nava telangana
-
జర్నలిస్ట్ లక్ష్మణ్‌కు జర్నలిస్టు సంఘాల నివాళి
-
పత్రికల ధోరణిలో మార్పు రావాలి
‘నవ తెలంగాణ’ దినపత్రిక ఆవిష్కరణలో సీఎం కేసీఆర్ సంచలనాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని వెల్లడి ఈ పరిస్థితులను సమీక్షించుకోవాలని సూచన సాక్షి,హైదరాబాద్: పత్రికలు సంచలనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని, ఈ తీరులో మార్పు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల ప్రజా సమస్యలు మరుగున పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతులేని దుఃఖంలో ఉన్న ప్రజల గాథలు కొన్ని పైపైనే కనిపిస్తాయని, మరి కొన్నింటి కోసం లోతుగా అన్వేషించాల్సి ఉంటుందన్నారు.హైదరాబాద్‌లో లక్షా 50 వేలకు పైగా ప్రజలు ఫుట్‌పాత్‌లపైనే నిద్రపోతున్నారని ఓ సంస్థ సర్వేలో తేలిందని, ఆ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన నివేదిక తనను ఎంతో బాధకు గురిచేసిందని అన్నారు. మనసును కదిలించే ఇలాంటి వార్తలు పత్రికల్లో ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఎంతో మంది విజ్ఞులతో నిండిన పత్రికా రంగం ఈ అంశంపై సమీక్షించుకోవాలని సూచించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ రవీంద్ర భారతిలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ప్రెస్ అకాడమీ చెర్మైన్ అల్లం నారాయణతో కలిసి ‘నవ తెలంగాణ’ దినపత్రిక, వెబ్‌పోర్టల్‌ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నవ తెలంగాణ పత్రిక యాజమాన్యం, పాత్రికేయులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సమాజంలోని అన్ని కోణాలను స్పృశిస్తూ.. అన్నార్తులకు అండగా ఉంటూ.. చక్కటి విశ్లేషణలు, వార్తలతో పత్రిక ప్రాచుర్యం పొందాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే తన అస్తిత్వాన్ని పదిలపరుచుకోడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో తెలంగాణ పేరుతో కొత్త పత్రిక రావడం శుభ పరిణామమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘ప్రజాశక్తి’ పేరుతో వచ్చిన పత్రిక .. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ‘నవ తెలంగాణ’గా రూపాంతరం చెందడం అభిలషణీయమన్నారు. తెలంగాణ ఉనికిని కాపాడడానికి శతవిధాలుగా ప్రయత్నించాలని పత్రిక యజమానులకు సూచించారు. పత్రికా రంగం నేడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని, ఈ రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని ‘నవ తెలంగాణ’ సంపాదకులు ఎస్.వీరయ్య అంతకు ముందు తన ప్రసంగంలో పేర్కొనడాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తూ.. కొత్తగా ఏర్పడిన పత్రికకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామన్నారు. నవ తెలంగాణకు ప్రకటనల జారీ విషయంలో గతంలో ప్రజాశక్తి దినపత్రికకు అమలు చేసిన టారిఫ్‌ను కొనసాగిస్తామన్నారు. వచ్చే మంగళవారం నాటికి నవ తెలంగాణ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇస్తామన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పత్రికలు, విపక్షాలు కలిసి ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించాల్సిన అవసరముందన్నారు. ఏషియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రిన్సిపల్ శేషు కుమార్ మాట్లాడుతూ.. నేడు ప్రపంచ వ్యాప్తంగా పత్రికారంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని, అమెరికా లాంటి దేశాల్లో సైతం చాలా పత్రికలు మూసివేత దిశగా వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండే లైన్లు రాశారు: కేసీఆర్ ‘నవ తెలంగాణ’ ఆవిష్కరణలో సీఎం కేసీఆర్ పత్రికలతో తనకు ఎదురైన ఆసక్తికర అనుభవాలను వెల్లడించారు. గతంలో తాను అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై ఏకంగా 67 నిమిషాల పాటు చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుందని, నాటి స్పీకర్ తనను చాంబర్‌కు పిలుపించుకుని ప్రత్యేకంగా అభినందించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మరుసటి రోజు పత్రికల్లో తన ప్రసంగానికి సంబంధించిన వార్త కోసం ఆసక్తిగా వెతకగా... కేవలం రెండు వాక్యాలకు మించి వార్త కనిపించలేదన్నారు. అయితే, అదే ఒకసారి అసెంబ్లీలో నిరసనగా ఓ కాగితాన్ని స్పీకర్ వైపు విసిరితే మాత్రం ‘స్పీకర్‌పై దాడి’ అనే శీర్షికతో భారీ ప్రాధాన్యత ఇచ్చాయని చెప్పారు. -
కోటి కళల మైనా... నవ తెలంగాణ
ఏళ్ల నాటి తపస్సు ఫలించి అవతరించిన స్వరాష్ట్రం ‘కళకళ’లాడాలని నవతరం కోరుకుంటోంది. పాశ్చాత్య సంస్కృతి ధాటికి పాతబడిపోతున్న పల్లె కళలకు కొత్త వసంతం తెస్తామంటోంది. సాంస్కృతిక బానిసత్వాన్ని అడ్డుకుంటూ... సంప్రదాయ వారసత్వాన్ని మోసుకుంటూ... కోటి కళల వీణ... మా తెలంగాణ అని నిరూపిస్తామంటోంది. శిల్పారామంలో నిర్వహించిన యువజనోత్సవాల సాక్షిగా... పది జిల్లాల ప్రతిభ ప్రకాశించింది. కాసింత ప్రోత్సాహం అందిస్తే... అద్భుతాలు సృష్టిస్తానంటోంది. - ఎస్.సత్యబాబు ‘చందనాల సులోచనాల రాధా ప్రమీలో... ఊడల మర్రి కింద నాగుల పుట్ట చందనాల సులోచనాల...’ అంటూ జానపదం పల్లవించింది. ‘పాంచాలి... ఏమే ఏమేమే నీ కండకావరము..’ అంటూ పౌరాణికం ప్రతిధ్వనించింది. ‘పొరియా గడేపీ ఆయీ’ అంటూ బంజారా పాట ఝంఝుంమారుతమైతే... ‘వినరా ద్వారకా రాజా యమలోకమందుండెదనురా’ అంటూ యక్షగానం మలయమారుతమైంది. విలువలంటే కళలే... ఆయాసాల నుంచి పుట్టిన ఆటపాటలు, శ్రమైక జీవన పల్లెపదాలు జానపదంతో కదం తొక్కుతాయి. ‘ఊరికి ఉత్తరాన ఊడలమర్రి’ అనే జానపదంతో తనదైన శైలితో ఈ కార్యక్రమంలో ఆకట్టుకున్న సంజీవ్ లాంటివారు... పాప్లూ, ర్యాప్లూ మన సంప్రదాయ శైలుల ప్రాణం తీస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేయడంలో అతిశయోక్తి లేదని చూసిన వారెవరైనా అంటారు. వీటిని యువతకు దగ్గర చేయడం అంటే తెలంగాణ భవితను కళకళలాడేలా చేయడమే. ఇక తెలంగాణ ప్రాంతంలో మరో శక్తివంతమైన సంప్రదాయ కళ యక్షగానం. ‘నాన్న హయాంలో ఆయన ప్రోగ్రామ్ కోసం ఊర్లకు ఊర్లు ఎదురు చూసేవి’ అంటూ గుర్తు చేసుకున్న కరీంనగర్ వాసి ఎన్.సురేష్... యమధర్మరాజు గెటప్ వేసి యక్షగానం ఆలపిస్తే శిల్పారామంలో కళాభిమానులు కళ్లప్పగించేశారు. గోత్రాల వంటి కులాల వారికి వారసత్వంగా వస్తున్న యక్షగానం... ఇప్పుడున్న పరిస్థితిలో కెరీర్‌గా ఎంచుకోవడం దాదాపు అసాధ్యమే. అయితే అందరూ దీన్ని ఆదాయ కోణంలోనే చూస్తారనలేం. ఏ ఉద్యోగమూ లేదు... కేవలం పాటే నాకు ఉపాధి బాట అంటున్న సురేష్... కంప్యూటర్స్‌లో పీజీ చేశాడంటే ఆశ్చర్యం అనిపించక మానదు. స్వరాష్ట్రంలోనైనా యువత ‘కళ’లు సాకారం కావాలని సురేష్ కోరుకుంటున్నానన్నాడు. ఘగన్గోర్ తండా నాయకుడి ఇంటి ముందుకు వెళ్లి చేసే నృత్యం... పచ్చదనం ప్రాధాన్యత చెప్పే తీజ్ పండుగ, బావా మరదళ్ల సరసాల పాటలు, లంబాడీ, బంజారాల సంస్కృతి సంప్రదాయాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. పెద్దలు, పిన్నలు ఆటపాటలతో గడిపే ఘగన్గోర్ వంటివి తరాల మధ్య అంతరాలకు సంప్రదాయం అందించిన పరిష్కారం. ‘సేవ్ వాటర్ అంటూ మా వన్ యాక్ట్ ప్లేలో సందేశం ఇచ్చాం’ అని చెప్పాడు కృష్ణానాయక్. రంగారెడ్డి జిల్లా, రామచంద్రగూడకు చెందిన ఈ కుర్రాడు... తన 10 మంది సభ్యుల బృందంతో కలిసి వన్ యాక్ట్ ప్లే, సోలో డ్యాన్స్, ఫోక్ సాంగ్ ప్రదర్శనలు ఇచ్చాడు. రెండురోజుల పాటు మాదాపూర్‌లోని శిల్పకళాతోరణం సకల తెలంగాణ కళల శోభను సింగారించుకుని నవయవ్వనిలా మెరిసి మురిసింది. వ్యయప్రయాసలు తెలియవు... ఈ ఆభరణాలు ఎంత బరువుంటాయో తెలుసా... వీటిని ధరించి గంటల పాటు మోయాలి. వీటన్నింటికీ కలిపి రూ.6 వేల వరకూ అద్దె చెల్లించాలి’ అనే ఈ దుర్యోధన వేషధారి... వేదిక ఎక్కగానే వ్యయప్రయాసలన్నీ మరిచిపోతాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ‘ఖర్చులు, శ్రమ చూసుకుంటే తృప్తి దక్కదు’ అంటున్న జనగాం వాసి గట్టగల్ల భాస్కర్.. బీఏ గ్రాడ్యుయేట్. దేశవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చిన భాస్కర్... తాము మొత్తం 20 మంది బృందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్పాడు. ఫొటోలు: జి.రాజేష్ -
పక్కా ప్రణాళికతో...
-
పక్కా ప్రణాళికతో...
బంగారు తెలంగాణ నిర్మాణానికి పకడ్బందీగా ముందుకెళదాం: కేసీఆర్ అధికారులు, ప్రజాప్రతినిధులతో ‘నవ తెలంగాణ సమాలోచన’ గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయండి తెలంగాణ దృక్పథం, దృష్టితో {పణాళికలు ఉండాలి.. ఎక్కడా తప్పు జరగొద్దు.. బడ్జెట్ సమావేశాల నాటికి సిద్ధం కావాలి రైతు రుణ మాఫీ చేసి తీరుతాం.. వచ్చే కేబినెట్ భేటీలో నిర్ణయం ‘ప్లాన్ విలేజ్.. ప్లాన్ టౌన్.. ప్లాన్ సిటీ..’.. అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కొత్త నినాదమిది. ‘అంతా పక్కా ప్రణాళికతో, ఎక్కడా చిన్నతప్పు కూడా దొర్లకుండా పనులు జరగాలి..’.. అధికారులకు ఆయన సూచన ఇది. ‘ప్రభుత్వ యంత్రాంగంతో పాటు వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకూ అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి జరగాలి.. బంగారు తెలంగాణ కల సాకారం కావాలి..’.. తెలంగాణ సత్వర అభివృద్ధికి ఆదేశమిది.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యాలు, దృక్పథం, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికార యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టాలు, మార్గదర్శకాలేవీ తెలంగాణ కోణంలో లేవని, ఇకపై తెలంగాణ రాష్ట్ర కోణంలోనే ప్రణాళికలు, అభివృద్ధి అంతా సాగాలని సూచించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో ‘నవ తెలంగాణ సమాలోచన’ పేరిట సోమవారం జరిగిన మేధోమథనంలో కలెక్టర్లు, జేసీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. శాఖల వారీగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్రం వరకు, ప్రభుత్వ శాఖలు తమ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రణాళికల రూపకల్పనలో వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకు ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని సూచించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోబోమని... క్షేత్రస్థాయి నుంచి పూర్తి సమాచారంతోనే నిర్ణయాలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. హడావుడిలో చిన్న పొరపాటు జరిగినా తెలంగాణ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. నెలరోజుల్లో ప్రభుత్వం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదన్న విమర్శలను పట్టించుకోనని, కొత్త ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి రెండు మూడు నెలలు పడుతుందని పేర్కొన్నారు. ‘పంచాయతీ’ చెడిపోయింది.. స్థానిక సంస్థలు, చట్టసభలకు యువకులు ఎక్కువగా ఎన్నికయ్యారని, వారు చెడుదారి పట్టకముందే.. వారిని రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందని, దానిని సంస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒకప్పుడు ప్రజా భాగస్వామ్యం ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థ ఇప్పుడు రాజకీయమయమైందన్నారు. కొత్త ప్రజా ప్రతినిధులందరికీ 15 రోజుల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం.. తెలంగాణలోని 593 గ్రామాల్లో గృహ నిర్మాణంపై సర్వే చేస్తే.. ఒక్క ఇల్లు కూడా కట్టకుండానే రూ. 235 కోట్ల దుర్వినియోగం జరిగింది. అంచనాలు, బిల్లులున్నాయి. ఇళ్లు మాత్రం లేవు. గృహ నిర్మాణ కుంభకోణంపై లోతుగా విచారణ జరిపిస్తాం. దోషులు ఎవరైనా వదిలిపెట్టం. వారిని జైలుకు పంపించి తీరుతాం. రేషన్‌కార్డుల్లోనూ ఇవే అక్రమాలు. కుటుంబాల సంఖ్య కంటే.. 22 లక్షల కార్డులు అధికంగా ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి. బియ్యం ఎక్కడకు పోతోంది. వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. అంతా సరిచేస్తాం. బృందంగా ముందుకు సాగాలి.. వ్యక్తులుగా మనం ఉన్నతస్థానాల్లోకి వెళుతున్నా, బృందంగా మనం విజయవంతం కాలేకపోతున్నాం. ఇకపై తెలంగాణలో బృందంగా ముందుకు సాగాల్సి ఉంది. ప్రతీ అంశాన్ని మైక్రో స్థాయి నుంచి మాక్రో స్థాయి వరకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఎక్కడా ఒక్క అంశంలోనూ తప్పు జరగడానికి వీల్లేదు. రేపటి నుంచే ఈ విధానం అమలుకు క్షేత్రస్థాయిలో పని ప్రారంభం కావాలి. సెప్టెంబర్‌లో జరిగే బడ్జెట్ సమావేశాల నాటికి ఈ ప్రణాళిక సిద్ధం కావాలి. ‘ప్రణాళిక’లోనే ఎస్సీలకు బడ్జెట్.. తెలంగాణ రాష్ట్రంలో 15.4 శాతం మంది ఎస్సీలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద నిధులను 54 ప్రభుత్వ శాఖలకు ఇవ్వకుండా.. ఇకపై బడ్జెట్లో ‘ప్రణాళిక’ కింద నేరుగా ఎస్సీ విభాగానికి కేటాయిస్తాం. ఉదాహరణకు 40 వేల కోట్ల ప్రణాళిక బడ్జెట్ అయితే.. అందులో 6,160 కోట్లను నేరుగా ఎస్సీ శాఖకు కేటాయిస్తాం. వారే కార్యక్రమాలు చేపడతారు. ఎక్కడా నిధులు పక్కదారి పట్టడానికి వీలుండదు. అవసరమైతే సబ్‌ప్లాన్ చట్టంలో మార్పులు చేస్తాం. వృధా నిధుల లెక్కలు తీయండి.. ఉమ్మడి రాష్ట్రంలో లేబర్‌సెస్ కింద దాదాపు వెయ్యి కోట్లు వసూలయింది. ఆ నిధులు నిరుపయోగంగా ఉన్నాయి. ఇందులో తెలంగాణకు రూ. 600 కోట్ల వరకు రావచ్చు. ఈ విధంగా ఏయే శాఖల్లో నిధులు వినియోగించుకోకుండా ఉన్నాయో ఆ లెక్కలన్ని తీయండి. కేంద్రం నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించి వినియోగ పత్రాల(యుసీలు)ను ఎప్పటికప్పుడు వెంటనే సమర్పించండి. తద్వారా కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చుకోవచ్చు. 6 వేల మెగావాట్ల ప్రాజెక్టులు చేపడతాం.. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది. దీనిని అధిగమించడానికి ఆరు వేల మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టులను జెన్కో నిర్మిస్తుంది. అందుకు అవసరమైన కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. ఈ ప్రాజెక్టులకు బొగ్గు కేటాయింపు లేనందున విదేశీ బొగ్గు కొనుగోలు చేయక తప్పదు. మూడేళ్లలో 220 కోట్ల మొక్కలు నాటాలి.. సాధారణంగా భూ విస్తీర్ణంలో 33 శాతం అటవీ ప్రాంతం ఉండాలి. ప్రస్తుతం 25 శాతమే ఉంది. దానిని పెంచాలి. మూడే ళ్లలో 220 కోట్ల మొక్కలు పెంచాల్సి ఉంది. అభయారణ్యంలో వంద కోట్ల మొక్కల వేర్లు ఇంకా సజీవంగా ఉన్నందున, వాటిని పెంచాలి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మరో 120 కోట్లు నాటి పెంచాలి. ఒక్క హెచ్ఎండీఏ పరిధిలోనే పదికోట్ల మొక్కలు పెంచాలి. రహదారుల పక్కన చెట్లతోపాటు పూలమొక్కలు పెంచాలి. ప్రతీ గ్రామంలో 33 వేల మొక్కలు ప్రతీ సంవత్సరం ఇంకా పెంచాలి. అడవుల పెంపకానికి కేంద్రం వద్ద తెలంగాణ ప్రభుత్వం 1,100 కోట్లు జమ చేసింది. ఆ నిధులు తిరిగి ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరాం. వచ్చే కేబినెట్ భేటీలో రుణమాఫీపై నిర్ణయం రైతులకు రుణ మాఫీని కచ్చితంగా అమలు చేస్తాం. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం ప్రకటిస్తాం. ప్రతీ రైతుకు చెందిన భూమి భూసార పరీక్షను ప్రభుత్వమే చేయాలి. మండల, జిల్లా స్థాయిలో భూసార పరీక్షల సమాచారం ఉండాలి. గ్రామం, మండలం, జిల్లా వారీగా పంట ప్రాంతాలుగా విభజించాలి. తెలంగాణ ప్రాంతంలో ఏది ఎక్కువ వినియోగం అవుతుందనే దాన్ని బట్టి ఆయా విత్తనాలను సిద్ధం చేయాలి. వ్యవసాయ శాఖలో విస్తరణాధికారులు రైతుల పొలాల్లోకి వెళ్లడం పూర్తిగా మరిచిపోయారు. వారు కేవలం విత్తనాలు, ఎరువుల పంపిణీకి మాత్రమే పరిమితమయ్యారు. పాతతరం వ్యవసాయ విధానాల స్థానంలో కొత్త ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, ఒక్కపైసా దుర్వినియోగం కావొద్దు.. పేదలకు ఇళ్లు, వృద్ధులు, వితంతువులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ. 1,500 పెన్షన్ ఇస్తాం. ఈ పథకాల్లో ఒక్క పైసా దుర్వినియోగం కావడానికి వీల్లేదు. గ్రామాలు, మండలాల వారీగా స్థానిక స్వపరిపాలన జరగాలి. స్వయం సమృద్ధి సాధించాలి. ఆర్థిక భారం లేని మంచి పథకాలు, విధానం గురించి ఆలోచించాలి. డబ్బు ఇస్తేనే పనులు చేస్తామనే భావన పోవాలి. బ్యూరోక్రటిక్ ధోరణి ఉండొద్దు. ప్రతీ గ్రామానికి ఒక డంప్ యార్డు, శ్మశాన వాటిక ఉండాలి. పట్టణాలు, కార్పొరేషన్లలో మూడు నుంచి పది వరకు ఉండాలి. ప్రతి జిల్లాలో పరిశ్రమలు.. తెలంగాణలో 35 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. పరిశ్రమల ఏర్పాటు కోసం 2.20 లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. జిల్లాలు, మండలాల వారీగా నివేదికలున్నాయి. ఒక్క వరంగల్‌లో మాత్రమే భూమి తక్కువగా ఉంది. ఇవి వ్యవసాయానికి ఉపయోగపడని భూములు. ప్రభుత్వ ఖజానా నిండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా... ఈ ప్రాంతాల్లో, ప్రతి జిల్లాలో పరిశ్రమలు పెట్టాలని కోరుదాం. వాటికి మౌలిక సదుపాయలు కల్పిద్దాం. చెరువులన్నీ ధ్వంసం చేశారు.. ‘‘తెలంగాణకు కృష్ణా, గోదావరి నదుల కింద 1,200 టీఎంసీలు కేటాయించారు. అందులో చిన్న నీటిపారుదలకు కృష్ణా బేసిన్లో 90 టీఎంసీలు, గోదావరిలో 175 టీఎంసీలు కేటాయించారు. కానీ చెరువులను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారు. ఇప్పుడు రెండు నదుల పరిధి నుంచి 65 టీఎంసీలు కూడా చెరువులు, కుంటల్లో నిండడం లేదు. యుద్ధ ప్రాతిపదికన చెరువులు, కుంటలను పునర్నిర్మించాలి. నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఇకపై విధిగా తాగునీరు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు ఎంత మొత్తం నీటి కేటాయింపులు చేసేదీ ముందుగానే నిర్ణయించాలి. దానికి అనుగుణంగా ప్రణాళిక ఉండాలి. వెయ్యికోట్లతో చిన్న నీటిపారుదల రంగాన్ని యుద్ధ ప్రతిపాదికన సరిచేస్తాం. ఇందుకోసం ఉపాధి హామీ నిధులు వినియోగిస్తాం. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాలు గోదావరి బేసిన్లో, దక్షిణ తెలంగాణలోని నాలుగు జిల్లాలు కృష్ణా బేసిన్లో ఉంటే.. ఖమ్మం, వరంగల్ జిల్లాలు మాత్రం ఇరు బేసిన్ల పరిధిలో ఉన్నాయి. జూరాల-పాకాల వరకు గురుత్వాకర్షణ ద్వారా నీటిని తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. గ్రావిటీ, ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పాదకత పెంచుదాం. ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మిద్దాం. లెండి, కౌలాస్ నాలా పనులు చేపట్టాలి. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి. జిల్లాల పెంపునకు సూచనలు ఇవ్వండి తెలంగాణలో జిల్లాల సంఖ్యను పెంచడంపై తగిన సూచనలు ఇవ్వాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. మొత్తం ఒకే సారి జిల్లాల సంఖ్యను పెంచకుండా..దశల వారీగా జిల్లాల పెంపు ఉంటుందని చెప్పారు. జిల్లాల భౌగోళిక స్వరూపం ఆధారంగా ఏయే ప్రాంతాలను కలిపి జిల్లాగా మార్చడానికి అవకాశం ఉందో పరిశీలించాలని సూచించారు. అలాగే పాలన మరింత పకడ్బందీగా కొనసాగడానికి, ప్రజలకు అవసరమైన సేవలు అందించడానికి వీలుగా జాయింట్ కలెక్టర్ల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు. -
లక్ష వరకూ రుణమాఫీ చేస్తాం: కేసీఆర్
-
లక్ష వరకూ రుణమాఫీ చేస్తాం: కేసీఆర్
హైదరాబాద్ : నవ తెలంగాణ నిర్మాణం వైపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన కసరత్తును ముమ్మరం చేశారు. కొత్త రాష్ట్రంలో సరికొత్త పాలనకు ప్రణాళికలు, చట్టాల రూపకల్పన లక్ష్యంగా మంత్రులు, కార్యదర్శులు, అన్ని శాఖల అధిపతులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ఆయన సోమవారం భేటీ అయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన మేథోమథనంలో కేసీఆర్ నవ తెలంగాణ నిర్మాణానికి అనుసరించాల్సిన విధి విధానాలపై అధికారులకు నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామన్నారు. కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటామని, రూ.లక్ష వరకూ రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానం హైదరాబాద్ నుంచి కాదని, గ్రామస్థాయి నుంచి రావాలన్నారు. వందల కోట్ల ప్రజాధనం ఎక్కడకి పోతుందో తేలాలన్నారు. ప్రబుత్వ పథకాల అమలులో రూపాయి కూడా దుర్వినియోగం కారాదని కేసీఆర్ సూచించారు. త్వరలోనే సర్పంచ్ల నుంచి ఎమ్మెల్యే వరకూ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రజా ప్రతినిధుల శిక్షణా తరగతుల కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధమని ఆయన చెప్పారు. నెల రోజులుగా ప్రతిశాఖపై సమీక్ష జరిపామని, శాఖలవారీ సమీక్షలతో పూర్తి స్థాయి అవగాహన వచ్చినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త పంథాతో ముందుకు వెళతామని తెలిపారు. తెలంగాణలో కుటుంబాలకు మించిన రేషన్ కార్డులు ఉన్నాయని, 22 లక్షల పైగా అదనపు కార్డులు జారీ చేసినట్లు చెప్పారు. ఇప్పుడున్న చట్టాలు ఉమ్మడి రాష్ట్రం కోసం చేసినవని అన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్లతో ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ పథకాల్లో అవకతవకలకు పాల్పడితే ఎంతటి వారిపైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చిత్తశుద్ధితో నవ తెలంగాణ నిర్మించుకుందామని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు. -
నేరరహిత హైదరాబాద్ హోంమంత్రి నాయిని
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌ను నేర రహిత మహానగరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. నగరంలో 600 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారి భరతం పడతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో వనస్థలిపురం హుడా ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సంబరాలకు బుధవారం నాయిని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన స్తూపం, 60 అడుగుల స్తంభంపై ఆవిష్కరించిన జెండా వద్ద అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రజలపై వ్యతిరేకత లేదని, తెలంగాణను ఆగం చేసిన నాయకులపైనే తమ వ్యతిరేకత అని తెలిపారు. తెలంగాణను అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నేడు తెలంగాణను నవ తెలంగాణ చేస్తానంటున్నాడని విమర్శించారు. హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల వారికి లేని రక్షణ చర్యలు ఆంధ్రా వారికే ఎందుకని ప్రశ్నించారు. -
కేసీఆర్ కేబినెట్!
సంపాదకీయం: దేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు నేతృత్వాన సోమవారం నూతన మంత్రివర్గం కొలువుదీరింది. తాము అధికారంలోకొస్తే అమలు చేయతలపెట్టిన ఎజెండాను పార్టీ మేనిఫెస్టో ద్వారా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించివున్న కేసీఆర్ అందుకనుగుణమైన కార్యాచరణ కోసం సమర్ధులని భావించినవారిని సహచరులుగా ఎంపిక చేసుకున్నారు. అటు అనుభవానికీ, ఇటు కొత్తదనానికీ సమ ప్రాధాన్యమిచ్చి ఈ కేబినెట్‌ను రూపొందించినట్టు కనబడుతున్నది. కేవల అనుభవాన్నే పరిగణనలోకి తీసుకుంటే సమర్ధతగల కొత్తవారికి అన్యాయం జరుగుతుంది. అది రాబోయే కాలంలో నాయకత్వ కొరతకు దారి తీస్తుంది. అందువల్ల పాతవారికి అవకాశం కల్పిస్తూనే కొత్త నెత్తురును ఎక్కించడం తప్పనిసరి. అప్పుడే కొత్త ఆలోచనలకూ, కొత్త పనివిధానానికి దారులు పరిచి నట్టవుతుంది. ఇవన్నీ చూసుకుంటూనే విధేయతకూ తగినంత చోటి వ్వక తప్పదు. అందువల్లే కేబినెట్ కూర్పులో కేసీఆర్ దాన్ని కూడా గమనంలోకి తీసుకున్నారు. అయితే, టీఆర్ఎస్నుంచి ఆరుగురు మహిళలు గెలిచినా ఒక్కరికి కూడా తొలి కేబినెట్లో అవకాశం కల్పించ కపోవడం వెలితిగానే కనబడుతోంది. కేబినెట్ విస్తరణలో ఆ లోటును భర్తీచేస్తే చేయవచ్చుగానీ తొలి మంత్రివర్గానికుండే ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళలనుంచి ఒక్కరినైనా తీసుకుని ఉంటే బాగుండేది. రాజకీయాల్లోనూ, కార్మికోద్యమాలలోనూ కాకలు తీరిన నాయిని నర్సింహారెడ్డికి అత్యంత కీలకమైన హోంశాఖను కేటాయించారు. సోష లిస్టు ఉద్యమకారుడిగా ఉన్నప్పటినుంచీ పౌరహక్కుల ఉల్లంఘనలపై కూడా ప్రశ్నించిన అనుభవం ఉన్న నాయినికి ఈ శాఖ నిర్వహణ నిజా నికి కత్తిమీది సాములాంటిదే. దానిని ఆయన ఎంత చాకచక్యంగా నిర్వహిస్తారో చూడాలి. దివంగత నేత వైఎస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో టీఆర్ఎస్ తరఫున నాయిని కేబినెట్ మంత్రిగా పనిచేసి, సాంకేతిక విద్యాశాఖను చూశారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ శాసనసభా పక్షం నేతగా విశేషానుభవం ఉన్న ఈటెల రాజేందర్‌కు ముఖ్యమైన ఆర్ధిక మంత్రిత్వ శాఖను అప్పగించారు. తెలంగాణకు ఆదాయవనరుల్లో లోటేమీ లేదు గనుక ఆర్ధిక శాఖను సునాయాసంగా నిర్వహించవచ్చునని... బడ్జెట్ రూపకల్పనలో తలనొప్పులేమీ ఉండవని అందరూ అనుకుంటారు. అయితే, రైతు రుణమాఫీ మొదలుకొని ప్రభుత్వ సిబ్బంది జీతాల పెంపు వరకూ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అనేక హామీలిచ్చింది. వాటన్నిటినీ అమలు చేయాలంటే అదనపు వనరుల సేకరణకు మార్గాలు వెదకడం తప్పనిసరి. సామాన్యులకు పన్నుపోటు కలిగించకుండా...ఇచ్చిన వాగ్దానాల అమలుకు లోటు రానీయకుండా ఈటెల ఎలా నెగ్గుకొస్తారన్నది చూడాల్సి ఉంది. గతంలో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డికి అత్యంత ప్రధానమైన వ్యవసాయ శాఖ లభించింది. వైఎస్ కేబినెట్లో యువజన సర్వీసుల మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు భారీ నీటిపారుదల శాఖను అప్పగించారు. ఉప ముఖ్య మంత్రులుగా అవకాశం లభించిన మహమూద్ అలీ, డాక్టర్ రాజయ్య లిద్దరూ తొలిసారి మంత్రులైనవారు. వారికి అప్పగించిన శాఖలు కూడా ముఖ్యమైనవే. మహేందర్ రెడ్డి, జోగు రామన్న, పద్మారావు, జగదీశ్‌రెడ్డి, కేటీఆర్‌లకు కూడా మంత్రి పదవులు కొత్త. ఇప్పుడున్న మంత్రివర్గ పరిమాణాన్ని చూసినా, కొందరికి ఒకటికన్నా ఎక్కువ శాఖలు అప్పగించిన తీరును గమనించినా త్వరలోనే విస్తరణ ఉంటుం దని సులభంగానే అర్ధమవుతుంది. ఆ విస్తరణలో మహిళలకూ, ఇప్పు డు అసలే చోటుదక్కని మహబూబ్‌నగర్ జిల్లావంటివాటికి జాగా లభిస్తుందని భావించవచ్చు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక నూతన రాష్ట్రావతరణ వేడుకల్లో నవ తెలంగాణ నిర్మాణంపై తన ఆలోచనలను కేసీఆర్ వెల్లడించారు. ఈ ప్రసంగంలో ఆయన ప్రకటించిన పథకా లన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచినవే. పారదర్శకమైన పాలనకు పెద్ద పీట వేస్తానని, రాజకీయ అవినీతికి తావు లేకుండా చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణను దేశంలో ఆదర్శనీయమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ఎజెండాను ప్రజలముందుంచారు. కొత్త రాష్ట్రం గనుక పాలనాపరంగా ఎదుర్కొనే చిన్న చిన్న ఇబ్బందులతో పాటు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా పంపకాల విషయంలో సహజంగానే కొన్ని సమస్యలుంటాయి. విభజించే ముందు నదీజలాల కేటాయింపువంటి కీలకాంశాలపై నిర్ణయం తీసుకోనందు వల్ల ఈ సమస్యలు తప్పనిసరి. ఇలాంటి ఇబ్బందులను అధిగమించ డానికి ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో, విశాల హృదయంతో వ్యవహరించడం తప్పనిసరి. ఈ విషయంలో ఏకొంచెం ఏమరుపాటుగా ఉన్నా, రాజకీయ ప్రయోజనాలను ఆశించి వ్యవహరించినా అనవసర భావోద్వేగాలు పెరుగుతాయి. పరస్పర అపనమ్మకం ఏర్పడే ప్రమాదమూ ఉంటుంది. ఇరు రాష్ట్రాల అభివృద్ధిపైనా దాని ప్రభావంపడే అవకాశం కూడా ఉంటుంది. భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా రెండు ప్రాంతాల్లోని ప్రజలూ ఒక జాతిగా, ఒకే తల్లి బిడ్డలుగా నిన్నటివరకూ కలిసిమెలిసి ఉన్నవారే గనుక తాత్కాలికంగా ఏర్పడే ఇబ్బందులు ఆ సంబంధాలపై ప్రభావం చూపకూడదు. అందుకోసం రెండు ప్రభుత్వాలూ ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంటుంది. తమ తమ ప్రాంతాల్లోని ప్రజలకు అవసరాన్నిబట్టి నచ్చజెప్పవలసిన బాధ్యతా ఉంటుంది. రెండు రాష్ట్రాల పాలకులూ దీన్ని గుర్తించి వ్యవహరిస్తారని ఆశిద్దాం. -
విజన్ తెలంగాణ
ప్రత్యేక రాష్ట్ర సాధన ఘనత అమరులదే - నవ తెలంగాణ నిర్మాణానికి ప్రజలు సన్నద్ధం కావాలి - పభుత్వ ఉద్యోగులు నూతనోత్తేజంతో పనిచేయాలి - అభివృద్ధి కార్యక్రమాల్లో అగ్ర స్థానం సాధించాలి - ఉన్నత విద్యావకాశాలతో ఉపాధి కల్పన - ఆవిర్భావ వేడుకల్లో కలెక్టర్ చిరంజీవులు సందేశం నల్లగొండ, న్యూస్‌లైన్, ‘కల నిజమైంది...తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. పరాయి పాలన ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆత్మాభిమానం కోసం తెలంగాణ ప్రజలు అరవై ఏళ్లుగా చేస్తున్న పోరాటం విజయం సాధించింది. 29వ రాష్ట్రంగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులకే దక్కుతుంది. అమరుల త్యాగం వృథా కాకుండా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక తెలంగాణ సమాజం అంతా పోరు తెలంగాణ నుంచి విజన్ తెలంగాణ బాటలో నడవాలి’.. అని కలెక్టర్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ సందేశాన్నిచ్చారు. ఉద్యమకాలమంతా తెలంగాణ సమాజం అనేక అవమానాలు, పరీక్షలు, కష్టనష్టాలకు ఓర్చి నిలబడింద ని తెలిపారు. మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే చెందాలనే దృఢ సంకల్పంతో అవిశ్రాంత పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు. మెరుగైన అభివృద్ధి సాధించాలి.. తెలంగాణలో ఉన్న ప్రతి నీటివనరులను ఉపయోగంలోకి తీసుకువచ్చి బంజరు భూములు, పచ్చిక బయళ్లు సాగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందించాలన్నదే కొత్త ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. దీంతోపాటు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కల్పించడం ద్వారా ఉన్నత విద్యావకాశాలను పెంపొందించి ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో మిగులు బడ్జెట్‌తో ఉన్నామన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి అవకాశాలు మెం డుగా ఉన్నాయని చెప్పారు. 57ఏళ్ల సమైక్య పాలనలో సాధించిన దానితో సంతృప్తి పడకుండా నవ తెలంగాణ, సమ తెలంగాణ, సామాజిక తెలంగాణ నిర్మిం చుకోవాల్సిన ఆవశక్యత ఎంతైనా ఉందన్నారు. ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలి... ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో చేపట్టిన ప్రతి కార్యక్రమం అభివృద్ధిఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేకూర్సాలిన అవసరం ఉందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం ప్రభుత్వంలో పనిచే స్తున్న ప్రతి ఉద్యోగిపై బాధ్యతను పెంచుతుందన్నారు. అలాగే ప్రతి ఉద్యోగి తమకు అప్పగించిన పనులను సకాలంలో, పారదర్శకంగా పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎప్పటికప్పుడు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని నూతనోత్తేజంతో, అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఘనంగా సంబురాలు... తెలంగాణ సంబురాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా గత నెల 28నుంచి ప్రజల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టి వేడుకలను ఘనంగా నిర్వహిం చుకున్నామన్నారు. మండల, డివిజన్‌స్థాయిలో మహిళలు, యువకులకు వివిధ రకాల క్రీడలు నిర్వహించి పండగ వాతావరణంలో వారిలో స్ఫూర్తి నింపామన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, అమరుల కుటుంబాలను, జిల్లాలో అనేక రంగాల్లో నిష్ణాతులైన, ఉన్నత శిఖరాలను అధిరోహించిన వివిధ రకాల ప్రముఖులను ఘనంగా సత్కరించామన్నారు. కలెక్టర్ అభినందనలు.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కర్షక, కార్మికులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని, వారందరికీ ఈ శుభ సందర్భంలో కలెక్టర్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలుచేస్తూ రాష్ట్రంలోనే జిల్లా ప్రత్యేకతను నిలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో ఎస్పీ టి.ప్రభాకర్‌రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఏజేసీ వెంకట్రావు, ఏఎస్పీ రమారాజేశ్వరి, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, జేడీఏ నర్సింగరావు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు ఎంపీ పొంగులేటి శుభాకాంక్షలు
ఖమ్మం: దశాబ్దాల ప్రజల కల నెరవేరింది...నవ తెలంగాణలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు నిరుపేదలందరికీ అందాలని, అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా నవ తెలంగాణ నిర్మాణంలో అన్ని పార్టీలు భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్ర వాసుల ఆశయాలకు అనుగుణంగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి, పరిష్కారానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. నవతెలంగాణ పునర్నిర్మాణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన పోరాడుతానని వివరించారు. -
నవ తెలంగాణ వికాసానికి సిద్ధం
నకిరేకల్, న్యూస్‌లైన్ : నవ తెలంగాణ వికాసానికి సీపీఎం కార్యకర్తలు సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. నకిరేకల్ పట్టణంలో సోమవారం జరిగిన ఆ పార్టీ డివి జన్ కమిటీ సమావేశంలో ఆయ న మాట్లాడారు. నవ తెలంగాణ వికాసంలో సీపీఎం స్పష్టమైన ఎజెండాతో ముం దుకు సాగుతుందన్నారు. సామాజిక న్యాయంతో కొందరికి పదవులు ఇచ్చినంత మాత్రాన సామాజిక న్యాయం జరగదన్నారు. వృత్తిదారులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతికి కృషి చే సినప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓటర్లను అనేక ప్రలోభాలకు గురితీసిందని ఆరోపించా రు. కాంగ్రెస్‌తో పాటు టీఆర్ ఎస్, బీజేపీలు సైతం విచ్చలవిడిగా మద్యం పారించి రాజకీయాలను కలుషితం చేశాయన్నారు. సీపీఎం నైతిక విలువల కోసం పోరాడుతుందన్నారు. ఆ పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడు బోళ్ల నర్సిం హారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి ఎండీ జహంగీర్, నాయకు లు మేక అశోక్‌రెడ్డి, మామిడి సర్వయ్య, కందాల ప్రమీల, వంటెపాక వెంకటేశ్వర్లు, జీరాల పెం టయ్య, గాదగోని కొండయ్య, బొజ్జ చిన్నవెం కులు, అచ్చాలు, గడుసు వెంకట్‌రెడ్డి, నంద్యాల వెంకట్‌రెడ్డి, మర్రి వెంకటయ్య, చెరుకు పెద్దులు తదితరులు ఉన్నారు. -
నవ తెలంగాణ నిర్మాణం వైఎస్ఆర్సీపీతోనే సాధ్యం
న్యూస్‌లైన్: నవ తెలంగాణ నిర్మాణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వైఎస్సార్సీపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వె ఎస్సార్ కుటుంబానికి అండగా ఉండాలని కోరారు. జగన్ పర్యటన సందర్భంగా ఆదివారం వైరాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కుంటుపడటానికి కిరణ్ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. వైఎస్సార్ పథకాలు అమలు కావాలంటే జగనన్న నాయకత్వంలోనే సాధ్యమవుతుం దన్నారు. ప్రతి పేదకు వైఎస్ హయాంలో న్యాయం జరిగిందని తెలిపారు. జనం కోసం వైఎస్ జగన్ పోరాడుతున్నారని అన్నా రు. రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, టీడీపీలు కుమ్మైక్కై 16 నెలల పాటు జగన్‌ను జైలు పాలు చేశాయని అన్నారు. అయినా ఆయన నిత్యం ప్రజల కోసమే పరితపించారని పేర్కొన్నారు. వైఎస్సార్ పాలనలో సువర్ణయుగం : వైఎస్సార్ సీపీ వైరా నియోజకవర్గ అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్ దివంగత మహనేత డాక్టర్ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రం సువర్ణయుగంగా ఉందని, మళ్ళీ అదే సువర్ణయుగం రావాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో మాత్రమే సాధ్యమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్ అన్నారు. వైఎస్సార్ జనరంజక పాలన అందించారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నానని, రాష్ట్రంలో వైఎస్సార్ పాలనకు ముందు ముఖ్యమంత్రులను చూశామని ఆ పాలనకు, వైఎస్ఆర్ పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి సీపీఎం బలపరిచిన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తనకు గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి బొంతు రాంబాబు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ షేక్ లాల్‌మహ్మద్, నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి బొర్రా ఉమాదేవి, ఐలూరి మహేష్‌రెడ్డి , తాతా నిర్మల పాల్గొన్నారు. -
నవ తెలంగాణ నిర్మాణంలో యువత పాత్రే కీలకం
మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ జోగిపేట, న్యూస్‌లైన్: నవ తెలంగాణ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం జోగిపేటలో సిరి, వివేకానంద, శ్రీరాం, భవానీ, గణేష్, గణసేన, దుర్గాభవానీ, జూనియర్ వివేకానంద యువజన సంఘాలకు చెందిన సుమారు 500 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఓటమి, గెలుపులు సహజమే అయినప్పటికీ యువత సరైన నాయకత్వాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాయకుడికి, ప్రజలకు మధ్య విశ్వసనీయత ఉండాలన్నారు. వాగ్ధానాలు చేసే ముందు అవి ఆచరణకు సాధ్యమా లేదా అని ఆలోచించాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు అవసరమన్నారు. మనిషికి ఉన్న స్వేచ్ఛ, స్వయంపాలన, ఆత్మగౌరవం, సమానత్వాన్ని హరించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారని దానినే ఉద్యమంటారన్నారు. మనిషికి అస్తిత్వం, ఆత్మగౌరవం, జవాబుదారీ తనం ఉండాలన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు మధ్య ఉన్న తేడాను ఆయన వివరించారు. సమావేశానికి మాజీ డీసీసీబీ డెరైక్టర్ ఎస్.జగన్మోహన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎస్.సురేందర్‌గౌడ్, ఏ.చిట్టిబాబు, మాజీ ఎంపీపీ అధ్యక్షుడు పి.నారాయణ, హెచ్.రామాగౌడ్, యువజన సంఘ నాయకులు నాగరాజ్ముదిరాజ్, శ్రీధర్, ఆనంద్, ఫైజల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. -
అమ్మ మాట..
ఏడాదికోసారైనా అమరులను తలచుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల జ్ఞాపకార్థం ప్రభుత్వమే విగ్రహాలు, స్థూపాలు ఏర్పాటు చేయాలి. వారి కుటుంబాలకు బస్సు, రైలు పాస్‌లు అందజేయాలి. ఏడాదికోసారి అమరుల జ్ఞాపకార్థం సభలు, సమావేశాలు నిర్వహించి నివాళులర్పించాలి. అప్పుడే నాలాంటి తెలంగాణ అమరవీరుల తల్లులకు మనశ్శాంతి లభిస్తుంది. నవ తెలంగాణలో ప్రభుత్వమే ప్రతీ పేదకీ ఇల్లు నిర్మించి ఇవ్వాలి. కొత్త రాష్ట్రంలో లంచాలనే మాట వినిపించకుండా చేయాలి. అందరూ కష్టపడి కొత్త రాష్ట్రం నిర్మాణంలో పాలుపంచుకోవాలి. పేద విద్యార్థులుకు నాణ్యమైన విద్య అందించే ఏర్పాట్లు చేయాలి. చదువుకున్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగం కల్పించాలి. రేషన్‌షాపుల ద్వారా ప్రతీ ఒక్కరికీ నెలకు 15కిలోల బియ్యం పంపిణీ చేయాలి. అలాగే తెలంగాణలో మద్యాన్ని నిషేధించాలి. పేదలు పెద్దాస్పత్రులకు వెళ్లలేక తనువు చాలిస్తున్నారు. ఈ దుస్థితి ప్రత్యేక రాష్ట్రంలో తలెత్తకుండా అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించే ఏర్పాటు చేయాలి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే, ఎంపీల ఆస్తులు పెరిగితే వారిని అనర్హులుగా ప్రకటించాలి. -న్యూస్‌లైన్, ఇల్లెందు -
కాంగ్రెస్‌తోనే ‘నవతెలంగాణ’
గజ్వేల్, న్యూస్‌లైన్: నవ తెలంగాణ నిర్మాణం కాంగ్రెస్‌కే సాధ్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దామోదర ప్రసంగిస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటువల్ల రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో పార్టీ తీవ్రమైన నష్టానికి గురవుతుందని తెలిసీ కూడా పోనియాగాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. అదే స్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో ముందుకుసాగుతోందని చెప్పారు. సొంత రాష్ట్రం కలను నిజం చేసిన సోనియాను మరిచిపోవద్దన్నారు. పూటకో మాట మాట్లాడే కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి గారడీ మాటలతో వస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను గెలిపిస్తే దొరల తెలంగాణ వచ్చి పేదల జీవితాలు మరింత అగాధంలోకి వెళతాయని చెప్పారు. తెలంగాణ ప్రజల సుందర స్వప్నమైన ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని పూర్తి చేయడం కాంగ్రెస్‌కే సాధ్యమనే విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించకముందే తానూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశానని గుర్తు చేశారు. 41మంది ఎమ్మెల్యేలతో సోనియాగాంధీకి వినతిపత్రం సమర్పించానని చెప్పారు. మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప్రజలను ప్రజావంచనకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలు అమలుకు సాధ్యంకానీ మేనిఫెస్టోను విడుదల చేశాయని మండిపడ్డారు. ఎన్నో హమీలనిచ్చి నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. గజ్వేల్‌పై కేసీఆర్ పెత్తనమేంటీ? గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ స్థానికేతరుడైన కేసీఆర్ గజ్వేల్ ప్రజలపై పెత్తనం చెలాయిస్తానంటే ఇక్కడి ప్రజలు సహించేస్థితిలో లేరని పేర్కొన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లాలంటే నాలుగు గేట్లు ఉంటాయని, ఈ గేట్లు దాటి ప్రజలు వెళ్లటం అసాధ్యమని చెప్పారు. అదే గజ్వేల్‌లోని తన ఇంటికి ప్రజలు ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉంటానని చెప్పారు. టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిది మోసాల చరిత్ర అని విమర్శించారు. గజ్వేల్‌లో టీఆర్ఎస్, టీడీపీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇదిలావుంటే తనకు రాజకీయాల్లో ఎంతోప్రోత్సాహన్నిచ్చి సమర్థంతమైన పాలన అందించిన వైఎస్‌ను మరిచిపోలేనని చెప్పారు. ఇంకా ఈ సభలో కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి శ్రవన్‌కుమార్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. గజ్వేల్‌లో భారీ ర్యాలీ.... నర్సారెడ్డి నామినేషన్ సందర్భంగా గజ్వేల్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోటమైసమ్మ గుడి నుంచి ఇందిరాపార్క్, అంబేద్కర్ చౌరస్తాల మీదుగా బహిరంగ సభా ప్రదేశం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు ఈ సందర్భంగా బతుకమ్మలు, బోనాల ఊరేగింపుతో ఆకట్టుకున్నారు. -
అమ్మ మాట: పాణం పెడితెనే పనైతదన్నడు
బిడ్డ సావుతోని మూడు దినాలు పోరాడిండు. పగలైతే అడ్డువడతమని..అర్ధరాత్రి లేచి ఇంటిపెకైక్కి పెయ్యిమీద కిరోసిన్ వోసుకొని ఇంగళమేసుకున్నడు. నిప్పుల కాలుకుంటనే ‘జై తెలంగాణ..జై తెలంగాణ..’ అని అరుస్తుంటే గింత రాత్రిల ఎవరరుస్తున్నరని అందరు బయటికొచ్చిచూస్తే నా బిడ్డనే. ‘ఎంతపనిజేసినవ్రా....బిడ్డా’ అని అంబులెన్స్‌ని విలిసి గాంధాస్పత్రికి తోలకవోయ్నం. మూడో దినంనాడు రాత్రి పదిగంటలకు నాగరాజుకి సీరియస్గుందని చెప్పిండ్రు. దగ్గరికివోయి చూస్తే బిడ్డనోటెంట మాటొస్తలే. జరసేపటికే డాక్టర్లొచ్చి బిడ్డ పాణమిడిసిండని చెప్పిండ్రు. గంతకు ముందురోజు బిడ్డడు మాతో ఒక మాట చెప్పిండు. ‘ఎందుకురా గింతపని జేసినవ్. నువ్వు సస్తేనే తెలంగాణ రాష్ర్టమొస్తదా!’ అని వాళ్లనాయన అడిగితే..‘ఒకరిద్దరు సచ్చిపోతే రాష్ట్రమేడస్తదే! నాలెక్క సచ్చిపోనీకి మస్తుమంది విద్యార్థులున్నరు. పాణం పెడితెనే పనైతదే!’ అన్నడు. ఆసంది నుంచి ఏ మాట మాట్లాడుకున్నా వాడిసావే గుర్తుకొస్తున్నది. తెలంగాణ రాష్ట్రమొచ్చిందని తెల్వంగనే నాకు సంతోషమేసింది. నా బిడ్డ చావు ఊకెవోలే అనుకున్న. ‘తెలంగాణ రాష్ర్టమొస్తే కొలువులొస్తయ్...కష్టాలన్నీ వోతయే’ అని చెప్పిన మాటలు నిజమైతయా కాదో నాకు తెల్వదు. అవి నిజం కాకుంటే నా బిడ్డచావు ఊకెవోయినట్టే. వాడెనక ఇంకో కొడుకున్నడు. ఆడికి కొలువొచ్చినాడన్న మనకు సొంతంగా రాష్ర్టమొచ్చిందని నమ్ముత. సేకరణ : భువనేశ్వరి, ఫొటో : విఠల్ జన తెలంగాణ విద్యకు పెద్దపీట... భవిష్యత్ తెలంగాణ సమున్నతంగా ఉండాలంటే కొత్త ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పాఠశాల స్థాయినుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రక్షాళన చేయాలి. డిగ్రీ వరకు నిర్బంధ విద్యను అమలు చేయాలి. శిక్షణ పొందిన బోధన సిబ్బందినే నియమించాలి. విద్యారంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలి. సైన్స్, మాథ్స్ల బోధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విద్యార్థి తనకు అభిరుచి గల రంగాన్ని ఎంచుకోగలిగే విద్యావ్యవస్థ ఉండాలి. మానవ వనరుల అభివృద్ధి ద్వారానే సమాజ పురోభివృద్ధి సాధ్యమవుతుంది. - జి.సంధ్య, ఆదర్శపాఠశాల, చిన్నకోడూరు, మెదక్ జిల్లా స్వేచ్ఛాయుత తెలంగాణ... ప్రజా ఉద్యమానికి తలవంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, ఇరుప్రాంతాల మధ్య సామరస్యం, పరస్పర సహకారం మీద దృష్టి సారించాలి. ప్రాథమిక విద్య మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టి మౌలిక వసతులు కల్పించాలి. వ్యవసాయ రంగంలో నూతన విధానాలు ప్రవేశపెట్టి అభివృద్ధి సాధించాలి. ఆంక్షలు లేని, నిర్బంధంలేని, స్వేచ్ఛాయుత తెలంగాణ కోసం అందరూ సహకరించాలి. - డి. సుధాకరరావు, చెన్నూరు, ఖమ్మం జిల్లా దురాచారాలను నిర్మూలించాలి.. నవ తెలంగాణలో వేళ్లూనుకున్న వరకట్నాన్ని నిర్మూలించాలి. మూఢనమ్మకాలు, లంచగొండితనం, ర్యాగింగు లాంటి సామాజిక దురాచారాలను పూర్తిగా తొలగించాలి. ఇందుకు యువతీయువకులు కృషి చేయాలి. నాణ్యమైన విద్యను అందించాలి. ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. మాతృభాషను పరిరక్షించాలి. పేదలందరికీ ఉచిత వైద్యాన్ని అందించాలి. ప్రతి వ్యక్తి విలువలతో జీవించాలి. - వేముల వాణిశ్రీ రేకుర్తి, కరీంనగర్ జిల్లా -
అమ్మ మాట
‘తల్లి తెలంగాణ’ కోసం తమకు కడుపు కోత మిగిల్చినా, వారు ఆశించిన తెలంగాణ వస్తే చాలంటున్నారు అమరవీరుల తల్లిదండ్రులు. తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్నోళ్లందరికీ ఉద్యోగాలివ్వాలంటున్నారు. పల్లెలు పచ్చగుండాలని, అన్ని వసతులున్న తెలంగాణను కోరుకుంటున్నారు. అప్పుడే నవతెలంగాణ సాధ్యమని, తమ బిడ్డల ఆత్మ శాంతిస్తుందని చెబుతున్నారు. పెంచాల విజయ, వెంకటేశ్ తల్లి, సిరిసిల్ల గ్రామం, కరీంనగర్ జిల్లా నా కొడుకు వెంకటేశ్ ఇంటర్ చదువుకున్నడు. తెలంగాణ అస్తే ఉద్యోగాలు వస్తయ్.. అందరికీ బాగా జరుగతది అనేటోడు. తెలంగాణ ఉద్యమంలో మస్తు తిరిగిండు. 23 డిసెంబర్, 2010న పెయ్యిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నడు. కాలిన గాయాలు సలుపుతున్నా జై తెలంగాణ అంటూ నినాదాలు జేసిండు. తర్వాత ఆస్పత్రిలో సచ్చిపోయిండు. ఆడు సచ్చిపోయిన గిన్ని రోజులకు తెలంగాణ అచ్చింది. నా బిడ్డ ఆత్మ గిప్పుడు శాంతిస్తుంది. నా కొడుకు సచ్చిపోయిన రోజు ఆళ్లు, ఈళ్లు వచ్చి ఆదుకుంట మన్నరు. ఎవలూ రాలే. ఆదుకోలే. పత్తేరబోతూ కైకిలి చేసుకుంట బతుకుతున్న. లక్ష రూపాయల బాకీ ఉంది. మూడు వారాల తేడాలోనే భర్త, కొడుకును పోగొట్టుకున్న. ఒక్కదాన్నే బతుకుతున్న. గిప్పుడు నా కొడుకుంటే సంబరపడు. తెలంగాణ అచ్చింది కాబట్టి ఇప్పుడైనా సదువుకున్న పోరగాళ్లందరికీ ఉద్యోగాలివ్వాలి. - సేకరణ: వూరడి మల్లిఖార్జున్, సిరిసిల్ల -
రాజన్న ఆశయ సాధనే ధ్యేయం
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనే ధ్యేయంగా జిల్లా ప్రజలందరి అండదండలతో ముందుకెళ్తానని వైఎస్సార్సీపీ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని ఆయన అన్నారు. జిల్లాలోని అన్నివర్గాల ప్రజల సహకారంతో జిల్లా అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఆశయాల సాధన కోసం జగనన్న బాటలో నడుస్తున్న తనను జిల్లా ప్రజలు మరింతగా ఆదరిస్తూ ప్రోత్సహిస్తుండడం సంతోషకరమన్నారు. వైఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా తెలంగాణ నుంచే ప్రారంభించేవారన్నారు. జగన్మోహన్రెడ్డి కూడా పార్టీ తరఫున మొదటి అభ్యర్థిగా ఇదే మైదానం నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన తనను ప్రకటించడం తెలంగాణ అభివృద్ధి పట్ల వైఎస్ కుటుంబానికి ఉన్న శ్రద్ధ ఏమిటో తెలియచేస్తోందన్నారు. అచంచల మనస్తత్వం ఉన్న వైఎస్.. జలయజ్ఞంతో పాటు ఇతర అనేక రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గిరిజన ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో అనేక మంది గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్‌దేనన్నారు. పావలా వడ్డీ, పింఛన్లు ఇతర అనేక పథకాలు ప్రజలకు పక్కాగా అందేలా వైఎస్ కృషి చేశారన్నారు. రాజన్న స్ఫూర్తితో ఖమ్మం జిల్లా నుంచి లోక్‌సభ, 10శాసనసభ స్థానాలను గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. వైఎస్సార్సీపీ గురించి ఛలోక్తులు విసిరే పార్టీలు తమ అభ్యర్థులెవరో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితిలో ఉండడాన్ని గమనించాలన్నారు. వైఎస్సార్సీపీ మాత్రం ఆరు నెలల కిందే అభ్యర్థులను ఎంపిక చేసిందన్నారు. ప్రతిఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్న వైఎస్సార్సీపీతో నవ తెలంగాణ నిర్మాణం సాధ్యం అవుతుందన్నారు. అన్నివర్గాల ప్రజలకు మేలు కలిగించిన రాజన్న పథకాలను వైఎస్సార్సీపీ మాత్రమే పూర్తి స్థాయిలో కొనసాగిస్తుందన్నారు. నవ తెలంగాణలో ఇవి అత్యంత కీలకమని పొంగులేటి అన్నారు. శీనన్నను గెలిపిస్తే కేంద్రమంత్రి అవుతారు: పాయం వెంకటేశ్వర్లు పొంగులేటి శీనన్నను గెలిపిస్తే తప్పకుండా కేంద్రమంత్రి అవుతారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ ఏర్పాటులో వైఎస్సార్సీపీ కీలక ప్రాత్ర పోషిస్తుందన్నారు. గత నెల 5వ తేదీన ఖమ్మంలో జగన్ ప్రకటించినట్లు శీనన్న తప్పకుండా కేంద్రమంత్రి అవుతారని, అత్యధిక మెజారిటీతో గెలిపించి ఢిల్లీకి పంపాలన్నారు. పొంగులేటి గెలుపుతోనే జిల్లా అభివృద్ధి: కూరాకుల నాగభూషణం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని, తద్వారా జిల్లా అభివృద్ధికి చక్కటి బాటలు పడతాయని వైఎస్ఆర్సీపీ ఖమ్మం శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్త కూరాకుల నాగ భూషణం అన్నారు. జిల్లాకు చెందిన పొంగులేటిని గెలిపించేందుకు అన్నివర్గాల ప్రజలు ఓట్లు వేయాలన్నారు. కొత్తగూడెం సెగ్మెంట్ నుంచి అత్యధిక మెజారిటీ: ఎడవల్లి కృష్ణ రాజన్న ఆశయ సాధన కోసం, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజలు కృషిచేయాలని వైఎస్ఆర్సీపీ కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త ఎడవల్లి కృష్ణ అన్నారు. శీనన్న గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా కృషిచేయాలన్నారు. కొత్తగూడెం సెగ్మెంట్ నుంచి అత్యధిక మెజారిటీ వచ్చేలా చేస్తానన్నారు. రైతుబిడ్డ శీనన్నను ఆదరించాలి: తాటి వెంకటేశ్వర్లు రైతుబిడ్డగా జన్మించి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ కన్వీనర్ తాటి వెంకటేశ్వర్లు అన్నారు. శీనన్న ఖమ్మం ప్రతినిధిగా పార్లమెంటుకు వెళితే జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. జగనన్న ఆశయ సాధన కోసం శీనన్నను గెలిపించాలన్నారు. తెలంగాణ ఎంపీల్లో పొంగులేటికి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఖమ్మం జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా నిలబెట్టాలన్నారు. జగనన్నకు కానుకగా ఇవ్వాలి: మదన్‌లాల్ పొంగులేటి శీనన్నను ఖమ్మం ఎంపీగా గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలని పార్టీ వైరా నియోజకవర్గ సమన్వయకర్త మదన్‌లాల్ అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్న శ్రీనివాసరెడ్డిని గెలిపించేందుకు వైరా నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. శీనన్న వ్యక్తిగా వచ్చి శక్తిగా మారారు: గుగులోత్ రవిబాబు నాయక్ సాధారణ గ్రామీణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శీనన్న వ్యక్తిగా ప్రజల్లోకి వచ్చి శక్తిగా మారారని పార్టీ ఇల్లెందు నియోజకవర్గ కన్వీనర్ గుగులోత్ రవిబాబు నాయక్ అన్నారు. శీనన్న గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. అన్ని వర్గాలు శీనన్న నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి: సాధు రమేష్‌రెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ మూడు జిల్లాల యువజన విభాగం సమన్వయకర్త సాధురమేష్‌రెడ్డి అన్నారు. శీనన్నను గెలిపిస్తే ఎట్టిపరిస్థితుల్లో కేంద్రమంత్రి అవుతారన్నారు. వైఎస్ ఆశయాలు, పథకాలు కొనసాగించాలంటే యువనాయకులు జగనన్న, శీనన్నలతోనే సాధ్యమన్నారు. ఖమ్మం జిల్లా జగన్ శీనన్న: మెండెం జయరాజ్ ఏ పదవి లేకున్నప్పటికీ జిల్లాలోని పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పెద్దమనసుతో పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న శీనన్న మనసున్న మారాజని, ఖమ్మం జిల్లా జగన్ శీనన్న అని పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ మెండెం జయరాజ్ అన్నారు. శీనన్న రాజకీయాల్లోకి రావడం జిల్లా అదృష్టమన్నారు. అందరి పట్ల ఆప్యాయంగా ఉండే శీనన్న గెలుపు జిల్లాకు అత్యవసరమన్నారు. ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ శీనన్న: సయ్యద్ అక్రం అలీ నిరాండబరుడు, నిగర్వి అయిన శీనన్న ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ అని జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అక్రం అలీ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోయే మనస్తత్వం ఉన్న పొంగులేటి శీనన్న గెలుపు జిల్లాకు, అన్ని వర్గాల ప్రజలకు అవసరమన్నారు. పొంగులేటి గెలిస్తే ఖమ్మం జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించడం తథ్యం అన్నారు. జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్న పొంగులేటి: కీసర పద్మజారెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన రాజన్న కుటుంబానికి అండగా నిలిచిన శీనన్నను ప్రతిఒక్కరూ ఆశీర్వదించాలని పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి అన్నారు. జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్న పొంగులేటిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. అఖండ మెజారిటీతో గెలిపించాలి: కొత్తగుండ్ల శ్రీలక్ష్మి జిల్లా అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న పొంగులేటి శీనన్నను అఖండ మెజారిటీతో గెలిపించాలని మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కొత్తగుండ్ల శ్రీలక్ష్మి అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త శీనన్న కోసం వంద చొప్పున ఓట్లు వేయించాలన్నారు. సర్వమత ప్రార్థనలు.. సభ అనంతరం ప్రదర్శనకు ముందుగా పొంగులేటిని మైదానంలో బ్రాహ్మణులు, ముస్లిం, క్రిస్టియన్ మత గురువులు ఆశీర్వదించారు. శీనన్న సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మండుటెండలోనూ మైదానానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సభలో జిల్లా అధికార ప్రతినిధి నిరంజన్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ముస్తఫా, నగర పార్టీ అధ్యక్షుడు తోట రామారావు, వట్టికొండ జగన్మోహన్రావు, సంపెట వెంకటేశ్వర్లు, కొంపల్లి బాలకృష్ణ, కొండలరావు, మార్కం లింగయ్య, ఆకుల మూర్తి, జిల్లేపల్లి సైదులు, ఆరెంపుల వీరభద్రం, వెంకటేశ్వర్లు, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కందిమళ్ల బుడ్డయ్య, జూపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మార్పు కోసం కృషి చేద్దాం..
నవ తెలంగాణ: సమాజం మారినప్పుడే మహిళల్లో సమూలమార్పులు సాధ్యం..ఉద్యోగినులుగా ఉద్యమంలో మమేకమై ప్రజ ల్లో గుర్తింపు తెచ్చుకున్న మనం నవ నిర్మాణంలోనూ భాగమవుదాం.. పని సంస్కృతిని పెంచి ప్రజలకు మెరుగయిన సేవ చేద్దాం. మనం మారుతూ... సమాజమార్పునకు కృషిచేద్దాం..అంటున్నారు.. టీఎన్జీవోల కేంద్రం సంఘం మహిళా చైర్పర్సన్ బండారు రేచల్... బండారు రేచల్ (మహిళా చైర్పర్సన్, టీఎన్జీవోల కేంద్ర సంఘం) తెలంగాణ ప్రాంతానికి దేశంలోనే ఉజ్వలమైన చరిత్ర ఉంది. ఆధిపత్యాన్ని ప్రశ్నించిన సమ్మక్క, సారలమ్మ, బందగీ త్యాగాలను, రాణీ రుద్రమ వారసత్వాన్ని, చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న తెలంగాణ ప్రాంత మహిళలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సత్తా చాటారు. పురుషులకు తామేమీ తక్కువ కాదని నిరూపించారు. 1969 తొలిదశ ఉద్యమం నుంచి ఇప్పటిదాకా క్రియాశీలకంగా వ్యవహరించారు. నిర్బంధాలకు వెరవకుండా పోరాట పటిమను చాటారు. తెలంగాణ కోసం బలిదానాలు చేశారు. మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన 1200 మందిలో వంద మందికి పైగా యువతులు, విద్యార్థినులున్నారు. డిసెంబర్ 2008లో 610 జీవో అమలు కోసం చేపట్టిన చేపట్టిన ఉద్యమ యాత్రలో, ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మహిళాఉద్యోగులు పాల్గొన్నారు. రైల్‌రోకో, సడక్‌బంద్, వంటావార్పు, మిలియన్‌మార్చ్ విజయవంతం కావడంలో ప్రధానపాత్ర పోషించారు. ఉద్యోగుల డిమాండ్ల సాధనతో పాటు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన చారిత్రాత్మకమైన సకలజనుల సమ్మెలో భాగమయ్యారు. తెలంగాణ ప్రాంత మహిళా ఉద్యోగులు అటు ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతూనే తెలంగాణ ప్రజల దశాబ్దాల కల అయిన ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ఉద్యమించారు. వివక్ష, అసమానతలు లేని సమాజం కోసం, ఆత్మగౌరవం కోసం ‘జీతం కోసం పీఆర్సీ - జీవితం కోసం తెలంగాణ’ అన్న నినాదంతో కదిలారు. 610 జీవో తెలంగాణ ఉద్యమానికి బీజంవేస్తే, 14ఎఫ్ తొలగించాలన్న డిమాండ్ మలిదశ పోరాటానికి నాంది పలికింది. కేసీఆర్ ఆమరణదీక్షకు సంఘీభావంగా ఉద్యోగినులు ర్యాలీలు నిర్వహించారు. డిసెంబర్ 1నుంచి 8వరకు ఉద్యోగుల పెన్‌డౌన్ సందర్భంగా నిర్వహించిన వంటావార్పూ కార్యక్రమాల్లో ఉద్యోగినుల కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములై సంఘీభావం చెప్పడం అద్భుతదృశ్యం. కిందిస్థాయి నుంచి గెజిటెడ్ అధికారుల వరకు కార్యాలయాల ముందు బతుకమ్మలాడుతూ ఐక్యతను ప్రదర్శించారు. సిద్దిపేటలో ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా రెండు లక్షల మందితో జరిగిన ఉద్యోగ గర్జనకు పది జిల్లాల నుంచి ఉద్యోగినులు తరలివచ్చారు. రచ్చబండ కార్యక్రమాల్లో మహిళలు అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీశారు. సహాయ నిరాకరణ కార్యక్రమంలో భాగంగా పే అండ్ అకౌంట్స్ శాఖ ఉద్యోగులు ముఖ్యమంత్రికి కూడా జీతం రాకుండా చేశారు. దీంతో ప్రభుత్వం ఈ శాఖలో సమ్మెను నిషేధించింది. స్వామిగౌడ్, దేవీప్రసాద్రావుల నేతృత్వంలో 42 రోజుల పాటు సాగిన సకలజనుల సమ్మె విజయంలోనూ మహిళాఉద్యోగుల పాత్ర ఉంది. ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనడంతో జనజీవనం మీద ప్రభావం పడింది. ప్రభుత్వం నిర్భందాన్ని ప్రయోగించడం మొదలుపెట్టింది. కార్యాలయాల్లో పోలీసులను దింపింది. మహిళా ఉద్యోగులతో సహా అరెస్టుల పర్వం ప్రారంభించింది. గాంధీ ఆస్పత్రి ఆవరణలో స్వామిగౌడ్‌ను అరెస్టు చేయడాన్ని ప్రతిఘటించిన మహిళలను అరెస్టు చేశారు.ప్రభుత్వ కుట్రను భగ్నం చేసి వారిని విడిపించుకోవడంలో ఉద్యోగినులు విజయం సాధించారు. రవాణాశాఖ కార్యాలయంలో స్వామిగౌడ్ మీద జరిగిన హత్యాప్రయత్నాన్ని ప్రతిఘటించారు. అడుగడుగునా ఆటంకాలు ఎదురయినా వాటినన్నింటినీ దాటుకుని ఉద్యోగినులు సాగరహారం, మిలియన్మార్చ్లలో పాల్గొనడం సాహసోపేతం. 2013 జూన్14న జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమంలోనూ ఉద్యోగినులు కీలక పాత్ర పోషించారు. మూడు రోజుల ముందు నుంచే పోలీసులు ఈ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు ప్రయత్నించారు. బస్సులను అడ్డుకోవడం, మహిళా ఉద్యోగులను కూడా ఎక్కడికక్కడే అరెస్టు చేసి కేసులు పెట్టడం ద్వారా భయానకవాతావరణాన్ని సృష్టించారు. అయినా మహిళలు, యువతులు వేల సంఖ్యలో జేఏసీ నాయకులతో పాటు అసెంబ్లీ వైపు బయలుదేరారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించినా వెన్ను చూపలేదు. ఇళ్లు తప్ప మరో లోకం తెలియని గృహిణులు, ఉద్యమాల ఊసెరగని ఉద్యోగినులు, యువతులు తెలంగాణ ఉద్యమంతో మమేకమయ్యారు. 2013 నవంబర్25న భద్రాచలం ముంపు గ్రామాల సమస్య మీద కూడా జరిగిన ఉద్యమంలో కూడా క్రియాశీలంగా పాల్గొని భద్రాచలం మాదే... అని నినదించారు. ఉద్యమంలో భాగంగా విద్యార్థినులుమీద, ఉద్యోగినుల మీద అక్రమ కేసులు బనాయించినా వెన్నుచూపక ధీర వనితల్లా తుదికంటా పోరాడారు. రాష్ట్రాన్ని సాధించినందున ఇప్పుడిక నవ నిర్మాణం మీద కేంద్రీకరించాల్సి ఉంది. సమైక్యపాలన వల్ల తలెత్తిన సమస్యలకు తెలంగాణ పాలనే పరిష్కారం. జన తెలంగాణ: యువనేతలకే పట్టం... హామీలను నెరవేర్చే సత్తా ఉన్న యువ నాయకులనే ఈ ఎన్నికల్లో గెలిపించాలి. యువతను ఆకర్శించడానికి కొందరు నాయకులు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. ఇంటికొక ఉద్యోగం ఇవ్వడం ఎలా సాధ్యం? వాటిని నమ్మి మోసపోవద్దు. యువత ప్రజల్లో చైతన్యం తేవాలి. సుపరిపాలన అందించే నాయకత్వానికే పట్టం కట్టాలి. - బొడ్డు మహేందర్ గట్టుభూత్కూరు, కరీంనగర్ జిల్లా సస్యశ్యామలం కావాలి... ఎందరి కృషి వల్లనో తెలంగాణ వచ్చింది. నవ తెలంగాణలో అవినీతి లేని నాయకత్వం రావాలి. మనకున్న బొగ్గు నిల్వలతో విద్యుత్ ఉత్పత్తి పెంచాలి. కొత్త పరిశ్రమలను నెలకొల్పాలి. హైదరాబాద్ సరిసరాల్లో భారీ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు కల్పించడంతో పాటు కేంద్రం నుంచి రాయితీలు లభించేలా చర్యలు తీసుకోవాలి. అందరూ కలిసి తెలంగాణను ప్రగతిమార్గంలో నడపాలి. హైదరాబాద్‌లో నీటి సమస్యను పరిష్కరించాలి. కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయాలి. - పూనూరు గంగాధరరెడ్డి, హైదరాబాద్ వృద్ధులకు జీవనభృతి కల్పించాలి... దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా నవ తెలంగాణ నిర్మాణం జరగాలి. ఇందుకు ప్రతి ఒక్కరు కృషి చేయవల్సిఉంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను మెరుగుపర్చాలి. విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యం కల్పించాలి. నిరుద్యోగ సమస్యను పూర్తిగా రూపుమాపాలి. వృద్ధులకు జీవనభృతి ఇవ్వాలి. తెలంగాణలో ఉన్న వనరులను పూర్తిగా వినియోగించుకోవాలి. నీటి పారుదల ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి. - డి.వి. శ్రీనివాస్, రాంనగర్, వరంగల్ జిల్లా నవ తెలంగాణ నిర్మాణంలో భాగం కండి నవ తెలంగాణ సామాజికంగా, ఆర్థికంగా, రాజ కీయంగా, సాంస్కృతికంగా మరింతగా వెలుగులీనా లంటే ఎలాంటి మేలిమి మార్పులు రావాలి? అందు కోసం ఏమేం చేయాలి? ఎవరెవరు ఎలా నడుం బిగించాలి? వీటిపై మీ అభిప్రా యాలు ‘సాక్షి’తో పంచు కోండి. ఎలక్షన్ సెల్, సాక్షి దినపత్రిక, రోడ్ నం.1 బంజారాహిల్స్, హైదరాబాద్ లేదా election@sakshi.com కు మెయిల్ చెయ్యండి. -
స్వర్గంల కొడుకు ఆత్మ నిమ్మలం
అమ్మ మాట: ‘తల్లి తెలంగాణ’ కోసం తమకు కడుపు కోత మిగిల్చినా, వారు ఆశించిన తెలంగాణ వస్తే చాలంటున్నారు అమరవీరుల తల్లిదండ్రులు. తెలంగాణ రాష్ట్రంలో సదువుకున్నోళ్లందరికీ ఉద్యోగాలివ్వాలంటున్నారు. పల్లెలు పచ్చగుండాలని, అన్ని వసతులున్న తెలంగాణను కోరుకుంటున్నారు. అప్పుడే నవ తెలంగాణ సాధ్యమని, తమ బిడ్డల ఆత్మ శాంతిస్తుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నా కొడుకు లేకపోయె బిడ్డా. తెలంగాణ రావాలని భోజ్యా ఎప్పుడూ అంటుండే. తెలంగాణ అయితే ఉద్యోగాలు ఒత్తయ్ అవ్వా అనేటోడు. మంచి ఉద్యోగం చేసి బాగా సాదుత అనేటోడు. పార్టీలోళ్ల గడికోమాటకు నా కొడుకు బలైండు. వాడు కలగన్న తెలంగాణ వచ్చింది గని వాడు లేడాయె. గిప్పుడు నా భోజ్యా ఉండుంటే మంచిగుండు. ఏం జెత్త బిడ్డ. మా రాత గిట్లయిపాయె. నా కొడుకు అనుకున్న తెలంగాణ వచ్చినందుకు సంబురపడాల్నో, వాడు లేడని ఏడువాలో తెలుస్తలేదు. గిప్పుడు తెలంగాణ ఏర్పడింది. గి దీంతోని స్వర్గంలో ఉన్న నా కొడుకు పాణం నిమ్మలమైంది. చేతికి వచ్చే కొడుకు పోయిండు. మా బాధలు ఎట్లా తీరాలె బిడ్డా. పిల్లల సావు.. అయ్యవ్వలకు చెప్పలేని గోస. అది ఎవలికి రావద్దు. తెలంగాణ అంటే మొదట్లో తెల్వకపోయేటిది. నా కొడుకు అన్నంకనే ఏందో తెలిసింది. వాడు పోయినంక ఇంకొంచెం ఎరుకైంది. నాయం జరుగాలంటే తెలంగాణ కావాలన్నారు. చానా మంది కొట్లాడిండ్లు. పాణాలు పోగొట్టొకున్నరు. ఇప్పుడు వచ్చింది. ఇప్పటికైన అందరు మంచిగుం డాలె. అందరి కడుపులు సల్లగుండాలె. రాజకీయాలు ఎమోగని తెలంగాణతో అందరు మంచిగుండాలె. పంటలు బాగా పండితే అందరికి తిండి ఉంటది. సదువుకుంటె కొలువులు రావాలె. - మంగ్తి, భోజ్యానాయక్ తల్లి, వీరారెడ్డి తండా గ్రామం, రఘునాథపల్లి మండలం, వరంగల్ జిల్లా సేకరణ: పల్ల రవి, రఘునాథపల్లి అడగండి చెబుతా.. ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి - ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్, లేదా election@sakshi.com కు మెయిల్ చెయ్యండి. మాది నల్లగొండ జిల్లా ఆలేరు. ఐదు నెలల క్రితం ఇల్లు మారాము. అడ్రస్ మార్పునకు జనవరి 1న దరఖాస్తు చేసుకున్నా. వెంటనే మార్చారు. అయితే, మా అమ్మగారి పేరు కూడా మార్చుకునేందుకు జనవరి 25న దరఖాస్తు చేశాను. కొత్త అడ్రస్‌కు ఆమె పేరు మారలేదు? ఇప్పుడు మేము ఏం చేయాలి. - రమేష్,నల్లగొండ ఏప్రిల్ 9వ తేదీలోపు మారుతుంది. ఏ అభ్యర్థీ నచ్చకపోతే తిరస్కరణ ఓటు ‘నోటా’ను ప్రవేశపెట్టారు. ఈ సౌకర్యం స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తిస్తుందా? ఒక నియోజకవర్గంలో 50 శాతానికిపైగా ‘నోటా’ ఓట్లు నమోదైతే ఆ నియోజకవర్గంలో ఫలితం ఎలా ఉంటుంది? - సంధ్య, విజయనగరం స్థానిక ఎన్నికల్లో ‘నోటా’ సౌకర్యం లేదు. 50 శాతానికిపైగా ‘నోటా’ లోట్లు నమోదైనప్పటికీ, మిగతా అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే గెలుస్తారు. నేను జర్నలిస్టును. పోలింగ్ రోజు మేం ఎన్నికల కవరేజ్‌లో ఉంటాం. మా గ్రామానికి వెళ్లి ఓటే సే వీలు ఉండదు. అందువల్ల జర్నలిస్టులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించవచ్చు కదా? -శ్రీహరి, నెల్లూరు ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ‘పోస్టల్ బ్యాలెట్’ సౌకర్యం ఉంది. మిగతా వారికి ఆ వెసులుబాటు ఉండదు. -
జై తెలంగాణ.. అనంగనే సామి యాద్కొస్తడు
మల్లమ్మ, స్వామి తల్లి, ఒగులాపూర్ గ్రామం, ఇల్లంతకుంట మండలం, కరీంనగర్ జిల్లా అమ్మ మాట: ‘తల్లి తెలంగాణ’ కోసం తమకు కడుపు కోత మిగిల్చినా, వారు ఆశించిన తెలంగాణ వస్తే చాలంటున్నారు అమరవీరుల తల్లిదండ్రులు. తెలంగాణ రాష్ట్రంలో సదువుకున్న పోరగాళ్లందరికీ ఉద్యోగాలివ్వాలంటున్నారు. పల్లెలు పచ్చగుండాలని, అన్ని వసతులున్న తెలంగాణను కోరుకుంటున్నారు. అప్పుడే నవతెలంగాణ సాధ్యమని, తమ బిడ్డల ఆత్మ శాంతిస్తుందని చెబుతున్నారు. ‘పొద్దున వోయేటేడు....రాత్రికొచ్చేటోడు. తిండి తిప్పల్లేకుండా తిరుగుడేందిరా.. అంటే ‘తెలంగాణ రాష్ర్టం కోసమే...’ అనేటోడు. ‘ఆ..గది అచ్చేదా సచ్చేదా దానితెరువుకి నువ్వెందుకురా’ అంటే ‘గందరట్లంటే సొంత రాష్ట్రమేడికెళ్లొస్తదే’ అన్నడొకసారి. నాకు ఒక బిడ్డ, ముగ్గురు మగపిల్లలు. పెద్దోడు సామి. నిజంగా ఆడు పెద్దోడే. ఆడు స్కూలు నుంచి వచ్చినంక పొద్దుగూకి పొలం పనికి పోయి పైసలు సంపాదించేటోడు. నా దవఖాన ఖర్చంతా సామే చూసుకొనేటోడు. ర్యాలీల తిరగాలె, నిరాహార దీక్షల కూసోవాలె...అని ఒకసారి ఇరవైరోజులు ఇంటికి రాలె. ఎవరో రాజకీయ నాయకుడు తెలంగాణ వచ్చుడు కష్టమన్నడంట. గా మాటకు వాడు పురుగుల మందుతాగి పాణమిడిసిండు. గాసంది...నెలకొకసారొచ్చే పిట్స్రోగం...సామి యాదికొచ్చినపుడల్లా వస్తంది. ‘తెలంగాణ రాష్ర్టమొచ్చింది గదే! ఇప్పుడు మనకేమొస్తదె..’ అని నేను మాయానను అడిగితే...‘వాడు కోరుకున్నట్లు మన రాష్ర్టం మనకొచ్చింది. పేదోళ్ల ఇంటికొచ్చి మాట్లాడే నాయకులొస్తే రోజూ సామి ఫొట్వోకి మొక్కుదం’ అన్నడు. సామి ఎప్పుడూ.. అమ్మా...‘జై తెలంగాణ’ అను అనేటోడు. ఆ మాట యినొస్తే సాలు సామి యాద్కొస్తుండు.’ - సేకరణ: భువనేశ్వరి, సాక్షి, హైదరాబాద్ -
కొలువుజేయనీకి కొడుకు లేడాయె..
