సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని కోకాపేట నియోపోలిస్ భూములను హెచ్‌ఎండీఏ ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరించి వేలం వేసినట్లు సర్కార్ స్పష్టం చేసింది. ఈ–వేలంతో సమకూరిన నిధులు రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీకి జమయ్యాయని వివరించింది. నియోపోలిస్ స్థలాల వేలం బాధ్యతలను హెచ్‌ఎండీఏ నిర్వహించిందని, స్థలాలను దక్కించుకున్న సంస్థలకు సేల్‌డీడ్ చేయించే బాధ్యత రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌దే అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లలోని భూములు ప్రభుత్వానివేనని పేర్కొన్నారు.
ఐటీ కారిడార్‌లోని కోకాపేటలో భూముల అమ్మకానికి జూలైలో ఆన్‌లైన్ వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్‌లో ఈ మేరకు ఈ–వేలంలో ప్లాట్లు భారీ రేట్లకు అమ్ముడుపోయా యి. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో 8 ప్లాట్లను విక్రయానికి ఉంచగా, వీటిని కొనడానికి 60 మంది బిడ్డర్లు పోటీపడ్డారు. ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించారు. కోకాపేట భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.2,000 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ వేలంతో రాష్ట్రంలోనే అత్యంత విలువైన భూమిగా కోకాపేటకు గుర్తింపు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment