హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ‘కల్పతరువు’గా భావిస్తూ వస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA) భూముల వేలంను ఆపేయాలని నిర్ణయించుకుంది. వేలంపాటలో అక్రమాలు.. అవకతవకలు జరిగినట్లు గుర్తించడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా.. హెచ్‌ఎండీఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. వేలానికి ముందే పలువురు రియల్టర్లకు హెచ్‌ఎండీఏలోని అధికారులు సమాచారం చేరవేశారట. తద్వారా ఆ ఫలానా రియాల్టర్లకే భూములు దక్కేలా అధికారుల చర్యలు తీసుకున్నట్లు తేలింది.
ఈ మేరకు.. వేలంపాటపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చింది. దీంతో వేలంపాటను ఆపేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు.. ఇప్పటికే వేలం వేసిన భూములపై అధికారులు విచారణ చేపట్టారు.
ఇదిలా ఉంటే.. వేలంపాట సమయంలోనే కాకుండా.. ఆ తర్వాత కూడా హెచ్‌ఎండీఏలో తన పరిచయాల ద్వారా శివ బాలకృష్ణ ఈ తతంగాన్ని నడిపించినట్లు గుర్తించారు . భూములు వేలం తో పాటు ప్రాజెక్టుల వివరాలను రియల్టర్లకు చేర్చారు హెచ్‌ఎండీలో పని చేసిన అధికారులు. అంతేకాదు ధరలను నిర్ణయించడంలోనూ వీళ్లే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ అధికారుల పాత్రపైనా ఏసీబీ లోతైన దర్యాప్తు చేపట్టింది. ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాన్వేషణలో.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భూముల్ని వేలం వేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అధికారం అండతో.. అడ్డగోలుగా అవినీతికి పాల్పడి అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడు శివబాలకృష్ణ. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఏసీబీకి అతను ఆస్తులు కూడబెట్టిన తీరు ఏసీబీని సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇంట్లోవాళ్లు, బంధువులు, ఆఖరికి పనివాళ్ల పేరిట మీద కూడా బినామీ ఆస్తుల్ని కూడబెట్టాడతను. దీంతో బినామీలను అరెస్ట్ చేసి ఈ పాటికే విచారణ చేపట్టిన ఏసీబీ.. ఇవాళో, రేపో కీలక అరెస్టులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment