t.chiranjeevulu
-
‘హరితహారం’ మొక్కలపై ఆరా
సాక్షి కథనంపై స్పందించిన కమిషనర్ టి.చిరంజీవులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నర్సరీల్లో పెంచుతున్న మొక్కల లెక్కలపై ఆరా మొదలైంది. ‘కోటి మొక్కలు...కొంటె లెక్కలు’ అని సాక్షిలో ప్రచురితమైన కథనంపై కమిషనర్ టి.చిరంజీవులు స్పందించారు. హెచ్ఎండీఏకు చెందిన 22 నర్సరీల్లో ఉన్న మొక్కల లెక్కల కోసం ఔట్‌సోర్సింగ్‌కు చెందిన 20 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను రంగంలోకి దింపారు. ఆదివారం వరకు ఆయా నర్సరీల్లో ఉన్న మొక్కల లెక్కలను తేల్చి సోమవారంనాటికి సమగ్ర నివేదికను ఇవ్వాలని కమిషనర్ ఆదేశించగా.. ఇప్పటికే లెక్కల పనులు మొదలెట్టారు. గతేడాది మిగిలిన వాటితో పాటు ఈ ఏడాది పెంచుతున్న ఒక కోటి 80 లక్షల మొక్కల్లో ఎన్ని ఉన్నాయనేది సోమవారం తేలిపోనుంది. అధికారుల్లో గుబులు! నర్సరీల్లో మొక్కలు లెక్కించేందుకు దింపిన ప్రత్యేక బృందాలతో హెచ్ఎండీఏకు చెందిన అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ అధికారుల్లో గుబులు మొదలైంది. ఇది ఎటుతిరిగి ఎటువైపు పోతుందోనన్న కలవరం పుట్టిస్తోంది. అయితే, అంతా లెక్కల ప్రకారమే మొక్కలు ఉన్నాయని అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ సత్యనారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నా ఏం జరుగుతుందనే ఆందోళన ఆ విభాగంలో వ్యక్తమవుతోంది. -
లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్ భగాయత్ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ వేగవంతమైంది. భూములు కోల్పోయిన రైతులతో హెచ్ఎండీఏ కమిషనర్ టి. చిరంజీవులు, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు. కమిషనర్ చేసిన ప్రతిపాదనలపై రైతులు సానుకూలత వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ప్లాట్ల కేటాయింపుపై సీఎం కేసీఆర్ ఈనెల 4వ తేదీన స్పందించిన విషయం తెలిసిందే. ఎకరా పట్టా భూమికి అభివృద్ధి చేసిన లే అవుట్ వెయ్యి గజాలు, యూఎల్సీ భూమికి 600 గజాలు కేటాయించి.. రైతులకు అందజేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ప్రతిజాప్రతినిధులు, అధికారులతో సమావేశం జరిగింది. లాటరీ పద్ధతిన కేటాయింపు.. లాటరీ పద్ధతిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయిస్తామని కమిషనర్ టి. చిరంజీవులు స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా కేటాయింపుల్లో పారదర్శకత ఉంటుందన్నారు. రైతుల నుంచి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేయిస్తామని పేర్కొన్నారు. ఈ భారాన్ని హెచ్ఎండీఏ భరిస్తుందన్నారు. ఈ నిర్ణయంపై మెజారిటీ రైతులు సానుకూలత వ్యక్తం చేశారు. వారం పది రోజుల తర్వాత లాటరీ ప్రక్రియ చేపట్టాలని, ఆ తర్వాత తాము అఫిడవిట్లు అందజేస్తామన్న రైతుల విజ్ఞప్తి మేరకు అధికారులు సమ్మతించారు. లే అవుట్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా, విద్యుత్ తదితర సౌకర్యాలు ఉంటాయన్నారు. అంతేగాక సదరు లే అవుట్‌ని.. మల్టీ పర్పస్ జోన్‌గా గుర్తిస్తామని చెప్పారు. ఈ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. 10న వివరాల వెల్లడి... ఉప్పల్ భగాయత్‌లో ప్రభుత్వ సేకరించిన 733.08 ఎకరాల్లో.. 413.13 ఎకరాల్లో లే అవుట్‌ని హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. గుంటల నుంచి ఎకరాల వరకు చాలా మంది రైతులు భూమిని కోల్పోయారు. అయితే నష్టపోయిన ఒక్కో ఎకరం పట్టా భూమికి వెయ్యి గజాలు ఇవ్వాల్సి ఉంది. ఏ రైతు ఎంత భూమి నష్టపోయాడు.. ఎంత విస్తీర్ణంలో పాట్లు కేటాయించాల్సి ఉందో.. తదితర వివరాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఈ మేరకు జాబితాను రైతులకు అందజేస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే కొంతమంది రైతులు కోల్పోయిన భూమి గుంటలలో ఉంది. వీరికి ప్లాట్ల కేటాయింపులో 30 – 40 గజాలు మాత్రమే రైతులకు చెందాల్సి ఉంది. వాస్తవంగా నిబంధనల ప్రకారం.. ఇంత తక్కువ విస్తీర్ణంలో లేవుట్‌లో చోటు ఉండదు. ఈ నేపథ్యంలో పది రైతులు కలిస్తే.. 300 గజాలుగా సమకూరుతుంది. ఈ మొత్తాన్ని బహిరంగా మార్కెట్‌కు ధరకు విక్రయించడం ద్వారా రైతులకు లాభం చేకూరుతుందని అధికారులు సలహా ఇచ్చారు. ఇలా అన్ని స్థాయిల్లో పనులు పూర్తయితే.. దీపావళిలోగా రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.కార్యక్రమంలో హెచ్ఎండీఏ మెంబర్ ఎస్టేట్ రాజేషం, సెక్రటీరీ కె. మధుకర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వెల్లువలా...
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్/బీఆర్ ఎస్‌లకు మహా నగర పరిధిలో అనూహ్య స్పందన లభించింది. క్రమబద్ధీకరణ కు శనివారం వరకు మొత్తం 2.82 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రాథమిక రుసుంగా రూ.234 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇందులో జీహెచ్ఎంసీకి రూ.118.28 కోట్లు, హెచ్ఎండీఏకు రూ.116 కోట్లకు పైగా ఆదాయం అందినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. దరఖాస్తులన్నిటినీ పరిష్కరిస్తే జీహెచ్ఎంసీకి సుమారు రూ.1000 కోట్లకు పైగా.. హెచ్ఎండీఏకు రూ.500 కోట్లకు పైగా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని అంచనా. ప్రభుత్వం 2015 నవంబర్ 2న ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్లను ప్రకటించి.. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 60 రోజులు గడువు ఇచ్చింది. తుది గడువు 2015 డిసెంబర్ 31తో ముగిసింది. ప్రజల అభ్యర్థన మేరకు మరో నెల రోజులు అంటే జనవరి 31వరకు పొడిగించింది. ఆ గడువు కూడా ఆదివారంతో ముగిసిపోతుండటంతో ఆన్లైన్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. గతంలో 2007-08లో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్/బీపీఎస్‌లను ప్రకటించి... తుది గడువును మూడుసార్లు పొడిగించినా ఇంత స్పందన కనిపించలేదు. అప్పట్లో జీహెచ్ఎంసీకి ఎల్ఆర్ఎస్/బీపీఎస్‌ల కింద 2.5 లక్షలు, హెచ్ఎండీఏకు కేవలం 63 వేల దరఖాస్తులే అందాయి. జీహెచ్ఎంసీకి రూ.868కోట్లు, హెచ్ ఎండీఏకు రూ.200 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరింది. ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు రావడంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు అదనపు ఆదాయాన్ని అందిపుచ్చుకొనేందుకు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాయి. నేడు పని చేయనున్న సేవా కేంద్రాలు అక్రమ భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఆదివారంతో ముగుస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లోని సిటిజన్ సర్వీసు సెంటర్లు, హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలోని ఫెసిలిటేషన్ సెంటర్లు ఆదివారం పని చేస్తాయని అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం7గంటల వరకు ఈ సేవా కేంద్రాలు తెరిచే ఉంటాయన్నారు. దరఖాస్తుదారులు డిమాండ్ డ్రాఫ్టులను వాటిలో అందజేయాలని సూచించారు. 1న స్వీకరిస్తాం: క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణకు ఆదివారం చివరి రోజైనా ... ఆ రోజులోగా తీసుకొన్న డిమాండ్ డ్రాఫ్టులను ఫిబ్రవరి 1న కూడా స్వీకరిస్తాం. దరఖాస్తుదారులు ఆందోళనకు గురవ్వాల్సిన పనిలేదు. ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా ఆన్లైన్ ద్వారా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఇంట్లో ఉండే మీరు మీ దరఖాస్తు స్టాటస్‌ను ఆన్లైన్ ద్వారా చూసుకోవచ్చు. మా సిబ్బంది ఇన్స్పెక్షన్కు వచ్చే ముందు మీ ఫోన్‌కు రింగ్ చేస్తారు. మీ సమక్షంలోనే కొలతలు తీసుకొని ట్యాబ్‌లో ఎంట్రీ చేస్తారు. దాంతో ఎంత ఫీజు చెల్లించాలో ఆటోమేటిక్‌గా మీకు సమాచారం వస్తుంది. ఆ మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లిస్తే అనుమతి పత్రం మీ చేతిలో ఉంటుంది. ఈ విషయంలో ఎవరి ప్రలోభాలకు గురవ్వాల్సిన పనిలేదు. ఆన్లైన్లోనే ప్రాసెస్ అయ్యేలా ఏర్పాట్లు చేశాం. నిర్ణీత వ్యవధిలోగా క్రమబద్ధీకరణ చేసి ఆన్లైన్లోనే ధ్రువపత్రం అందజేస్తాం. క్రమబద్ధీకరణ కోసం హెచ్ఎండీఏకు సుమారు 1.25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిష్కరిస్తే రూ.500 కోట్ల ఆదాయం వస్తుంది. రాబోయే 6 నెలల్లో వీటిని పరిష్కరించేందుకు సిబ్బందిని కార్యోన్ముఖులను చేస్తున్నా. ఫిబ్రవరి 16 నుంచి దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియను ప్రారంభిస్తాం. దీనికోసం అదనంగా సుమారు 70-75మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోబోతున్నాం. - టి.చిరంజీవులు, హెచ్ఎండీఏ కమిషనర్ -
కథలు చెప్పొద్దు.. లక్ష్యం పూర్తి చేయండి
మరుగుదొడ్లకు స్థలాలు లేవా? అధికారులపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆగ్రహం మహబూబ్‌నగర్ టౌన్ : ‘జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేయకుండా నాకు కథలు చెబుతారా..?’ అని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి.చిరంజీవులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో మరుగుదొడ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్లను వెంటనే పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని నెలరోజులుగా తరచూ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్విహస్తున్నా అధికారులు పనితీరులో ఏమాత్రం మార్పులేదన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,187పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉండగా కనీసం పదిశాతమైనా పూర్తికాకపోవడంపై మండిపడ్డారు. అలాగే 174 పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించేందుకు స్థలాల్లేవని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మరో 2,370 పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ ముందుకు వచ్చిందన్నారు. ఇప్పటికైనా అందరూ సమన్వయంతో పనిచేసి మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. వీటితోపాటు పాఠశాలలకు ప్రహరీలు, తాగునీరు, విద్యుత్ సదుపాయం కల్పించాలన్నారు. ఈ నెలాఖరు నాటికి అన్నీ పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. దీంతో నిర్మాణంలో ఉన్న వాటితో పాటు కొత్తగా చేపట్టే మరుగుదొడ్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ టీకే శ్రీదేవి బదులిచ్చారు. కార్యక్రమంలో డీఈఓ రాజేష్ పాల్గొన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.120కోట్లు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించేందుకు రూ.120కోట్లు మంజూరుచేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి.చిరంజీవులు వెల్లడించారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని సమర్థవంతంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 50శాతం నిధులను అన్ని జిల్లాల ఖాతాల్లో జమచేసి పనులు వేగవంతం చేయాలని ఆదేశించామని చెప్పారు. ఈనెలాఖరు నాటికి అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేసి నివేదికలు పంపించాలని ఆదేశించామన్నారు. ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో మరుగుదొడ్ల పనులు ఆలస్యమవుతున్నాయని, సమీక్షించేందుకే జిల్లాకు వచ్చానని వివరించారు. వీటి లక్ష్యాన్ని పూర్తిచేసేంత వరకు తాను నిద్రపోనని అన్నారు. -
బీఎడ్‌లో ఇకపై 12 పేపర్లు
నాలుగు సెమిస్టర్లుగా కోర్సు 20 వారాలపాటు ఇంటర్న్‌షిప్ జూలై నుంచి రెండేళ్ల కోర్సుగా బీఎడ్ సిలబస్‌లో మార్పులు చేస్తున్న విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్) ఇకపై 12 పేపర్ల (ప్రశ్నాపత్రాలు) విధా నం అమల్లోకి రానుంది. సెమిస్టర్ విధానం, ఐదు నెలలపాటు(20 వారాలు) ఇంటర్న్‌షిప్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. బీఎడ్‌ను రెండేళ్ల కోర్సుగా మార్చిన నేపథ్యంలో రాష్ట్రంలో మార్పు చేసిన పాఠశాల విద్యా విధానం, పరీక్షల సంస్కరణలు, సిలబస్‌లో మార్పులకు అనుగుణంగా బీఎడ్ సిలబస్‌ను రూపొందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన విద్యావిభాగం అధిపతులు, ప్రభుత్వ, ప్రైవేటు బీఎడ్ కాలేజీల ప్రతినిధులతో సిలబస్ రూపకల్పనపై విద్యాశాఖ చర్చించింది. పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో వివిధ అంశాలపై చర్చించారు. యూనివర్సిటీలు, ఉన్నత విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ పర స్పర సహకారంతో పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డెరైక్టర్ జగన్నాథరెడ్డి, పరీక్షల సంస్కరణల కన్సల్టెంట్ ఉపేందర్‌రెడ్డి యూనివర్సిటీలు, కళాశాలల ప్రతినిధులకు తెలియజేశారు. కొత్త నిబంధనలను వివరించారు. గతంలో ఏడాది కోర్సుగా ఉన్న బీఎడ్‌లో 6 ప్రశ్నాపత్రాల విధానం అమల్లో ఉం డగా వచ్చే విద్యా సంవ త్సరంలో(జూలై నుంచి) అమల్లోకి రానున్న రెండేళ్ల బీఎడ్ కోర్సులో స్కూల్ ఇంటర్న్‌షిప్ కాకుండా 12 ప్రశ్నాపత్రాల విధానం అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలి మెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ) కోర్సు సిల బస్‌లోనూ మార్పులు తెస్తున్నట్లు వెల్లడించారు. ఇవీ బీఎడ్‌లో రానున్న ప్రధాన మార్పులు... ఇప్పటివరకూ 8 వారాలే ఉన్న స్కూల్ ఇంటర్న్‌షిప్ (పాఠశాలల్లో ప్రాక్టికల్ తరగతులు) ఇకపై 20 వారాలపాటు ఉంటుంది. ఇందులో కమ్యూనిటీ భాగస్వామ్యం, జ్ఞానం, సమాచారం, కరి క్యులమ్కు ప్రాధాన్యం ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక పేపరుగా ప్రవేశ పెడతారు. ఉపాధ్యాయ విద్యార్థులు ఏం నేర్చుకోవాలి? పిల్లలకు వారేం చెప్పాలి? బోధన పద్ధతులు, అనుసరించాల్సిన నిబంధనలు, ప్రజలతో మ మేకం ఎలా కావాలన్న అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. దీనికి 250 మార్కులు ఉంటాయి. కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఏడాది కోర్సులో ఉన్న 6 పేపర్ల స్థానంలో రెండేళ్ల కోర్సులో 12 పేపర్ల విధానం అమల్లోకి తెస్తున్నందునా, ఇలాంటి వివిధ అంశాలకు సంబంధించిన అంశాలపై సిలబస్‌ను సిద్ధం చేశారు. ఆప్షనల్ కోర్సులుగా వొకేషనల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, హెల్త్, ఫిజికల్ ఎడ్యుకేషన్, గెడైన్స్ అండ్ కౌన్సెలింగ్ ఉంటాయి. వృత్తి సం బంధ సామర్థ్యాల పెంపునకు (ఎన్హాన్సింగ్ ప్రొఫెషనల్ కెపాసిటీస్) ప్రాధాన్యం ఇస్తారు. -
పక్షం రోజులు ముందుగా పరీక్షలు
ఏప్రిల్ 1 నుంచే ఒకటో తరగతి నుంచి 9వ తరగతుల పరీక్షలు 11 నుంచి పదో తరగతి స్పాట్ వ్యాల్యుయేషన్ సాక్షి, హైదరాబాద్: ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలను 15 రోజుల ముందుగానే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. సాధారణంగా వీటిని ఏప్రిల్ 15 నుంచి నిర్వహించాలని గతంలోనే తేదీలు ఖరారు చేశారు. అయితే వాటిని ఏప్రిల్ 1 నుంచే నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. ఈ నెల 25 నుంచి మొదలయ్యే టెన్త్ పరీక్షల స్పాట్ వ్యాల్యుయేషన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అంతకంటే ముందుగానే 9 తరగతుల పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. టెన్త్ స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం అయితే టీచర్లంతా ఆ పనుల్లోనే ఉంటుండడంతో 1 నుంచి 9 తరగతుల పరీక్షల నిర్వహణ, మూల్యాంకనాన్ని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టెన్త్ మూల్యాంకనం కంటే ముందుగానే పరీక్షలను ప్రారంభించనున్నారు. 8వ తరగతి వరకు పరీక్షలు ఆరు రోజుల్లో పూర్తి కానున్నాయి. 9వ తరగతిలో 11 పేపర్ల విధానం ప్రవేశపెట్టడంతో ఏప్రిల్ 11తో పూర్తవుతాయని పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు పేర్కొన్నారు. -
