layout Regulation
-
లేఅవుట్ డెవలపర్లకు గట్టి షాక్...రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం..!
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్ డెవలపర్లకు పెద్ద షాక్ తగిలింది. హెచ్ఎండీఏ, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) అనుమతులు లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను అంగీకరించేది లేదని రిజిస్ట్రేషన్ల శాఖ తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం లేఅవుట్లలో ఉన్న అనుమతి లేని ప్లాట్లపై క్రయవిక్రయ లావాదేవీలు జరిపే అవకాశం ఉండదు. గతంలోనే ఈ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ రియల్టర్లకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనుమతి లేకున్నప్పటికీ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని, సదరు ప్లాట్లకు అనుమతులు లేవని, దీనిపై లావాదేవీలు జరపడం క్రయ, విక్రయదారుల రిస్క్ అంటూ ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌పై పేర్కొనాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయడంతో ఈ మేరకు కొట్టివేసింది. ఎట్టి పరిస్థితుల్లో అనుమతుల్లేని ప్లాట్ల క్రయ, విక్రయ లావాదేవీలకు అనుమతి ఇవ్వవద్దని తీర్పునిచ్చింది. ఈ తీర్పుకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ శుక్రవారం నుంచి సదరు ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. అమ్ముడుపోకుండా మిగిలినవాటికే.. అనుమతుల్లేని లేఅవుట్ల ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం స్థలాల రెగ్యులరైజేæషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ పథకంపట్ల ప్రజల నుంచి వ్యతిరేకత రావడం... హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికారపార్టీకి చేదు ఫలితాలు రావడంతో ఉపసంహరించుకున్న ప్రభుత్వం లేఅవుట్లలో అప్పటికే అమ్ముడైన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని, అప్పటివరకు అమ్మని ప్లాట్లకు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అక్రమ లేఅవుట్లలో డెవలపర్ల వద్ద ఉన్న ప్లాట్లకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే క్రయవిక్రయ లావాదేవీలు జరిపిన ప్లాట్లకు వర్తించదని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు వెల్లడించారు. -
స్లమ్స్‌లో రూ.5కే క్రమబద్దీకరణ
సాక్షి, హైదరాబాద్: మురికివాడల్లోని అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు కేవలం రూ.5 రుసుం చెల్లిస్తే సరిపోనుంది. లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం లేకుంటే రిజిస్ట్రేషన్ తేదీ నాటి మార్కెట్ విలువ ఆధారంగా 14 శాతం ప్లాట్ ధరను చార్జీలుగా చెల్లించాలి. అయితే మురికి వాడల్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చార్జీల నుంచి మినహాయింపు కల్పించనుంది. గత నెల 31న జారీ చేసిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ జీవో 131లో ఈ మేరకు మరింత స్పష్టతనిస్తూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మురికివాడల్లోని పేద, మధ్యతరగతి ప్రజ లకు ఈ నిర్ణయం వరంగా మారనుంది. లేనిపక్షంలో ప్లాటు విస్తీర్ణం, రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువ ఆధారంగా రూ.వేల నుంచి రూ.లక్షల వరకు రుసుం చెల్లించాల్సి వచ్చేది. జీవోలో ప్రస్తావన లేక ఆందోళన: అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీ్ధకరణను ప్రభుత్వం తప్పనిసరిచేసింది. లేనిపక్షంలో సదరు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరపమని, భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేయమని లేఅవుట్ల క్రమబద్ధీకరణ రూల్స్–2020లో స్పష్టం చేసింది. మురికివాడల్లోని ప్లాట్ల విషయంలో ప్లాటు విస్తీర్ణం, మార్కెట్ విలువతో సంబంధం లేకుండా నామమాత్రంగా రూ.5ను ‘క్రమబద్ధీకణ రుసుం’గా చెల్లిస్తే సరిపోతుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అయితే, లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం లేనందుకు చెల్లించాల్సిన 14 శాతం ప్లాట్ ధర చార్జీలు మురికివాడల్లోని ప్లాట్లకు వర్తిస్తాయా? లేదా ? అన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం జీవోలో స్పష్టత ఇవ్వలేదు. దీంతో మురికివాడల్లో స్థలాలు కలిగి ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలు 14శాతం ప్లాటు ధరను చార్జీలుగా చెల్లించాల్సి వస్తుందని ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ‘సాక్షి’పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ను సంప్రదించగా, మురికివాడల్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణ విషయంలో 14 శాతం ప్లాటు ధర చార్జీలు వర్తించవని, దీనిపై త్వరలో క్లారిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు. దస్తావేజులో స్లమ్ పేరు ఉండాలి జీహెచ్ఎంసీ పరిధిలో 1,179 నోటిఫైడ్ స్లమ్స్, 297 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ కలిపి మొత్తం 1,476 మురికివాడలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో మరో 700కి పైగా మురికివాడలు ఉన్నాయి. వీటికి సంబందించిన జాబితా స్థానిక పురపాలికతో పాటు మెప్మా అధికారుల వద్ద లభిస్తుంది. ప్లాట్లు రిజిస్ట్రేషన్ దస్తావేజులో మురికివాడ పేరు ఉంటే ఈ మేరకు 14శాతం ప్లాటు ధరను ఫీజుగా చెల్లించకుండా మినహాయింపు పొందడానికి వీలుకలగనుంది. ప్లాటు మురికివాడలో ఉన్నా కొన్నిసార్లు దస్తావేజుల్లో సదరు మురికివాడ పేరుకు బదులు వేరే పేర్లు ఉండే అవకాశముంది. ఇలాంటి సందర్భాల్లో సదరు ప్లాట్లకు సంబంధించిన గత 20, 30 ఏళ్ల కాలానికి సంబంధించిన పహాణీలను స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి తీస్తే అందులో మురికివాడ పేరు ఉండే అవకాశలుంటాయి. దీని ఆధారంగా రిజిస్ట్రేషన్ దస్తావేజులో ఆ మేరకు కాలనీ పేరు సవరణ చేయించుకుంటే ఎల్ఆర్ఎస్ ఫీజుల చెల్లింపు నుంచి రాయితీ పొందడానికి అవకాశం ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
ఎల్ఆర్ఎస్ అప్పీల్‌కు అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకుని వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురైన వాటికి మళ్లీ అప్పీలు చేసుకునేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) వెసులుబాటు కల్పించింది. వీటిలో ఆమోదయోగ్యమైన వాటిని పరిశీలించి క్లియర్ చేయనున్నారు. నవంబర్ 1 నుంచి ఈ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించేందుకు హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని పరిశీలించేందుకు నలుగురు తహసీల్దార్లు, నలుగురు టెక్నికల్ ఆఫీసర్లతో ప్రత్యేక బృందం నియమించాలని హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు బుధవారం నిర్ణయించారు. ఈ మేరకు ఐటీ అధికారులు, ఆయా విభాగాలకు చెందిన అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. 32 వేల దరఖాస్తులకు అవకాశం.. హెచ్ఎండీఏకు ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన 1,75,253 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 77,000 దరఖాస్తులు క్లియర్ కాగా, 31,131 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 40 వేల దరఖాస్తులు వివిధ టైటిల్, టెక్నికల్ స్క్రూటినీ దశల్లో ఉన్నాయి. వీటిలో 20 వేలకుపైగా దరఖాస్తులు తిరస్కరించే అవకాశమున్నట్టు తెలిసింది. ఓపెన్ స్పేస్, రిక్రియేషనల్, వాటర్‌బాడీ, మాన్యుఫాక్చరింగ్, సెంట్రల్ స్క్వేర్, ట్రాన్స్‌పొర్టేషన్, బయో కన్జర్వేషన్, వాగు, నాలా, చెరువుల బఫర్ జోన్లో ప్లాట్‌తో పాటు ఇతర కారణాలతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను తిరస్కరించారు. యూఎల్సీ, వక్ఫ్, అసైన్డ్ ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్, ప్రభుత్వ భూముల్లో ఉన్న ప్లాట్లను సంబంధిత విభాగాల నుంచి ఎన్వోసీ తీసుకురావాలంటూ టైటిల్ సూపర్వైజ్ దశలోనే అధికారులు తిరస్కరించారు. ఇలా 32 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. చాలా మంది నుంచి అభ్యర్థనలు రావడంతో హెచ్ఎండీఏ అప్పీల్‌కు అవకాశం ఇచ్చింది. అప్పీల్ చేయడం ఇలా హెచ్ఎండీఏ (http://hmda.gov.in/) వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్ ఎల్ఆర్ఎస్ అప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుడు తన యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయగానే వచ్చే అప్పీల్ ప్రొవిజన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు వాళ్లకు సంబంధించిన డాక్యుమెంట్ ప్రొవిజన్ వస్తుంది. తిరిగి వాళ్లు అప్లోడ్ చేయాలనుకునే డాక్యుమెంట్లను నిక్షిప్తం చేయాలి. తహసీల్దార్, టెక్నికల్ అధికారులు ఆ డాక్యుమెంట్లను పరిశీలించి అంతా ఓకే అనుకుంటే తదుపరి దశకు అనుమతిస్తారు. ఒకవేళ సరైనవి లేకపోతే తొలి దశలోనే తిరస్కరిస్తారు. అప్పీల్ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ చిరంజీవులు ప్రజలను కోరారు. -
వెల్లువలా...
