సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎస్) కింద దరఖాస్తు చేసుకుని వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురైన వాటికి మళ్లీ అప్పీలు చేసుకునేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) వెసులుబాటు కల్పించింది. వీటిలో ఆమోదయోగ్యమైన వాటిని పరిశీలించి క్లియర్ చేయనున్నారు. నవంబర్ 1 నుంచి ఈ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని పరిశీలించేందుకు నలుగురు తహసీల్దార్‌లు, నలుగురు టెక్నికల్ ఆఫీసర్లతో ప్రత్యేక బృందం నియమించాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు బుధవారం నిర్ణయించారు. ఈ మేరకు ఐటీ అధికారులు, ఆయా విభాగాలకు చెందిన అధికారులకు మార్గనిర్దేశనం చేశారు.
32 వేల దరఖాస్తులకు అవకాశం..
హెచ్‌ఎండీఏకు ఎల్‌ఆర్‌ఎస్ కోసం వచ్చిన 1,75,253 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 77,000 దరఖాస్తులు క్లియర్ కాగా, 31,131 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 40 వేల దరఖాస్తులు వివిధ టైటిల్, టెక్నికల్ స్క్రూటినీ దశల్లో ఉన్నాయి. వీటిలో 20 వేలకుపైగా దరఖాస్తులు తిరస్కరించే అవకాశమున్నట్టు తెలిసింది. ఓపెన్ స్పేస్, రిక్రియేషనల్, వాటర్‌బాడీ, మాన్యుఫాక్చరింగ్, సెంట్రల్ స్క్వేర్, ట్రాన్స్‌పొర్టేషన్, బయో కన్జర్వేషన్, వాగు, నాలా, చెరువుల బఫర్ జోన్‌లో ప్లాట్‌తో పాటు ఇతర కారణాలతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను తిరస్కరించారు. యూఎల్‌సీ, వక్ఫ్, అసైన్డ్ ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్, ప్రభుత్వ భూముల్లో ఉన్న ప్లాట్లను సంబంధిత విభాగాల నుంచి ఎన్‌వోసీ తీసుకురావాలంటూ టైటిల్ సూపర్‌వైజ్ దశలోనే అధికారులు తిరస్కరించారు. ఇలా 32 వేల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. చాలా మంది నుంచి అభ్యర్థనలు రావడంతో హెచ్‌ఎండీఏ అప్పీల్‌కు అవకాశం ఇచ్చింది.
అప్పీల్ చేయడం ఇలా
హెచ్‌ఎండీఏ (http://hmda.gov.in/) వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ ఎల్‌ఆర్‌ఎస్ అప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారుడు తన యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయగానే వచ్చే అప్పీల్ ప్రొవిజన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు వాళ్లకు సంబంధించిన డాక్యుమెంట్ ప్రొవిజన్ వస్తుంది. తిరిగి వాళ్లు అప్‌లోడ్ చేయాలనుకునే డాక్యుమెంట్లను నిక్షిప్తం చేయాలి. తహసీల్దార్, టెక్నికల్ అధికారులు ఆ డాక్యుమెంట్లను పరిశీలించి అంతా ఓకే అనుకుంటే తదుపరి దశకు అనుమతిస్తారు. ఒకవేళ సరైనవి లేకపోతే తొలి దశలోనే తిరస్కరిస్తారు. అప్పీల్ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ చిరంజీవులు ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment