
పెరుగుతున్న ఇన్‌ఫ్లుయెంజా, ఆర్‌ఎస్‌వీ, హెచ్‌ఎంపీవీ కేసులు
పిల్లలు, వృద్ధుల్లోనే వైరస్ ప్రభావం ఎక్కువ
15 – 59 ఏళ్ల మధ్య వయస్కుల్లో ప్రభావం తక్కువే
తీవ్రత పెరిగితే న్యుమోనియా బారిన పడే ప్రమాదం
అధ్యయన నివేదిక విడుదల చేసిన డబ్ల్యూహెచ్‌ఓ
సాక్షి, హైదరాబాద్: దేశంలో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) కేసులు వెలుగుచూశాయి. ఈ వైరస్ పాతదే అయినప్పటికీ అది సోకితే వచ్చే వ్యాధుల ప్రభావం పిల్లలు, వృద్ధుల్లో అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతోంది.
చైనాలో హెచ్‌ఎంపీవీ వ్యాప్తిపై ఈ ఏడాది మొదటివారంలో ఈ సంస్థ అధ్యయనం చేసింది. చైనాతోపాటు, భారత్‌లో వైరస్ వ్యాప్తి గురించి వివరిస్తూ తాజాగా నివేదిక విడుదల చేసింది. హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లుయెంజా, ఆర్‌ఎస్‌వీల వ్యాప్తి కూడా పెరిగినట్లు వెల్లడించింది.
పాతవే.. అయినా జాగ్రత్త ముఖ్యం..
మనదేశంలో హెచ్‌ఎంపీవీ 2015 – 2017 మధ్య కాలంలో వ్యాప్తి చెందినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 60 ఏళ్లలోపు వయ సున్న ప్రతి లక్ష మందిలో సగటున 220 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. 60–74 ఏళ్ల మధ్య వయస్కుల్లో వైరస్ వ్యాప్తి వేగంగా ఉంది. 80 ఏళ్లకు పైబడిన వారిలో రెట్టింపు స్థాయిలో ఉంది. 2018లో ప్రపంచవ్యాప్తంగా 1.1 కోట్ల హెచ్‌ఎంపీవీ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
వీరిలో ఆస్పత్రిలో చేరిన వారి రేటు 5% ఉండగా, మరణాల రేటు ఒకశాతం ఉంది. హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లుయెంజా, ఆర్‌ఎస్‌వీలు యువకుల్లో పెద్దగా ప్రభావం చూపవని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. నాలుగేళ్లలోపు చిన్నారులు, 60 సంవత్సరాలు పైబడినవారిలో వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని వెల్లడించింది. 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు వారిలో వైరస్‌ను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉందని పేర్కొంది.
న్యుమోనియా ప్రమాదం..
హెచ్‌ఎంపీవీ, ఇన్‌ఫ్లుయెంజా, ఆర్‌ఎస్‌వీ వైరస్‌లు సోకినప్పుడు అత్యధికుల్లో రోగ నిరోధక శక్తి క్రియాశీలమై వైరస్‌ను జయిస్తున్నారు. అయితే, ఇన్‌పేషెంట్ కేటగిరీ రోగుల్లో ఇన్‌ఫ్లుయెంజా బారిన పడిన వారు 30 శాతం ఉండగా, హెచ్‌ఎంపీవీతో 6.2 శాతం, ఎడినో వైరస్‌తో 3.7 శాతం, రినో వైరస్‌తో 4.9 శాతం ఆసుపత్రుల పాలవుతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
శ్వాస, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలున్న వారికి ఈ వైరస్‌లు హాని తలపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా దగ్గు, జలుబు ఉన్న వారిలో ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరుతుందని, అది క్రమంగా న్యుమోనియాకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్తలు పాటించాలి
చిన్న పిల్లల్లో, వృద్ధుల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉండడంతో బయ టి వ్యక్తులతో ఎక్కువగా కలువొద్దు. కోవిడ్– 19 సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించ డంతో వైరస్ వ్యాప్తి తగ్గింది. దీంతో వాటికి సంబంధించిన యాంటిబాడీస్ క్షీణించాయి. ఇప్పుడు వైరస్ వ్యాప్తితో సమస్యలు వస్తు న్నట్లు తెలుస్తోంది.
దీర్ఘకాలిక సమస్యలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలున్నవారు వైద్యడి సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ తీసు కోవడం మంచిదే. – డాక్టర్ కిరణ్ మాదల,క్రిటికల్ కేర్ హెచ్‌ఓడీ, గాంధీ మెడికల్ కాలేజీ
Comments
Please login to add a commentAdd a comment