అమ్మ మాట: ‘తల్లి తెలంగాణ’ కోసం తమకు కడుపు కోత మిగిల్చినా, వారు ఆశించిన తెలంగాణ వస్తే చాలంటున్నారు అమరవీరుల తల్లిదండ్రులు. తెలంగాణ రాష్ట్రంలో సదువుకున్న పోరగాళ్లందరికీ ఉద్యోగాలివ్వాలంటున్నారు. పల్లెలు పచ్చగుండాలని, అన్ని వసతులున్న తెలంగాణను కోరుకుంటున్నారు. అప్పుడే నవతెలంగాణ సాధ్యమని, తమ బిడ్డల ఆత్మ శాంతిస్తుందని చెబుతున్నారు. - యాదలక్ష్మి, బాషిపాక భాస్కర్ తల్లి, గవిచర్ల, సంగెం మండలం, వరంగల్ జిల్లా ‘సొంతంగ రాష్ట్రమొస్తే...కొలువులొస్తయే. మన కష్టాలన్నీదీర్తయే....’ అని చెప్పేటేడు. ఇయ్యాల రాష్ట్రమచ్చింది, కొలువు జేయనీకి నాకు కొడుకు లేడాయె. తెలంగాణ రాష్ర్టమచ్చిందని టీవీల్ల జెప్పంగనే నా కొడుకు ఫోట్వ దగ్గరకిబోయి ‘బిడ్డా...తెలంగాణ రాష్ర్టమచ్చిందే, నువ్వు... సావకుంటే రాకపోవునా...’ అని వాళ్ల నాయన అన్నమాటలకు నాకు గుండెంతా పగిలినట్టయింది. ఏం జేస్తం... పేదోళ్లం కదా! ఉద్యమం చేసే స్థోమత లేనోళ్లం. ఇద్దరాడివిల్లలు, ఒక కొడుకు. మగపిల్లగాడు... మాలెక్క కూలీనాలీ చేసుకోకుండా కొలువు జేయాలని కష్టపడి చదివించినం. రోజు పొద్దుగాలే కాలేజీకి పోతుంటే కళ్లనిండా సూస్కొని మురిసేటోళ్లం. పెద్దగయినంక మంచి కొలువు చేసి మమ్మల్ని సాదుతడనుకున్నం. ఉద్యమం కోసం సచ్చిపోయేటళ్లను టీవీల్ల జూసి ‘అమ్మా సూడే... వాళ్లు మన తెలంగాణ రాష్ర్టం కోసం పాణం తీసుకుంటుండ్రు. ఎంత గొప్పోళ్లే వాళ్లు...’ అనేటోడు. ఒకరోజు పొద్దుగాల ఎవరో ఒకాయనొచ్చి ‘మీ కొడుకు యిసం మింగి సచ్చిపోయిండు’ అని జెప్పిండు. పాయింటు జేబుల ఒక పేపర్ మీద ఉద్యమం కోసమే సచ్చిపోతున్న అని రాసిండంట. అది సదవనీకి మా ఇంట్ల ఎవ్వరికీ సదువు రాదాయె. బిడ్డ రాసిన అచ్చరాలను చూసి ఎక్కి ఎక్కి ఏడ్సుడు తప్ప ఇంకేం మిగల్లే. ఎవరైనా ‘భాస్కర్’ అని పిలిస్తే ఇగంతే... వాళ్లనాయనకు ఏడుపాగదు. వాడు జెప్పినట్లు పేదోళ్ల కష్టాలు తీరాలే. కొలువులొక్కటే కాదు, పోరగాళ్లకు సదువు జెప్పీయలేక, పెండ్లి చేయలేక యాష్టపడేటోళ్ల కష్టం ఇనేటోళ్లు కావాలే. - సేకరణ: భువనేశ్వరి, సాక్షి, హైదరాబాద్ -
ఇంకెందుకు రాజకీయ పంచన?
అన్ని జేఏసీలను ఏకం చేసేందుకు కోదండరాం సిద్ధమేనా? తెలంగాణ రాష్ట్ర సాధన ఎవరి విజయం? అడుగడుగున ఊపిరులూదిన ఉత్పత్తి శక్తులదా? ఆ శక్తుల త్యాగాలపైనే ఏర్పడ్డ పార్లమెంటరీ వ్యవస్థదా? ఈ ప్రశ్నకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచణ నేత లు జవాబు చెప్పాలి. కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థుల వల్లే తెలంగాణ సాధ్యమనే నిజాన్ని ఒప్పుకుంటే... తెలంగాణ రాజకీయ జేఏసీృఇప్పుడు ఆ వర్గాలకే పరిమితమవ్వాలి. ఆ ఆలోచన ప్రొఫెసర్ కోదండరాంకు ఉందా? అన్ని ఐక్య కార్యాచణలను ఏకం చేసేందుకు సిద్ధమేనా? జనం కోరుకున్న తెలంగాణ పునర్ నిర్మాణానికి ఆయన అడుగులేస్తారా? ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వేదకుమార్ వేస్తున్న ప్రశ్నలివి. తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది చనిపోవడం దురదృష్టకరమే. దీనికి రాజకీయ జేఏసీనే కారణం. వాళ్ళ నాయకత్వమే పొట్టనబెట్టుకుంది. రాష్ట్ర సాధన కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కో అగ్ని కణమై లేచారు. ఎక్కడికక్కడ జేఎసీలుగా ఏర్పడ్డారు. వీటన్నింటికీ నాయకత్వం వహించేందుకు తెలంగాణ ఐక్య కార్యాచణ కమిటి ముందుకొచ్చింది. కానీ ఆ తర్వాత రాజకీయ పార్టీల పంచన చేరింది. అవకాశ ధోరణితో పార్టీలు అవసరమైనప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపాయి. అవసరం లేనప్పుడు నీరుగార్చాయి. ఈ నైరాశ్యం నుంచే ఆత్మహత్యలు జరిగాయి. ఆశించినంత పాత్ర లేదు ... టీజేఏసీ అనుకున్న మేర ముందుకెళ్ళలేదు. ఆంక్షల తెలంగాణ ఎవరు కోరుకున్నారు? పోలవరం ప్యాకేజీ, ముంపు గ్రామాల బదలాయింపు, పదేళ్ళ ఉమ్మడి రాజధాని, గవర్నర్ చేతికి హైదరాబాద్‌పై అధికారం... ఇవన్నీ ఆంక్షలు కావా? జేఏసీ ఏం చేసింది? సొంత ఎజెండాతో ఎందుకు ముందుకెళ్ళలేదు? ఇప్పుడీ విజయం ఎవరిది? ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. సాకారమైన తెలంగాణను రాజకీయ పార్టీలు గుప్పిట్లోకి తీసుకుంటున్నాయి. రాష్ట్ర సాధన కోసం నిరంతర పోరు చేసిన ఉత్పత్తి శక్తులు (కవులు, కళాకారులు, ఉద్యోగులు,విద్యార్థులు, రచయితలు, మేధావులు) వెనక్కు తగ్గాయి. అప్పట్లో అని వార్యమై రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలు మద్ధతునిచ్చాయి. ఉద్యమాలతో పాటు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారానే తెలంగాణ సాధ్యమని ఆనాడు భావించాయి. దీన్ని పార్టీలు హైజాక్ చేశాయి. ఉద్యమ శక్తుల త్యాగాలకు గుర్తింపు లేకుండా చేస్తున్నాయి. ఉద్యమ శక్తులు శాసిస్తాయి... ఉద్యమశక్తులు పాలించకపోయినా..శాసిస్తాయి. ప్రజలు, ప్రజా సంఘాలిచ్చే సూచనలే జనం మెచ్చేవిగా ఉంటాయి. రాజకీయ జేఏసీ అయినా ప్రజా సంఘాల అభిప్రాయాలు తీసుకుంటుందా? ఇప్పటికైనా కోదండరాం పార్టీల పంచ నుంచి బయటపడాలి. ప్రజా ఉద్యమ సంఘాల చెంతకు రావాలి. యువరక్తం నాయకత్వం వహించాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పుడున్న పార్లమెంటరీ శక్తులపై ప్రజలకు విశ్వాసం లేదు. 44 ఏళ్లలో తెలంగాణ ఎంత దోపిడీకి గురైందో.. ఈ 13 ఏళ్ళలోనూ ఆదే స్థాయిలో దోపిడీ కొనసాగింది. ప్రజా సంఘాలు మద్దతిచ్చి ఎన్నుకున్న పార్టీల చరిత్ర ఇది. వీళ్ళే మళ్ళీ అధికారందక్కించుకునేందుకు ముందుకొస్తున్నారు. డబ్బుతో సీట్ల జూదం ఆడుతున్నారు. ప్రజలు చాలా కోరుకుంటున్నారు. నిజానికి ఆ ఆశలు మనమే కల్పించాం. నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని చెప్పాం. హరిజన, గిరిజన అభ్యున్నతికి బాటలు వేస్తామన్నాం. కేంద్రంలో ఎవరు వస్తారో చూసుకుని ప్రణాళికలు తయారు చేస్తే తెలంగాణ ఆశలు ఎలా నెరవేరుతాయి? పోలవరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణకు అవసరం లేదు. గ్రామీణ జీవన విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. చేతి వృత్తులను ప్రోత్సహించాలి. ఇక మీదట హైదరాబాద్ జనాభా పెరిగితే ప్రమాదమే. దీన్ని నివారించాలంటే ముందు గా పట్టణీకరణ ఆపాలి. గ్రామాల్లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఊతం ఇవ్వాలి. ఎక్కడ ఏ పరిశ్రమలు కావాలో ప్రజలే నిర్ణయించాలి. ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ వైద్యశాలలకు మెరుగైన వసతులు కల్పించాలి. ఇప్పుడున్న రాజకీయ పార్టీలతో ఇది సాధ్యం కాదు. మరెలా? తెలంగాణ వచ్చిందని, ఇక తమ పనిలేదని నిద్రాణ స్థితిలో ఉన్న మేధావి వర్గం కళ్ళు తెరవాలి. సాకారమైన తెలంగాణను జనాభీష్టం మేరకు తయారు చేసే ఉద్యమ కేంద్రాలు కావాలి. పార్టీల మెడలు వంచి ప్రజల మేనిఫెస్టో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఈ దిశగా ప్రజా సంఘాలు జాగృతం కావాలని కోరుకుందాం. జన తెలంగాణ మాట మీద నిలబడే నేత కావాలి... ఇచ్చిన మాట మీద నిలబడే నాయకున్ని ఎన్నుకోవడమే ఓటర్ల ప్రధాన బాధ్యత. తెలంగాణ నవ నిర్మాణంలో యువత ప్రధాన పాత్ర పోషించాలి. ఇరుప్రాంతాలను అభివృద్ది చేయడం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం. ఆయన మాత్రమే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సువర్ణయుగాన్ని తేగలరు. ఆరోగ్యశ్రీ, అమ్మఒడి లాంటి పథకాలు రెండు రాష్ట్రాల్లో అమలు కావాలి. - చింతకింది శ్రీహరి మన్‌పహాడ్, దేవరుప్పుల మండలం, వరంగల్ జిల్లా పరిశ్రమలకు టాక్స్ హాలిడే ఇవ్వాలి.. తెలంగాణలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పదేళ్లపాటు పరిశ్రమలకు టాక్స్ హాలిడే ప్రకటించాలి. నిరుద్యోగులకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించాలి. ప్రైవేటు రంగంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించాలి. దీనివల్ల విద్యుత్ సంక్షోభం తీరడంతో పాటు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. వ్యవసాయానికి రాజశేఖర్‌రెడ్డి తరహాలో ప్రోత్సాహం కల్పించాలి. గోదావరి తీరంలో ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేయాలి. చిత విద్యుత్ కొనసాగించాలి. పర్యాటక, దేవాదాయ శాఖల్లో కొత్త ఉద్యోగాల కల్పనకు అవకాశాలున్నాయి. సమసమాజ లక్ష్యంగా ప్రజలు కలలు గన్న తెలంగాణ నిర్మాణం జరగాలి. - వసంతరాయ్ తోట, రెడ్డి కాలనీ, మిర్యాలగూడ వనరుల సద్వినియోగం... సంపదను సక్రమంగా వినియోగించే సమర్థులు అధికారంలోకి రావాలి. అవినీతి, స్వార్థం లేని నాయకుల వల్లనే ఇది సాధ్యం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రవాణా సౌకర్యా లను మెరుగుపర్చాలి. తెలంగాణ మరిం త వేగంగా అభివృద్ధి జరగాలంటే రవా ణా సదుపాయాలు పెరగాలి. ప్రధానం గా రైలుమార్గాల విస్తరణకు కృషి చేయా లి. వ్యవసాయంతో పాటు పాడి పరి శ్రమ అభివృద్ధిమీద దృష్టి సారించాలి. నిర్భంద విద్యను అమలుచేసి పదేళ్లలో నిరక్షరాస్యులు లేని రాష్ట్రంగా తయారు చేయాలి. నైజాం ఆభరణాలను అమ్మి బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఖర్చుచేయాలి. - మంద నారాయణమూర్తి, హైదరాబాద్ -
ప్రతిజిల్లా పరిశ్రమవ్వాలి: కె.నాగేశ్వర్
* అపార ఖనిజ సంపద తెలంగాణ సొంతం * పారిశ్రామిక ప్రగతి అన్ని జిల్లాలకూ విస్తరించాలి * విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చాలి * జిల్లాల్లోనూ విమానాశ్రయాలు నిర్మించాలి * అప్పుడే నవతెలంగాణ సాధ్యం ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు పారిశ్రామిక రంగం.. ముఖ్యంగా వస్తూత్పత్తి రంగం ఆలంబన అవుతుంది. సమాచార సాంకేతికరంగం లాంటి సేవల రంగంలో హైదరాబాద్ విశిష్ట ప్రగతి సాధించింది. దేశంలోనే సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో నాలుగో స్థానంలో ఉంది. అయితే సేవల రంగం ఆధునిక ఉపాధి కల్పించినా అది పరిమితం. వస్తూత్పత్తి రంగమే ఉపాధి కల్పించి విస్తృత అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఔషధ పరిశ్రమలు మొదలుకొని ఎలక్ట్రానిక్స్, మెషీన్‌టూల్స్, ఏరోనాటిక్స్ రంగాలకు చెందిన భారీ పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయి. అయితే ఆయా రంగాల్లో మరింత ప్రగతి, ఆధునికత సాధించడంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా పారిశ్రామికీకరణ జరగాలి. ముడిపదార్థాలున్నా.. నిస్తేజంగా.. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో బొగ్గు గనులు, కొన్ని జిల్లాల్లో సిమెంట్ కర్మాగారాలు, మెదక్ జిల్లాలో మోటారు పరిశ్రమలు, నిజామాబాద్‌లో చక్కెర, బీడీ పరిశ్రమ, ఆదిలాబాద్‌లో జిన్నింగ్ మిల్లులు, నల్లగొండలో బియ్యం మిల్లులు మొదలుగునవి ఉన్నప్పటికీ, ఇతర అనేక పరిశ్రమల ఏర్పాటుకవసరమైన ముడి పదార్థాల లభ్యత తెలంగాణ ప్రత్యేకత. తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర, కాగితం, పరిశ్రమల అభివృద్ధికి కూడా విస్తారమైన అవకాశాలున్నాయి. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, నల్లగొండ జిల్లా పోచంపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమకు అవకాశాలున్నా నిస్తేజంగా పడిఉన్నాయి. అద్భుత నైపుణ్యం ఉన్న నేతకారులు కళావిహీనులై నగరంలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేయడం నాగరికతకే తలవంపు. యువతను ఊరిస్తున్న ఐటీఐఆర్ ఆదిలాబాద్ జిల్లాలో మాంగనీస్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో సున్నపురాయి, నల్లమల అటవీసంపద వివిధ రకాల పరిశ్రమలకు అవకాశాలు ఇస్తున్నాయి. నిజామాబాద్‌లో పసుపు, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల్లో మిర్చి, రంగారెడ్డిలో హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఫ్లోరీ కల్చర్‌కు ఉన్న అవకాశాలు పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయగలవు. వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్ లాంటి జిల్లాల్లోని టైర్-2, టైర్-3 నగరాలకు సమాచార సాంకేతిక పరిశ్రమను విస్తరించేందుకు అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం(ఐటీఐఆర్) నగర యువతను ఉవ్విళ్లూరిస్తోంది. మసిబారుతున్న యువత భవిత ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న బొగ్గుగనులు వేలాది కుటుంబాలకు జీవనోపాధినిచ్చి జీవి తాలు మార్చాయి. కానీ ఈ గనుల్లో క్రమంగా ఉపాధి తగ్గి పోవడంతో స్థాని క యువత భవిత మసిబారుతోంది. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని గ్రానైట్ పరిశ్రమ గందరగోళంలో ఉంది. కాబట్టి సమగ్ర పారిశ్రామిక పునరుజ్జీవనాన్నీ, సరికొత్త పారిశ్రామికీకరణ కోసం నవతెలంగాణ ఎదురుచూస్తోంది. ఎన్నెన్నో అవకాశాలు తెలంగాణ ఖనిజాల గని. ఆదిలాబాద్ జిల్లాలో మాంగనీసు, ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దులో ఇనుప ఖనిజం, ఉత్తర తెలంగాణలో బొగ్గు, ప్రాణహిత పరివాహక ప్రాంతంలో బొగ్గు ఆధారిత మీథేన్(సీబీఎం) గ్యాస్ నిక్షేపాలున్నాయి. ఇంకా గణనీయ స్థాయిలో సున్నపురాయి నిక్షేపాలున్నాయి. ఇవికాక చైనా క్లే, గ్రానైట్, స్పటికం, మైకా మొదలుగు నిక్షేపాలు మెదక్, నల్లగొండ లాంటి ఇతర తెలగాణ జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ పారిశ్రామిక ముడి పదార్థాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో సుమారు 45శాతం అటవీ సంపద తెలంగాణలోనే ఉంది. దేశంలోని మొత్తం బొగ్గు నిక్షేపాలలో 20శాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని అంచనా. వ్యవసాయాధారిత, ఆహారోత్పత్తి పరిశ్రమలతో పాటు బయో టెక్నాలజీ లాంటి విజ్ఞాన ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కూడా అవకాశాలు ఎన్నెన్నో. వెక్కిరిస్తున్న విద్యుత్ కొరత ముడి పదార్థాలున్నా, మురిపించే అవకాశాలున్నా ఆచరణలోకి రావాలంటే కావలసిందల్లా దార్శనికత గల రాజకీయ నాయకత్వమే. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికీకరణకు అతిపెద్ద సవాల్ చాలినంత విద్యుత్ లేకపోవడమే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మొత్తం విద్యుత్ సామర్థ్యం 16,500 మెగావాట్లు. ఇందులో 10,500 మెగావాట్లు సీమాంధ్ర ప్రాంతంలోనే. తెలంగాణ ప్రాంతంలో ఉన్న మిగిలిన విద్యుత్‌లో గణనీయమైన భాగం జలవిద్యుత్తే. దీని ఉత్పత్తికి నీటి వనరుల లభ్యత ఎప్పుడూ సమస్యే. విద్యుత్ కొరత పారిశ్రామికీకరణకు ఆటంకంగా మారక తప్పదు. అతి తక్కువ కాలంలో విద్యుత్ లోటునుంచి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు అధికారంలోకి రానున్న రాజకీయ నాయకత్వం ప్రణాళికలు రచించి అమలు చేయాలి. సమగ్ర జల విధానాన్ని అమలు చేయడం ద్వారా భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించి, ఉపరితల జలాల వినియోగాన్ని పెంచి తద్వారా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించాలి. విమానయానం జిల్లాలకూ విస్తరించాలి హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునిక పారిశ్రామికీకరణకు గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. అయితే హైదరాబాద్‌తోపాటు తెలంగాణ రాష్ర్టంలో ఇతర నగరాలను కూడా పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలంటే విమానయానరంగం విస్తరించాలి. ఆదిలాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో ఇప్పటికే విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రైల్వేలైన్లు అభివృద్ధి కావాలి. అందుబాటులో ఉన్న ముడి పదార్థాలను ఉపయోగిస్తూ మానవ వనరులను అభివృద్ధి చేయాలి. మౌలిక వసతులు కల్పిస్తూ ఉపాధి అవకాశాలే లక్ష్యంగా నూతన పారిశ్రామిక యుగానికి నవ తెలంగాణలో నాంది పలకాలి. - ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పొన్నాల లక్ష్మయ్య ఖిలాషాపురం, వరంగల్ గిది మీ ఊరే..! - సగం కూలిన ప్రాథమిక పాఠశాల భవనం.. ఆరుబయట చదువులు - విద్య, వైద్యం, మంచినీటికి ఇబ్బందులు - అద్దె ఇంట్లో ఆరోగ్య ఉపకేంద్రం - వ్యవసాయ పరికరాలు నిల్వచేసుకునే స్థలంగా గ్రంథాలయ భవనం - కంకరతేలి భయపెడుతున్న రోడ్లు - చెంతనే అశ్వరావుపల్లి రిజర్వాయర్ ఉన్నా తాగునీటికి ఇక్కట్లు - పర్యాటకంగా అభివృద్ధి చేయకపోవడంతో కూలుతున్న సర్దార్ సర్వాయి పాపన్న కోట - మాదారం-ఖిలాషాపురం మధ్య వాగులో వంతెన నిర్మించకపోవడంతో వర్షాకాలంలో వాగుపొంగి సమీప గ్రామాలతో ఖిలాషాపురానికి తెగిపోతున్న సంబంధాలు ఒక్కడే... అనావుకుడిగా వచ్చి... అసెంబ్లీలో పాగ అవి జనతాపార్టీ గాలి ఉధృతంగా వీచే రోజు లు. ఎమ్మెల్యే టిక్కెట్ ట్రై చేద్దావూ! అనుకున్నా రు... మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లోని ఓ ఆర్ఎంపీ జి.నర్సిములునాయుడు. అనుకు న్నదే తడవుగా జనతాపార్టీ టిక్కెట్ కోసం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం వరకు వేచిచూసి నిరాశగా వెనుదిరిగారు. ‘ఎలాగూ ఇంత దూరం వచ్చా కదా.. గాంధీభవన్‌ను చూసి వెళ్దాం’ అనుకుని అక్కడికి వెళ్లి ఎందుకైనా మంచిదనుకుని వెంట తెచ్చుకున్న దరఖాస్తును అక్కడ సమర్పించారు. అంతే ఆయున రొట్టె విరిగి నేతిలో పడింది. ‘ఇందిరా కాంగ్రెస్ టికెట్‌కు మీరొక్కరే దరఖాస్తు చేసుకున్నారు...టికెట్ మీకే వచ్చింది’అంటూ గాంధీభవన్ నుంచి అతనికి వర్తమానం వచ్చింది. దీంతో అనూహ్యంగా ఆయున కాంగ్రెస్ టికెట్‌పై బరిలో దిగి 1978లో మక్తల్ ఎమ్మెల్యే అయ్యారు. ఒక ఆర్ఎంపీ ఒక పార్టీకి దరఖాస్తు చేసేందుకు వెళ్లి మరోపార్టీకి దరఖాస్తు సమర్పించి ఏకంగా ఎమ్మెల్యే కావడం అప్పట్లో ఓ సంచలనం. -న్యూస్‌లైన్, నారాయణపేట సాకలోల్ల కట్టం తీరకచ్చె రాజులు బోవట్టే.. రాజ్యాలు బోవట్టే గని మా సాకలోల్ల బతుకుల సీమంత సుక మారకచ్చినై. మా తాతముత్తాతల కాడికెళ్లి గిదే బతుకు. పొద్దుగల్ల లేసి.. కారంబువ్వ దిని.. ఇళ్లిళ్లూ దిరిగి ఊళ్లె బట్టలన్నీ ముళ్లెగట్టుకుని చెరొడ్డుకు దీస్కచ్చి ఉతుకుడే దెలుసు. బట్టలకంటిన మైలైతే బోవట్టే గని మా బతుకు కట్టం తీరకచ్చె. ఇగ మా బతుకంతా చాకిరేవు కాడ్నే బోవట్టే. మాకు దెల్సింది గిదొక్కటే పని. గిది గుడ సక్కగ సేసుకోలేక పోతున్నం. బట్టల్ని ఉతుకుదమంటే నీళ్లుంట లేవు. చెరువుల, కుంటల కాడ ఉతకస్త లేదు. గా దోబిగాట్లు కట్టిపియుండ్రి సారూ.. అని పెద్దమనుషులందర్ని అడిగినం. ఇగ ఎలచ్చన్ల సంగతేందో.. గ లీడరుసాబుల ముచ్చటేందో. ఐదేండ్లకోపారి గిట్ల ఇంటిమొకాన అత్తరు. ఏమే అవ్వ మంచిగున్నాయే.. అని తియ్యగ మాట్లడతరు. ఈసారి గూడ నాకే ఓటు గుద్దే అవ్వ.. నీకు పించినిప్పిత్తా.. ఇళ్ల జాగ ఇప్పిత్తా అని జెప్తరు. ఓట్లేశేనాడు ఆటోల గూసుండ వెట్టి దీస్కపోతరు. తీస్కత్తరు. గంతే.. మల్ల ఒక్కనాడు సుక కన్పియ్యరు. మాకు పెద్దకోర్కెలు ఏముంటయ్ బిడ్డా.. కడుపుకింత తిండి, కట్టుకునతందుకు బట్ట, ఉండతందుకు ఇంత ఇల్లు సాలు. ఇగ గివి గూడ ఇయ్యకపోతే గౌర్నమెంటు ఎందుకు.. గీ లీడరుసాబులు ఎందుకు. - సాకలి లచ్చవ్వ, బూర్గుల్, నిజామాబాద్ -
నవ తెలంగాణ నిర్మాణంలో భాగం కండి
అమరుల త్యాగాలు... సబ్బండ వర్ణాల పోరాటాలతో అరవై ఏళ్ల తండ్లాట తీరింది. నెత్తుటి జ్ఞాపకాలు, నిత్య నినాదాలతో చరిత్రలో నిలిచిన తెలంగాణ గడ్డ నేడు నవ తెలంగాణ కోరుకుంటున్నది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా మరింతగా వెలుగులీనాలంటే ఎలాంటి మేలిమి మార్పులు రావాలి? అందుకోసం ఏమేం చేయాలి? ఎవరెవరు ఎలా నడుం బిగించాలి? వీటన్నింటి మీద మీ ఆలోచనలను ‘సాక్షి’తో పంచుకోండి. మీ అభిప్రాయాలను క్లుప్తంగా మాకు రాసి పంపండి. ఫొటో కూడా పంపించండి. ఎలక్షన్ సెల్, సాక్షి దినపత్రిక, రోడ్ నం.1 బంజారాహిల్స్, హైదరాబాద్ లేదా lection@sakshi.comకు మెయిల్ చెయ్యండి. అందరికీ కార్పోరేటు వైద్యం... వనరులన్నీ ఉన్నా తెలంగాణ వెనుకబడి పోయింది. వెనుకబాటుకు దారి తీసిన కార ణాలపై దృష్టి సారిస్తేనే నవ తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుంది. ప్రాథమిక స్థాయినుంచి మాతృభాషలో విద్యా బోధన జరగాలి. అభివృద్ధి లో కీలక పాత్ర పోిషించే విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు ప్రైవేటు రంగంలో ఉద్యోగ భద్రత కల్పిం చాలి. దళారీ వ్యవస్థను రూపుమాపి ధరలను నియంత్రించాలి. ఆహారధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించాలి. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలి. నదుల అను సంధానం చేయాలి. పూడుకుపోయిన చెరువు లను పునరుద్ధరించాలి. వైఎస్ హయాంలో మాదిరిగా ప్రజలందరికీ కార్పోరేటు వైద్యాన్ని అందుబాటులోకి తేవాలి. - సుధాకర్ శ్రీచూర్ణం, లెక్చరర్, జహీరాబాద్, మెదక్ జిల్లా. ఉపాధి అవకాశాలు పెరగాలి... తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో విద్యాఉపాధి రంగాల్లో అవకాశాలు మెరుగవు తాయని ఈ ప్రాంత ప్రజలు ఆశలు పెట్టుకు న్నారు. ఉద్యోగావకాశాలు కల్పించడానికి రాబో యే ప్రభుత్వాలు కృషి చేయాలి. అప్పుల బాధ తో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థి తులను తొలగించాలి. వ్యవసాయాన్ని లాభదా యకంగా మార్చాలి. ప్రతి జిలా ్లకేంద్రాన్ని అన్ని సౌకర్యాలు గల నగరాలుగా అభివృద్ధి చేయాలి. ప్రతి జిల్లాలో ఒక వైద్యకళాశాల, ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్య కళాశాలలను ఏర్పాటు చేయాలి. అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి. - తోట యోగేందర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా అసమానతలు లేని విద్య... విద్యారంగంలో అసమానతలను రూపు మాపాలి. అందరికీ నాణ్యమైన విద్య అందిం చేలా చర్యలు తీసుకోవాలి. విద్యాహక్కు చట్టాన్ని ఇందుకు ఆయుధంగా వాడుకోవాలి. విద్యా రంగంలో కార్పోరేటు ధోరణులను పారదోలాలి. విద్య ఎవరికయినా ఒక్కటే. అలాంటిది చదువు కోసం కొందరు లక్షల్లో డొనేషన్లు కట్టాల్సి రావడం ఎంతవరకు సమంజసం. విద్యాహక్కు చట్టం ప్రకారం అందరూ నామమాత్రపు ఫీజు లతో అత్యుత్తమ విద్యను పొందేలా చూడాలి. - తుమ్మలపల్లి ప్రసాద్, ఇల్లెందు, ఖమ్మం జిల్లా (కార్యదర్శి, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం) ఆదర్శరాష్ట్రంగా నిలవాలి... దశాబ్దాల పోరాటాల ఫలితంగా తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరిం చింది. విద్యార్థుల బలిదానాల వల్లనే ఇది సాధ్యమయ్యింది. ప్రతి జిల్లాలో కనీసం ఒక భారీ పరిశ్రమను నెలకొల్పి ఉపాధి కల్పించాలి. ప్రతి కుటుం బానికిఒక ఉద్యోగం కల్పించాలి. పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కడికక్కడ వేళ్లూనుకున్న అవినీతిని సమూలంగా నిర్మూలించాలి. అప్పుడే సామాన్యుడికి న్యాయం జరుగుతుంది. నవ తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుంది. - వెనిశెట్టి రవికుమార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు (రాష్ట్రపతి అవార్డు గ్రహీత) హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా -
నా తెలంగాణ స్వచ్ఛంగా.. పాటలా.. తేటగా..
