వెల్లువలా...
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్/బీఆర్ ఎస్‌లకు మహా నగర పరిధిలో అనూహ్య స్పందన లభించింది. క్రమబద్ధీకరణ కు శనివారం వరకు మొత్తం 2.82 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రాథమిక రుసుంగా రూ.234 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇందులో జీహెచ్‌ఎంసీకి రూ.118.28 కోట్లు, హెచ్‌ఎండీఏకు రూ.116 కోట్లకు పైగా ఆదాయం అందినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. దరఖాస్తులన్నిటినీ పరిష్కరిస్తే జీహెచ్‌ఎంసీకి సుమారు రూ.1000 కోట్లకు పైగా..
హెచ్‌ఎండీఏకు రూ.500 కోట్లకు పైగా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని అంచనా. ప్రభుత్వం 2015 నవంబర్ 2న ఎల్‌ఆర్‌ఎస్/బీఆర్‌ఎస్‌లను ప్రకటించి.. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 60 రోజులు గడువు ఇచ్చింది. తుది గడువు 2015 డిసెంబర్ 31తో ముగిసింది. ప్రజల అభ్యర్థన మేరకు మరో నెల రోజులు అంటే జనవరి 31వరకు పొడిగించింది. ఆ గడువు కూడా ఆదివారంతో ముగిసిపోతుండటంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు వెల్లువెత్తాయి.
గతంలో 2007-08లో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్/బీపీఎస్‌లను ప్రకటించి... తుది గడువును మూడుసార్లు పొడిగించినా ఇంత స్పందన కనిపించలేదు. అప్పట్లో జీహెచ్‌ఎంసీకి ఎల్‌ఆర్‌ఎస్/బీపీఎస్‌ల కింద 2.5 లక్షలు, హెచ్‌ఎండీఏకు కేవలం 63 వేల దరఖాస్తులే అందాయి. జీహెచ్‌ఎంసీకి రూ.868కోట్లు, హెచ్ ఎండీఏకు రూ.200 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరింది. ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు రావడంతో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు అదనపు ఆదాయాన్ని అందిపుచ్చుకొనేందుకు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాయి.
నేడు పని చేయనున్న సేవా కేంద్రాలు
అక్రమ భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఆదివారంతో ముగుస్తోంది. దీంతో జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లోని సిటిజన్ సర్వీసు సెంటర్లు, హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంలోని ఫెసిలిటేషన్ సెంటర్లు ఆదివారం పని చేస్తాయని అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం7గంటల వరకు ఈ సేవా కేంద్రాలు తెరిచే ఉంటాయన్నారు. దరఖాస్తుదారులు డిమాండ్ డ్రాఫ్టులను వాటిలో అందజేయాలని సూచించారు.
1న స్వీకరిస్తాం:
క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణకు ఆదివారం చివరి రోజైనా ... ఆ రోజులోగా తీసుకొన్న డిమాండ్ డ్రాఫ్టులను ఫిబ్రవరి 1న కూడా స్వీకరిస్తాం. దరఖాస్తుదారులు ఆందోళనకు గురవ్వాల్సిన పనిలేదు. ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా ఆన్‌లైన్ ద్వారా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఇంట్లో ఉండే మీరు మీ దరఖాస్తు స్టాటస్‌ను ఆన్‌లైన్ ద్వారా చూసుకోవచ్చు. మా సిబ్బంది ఇన్‌స్పెక్షన్‌కు వచ్చే ముందు మీ ఫోన్‌కు రింగ్ చేస్తారు. మీ సమక్షంలోనే కొలతలు తీసుకొని ట్యాబ్‌లో ఎంట్రీ చేస్తారు. దాంతో ఎంత ఫీజు చెల్లించాలో ఆటోమేటిక్‌గా మీకు సమాచారం వస్తుంది. ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లిస్తే అనుమతి పత్రం మీ చేతిలో ఉంటుంది.
ఈ విషయంలో ఎవరి ప్రలోభాలకు గురవ్వాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ అయ్యేలా ఏర్పాట్లు చేశాం. నిర్ణీత వ్యవధిలోగా క్రమబద్ధీకరణ చేసి ఆన్‌లైన్‌లోనే ధ్రువపత్రం అందజేస్తాం. క్రమబద్ధీకరణ కోసం హెచ్‌ఎండీఏకు సుమారు 1.25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిష్కరిస్తే రూ.500 కోట్ల ఆదాయం వస్తుంది. రాబోయే 6 నెలల్లో వీటిని పరిష్కరించేందుకు సిబ్బందిని కార్యోన్ముఖులను చేస్తున్నా. ఫిబ్రవరి 16 నుంచి దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియను ప్రారంభిస్తాం. దీనికోసం అదనంగా సుమారు 70-75మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోబోతున్నాం.
- టి.చిరంజీవులు, హెచ్‌ఎండీఏ కమిషనర్