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్/బీఆర్ ఎస్‌లకు మహా నగర పరిధిలో అనూహ్య స్పందన లభించింది. క్రమబద్ధీకరణ కు శనివారం వరకు మొత్తం 2.82 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రాథమిక రుసుంగా రూ.234 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇందులో జీహెచ్ఎంసీకి రూ.118.28 కోట్లు, హెచ్ఎండీఏకు రూ.116 కోట్లకు పైగా ఆదాయం అందినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. దరఖాస్తులన్నిటినీ పరిష్కరిస్తే జీహెచ్ఎంసీకి సుమారు రూ.1000 కోట్లకు పైగా.. హెచ్ఎండీఏకు రూ.500 కోట్లకు పైగా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని అంచనా. ప్రభుత్వం 2015 నవంబర్ 2న ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్లను ప్రకటించి.. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 60 రోజులు గడువు ఇచ్చింది. తుది గడువు 2015 డిసెంబర్ 31తో ముగిసింది. ప్రజల అభ్యర్థన మేరకు మరో నెల రోజులు అంటే జనవరి 31వరకు పొడిగించింది. ఆ గడువు కూడా ఆదివారంతో ముగిసిపోతుండటంతో ఆన్లైన్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. గతంలో 2007-08లో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్/బీపీఎస్‌లను ప్రకటించి... తుది గడువును మూడుసార్లు పొడిగించినా ఇంత స్పందన కనిపించలేదు. అప్పట్లో జీహెచ్ఎంసీకి ఎల్ఆర్ఎస్/బీపీఎస్‌ల కింద 2.5 లక్షలు, హెచ్ఎండీఏకు కేవలం 63 వేల దరఖాస్తులే అందాయి. జీహెచ్ఎంసీకి రూ.868కోట్లు, హెచ్ ఎండీఏకు రూ.200 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరింది. ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు రావడంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు అదనపు ఆదాయాన్ని అందిపుచ్చుకొనేందుకు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాయి. నేడు పని చేయనున్న సేవా కేంద్రాలు అక్రమ భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఆదివారంతో ముగుస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లోని సిటిజన్ సర్వీసు సెంటర్లు, హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలోని ఫెసిలిటేషన్ సెంటర్లు ఆదివారం పని చేస్తాయని అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం7గంటల వరకు ఈ సేవా కేంద్రాలు తెరిచే ఉంటాయన్నారు. దరఖాస్తుదారులు డిమాండ్ డ్రాఫ్టులను వాటిలో అందజేయాలని సూచించారు. 1న స్వీకరిస్తాం: క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణకు ఆదివారం చివరి రోజైనా ... ఆ రోజులోగా తీసుకొన్న డిమాండ్ డ్రాఫ్టులను ఫిబ్రవరి 1న కూడా స్వీకరిస్తాం. దరఖాస్తుదారులు ఆందోళనకు గురవ్వాల్సిన పనిలేదు. ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా ఆన్లైన్ ద్వారా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఇంట్లో ఉండే మీరు మీ దరఖాస్తు స్టాటస్‌ను ఆన్లైన్ ద్వారా చూసుకోవచ్చు. మా సిబ్బంది ఇన్స్పెక్షన్కు వచ్చే ముందు మీ ఫోన్‌కు రింగ్ చేస్తారు. మీ సమక్షంలోనే కొలతలు తీసుకొని ట్యాబ్‌లో ఎంట్రీ చేస్తారు. దాంతో ఎంత ఫీజు చెల్లించాలో ఆటోమేటిక్‌గా మీకు సమాచారం వస్తుంది. ఆ మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లిస్తే అనుమతి పత్రం మీ చేతిలో ఉంటుంది. ఈ విషయంలో ఎవరి ప్రలోభాలకు గురవ్వాల్సిన