సంక్షేమ పథకాలను ప్రజలకు చేరుస్తా
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలన్నింటినీ చిత్తశుద్ధితో అమలు చేసి ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా పలు రంగాల్లో ఇప్పటికే మంచి స్థానంలో ఉందని, మరింత కృషి చేయడం ద్వారా రాష్ట్రంలోనే జిల్లాను అభివృద్ధి పథాన మొదటి స్థానంలో నిలుపుతానని చెప్పారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు మరింత చేరువ చేస్తానని ఆయన వెల్లడించారు. -కలెక్టర్. సత్యనారాయణ రెడ్డి -
ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సిద్ధమవ్వండి
రాంనగర్ (నల్లగొండ): జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. అందులో 25శాతం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉన్నందున, అందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిం చాలని సూచించారు. జిల్లాలో సుమారు 130 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమయంత్రం, టార్పాలిన్లు, గన్నీ బ్యాగ్స్, కాంటాలు అందుబాటులో ఉంచాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి రోజువారీగా ధాన్యం విక్రయించే రైతుల పేర్లు, టోకెన్స్ పంపిణీ తదితర వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ టోకన్లు పంపిణీ చేసిన తేదీల వారీగానే వారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు సలహాలు, సూచనలు చేయటానికి అడ్వయిజరీ కమిటీలు వేయాలని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్ల వద్ద నుంచి 24 గంటల్లో అన్లోడ్ చేయాలని, ట్రాన్సుపోర్టు కాంట్రాక్టర్లను త్వరితగతిన ఫైనలైజ్ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎవరైనా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా, జిల్లా పౌర సరఫరాల అధికారి నాగేశ్వర్రావు, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు, డీఆర్డీఏ పీడీ సుధాకర్, ఆర్టీఓ హన్మంతరెడ్డి, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేందర్, సంఘం ప్రతినిధులు మల్లయ్య పాల్గొన్నారు. -
విజన్ తెలంగాణ
ప్రత్యేక రాష్ట్ర సాధన ఘనత అమరులదే - నవ తెలంగాణ నిర్మాణానికి ప్రజలు సన్నద్ధం కావాలి - పభుత్వ ఉద్యోగులు నూతనోత్తేజంతో పనిచేయాలి - అభివృద్ధి కార్యక్రమాల్లో అగ్ర స్థానం సాధించాలి - ఉన్నత విద్యావకాశాలతో ఉపాధి కల్పన - ఆవిర్భావ వేడుకల్లో కలెక్టర్ చిరంజీవులు సందేశం నల్లగొండ, న్యూస్‌లైన్, ‘కల నిజమైంది...తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. పరాయి పాలన ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆత్మాభిమానం కోసం తెలంగాణ ప్రజలు అరవై ఏళ్లుగా చేస్తున్న పోరాటం విజయం సాధించింది. 29వ రాష్ట్రంగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులకే దక్కుతుంది. అమరుల త్యాగం వృథా కాకుండా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక తెలంగాణ సమాజం అంతా పోరు తెలంగాణ నుంచి విజన్ తెలంగాణ బాటలో నడవాలి’.. అని కలెక్టర్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ సందేశాన్నిచ్చారు. ఉద్యమకాలమంతా తెలంగాణ సమాజం అనేక అవమానాలు, పరీక్షలు, కష్టనష్టాలకు ఓర్చి నిలబడింద ని తెలిపారు. మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే చెందాలనే దృఢ సంకల్పంతో అవిశ్రాంత పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు. మెరుగైన అభివృద్ధి సాధించాలి.. తెలంగాణలో ఉన్న ప్రతి నీటివనరులను ఉపయోగంలోకి తీసుకువచ్చి బంజరు భూములు, పచ్చిక బయళ్లు సాగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందించాలన్నదే కొత్త ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. దీంతోపాటు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కల్పించడం ద్వారా ఉన్నత విద్యావకాశాలను పెంపొందించి ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో మిగులు బడ్జెట్‌తో ఉన్నామన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి అవకాశాలు మెం డుగా ఉన్నాయని చెప్పారు. 57ఏళ్ల సమైక్య పాలనలో సాధించిన దానితో సంతృప్తి పడకుండా నవ తెలంగాణ, సమ తెలంగాణ, సామాజిక తెలంగాణ నిర్మిం చుకోవాల్సిన ఆవశక్యత ఎంతైనా ఉందన్నారు. ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలి... ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో చేపట్టిన ప్రతి కార్యక్రమం అభివృద్ధిఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేకూర్సాలిన అవసరం ఉందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం ప్రభుత్వంలో పనిచే స్తున్న ప్రతి ఉద్యోగిపై బాధ్యతను పెంచుతుందన్నారు. అలాగే ప్రతి ఉద్యోగి తమకు అప్పగించిన పనులను సకాలంలో, పారదర్శకంగా పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎప్పటికప్పుడు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని నూతనోత్తేజంతో, అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఘనంగా సంబురాలు... తెలంగాణ సంబురాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా గత నెల 28నుంచి ప్రజల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టి వేడుకలను ఘనంగా నిర్వహిం చుకున్నామన్నారు. మండల, డివిజన్‌స్థాయిలో మహిళలు, యువకులకు వివిధ రకాల క్రీడలు నిర్వహించి పండగ వాతావరణంలో వారిలో స్ఫూర్తి నింపామన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, అమరుల కుటుంబాలను, జిల్లాలో అనేక రంగాల్లో నిష్ణాతులైన, ఉన్నత శిఖరాలను అధిరోహించిన వివిధ రకాల ప్రముఖులను ఘనంగా సత్కరించామన్నారు. కలెక్టర్ అభినందనలు.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కర్షక, కార్మికులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని, వారందరికీ ఈ శుభ సందర్భంలో కలెక్టర్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలుచేస్తూ రాష్ట్రంలోనే జిల్లా ప్రత్యేకతను నిలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో ఎస్పీ టి.ప్రభాకర్‌రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఏజేసీ వెంకట్రావు, ఏఎస్పీ రమారాజేశ్వరి, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, జేడీఏ నర్సింగరావు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.చిరంజీవులు కోరారు. ఈ నెల 12న మున్సిపల్, 16న పార్లమెంటు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ మీటింగ్‌హాల్‌లో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు, ము న్సిపల్ కమిషనర్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మూడు దశల్లో సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసి కౌంటింగ్‌కు ముందు రోజు ర్యాండమైజేషన్ ద్వారా ఓట్ల లెక్కింపు విధులు కేటాయించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు విషయం లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు తు.