట్ చేపట్టి రానున్న సంవత్సరాల్లో ఆదాయ పెరుగుదలకు సంబంధించిన వినూత్నమైన పద్ధతులను ఎంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో తొలుత మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా కేటీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఒక ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించారు. పరిపాలన వికేంద్రీకరణ సాధనంగా.. పెరుగుతున్న జనాభాకు అవసరమైన సేవలను అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని.. ఈ మేరకు పరిపాలన వికేంద్రీకరణ ఒక సాధనంగా ఎంచుకుందని కేటీఆర్ చెప్పారు. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, గ్రామాల సంఖ్యను పెద్ద ఎత్తున పెంచి ప్రజల వద్దకు పరిపాలన తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. -
సానుకూల ధోరణితో విధులను స్వీకరించాలి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగరీత్యా నిర్వర్తించే ప్రతీ పనిని సానుకూల ధోరణితో స్వీకరించినప్పుడే పోలీసుల విధి నిర్వహణకు సార్థకత చేకూరుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో (టీఎస్పీఏ) బుధవారం జరిగిన ట్రైనీ ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐల శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి వ్యక్తి ఆత్మగౌరవం దెబ్బతినకుండా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. చట్టాలకు లోబడి ధనిక, పేద తేడా లేకుండా సేవలను అందించాలని పోలీసు అధికారులకు సూచించారు. మన అధికారాలు సామాన్య ప్రజల సేవలకు ఉపయోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్, అకాడమీ జాయింట్ డైరెక్టర్ కె.రమేష్ నాయుడు, డిప్యూటీ డైరెక్టర్ బి.నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో 5,6 తేదీల్లో డా. ఖాదర్ సభలు
అటవీ కృషి నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార, ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్ వలి సభలు 2020 జనవరి 5,6 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ సభలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. బి.హెచ్.ఇ.ఎల్.లో: 5వ తేదీ (ఆదివారం) ఉ. 10 గం. నుంచి మ. 1 గం. వరకు హైదరాబాద్ రామచంద్రాపురంలోని బి.హెచ్.ఇ.ఎల్. కమ్యూనిటీ సెంటర్లో డా. ఖాదర్ సభ జరుగుతుంది. వివరాలకు.. ప్రవీణ్‌బాబు – 76619 09151. ప్రగతి రిసార్ట్స్‌లో: 5వ తేదీ (ఆదివారం) సా. 4 గం. నుంచి మ. 7 గం. వరకు హైదరాబాద్ శివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో డా. ఖాదర్ వలి సభ జరుగుతుంది. జె.ఎన్.టి.యు.లో: హైదరాబాద్ కూకట్పల్లి జె.ఎన్.టి.యు. ఆవరణలోని యు.జి.సి. హెచ్.ఆర్.డి.సి. ఆడిటోరియంలో 6వ తేదీ (సోమవారం)న ఉ. 9 గం. నుంచి మ. 11 వరకు జరిగే సభలో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. డా. రమణానాయక్ – 95551 63014, డా. కరుణాకర్‌రెడ్డి – 90529 98899. ఉస్మానియావర్సిటీలో: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో 6వ తేదీ(సోమవారం) సా. 3 గం. నుంచి 5 గం. వరకు డా. ఖాదర్ వలి సభ జరుగుతుంది. వివరాలకు.. డా. రమణానాయక్– 95551 63014. ఫిబ్రవరి 7–9 తేదీల్లో విశాఖలో ఆర్గానిక్ మేళా 7న గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం నేలతల్లికి ప్రణమిల్లుతూ రసాయనిక అవశేషాల్లేని అమృతాహారాన్ని పండించే రైతులు తమ ఆహారోత్పత్తులను తాము నిర్ణయించిన ధరకు నేరుగా వినియోగదారులకు అమ్ముకునేందుకు, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకోవడానికి రైతుల మేళాలు ఎంతగానో ఉపకరిస్తాయి. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం (ఆం. ప్ర.) 2020 ఫిబ్రవరి 7,8,9 తేదీల(శుక్ర, శని, ఆదివారాల)లో విశాఖపట్నం ఎం.వి.పి. కాలనీలోని ఎ.ఎస్.రాజా గ్రౌండ్స్ (ఆళ్వార్‌దాస్ గ్రౌండ్స్)లో విశాఖ ఆర్గానిక్ మేళా నిర్వహించనుంది. వివరాలకు.. 99512 82288, 81251 77871, 94908 10438, 98495 22191. -
22న సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై శిక్షణ
సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో రైతులకు ఈ నెల 22(ఆదివారం)న శిక్షణ ఇవ్వనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన నిపుణులు డా. జి. రాంబాబుతోపాటు గొర్రెలు, మేకల పెంపకంలో అనుభవజ్ఞులైన రైతులు శిక్షణ ఇస్తారన్నారు. ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరే వారు సంప్రదించాల్సిన నంబర్లు: 970 538 3666, 0863–2286255 22న కాకినాడలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ శిక్షణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై లోతైన అవగాహన కలిగించే లక్ష్యంతో సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్(సేవ్) స్వచ్ఛంద సంస్థ ఈ నెల 22 (ఆదివారం)న కాకినాడ విద్యుత్‌నగర్‌లోని చల్లా ఫంక్షన్ హాల్ (వినాయకుడి గుడి ఎదుట)లో ఉ. 8.30 గం. నుంచి సా. 5.30 గం. వరకు రైతులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? పెట్టుబడి, ఖర్చులు తగ్గించుకునే మార్గాలు, రైతులు పంట దిగుబడులను మొత్తం నేరుగా అమ్ముకోకుండా కొంత మోత్తాన్ని విలువ ఆధారిత ఉత్పత్తులగా మార్చి అమ్ముకోవడం, అధికాదాయం కోసం ప్రయత్నాలు, దేశీ విత్తనాల ఆవశ్యకత, దేశీ ఆవు విశిష్టత తదితర అంశాలపై సేవ్ సంస్థ వ్యవస్థాపకులు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్ శిక్షణ ఇస్తారు. ప్రవేశ రుసుము: ఒక్కొక్కరికి రూ. వంద. ఆసక్తి గల రైతులు ముందుగా తమ పేర్లను ఫోన్ చేసి నమోదు చేసుకోవాలి.. వివరాలకు.. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ సమాచార కేంద్రం: 04027654337, 86889 98047 94495 96039 మార్చిలో జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ భూతాపోన్నతిని శాశ్వత వ్యవసాయ (పర్మాకల్చర్) పద్ధతుల్లో సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలపై రైతాంగంలో చైతన్యం తెచ్చే లక్ష్యంతో వచ్చే ఏడాది మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ జరగనుంది. తెలంగాణలోని జహీరాబాద్ దగ్గర్లోని బిడకన్నె గ్రామంలో అరణ్య పర్మాకల్చర్ అకాడమీలో ఈ మూడు రోజుల మహాసభ జరగనుందని అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ తెలిపింది. 20న ప్రకృతి సేద్య పద్ధతుల్లో కూరగాయల సాగుపై శిక్షణ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయల సాగుపై కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలోని రామరాజు గారి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 20 (శుక్రవారం)న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆం. ప్ర. శాఖ తరఫున రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. కూరగాయల సాగులో కొత్త పద్ధతులను అనుసరిస్తున్న సీనియర్ రైతులు అనుభవాలను పంచుకుంటారు. వివరాలకు.. 78934 56163 -
‘గ్రామ వలంటీర్లు రాజకీయాలకు అతీతంగా ఉండాలి’
సాక్షి, కాకినాడ : రాష్ట్రంలోని పాలనా వ్యవస్థల్లో మార్పు తీసుకువచ్చేందుకు.. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో వలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చామని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో గ్రామ వలంటీర్ల మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమనికి శుక్రవారం ఆయన హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ వలంటీర్లు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. ‘మీ పనితీరు ప్రభుత్వానికి అద్దం పట్టేలా ఉండాలి. వలంటీర్లు తప్పు చేస్తే వెంటనే వారిని తొలగించి కొత్త వారిని నియమిస్తాం’ అని స్పష్టం చేశారు. అదే విధంగా గత ప్రభుత్వ జన్మభూమి కమిటీల మాదిరిగా కాకుండా.. గ్రామ వలంటీర్ వ్యవస్థ అందుకు భిన్నంగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. కాగా వలంటీర్ వ్యవస్థ నియంత్రణ మొత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దే ఉంటుందని వెల్లడించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నాం అని మంత్రి తెలిపారు. అన్న క్యాంటిన్లు తొలగించలేదని, బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తున్నామన్నారు. దీంతో పాటు గోదావరి వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. -
20న ఓట్ల లెక్కింపుపై శిక్షణ: రజత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 23న నిర్వహించనున్న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ ఈ నెల 20న నగరంలోని ఓ హోటల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపులో ఎదురయ్యే సమస్యలు, వాటికి పరిష్కారాలు, కచ్చితమైన ఫలితాల ప్రకటన తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. -
ఊరు రూపు రేఖలు మార్చేందుకు ఐదేళ్ల ప్రణాళిక
-
16న కొర్నెపాడులో జీవన ఎరువులపై శిక్షణ
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అన్ని పంటల్లో జీవన ఎరువుల వాడకం, రైతు స్థాయిలో వాటి తయారీపై ఉ. 10 గం.ల నుంచి సా. 5 గం.ల వరకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు. కరీంనగర్ జిల్లా రైతు కొక్కు అశోక్‌కుమార్ శిక్షణ ఇస్తారు. అనంతరం ఉచితంగా మదర్ కల్చర్ పంపిణీ చేస్తారు. వివరాలకు..8367535439, 0863–2286255. -
నమ్మకానికి,నిబద్ధతకు ప్రతీక వైఎస్ జగన్
-
కార్పొరేట్ విద్యనందించడమే లక్ష్యం
డీఈఓ రామలింగం గూడూరు: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యమని డీఈఓ మువ్వా రామలింగం పేర్కొన్నారు. స్థానిక జెడ్పీ బాలురు ఉన్నత పాఠశాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. డీఈఓ మాట్లాడుతూ జిల్లాలోని 100 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సోమవారం నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ మేరకే 6 నుంచి 10 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మిగిలిన పాఠశాలల్లో కూడా డిజిటల్ తరగతులు బోధించేందుకు దాతల సాయాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. కార్పొరేట్ స్థాయికి తీసిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎన్నో నూతన విద్యా వరవడులకు శ్రీకారం చుడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ మంజులాక్షి, ఎంఈఓ ఇస్మాయిల్, రవీంద్ర, రిసోర్స్ పర్సన్లు సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, ఖాధర్‌బాష, జగదీష్ పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన పెంచాలి
నెల్లూరు(అర్బన్): సీజనల్ వ్యాధులైన డెంగీ, చికున్‌గున్యా, మలేరియా, మెదడు వాపు, ఫైలేరియా తదితర వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా వైద్య శిక్షణ మండలి డాక్టర్ పెద్దిశెట్టి రమాదేవి అన్నారు. స్థానిక గాంధీనగర్‌లోని మహిళా ప్రాంగణంలో ఆశ కార్యకర్తలకు సీజనల్ వ్యాధులు, కలుషిత నీటి వల్ల వచ్చే జబ్బులు, నివారణ మార్గాలు గురించి మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, నీరు నిల్వ లేకుండా చూడటం వల్ల పలు రకాల వ్యాధులను అరికట్టవచ్చన్నారు. ఇళ్లలో పాత టెంకాయ చిప్పలు, టైర్లు, పూలకుండీలు, పెంకుల్లో నిల్వ ఉండే కొద్దిపాటి నీటిలోనే దోమలు గుడ్లు పెడతాయని, వాటిని లేకుండా చూడాలని కోరారు. డెంగీ అని అనుమానం వస్తే వెంటనే పరీక్ష చేయించాలని కోరారు. డాక్టర్ శ్రీనాథ్ ఫ్లోరోసిస్ గురించి వివరించారు. కార్యక్రమలలో హెల్త్ ఎడ్యుకేటర్ సుధాకర్‌రావు, లక్ష్మీనారాయణ, డీసీఎం సునీత తదితరులు పాల్గొన్నారు. -
సేవకు ప్రతి రూపం నర్సింగ్
జేసీ ఇంతియాజ్ అహ్మద్ నెల్లూరు(అర్బన్): సేవలకు ప్రతిరూపమే నర్సింగ్ వృత్తి అని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. స్థానిక సంతపేటలోని జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో గురువారం మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ స్త్రీల టైనింగ్ కోర్సుల ఎంపికకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ కోర్సులో చేరేందుకు ప్రభుత్వ, మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి 51 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా 26 మంది ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన వారు తమ చదువులు పూర్తి చేసుకుని భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వరసుందరం, ఏఓ సాయిరాం, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ప్రవేశాలు
ఐఐటీ మద్రాస్‌లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ మద్రాస్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) డిప్లొమా అభ్యర్థులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: ఫిట్టర్, షీట్‌మెటల్ వర్కర్, ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, మెకానిక్ (మెషిన్ టూల్ మెయింటనెన్స్, డీజిల్, మోటార్ వెహికల్), ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. అర్హతలు: మెకానికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 5 వెబ్సైట్: www.iitm.ac.in అంకాలజీలో పోస్ట్ బేసిక్ డిప్లొమా తిరువనంతపురంలోని రీజనల్ కేన్సర్ సెంటర్, పోస్ట్-బేసిక్ డిప్లొమా ఇన్ అంకాలజీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ అంకాలజీ నర్సింగ్ కాలపరిమితి: ఏడాది అర్హతలు: బీఎస్సీ(నర్సింగ్) లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీలో డిప్లొమా ఉండాలి. వయసు: 35 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 12 వెబ్సైట్: http://www.rcctvm.org -
పారదర్శకంగా సర్వే నిర్వహించాలి
సామర్లకోట/పెద్దాపురం :సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే పూర్తి పారదర్శకంగా చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. ఈ సర్వే నిర్వహణపై సామర్లకోట టీటీడీసీలో బుధవారం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, మెప్మా అధికారులు, ఐటీడీఏ అధికారులు, డీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి 82 రోజులపాటు సర్వే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. దీనికి సంబంధించిన మెటీరియల్‌ను సంబంధిత అధికార కార్యాలయాలకు పంపించామన్నారు. ఈసర్వేలో ప్రతి కుటుంబ ఆర్థిక స్థితిగతులు, సమగ్ర సమాచారం, కుల వివరాలు, సామాజిక అంశాలు సేకరించాలన్నారు. ఈ సర్వేను ఆధారంగా చేసుకొనే నిధుల కేటాయింపు, బడ్జెట్ రూపకల్పన ఉంటుందన్నారు. గతంలో చేసిన సర్వేలో లోపాలు ఈ సర్వేలో లేకుండా అన్ని స్థాయిల్లో సిబ్బంది కృషి చేయాలన్నారు. సర్వేలో ప్రజలు పూర్తిగా భాగస్వాములయ్యేలా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించాలన్నారు. అలాగే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఇందులో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులను, అవసరమైతే భారత్ నిర్మాణ్ వలంటీర్లను భాగస్వాములను చేయాలన్నారు. జిల్లాలో 2011లో సేకరించిన సర్వే వివరాలను ఈ నెల 26వ తేదీన ప్రచురిస్తారని, ఆముసాయిదా జాబితాపై 30 రోజుల లోపు ప్రజల నుంచి ఫిర్యాదులు, ఆక్షేపణలను పరిష్కరించాలన్నారు. ముసాయిదా జాబితా ప్రచురించిన 52వ రోజు నుంచి 80వ రోజు వరకు అప్పీళ్లను పరిష్కరించాలన్నారు. 82వ రోజున తుది జాబితా ప్రచురించాలన్నారు. జాబితాను ప్రజలు తిలకించేందుకు వీలుగా ప్రతి ప్రభుత్వ కార్యాలయం, పంచాయతీ కార్యాలయం, గ్రామసంఘాల వద్ద ఉంచాలన్నారు. సెక్ రాష్ట్ర అధికారి రాంబాబు మాట్లాడుతూ 2011లో సేకరించిన డేటా ముసాయిదా జాబితాలోని దిద్దుబాట్లు, సవరణకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 2011లో గణన సమయంలో తొలగించబడిన నివాస స్థలం నుంచి దూరంగా ఉన్న ఆయా కుటుంబాలను చేర్చడానికి అవసరమైన సూచనలు చేశారు. డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ ఈసర్వే కార్యక్రమం విజయవంతానికి అధికారులు సహకరించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. అనంతరం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమగ్ర సర్వేపై అవగాహన కల్పించారు. ట్రైనీ కలెక్టర్ శశాంక్, ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు, మెప్మా పీడీ శైలజావల్లి, ఆర్డీవోలు అంబేద్కర్, కూర్మనాథ్, సుబ్బారావు, శంకరవరప్రసాద్ పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణపై శిక్షణ
నల్లగొండ, న్యూస్‌లైన్, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఆదివారం 12 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎన్నికలకు మొత్తం 3,655 మంది ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. అయితే ఈ శిక్షణ కార్యక్రమానికి 772 మంది గైర్హాజరు కాగా ఓపెన్ స్కూల్ పరీక్షల నిమిత్తం 55 మంది హాజరుకాలేదు. వీరిలో 717 మంది అధికారులు.. సోమవారం నియోజకవర్గ కేంద్రాల్లో అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఇచ్చే శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ టి.చిరంజీవులు తెలిపారు. మిగిలిన 55 మందికి ఈ నెల 26 జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయంలో శిక్షణ ఇస్తారు. సోమవారం జరిగే శిక్షణ కార్యక్రమాలకు అధికారులకు గైర్హాజరైనట్లయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు ఈ నెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే ప్రిసైడింగ్ అధికారులకు రెండు విడతల్లో శిక్షణ పూర్తిచేశారు. సోమవారం అసిస్టెంట్ అధికారులకు, ఆ తర్వాత పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు మొత్తం 15,500 ఈవీఎంలను వినియోగించునున్నారు. వీటిలో బ్యాలెట్ యూనిట్లు 8,500, కంట్రోల్ యూనిట్లు 7 వేలు ఇప్పటికే ఆయా నియోజకవ ర్గ కేంద్రాలకు చేరవేశారు. శని, ఆదివారాల్లో ఈవీఎం మిషన్లలో బ్యాలెల్ పత్రాలను నిక్షిప్తం చేశారు. ఈ కార్యక్రమం మరో రెండు రోజుల్లో పూర్తవుతుంది. ఎన్నికల నిర్వహణ నిమిత్తం 18 వేల పైచిలుకు సిబ్బందిని నియమించారు. దీంట్లో ప్రిసైడింగ్ అధికారులు 3,655, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 3,447, పోలింగ్ సిబ్బంది 11,037 మందిని నియమించారు. ఇక ఎన్నికల నిబంధనల మేరకు నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులకు పైబడి ఉన్న కోదాడ, మునుగోడు నియోజకవర్గాల్లో రెండేసి ఈవీఎం మిషన్లను వినియోగించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు పూర్తి ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఏర్పాట్లు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు పత్రాలను ఉద్యోగులకు అందజేశారు. పోలింగ్ సిబ్బందికి సోమవారం శిక్షణలో ఇస్తారు. వారంతా ఈ నెల 23, 24, 25 తేదీల్లో వారికి కేటాయించిన మండలాల్లోని తహసీల్దారు కార్యాలయాల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.