పనిలేదు. ఆన్లైన్లోనే ప్రాసెస్ అయ్యేలా ఏర్పాట్లు చేశాం. నిర్ణీత వ్యవధిలోగా క్రమబద్ధీకరణ చేసి ఆన్లైన్లోనే ధ్రువపత్రం అందజేస్తాం. క్రమబద్ధీకరణ కోసం హెచ్ఎండీఏకు సుమారు 1.25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిష్కరిస్తే రూ.500 కోట్ల ఆదాయం వస్తుంది. రాబోయే 6 నెలల్లో వీటిని పరిష్కరించేందుకు సిబ్బందిని కార్యోన్ముఖులను చేస్తున్నా. ఫిబ్రవరి 16 నుంచి దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియను ప్రారంభిస్తాం. దీనికోసం అదనంగా సుమారు 70-75మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోబోతున్నాం. - టి.చిరంజీవులు, హెచ్ఎండీఏ కమిషనర్ -
ఆ నిధులు స్థానిక అభివృద్ధికే... !
సాక్షి, సిటీబ్యూరో : అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు వసూలు చేస్తున్న రుసుం (ఫీజు)లో నగర పంచాయతీలకు 70శాతం, గ్రామ పంచాయతీలకు 50శాతం చొప్పున వాటా ఇవ్వనున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు స్పష్టం చేశారు. ఈ నిధులను ఆయా ప్రాంతాల్లో రోడ్లు, నీటి సరఫరా, డ్రైనేజీ, వీధిదీపాలు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు వినియోగిస్తామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్-బీఆర్ఎస్లను సద్వనియోగం చేసుకోవడం ద్వారా అక్రమ నిర్మాణాలను సక్రమం చేసుకోవడంతో పాటు స్థానికంగా సౌకర్యాలు సమకూరతాయని, దీనివల్ల ప్రజలకే ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ విషయం చాలామందికి తెలియకపోవడం వల్లే అక్రమ నిర్మాణాలు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకొనేందుకు ఆసక్తి చూపట్లేదని, వారిలో అవగాహన పెంచేందుకు స్థానిక సంస్థల అధికారులతో పాటు రెవిన్యూ అధికారులు ప్రధాన భూమిక పోషించాలని కోరారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో నిర్మితమైన భవనాలు, ఇతర నిర్మాణాలను సర్వే నంబర్ల వారీగా ఎమ్మార్వోలు, వీఆర్వోలు గుర్తించి వాటి యజమానులను భూ వినియోగమార్పిడి దరఖాస్తు చేసుకొనేలా ప్రోత్సహించాలని సూచించారు. ఇటీవల మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో హెచ్ఎండీఏ నిర్వహించిన అవగాహన సదస్సులకు పెద్దమొత్తంలో జనాలు రావడాన్ని గమనించిన కమిషనర్ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమన్న వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకొనేలా వారిని కదిలించాలని తెలిపారు. ఎల్ఆర్ఎస్/బిఆర్ఎస్ల దరఖాస్తు గడువు ముగిశాక, ఎటువంటి పరిస్థితిలో దరఖాస్తులను స్వీకరించబోమని తెలిపారు. సకాలంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొన్న వారి దరఖాస్తులను 6నెలల వ్యవధిలోగా పరిష్కరించి అనుమతి పత్రాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగిశాక హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలు, లే అవుట్లను సమూలంగా కూల్చివే యడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అనుమతిలేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయకుండా (జీవో నెం.151, తేదీ2.11.2015 రూల్-13(సి) ప్రకారం) నిషేధిత ప్రాంతాల్లోకి చేర్చేందుకు రిజిస్ట్రేషన్ల శాఖకు సమాచారం ఇస్తామన్నారు. దీనివల్ల ఆయా ప్లాట్లు అమ్మడం గానీ, కొనడం గానీ ఇతర లావాదేవీలకు అవకాశం లేకుండా స్తంభింపజేస్తామని కమిషనర్ చిరంజీవులు ‘సాక్షి’కి వివరించారు.