చ. తప్పక పాటించాలని, ఒక రోజు ముందుగా మాక్ కౌంటింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. రిట ర్నింగ్ అధికారులందరూ ఎవ్వరి నియోజకవర్గ కౌంటింగ్ ఏర్పాట్లను వారే స్వయంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. జనరేటర్, సమర్థులైన కంప్యూటర్ ఆపరేటర్లు, జీరాక్సు ఇతర మౌలిక సౌకర్యాలను, వారి ఏజెంట్లకు ఫారం 43ఎలో కౌంటింగ్ తేదీ ఇతర వివరాలు తెలుపుతూ రిటర్నింగ్ అధికారులు నోటీసు జారీ చేయాలని సూచించారు. క్రిమినల్ నేర చరిత్ర లేని వారికి మాత్రమే పోలీసు శాఖ నుంచి నివేదికలు పొంది కౌంటింగ్ ఏజెంట్లకు పాసులు జారీ చేయాలని కోరారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు రిట ర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులకు తప్ప ఇతరులకు సెల్‌ఫోను అనుమతి లేదన్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 12, పార్లమెంటు నియోజకవర్గానికి 12 టేబుల్స్‌తో పాటు రిటర్నింగ్ అధికారి వద్ద పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు ఒక టేబుల్ ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఉయదం 8 గంటలకు ఓట్ల లెక్కింపు విధిగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కిం పులో రహస్యానికి భంగం కలుగకుండా నిబంధనల మేరకు స్క్రూటినీ చేసిన పిదపనే లెక్కింపు ప్రారంభించాలని రిటర్నింగ్ అధికారులకు సూచిం చారు. రిసోర్సు పర్సన్, భునవగిరి ఆర్డీఓ భాస్కర్‌రావు ఓట్ల లెక్కింపుపై అధికారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. కార్యక్రమంలో జేసీ హరిజవహర్‌లాల్, ట్రైనీ ఐఎఎస్ సత్యనారాయణ, అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట్రావు, ఆర్డీఓలు నాగన్న, శ్రీనివాస్‌రెడ్డి, రవినాయక్, జహీర్ పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణపై శిక్షణ
నల్లగొండ, న్యూస్‌లైన్, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఆదివారం 12 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎన్నికలకు మొత్తం 3,655 మంది ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. అయితే ఈ శిక్షణ కార్యక్రమానికి 772 మంది గైర్హాజరు కాగా ఓపెన్ స్కూల్ పరీక్షల నిమిత్తం 55 మంది హాజరుకాలేదు. వీరిలో 717 మంది అధికారులు.. సోమవారం నియోజకవర్గ కేంద్రాల్లో అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఇచ్చే శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ టి.చిరంజీవులు తెలిపారు. మిగిలిన 55 మందికి ఈ నెల 26 జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయంలో శిక్షణ ఇస్తారు. సోమవారం జరిగే శిక్షణ కార్యక్రమాలకు అధికారులకు గైర్హాజరైనట్లయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు ఈ నెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే ప్రిసైడింగ్ అధికారులకు రెండు విడతల్లో శిక్షణ పూర్తిచేశారు. సోమవారం అసిస్టెంట్ అధికారులకు, ఆ తర్వాత పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు మొత్తం 15,500 ఈవీఎంలను వినియోగించునున్నారు. వీటిలో బ్యాలెట్ యూనిట్లు 8,500, కంట్రోల్ యూనిట్లు 7 వేలు ఇప్పటికే ఆయా నియోజకవ ర్గ కేంద్రాలకు చేరవేశారు. శని, ఆదివారాల్లో ఈవీఎం మిషన్లలో బ్యాలెల్ పత్రాలను నిక్షిప్తం చేశారు. ఈ కార్యక్రమం మరో రెండు రోజుల్లో పూర్తవుతుంది. ఎన్నికల నిర్వహణ నిమిత్తం 18 వేల పైచిలుకు సిబ్బందిని నియమించారు. దీంట్లో ప్రిసైడింగ్ అధికారులు 3,655, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 3,447, పోలింగ్ సిబ్బంది 11,037 మందిని నియమించారు. ఇక ఎన్నికల నిబంధనల మేరకు నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులకు పైబడి ఉన్న కోదాడ, మునుగోడు నియోజకవర్గాల్లో రెండేసి ఈవీఎం మిషన్లను వినియోగించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు పూర్తి ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఏర్పాట్లు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు పత్రాలను ఉద్యోగులకు అందజేశారు. పోలింగ్ సిబ్బందికి సోమవారం శిక్షణలో ఇస్తారు. వారంతా ఈ నెల 23, 24, 25 తేదీల్లో వారికి కేటాయించిన మండలాల్లోని తహసీల్దారు కార్యాలయాల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. -
