
సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి, సీఎస్ శాంతికుమారి
మార్చి 31లోపు చెల్లిస్తే ఫీజులో 25 శాతం రాయితీ
2020 ఆగస్టు 28 నాటికి ఉన్న లేఅవుట్లకు పథకం వర్తింపు
గతంలో ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ చేసుకోని వారికీ రాయితీ
ఎల్‌ఆర్‌ఎస్ కింద గతంలో దరఖాస్తు చేసుకోని వారికీ చాన్స్
పథకంపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి,శ్రీధర్‌బాబు సమీక్ష.. వేగంగా దరఖాస్తుల పరిశీలనకు ఆదేశం
ఖజానాకు రూ.20 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ల క్రమబధ్దీకరణ పథకానికి (ఎల్‌ఆర్‌ఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. బుధవారం సచివాలయంలో ఎల్‌ఆర్‌ఎస్ అంశంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉన్నతస్థాయిలో సమీక్షించారు. ఎల్‌ఆర్‌ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని నిర్ణయించారు.
2021లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకొన్నవారిలో.. 2020 ఆగస్టు 28కు ముందు నాటి అక్రమ లేఅవుట్లనే క్రమబధ్దీకరించనున్నారు. మార్చి 31వ తేదీలోపు పూర్తిగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించినవారికి 25శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోని వారికి, లేఅవుట్లలో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల క్రమబధ్దీకరణకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక లేఅవుట్‌లో 10శాతం ప్లాట్లు రిజిస్టరై.. 90శాతం ప్లాట్లు మిగిలిపోయినా ఎల్‌ఆర్‌ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.
ప్లాట్లు కొనుగోలు చేసి సేల్‌డీడ్ రిజి్రస్టేషన్ కలిగిన వారికి కూడా క్రమబధ్దీకరణ చాన్స్ ఇచ్చారు. ఈ కేటగిరీల వారికి కూడా మార్చి 31లోగా ఎల్‌ఆర్‌ఎస్ చేసుకుంటే, ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని రోజు వారీగా సమీక్షించాలని కూడా నిర్ణయానికి వచ్చారు. పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు విజ్ఞప్తి చేశారు.
నిషేధిత భూముల జాబితా పట్ల అప్రమత్తం
ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో జాగ్రత్త వహించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. సాధారణ ప్రజలు ఇబ్బంది పడకుండా ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు.
ఎల్‌ఆర్‌ఎస్ కోసం జనం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా.. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే చెల్లింపులు చేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, దాన కిషోర్, నవీన్ మిట్టల్, జయేశ్ రంజన్, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ కమిషనర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
రూ.20 వేల కోట్ల రాబడి అంచనా
రాష్ట్రంలో 2021లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పథకానికి శ్రీకారం చుట్టింది. దానికి రాష్ట్రవ్యాప్తంగా 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కానీ కోర్టు కేసుల కారణంగా ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎల్‌ఆర్‌ఎస్‌పై దృష్టి పెట్టింది. అప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తగిన ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబధ్దీకరించుకొనేందుకు చర్యలు చేపట్టింది.
ఈ నిర్ణయం అమల్లోకి రావడానికి ఆలస్యమైంది. తాజాగా బుధవారం మంత్రులు సమావేశమై ఎల్‌ఆర్‌ఎస్‌కు ఆమోదం తెలిపారు. మార్చి 31వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.20 వేల కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.
ఇక వేగంగా దరఖాస్తుల పరిశీలన
రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు సుమారు 25.67 లక్షలు. ఇందులో 13,844 దరఖాస్తులకు సంబంధించి రూ.107.01 కోట్లు చెల్లింపు కూడా పూర్తయింది. మరో 9.21 లక్షల దరఖాస్తులను పరిశీలించి ఎల్‌ఆర్‌ఎస్‌కు ఆమోదయోగ్యమైనవిగా గుర్తించారు.
ఫీజు చెల్లించాలని నోటీసులు కూడా జారీ చేశారు. ఇంకా ఆయా నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, గ్రామ పంచాయతీల పరిధిలో వచ్చిన మిగతా సుమారు 16 లక్షల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఇకపై వేగవంగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment