సూర్యాపేట : ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పిస్తున్న ఆర్డీఓ నాగన్న
నల్లగొండ, న్యూస్‌లైన్, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఆదివారం 12 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎన్నికలకు మొత్తం 3,655 మంది ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. అయితే ఈ శిక్షణ కార్యక్రమానికి 772 మంది గైర్హాజరు కాగా ఓపెన్ స్కూల్ పరీక్షల నిమిత్తం 55 మంది హాజరుకాలేదు.
వీరిలో 717 మంది అధికారులు.. సోమవారం నియోజకవర్గ కేంద్రాల్లో అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఇచ్చే శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ టి.చిరంజీవులు తెలిపారు. మిగిలిన 55 మందికి ఈ నెల 26 జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయంలో శిక్షణ ఇస్తారు. సోమవారం జరిగే శిక్షణ కార్యక్రమాలకు అధికారులకు గైర్హాజరైనట్లయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
సార్వత్రిక ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు
ఈ నెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే ప్రిసైడింగ్ అధికారులకు రెండు విడతల్లో శిక్షణ పూర్తిచేశారు. సోమవారం అసిస్టెంట్ అధికారులకు, ఆ తర్వాత పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ ఎన్నికల నిర్వహణకు మొత్తం 15,500 ఈవీఎంలను వినియోగించునున్నారు. వీటిలో బ్యాలెట్ యూనిట్లు 8,500, కంట్రోల్ యూనిట్లు 7 వేలు ఇప్పటికే ఆయా నియోజకవ ర్గ కేంద్రాలకు చేరవేశారు. శని, ఆదివారాల్లో ఈవీఎం మిషన్‌లలో బ్యాలెల్ పత్రాలను నిక్షిప్తం చేశారు.
ఈ కార్యక్రమం మరో రెండు రోజుల్లో పూర్తవుతుంది. ఎన్నికల నిర్వహణ నిమిత్తం 18 వేల పైచిలుకు సిబ్బందిని నియమించారు. దీంట్లో ప్రిసైడింగ్ అధికారులు 3,655, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 3,447, పోలింగ్ సిబ్బంది 11,037 మందిని నియమించారు. ఇక ఎన్నికల నిబంధనల మేరకు నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులకు పైబడి ఉన్న కోదాడ, మునుగోడు నియోజకవర్గాల్లో రెండేసి ఈవీఎం మిషన్లను వినియోగించనున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు పూర్తి
ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఏర్పాట్లు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు పత్రాలను ఉద్యోగులకు అందజేశారు. పోలింగ్ సిబ్బందికి సోమవారం శిక్షణలో ఇస్తారు. వారంతా ఈ నెల 23, 24, 25 తేదీల్లో వారికి కేటాయించిన మండలాల్లోని తహసీల్దారు కార్యాలయాల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.