16న ఓటరు తుది జాబితా విడుదల
కలెక్టరేట్, న్యూస్‌లైన్:ఓటరు తుది జాబితా ఈ నెల 16న విడుదల చేసేందుకు కలెక్టర్లు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ ఆదేశిం చారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి మాట్లాడారు. మరణించిన, డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి విధిగా తొలగించాలన్నారు. వ చ్చిన ఆక్షేపణలు, దరఖాస్తులు, మార్గదర్శకాల మేరకు పరిశీలించిన తర్వాత మాత్రమే తిరస్కరించాలని సూచిం చారు. డూప్లికేట్ ఓటర్ల తొలగింపు కార్యక్రమాన్ని ఈ నెల 13లోగా పూర్తిచేయాలన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా కేవలం 18 శాతం దరఖాస్తులు మాత్రమే పరిష్కరిం చారని, 82 శాతం దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి జిల్లాకు దాదాపు 14 మంది ఎన్నికల పరిశీలకులు రాబోతున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు మాట్లాడుతూ జిల్లాలో 1లక్షా 16 వేల దరఖాస్తులు అందగా, ఇప్పటి వరకు 29,700 పరిష్కరించామని తెలి పారు. కొన్ని మండలాలలో విద్యుత్ సమస్య కారణంగా జాప్యం జరుగుతుం దని యూపీఎస్ కొనుగోలు చేసి త్వరితగతిన పరిష్కరిస్తామని వివరించారు. ఈవీఎం లు భద్రపరించేందుకు గోదాం నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరారు. వీడియో కాన్ఫరెన్సులో జేసీ హరిజవహర్‌లాల్, డీఆర్వో అం జ య్య, రెవెన్యూ డివిజనల్ అధికారులు జహీర్, శ్రీనివాసరెడ్డి, రవినాయక్, భాస్కర్‌రావు, స్పెషల్‌డిప్యూటీ కలెక్టర్లు కె.మధుకర్‌రెడ్డి, రాములు, పరిపాలన అధికారి శ్రీరాములు, భాస్కర్, శ్యాం సుందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ప్రణాళికాబద్ధంగా పట్టణాల అభివృద్ధి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: మున్సిపాలిటీలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పర్చాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై మున్సిపాలిటీల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటా చెత్త సేకరించే విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నల్లగొండ మున్సిపాలిటీ పనితీరుపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల మంజూరుపై చూపిన శ్రద్ధ పారిశుద్ధ్యంపై చూపకపోవడం సరికాదని అధికారులకు హితవు పలికారు. డంపింగ్ యార్డులు లేనిచోట తహసీల్దార్లను సం ప్రదించి స్థలాలు సేకరించాలని సూచిం చారు. ఒకప్పుడు ఆదర్శ మున్సిపాలిటీగా ఉన్న సూర్యాపేటలో నేడు పారి శుద్ధ్యం కొరవడిందని అసహనం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల గొట్టాలపై దోమల బెడద నివారించేందుకు నెట్లు ఏర్పాటు చేయాలని చెప్పి మూడు నెలలైనా చర్యలు తీసుకోకపోవడంపై కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎందుకు అమలు చేయలేదని వా రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయా విషయాలపై వెంటనే మున్సిపల్ కమిషనర్లకు మెమోలు జారీ చేయాలని మెప్మా పీడీని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో చేపట్టిన పనులన్నింటిపై విధిగా మూడో బృందంతో విచారణ చేయించాలని సూ చించారు. పట్టణ ప్రాంతంలో ఉన్న బాలకార్మికులను రెసిడెన్షియల్, కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాలు, బ్రిడ్జి కోర్సులలో చేర్పించాలని సూచిం చారు. ఆస్తి పన్ను, నీటి పన్నులను మార్చి నెలాఖరులోగా నూరుశాతం వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, అధికారులు మొక్కుబడిగా సమావేశానికి హాజరైతే ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ ఆమోస్, నల్లగొండ ఆర్డీఓ జహీర్, మెప్మా పీడీ వెంకటేశ్వర్లు, జిల్లాఆడిట్ అధికారి సీహెచ్.వేణుగోపాల్‌రావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ అశ్విని, కమిషనర్లు పాల్గొన్నారు.