విజన్ తెలంగాణ
ప్రత్యేక రాష్ట్ర సాధన ఘనత అమరులదే
- నవ తెలంగాణ నిర్మాణానికి ప్రజలు సన్నద్ధం కావాలి
- పభుత్వ ఉద్యోగులు నూతనోత్తేజంతో పనిచేయాలి
- అభివృద్ధి కార్యక్రమాల్లో అగ్ర స్థానం సాధించాలి
- ఉన్నత విద్యావకాశాలతో ఉపాధి కల్పన
- ఆవిర్భావ వేడుకల్లో కలెక్టర్ చిరంజీవులు సందేశం
నల్లగొండ, న్యూస్‌లైన్, ‘కల నిజమైంది...తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. పరాయి పాలన ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆత్మాభిమానం కోసం తెలంగాణ ప్రజలు అరవై ఏళ్లుగా చేస్తున్న పోరాటం విజయం సాధించింది. 29వ రాష్ట్రంగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులకే దక్కుతుంది. అమరుల త్యాగం వృథా కాకుండా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక తెలంగాణ సమాజం అంతా పోరు తెలంగాణ నుంచి విజన్ తెలంగాణ బాటలో నడవాలి’.. అని కలెక్టర్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు.
సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ సందేశాన్నిచ్చారు. ఉద్యమకాలమంతా తెలంగాణ సమాజం అనేక అవమానాలు, పరీక్షలు, కష్టనష్టాలకు ఓర్చి నిలబడింద ని తెలిపారు. మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే చెందాలనే దృఢ సంకల్పంతో అవిశ్రాంత పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు.
మెరుగైన అభివృద్ధి సాధించాలి..
తెలంగాణలో ఉన్న ప్రతి నీటివనరులను ఉపయోగంలోకి తీసుకువచ్చి బంజరు భూములు, పచ్చిక బయళ్లు సాగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందించాలన్నదే కొత్త ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. దీంతోపాటు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కల్పించడం ద్వారా ఉన్నత విద్యావకాశాలను పెంపొందించి ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్టు పేర్కొన్నారు.
ప్రస్తుతం మన రాష్ట్రంలో మిగులు బడ్జెట్‌తో ఉన్నామన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి అవకాశాలు మెం డుగా ఉన్నాయని చెప్పారు. 57ఏళ్ల సమైక్య పాలనలో సాధించిన దానితో సంతృప్తి పడకుండా నవ తెలంగాణ, సమ తెలంగాణ, సామాజిక తెలంగాణ నిర్మిం చుకోవాల్సిన ఆవశక్యత ఎంతైనా ఉందన్నారు.
ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలి...
ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో చేపట్టిన ప్రతి కార్యక్రమం అభివృద్ధిఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేకూర్సాలిన అవసరం ఉందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం ప్రభుత్వంలో పనిచే స్తున్న ప్రతి ఉద్యోగిపై బాధ్యతను పెంచుతుందన్నారు. అలాగే ప్రతి ఉద్యోగి తమకు అప్పగించిన పనులను సకాలంలో, పారదర్శకంగా పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎప్పటికప్పుడు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని నూతనోత్తేజంతో, అంకితభావంతో పనిచేయాలని కోరారు.
ఘనంగా సంబురాలు...
తెలంగాణ సంబురాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా గత నెల 28నుంచి ప్రజల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టి వేడుకలను ఘనంగా నిర్వహిం చుకున్నామన్నారు. మండల, డివిజన్‌స్థాయిలో మహిళలు, యువకులకు వివిధ రకాల క్రీడలు నిర్వహించి పండగ వాతావరణంలో వారిలో స్ఫూర్తి నింపామన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, అమరుల కుటుంబాలను, జిల్లాలో అనేక రంగాల్లో నిష్ణాతులైన, ఉన్నత శిఖరాలను అధిరోహించిన వివిధ రకాల ప్రముఖులను ఘనంగా సత్కరించామన్నారు.
కలెక్టర్ అభినందనలు..
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కర్షక, కార్మికులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని, వారందరికీ ఈ శుభ సందర్భంలో కలెక్టర్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలుచేస్తూ రాష్ట్రంలోనే జిల్లా ప్రత్యేకతను నిలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో ఎస్పీ టి.ప్రభాకర్‌రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఏజేసీ వెంకట్రావు, ఏఎస్పీ రమారాజేశ్వరి, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, జేడీఏ నర్సింగరావు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.