సీజనల్ వ్యాధులపై అవగాహన పెంచాలి
నెల్లూరు(అర్బన్): సీజనల్ వ్యాధులైన డెంగీ, చికున్‌గున్యా, మలేరియా, మెదడు వాపు, ఫైలేరియా తదితర వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా వైద్య శిక్షణ మండలి డాక్టర్ పెద్దిశెట్టి రమాదేవి అన్నారు. స్థానిక గాంధీనగర్‌లోని మహిళా ప్రాంగణంలో ఆశ కార్యకర్తలకు సీజనల్ వ్యాధులు, కలుషిత నీటి వల్ల వచ్చే జబ్బులు, నివారణ మార్గాలు గురించి మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, నీరు నిల్వ లేకుండా చూడటం వల్ల పలు రకాల వ్యాధులను అరికట్టవచ్చన్నారు. ఇళ్లలో పాత టెంకాయ చిప్పలు, టైర్లు, పూలకుండీలు, పెంకుల్లో నిల్వ ఉండే కొద్దిపాటి నీటిలోనే దోమలు గుడ్లు పెడతాయని, వాటిని లేకుండా చూడాలని కోరారు. డెంగీ అని అనుమానం వస్తే వెంటనే పరీక్ష చేయించాలని కోరారు. డాక్టర్ శ్రీనాథ్ ఫ్లోరోసిస్ గురించి వివరించారు. కార్యక్రమలలో హెల్త్ ఎడ్యుకేటర్ సుధాకర్‌రావు, లక్ష్మీనారాయణ, డీసీఎం సునీత తదితరులు పాల్గొన్నారు.