నవ తెలంగాణ: పల్లె కన్నీరు పెడుతుందో..కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అవుతుందో.. కనిపించని కుట్రల.. అని గ్రామాల్లో జరుగుతున్న దుర్మార్గాలను, కనుమరుగు అవుతున్న పల్లె సంస్కృతిని చూసి బాధతో గొంతు పెకిలించినోడు ప్రజాకవి గోరటి వెంకన్న. తన గొంతు నుంచి సమస్త తెలంగాణ దుఃఖాన్ని, నిరసనను, ధిక్కారాన్ని పలికించినోడు. గోరటి పాటలను భుజాన వేసుకుని జనాన్ని చైతన్యం చేసే కళాకారులు వందలు.. వేలల్లో ఉన్నారు.అలాంటి వెంకన్న.. నవ తెలంగాణ నిర్మాణంపై కోన సుధాకర్ రెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని ఆవిష్కరించారు. ప్రజల కల సాకారమైంది. దశాబ్దాల పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైంది. ఇక కొత్త రాష్ట్రంలో అన్ని విషయాల్లోనూ పునర్నిర్మాణం జరగాలి. గ్రామీణ సంప్రదాయ కళా ైవె భవాలకు పునర్వైభవం తీసుకురావాలి. సెజ్‌ల పేరుతో తెలంగాణ గడ్డన భూములకు పడ్డ కంచెలు తొలగిపోవాలి. వివక్షకు అసలు కారణం భూమే కాబట్టి ఎవరికీ 20 ఎకరాలకు మించి ఉండకూడదు. భూమిలేనివారందరికీ ప్రభుత్వ భూమి ఇవ్వాలి. ప్రభుత్వమే చెరువులు తవ్వించాలి. అవసరం అనుకుంటే బోర్లు వేయించాలి. నీటి యాజమాన్యం పంపిణీపై ప్రభుత్వం శ్రద్ధపెట్టాలి. అభివృద్ధి దిశగా ఆలోచించాలి. రెండు జీవనదుల మధ్యనున్న గడ్డ తెలంగాణ. సంపూర్ణంగా నీరు రావాలి. పెట్టుబడుల్లేని వ్యవసాయం, నీటి వాడకం తక్కువగా ఉన్న పంటలు రావాలి. పంటలు రైతులకు వెన్నుదన్నుగా ఉండాలి. ఉద్యోగ సంఘాల జేఏసీలు ఈ రోజు నుంచి కొత్త తెలంగాణ రాష్ట్రం కోసం కంకణబద్ధులమై పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. లంచం తీసుకోబోమని, అవినీతి జోలికి వెళ్లబోమని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేయాలి. ఎన్నికల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలవాలి. అధికారులు అలసత్వం వీడాలి. తెలంగాణ స్వచ్ఛంగా, సంపూర్ణంగా ఉండాలి. పల్లెల బాగు కోసం.. సరళీకరణ ఆర్థిక విధానాలతో పల్లెల్లో చాలా మార్పులు వచ్చాయి. ఊహించని సదుపాయాలతోపాటు రాజకీయ దళారీ వ్యవస్థలూ వచ్చి చేరాయి. పల్లెలు బాగుపడాలంటే ఆదర్శవంతమైన ఉద్యమాలు రావాలి. ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం మద్య నిషేధం చేయడంతోపాటు ప్రతీ కుటుంబానికి మూడెకరాల భూమి ఇవ్వాలి. ప్రజలను పిప్పిచేస్తున్న వైద్య, విద్య రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలి. పోలీసులు సోషల్ వర్కర్ల లాగా పనిచేయాలి. కుల వృత్తులను ఆధునికీకరించాలి. అప్పుడే తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి సిరిమల్లెచెట్లు మొలకెత్తుతాయి. విడిపోయిన మనమొక్కటే.. తెలంగాణ అంటే కరువు..కన్నీళ్లే. నీరు, కొలువుల విషయంలో బాగా అన్యాయం జరిగింది. ఇప్పుడు విడిపోయినా మంచిగానే విడిపోవాలి. భౌగోళికంగానే విడిపోతున్నాం తప్ప మన సంస్కృతి, జాతి ఒక్కటే కదా. ఇక సాంస్కృతికంగా తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. వలసవాదులు మొదట తెలంగాణ భాషపైనా, ఈ ప్రాంతపు సొగసులపైనా పడ్డారు. కళను మార్కెట్ చేసుకుని ఆ తర్వాత అందమైన తెలంగాణ సృజనాత్మకతను మింగేశారు. అందుకే.. ఆ పాట రాశా ఎందరో వలసవాద రాజకీయనేతలు, పెట్టుబడిదారులు ఇక్కడి వందలాది ఎకరాల పచ్చటి నేలను ఆక్రమించేశారు. ఉద్యోగాలను కొల్లగొట్టారు. మా తెలంగాణ బిడ్డలు యాడికిపోవాలి. వందలాది మంది మిసమిసలాడే మీసకట్టు కలిగిన యువకులు తెలంగాణ కోసం ప్రాణాలు విడుస్తుంటే ఏమీ ఎరగని వారిలాగా ఆంధ్రావాళ్లు ఉంటే మాకు మండదా. అందుకే కడుపు మండి ‘పొమ్మంటే పోవేందిర ఓ ఆంధ్ర దొర’ అనే పాట రాశా. ఏ ఉద్యమానికైనా పాటే ఊపిరి పాటలేని ఉద్యమాన్ని ఊహించుకోలేం. ఆఫ్రికా జాతి ఉద్యమంలోనూ, నిజాం వ్యతిరేక పోరాటాల్లోనూ ప్రజల పక్షాన నిలిచింది పాటే. ప్రగతీ శీల ఉద్యమాలకు ముందే పాట ఉంది. హింసకు, పెత్తనానికి, బాంచన్ దొరలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పాటను ఆయుధంగా చేసుకున్నారు. ఆనందం, బాధ కలిగినప్పుడు పాట దానంతట అదే పుట్టుకొస్తుంది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు పాట అనేకరకాలుగా దోహదం చేసింది. కోస్తాలో పౌరాణిక నాటకం, రాయలసీమలో తత్వ పద్యం, తెలంగాణలో జానపద పాటలు.. మూడు ప్రాంతాల్లో మూడు రకాలు. పల్లెనుంచి వచ్చాను కాబట్టే ఆ వాసన మాది మహబూబ్‌నగర్ జిల్లా తెలకపల్లి మండలంలోని గౌరారం. మధ్యతరగతి కుటుంబం. నాలుగో తరగతి నుంచి పది వరకు రఘుపతిపేటలో, ఇంటర్ కల్వకుర్తిలో చదివాను. తల్లి ఈరమ్మ, తండ్రి నర్సింహ. టీచరు వెంకటరెడ్డి ప్రభావంతో విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐ వైపు కొంతకాలం మొగ్గాను. మా ఊరంతా ప్రకృతి రమణీయంగా ఉంటుంది. అందరూ ఒకే కులంగా కలిసిమెలసి బతికేవారు. పల్లె నుంచి వచ్చిన వాణ్ణి కనుక నా పాటలో పల్లె వాసన ఉంటుంది. నిజాం రాక్షసత్వం, ప్రపంచీకరణ పరిస్థితులు చూశాను. పుచ్చలపల్లి సుందరయ్యలాంటి వామపక్షనేతల్ని, సర్వోదయ ఉద్యమాల్ని గమనించాను. దీంతో మనుషులంతా సమానం అన్న అభ్యుదయం నా రక్తంలో జీర్ణించుకుపోయింది. 1985-86లో నీ పాట ఏమాయెరో అనే పాట రాశాను. సోషలిజం, సమానత్వం, సాటి మనిషికి సాయం చేయాలనేదే ఇప్పటికీ నా ఆలోచన. ఆ పార్టీ రాకముందే అన్యాయంపై పాటరాశా తెలంగాణపై మొత్తంగా 22పాటలు రాశా. సందర్భోచితంగా పాడినవి మరికొన్ని ఉన్నాయి. ‘రేలదూల తాలెల్లాడే తెలంగాణ నే’, తల్లి తెలంగాణ , ఎలమంద ఎలమంద, కంపతారు చెట్లు...ఇలా ఎన్నో రాశాను. పారుతున్న నదీజలాల పంపకంలో జరిగిన అన్యాయానికి మొగ్గతొడిగిన ఉద్యమం నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. టీఆర్ఎస్ పార్టీ రాకముందే తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పాట రాశా. బషీర్‌బాగ్ కాల్పులపై 12 పాటలు రాశాను. అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాబట్టి ముందుగా వారి కుటుం బాలు బాగుపడాలి. ఇకనుంచి తెలుగు ప్రజల దుఃఖం గురించి పాడతా. వైఎస్ అభినందించారు నేను రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ పాట రాష్ట్రంలో ఓ పార్టీ అధికారం కోల్పోవడానికి కారణమైందని చాలామంది అంటుంటారు. నిజానికి నాకైతే ఆ విషయం తెలియదు. 1996-97లో రాసిన ఆ పాటను ‘కుబుసం’ సినిమాలో వాడుకున్నారు. ఆ తర్వాత గత ఎన్నికలకు ముందు ‘పార్టీ’ వాళ్లు ప్రకటనగా వాడుకున్నారు. అది అలా దోహదకారిగా అయిందని చాలామంది అప్పట్లో చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడో రోజే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నన్ను, మరికొందరిని పిలిపించి అభినందించారు. నా ఊరే ప్రేరణ.. 1996-97లో ‘పల్లె కన్నీరు పెడుతుందో...’ అనే పాట రాశాను. దీనికి ప్రేరణ నా ఊరే. సంస్కరణల ప్రభావంతో ఊళ్ల నుంచి వలసలు మొదలైన కాలం. ప్రతి ఏటా మా ఊళ్లో మొహర్రం బాగా జరుగుతుంది. అలాంటిది ఆ ఏడాది మా ఊరికి పోతే ఊళ్లో జనాలే లేరు. రైతుల వ్యధలు, పల్లె ఉనికి కోల్పోతున్న వైనం నన్ను కదిలించింది. అదేపాటగా మారింది. ఆధునికతకు దూరమవుతున్న మనుషుల గురించి రాశాను. ఏ ఊళ్లో చూసినా కలవృత్తులు మూలనపడ్డాయి. ఒక సంవత్సర కాలం పట్టిందీ పాటకు. బాలసంతుల యక్షగానం స్ఫూర్తితో నేనీ పాటను రాశా. -
జన తెలంగాణ కావాలె!
నవ తెలంగాణ: తెలంగాణ వచ్చింది. సంతోషమే. కానీ వస్తుందనుకున్న తెలంగాణ రాలేదు. భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది. రాజకీయ తెలంగాణ మాత్రమే వచ్చింది. దీనివల్ల ప్రజలకు ఏం లాభం. ప్రజల తెలంగాణ రావలసి ఉండే. దోపిడీ, పీడన లేని తెలంగాణ వస్తే బాగుండేది. రాజకీయ దోపిడీ, శ్రమ దోపిడీ లేని తెలంగాణ కావాలె. భూమి లేని వాళ్లందరికీ భూమి దక్కాలే. ఒకప్పుడు దొర గడీలను కూలగొట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో దూకిన ఉద్యమకారుడు ఆయన. మార్క్సిజాన్ని, మానవత్వాన్ని, ఆధ్యాత్మికతను, తరతరాల సాహిత్య, సాంసృృతిక వారసత్వాన్ని వైవిధ్యభరితంగా ఆవిష్కరించిన గొప్ప రచయిత. దార్శనికుడు. ఆయనే అక్షరవాచస్పతి దాశరథి రంగాచార్య. తన జీవితకాలంలో వస్తుందో రాదో అనుకున్న తెలంగాణ వచ్చేసింది కానీ అది తాను కోరుకున్న తెలంగాణ కాదన్నది ఆయన ఆవేదన. సాక్షితో ఆ సాహితీ స్రష్ట పంచుకున్న భావాలు.. ఆయన మాటల్లోనే..! - దాశరథి రంగాచార్య అంతరంగం ‘తెలంగాణ వచ్చింది కదా సంతోషమేనా అని చాలా మంది అడుగుతున్నారు. ఫోన్లు చేసి పలకరిస్తున్నారు. ఏదో ఒకటి వచ్చినందుకు సంతోషమే కానీ, ఇది పెద్ద సంతోషమైతే కాదు. వచ్చింది రాజకీయ తెలంగాణ. దీనివల్ల ప్రజలకు ఏం పని.. ప్రజలకు మేలు చేసే తెలంగాణ రావలసి ఉండె. ప్రజల తెలంగాణ కోసం పోరాటం జరగవలసి ఉండే. అట్లా జరుగలేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు సాధించిన ఫలితాలు ప్రజలకు దక్కినప్పుడే తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరినట్లు. కమ్యూనిస్టులు పంచిన లక్షలాది ఎకరాల భూములను దొరలు తిరిగి హస్తగతం చేసుకున్నారు. ఆ భూములు తిరిగి ప్రజల పరమైనప్పుడే తెలంగాణ లక్ష్యం నెరవేరినట్లు లెక్క. అదెట్లా సాధ్యమనుకోవద్దు. చిత్తశుద్ధి ఉండే ఏ మాత్రం కష్టం కాదు. ప్రజలకు భూమి మీద హక్కు లభించినప్పుడే వాళ్ల ఆత్మగౌరవం నిలబడుతుంది. గౌరవప్రదంగా బతుకుతారు. సాయుధ పోరాటం నుంచి నేటి దాకా ఎంతో రక్తాన్ని ధారపోసింది తెలంగాణ. ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా, సంతోషంగా బతికే సదుపాయాలు కావాలె. అట్లా బతుకాల్నంటే భూమి లేని వాళ్లందరికీ భూమి దక్కాలే. సకల జనుల అభివృద్ధి జరగాలె.. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడేందుకు కాళోజీ లేడు. జయశంకర్ లేడు. తెలంగాణకు దిశానిర్దేశం చేసే పెద్దవాళ్లెవరు ఉన్నారు? చాలా అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇది. రాజకీయ నిరుద్యోగం కారణంగా నష్టం జరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న పార్టీలు కూడా ముందుకొస్తాయి. రాజకీయ అనిశ్చితి పెరుగుతుంది. కొట్లాటలు పెరుగుతాయి. తెలంగాణ అభివృద్ధికి ఇది అవరోధం. ఈ రాక్షస క్యాపిటలిస్టు ఉత్పత్తి విధానంలో సామాన్యుడు ఏమవుతాడోననేదే నా ఆవేదన. ఈ ధనపతులు మానవాళిని, మానవతను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. భవిష్యత్తు తరాలకు మట్టి చిప్ప కూడా దక్కకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా పరిశ్రమల్లో కార్మికులకు భాగస్వామ్యం ఉండే విధంగా విధానాలు రూపొందించాలి. కార్మికుల జీవితాల్లో గొప్ప ముందడుగు రావాలి. అందుకు చక్కటి దార్శనికత అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే సకల జనుల ఉద్యమ భాగస్వామ్యంతో వచ్చిన తెలంగాణలో సకల జనుల అభివృద్ధికి, సంక్షేమానికి బాటలు పడాలి. అప్పుడే తెలంగాణ స్వయంపాలన సాధించుకున్నట్లు. సాంస్కృతిక తెలంగాణ రావాలె.. నిజాం నిరంకుశ పాలనను,రజాకార్ల హింసను చవి చూసింది తెలంగాణ. ప్రజలు అనతి కాలంలోనే ఆ హింసను మరిచి నిజాంను ఒక ప్రభువుగా కీర్తిస్తారేమోననే భయం పట్టుకుంది నాకు. ఎందుకంటే అప్పటికే నిజాం కట్టించిన హైకోర్టును, ఉస్మానియా యూనివర్సిటీని పొగిడేవాళ్లు బయలుదేరారు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజలకు అర్ధమయ్యే సులభ శైలిలో ‘చిల్లర దేవుళ్లు’ నవల రాశాను. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత తెలంగాణ భాష, యాస, సంస్కృతి,సాహిత్యం అన్నీ అస్తిత్వాన్ని కోల్పోయినై. మన భాషా సాహిత్యాలను, సంస్కృతిని, కళలను పరిరక్షించే సాంస్కృతిక తెలంగాణ కోసం కృషి జరగాలే. మన యాసను కాపాడుకోవాలె. అందుకోసం పాలకుల దృష్టికోణం మా రాలె. సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయాలె. రాయటం చేతనైతే బాగుండు.. తెలంగాణ జీవితాన్ని, సమాజాన్ని ఇతివృత్తంగా చేసుకొని రాశాను. ఇప్పటికీ రాయాలనిపిస్తుంది. నేను అనుకున్నవన్నీ రాసేవాన్ని. ఇప్పుడు నా వయస్సు 86. నేను వృద్ధున్నే అయినా మనస్సు మాత్రం యువకగానే ఉంది. శరీరమే సహకరించడం లేదు. నా ఉచ్ఛ్వాసం రచన.నిశ్వాసం పఠనం. అవి రెండూ లేకుండానే బతికేస్తున్నాను. చౌరస్తా.. చైతన్యానికి మారుపేరు.. ఎగ్లాస్పూర్ ఓటర్లు నేతల తలరాతలు మార్చే ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకుంటూ చైతన్యానికి మారుపేరుగా నిలుస్తున్నారు కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామస్తులు. విప్లవోద్యమాలకు పుట్టినిల్లయిన ఈ మారుమూల గ్రామంలో నక్సల్స్ ఆజ్ఞలను సైతం బేఖాతరు చేస్తూ ప్రజాస్వామ్యంపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామ జనాభా 619 కాగా, 380మంది ఓటర్లున్నారు. వీరిలో 40మంది విదేశాల్లో ఉన్నారు. 1994 ఎన్నికల్లో 72శాతం, 1996, 98లో 78శాతం, 2009 ఎన్నికల్లో 80శాతం, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 85శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. - న్యూస్‌లైన్, కోనరావుపేట(కరీంనగర్) అక్కడ టీడీపీకి 2 ఓట్లే: ఎ(వి)లక్షణం మూడు దశాబ్దాలు గడిచిపోయినా అక్కడ టీడీపీకి పోలైన ఓట్లపై ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు స్వయంగా ప్రచారం చేసినా రెండంటే రెండే ఓట్లు రావడం చర్చనీయాంశమైంది. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్‌విచార్‌మంచ్ అభ్యర్థిగా పెద్దపల్లి నుంచి ఎన్నికైన గోనె ప్రకాశ్‌రావు తర్వాత రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. టీడీపీ అభ్యర్థిగా వేముల రమణయ్య బరిలోకి దిగారు. అప్పుడు ఆయన విజయం కోసం స్వయంగా ఎన్టీ రామారావు రంగంలోకి దిగి కాల్వశ్రీరాంపూర్ మండలంలోని జాఫర్‌ఖాన్‌పేట, ఇద్లాపూర్ గ్రామాల్లో విస్తత ప్రచారం చేశారు. ఇంత చేసినా ఆ గ్రామాల్లో టీడీపీకి రెండంటే రెండే ఓట్లు పోలయ్యాయి. -న్యూస్‌లైన్, పెద్దపల్లి -
లక్ష మంది ఉద్యోగులు సీమాంధ్రకే
టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ అంతరంగం తెలంగాణలో పనిచేస్తున్న 1.10 లక్షల మంది సీమాంధ్ర ఉద్యోగులను వారి ప్రాంతాలకు పంపాల్సిందే. అలాగే మొత్తంగా 75వేల మంది పెన్షనర్లను సీమాంధ్రకు బదిలీ చేయాలి. తెలంగాణ సెక్రటేరియేట్‌లో నూటికి నూరు శాతం తెలంగాణ ఉద్యోగులే ఉండాలి. ప్రభుత్వం ఉద్యోగ భర్తీ ప్రక్రియను వెంటనే చేపట్టాలి... నవ తెలంగాణ తెలంగాణ నవనిర్మాణంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైంది. గత ప్రభుత్వాల్లో ఉద్యోగానికి... రాబోయే తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగానికి తేడా ఉంటుది. 15 ఏళ్లుగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో ప్రజలు, ఉద్యోగులు మమేకం అయ్యారు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి ఉద్యమాలతో వారి మధ్య విభజన రేఖ చెరిగి పోయింది. ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు, ప్రజలు కలిసికట్టుగా తెలంగాణ నవనిర్మాణం కోసం కృషిచేయాలి. ప్రభుత్వం చేపట్టబోయే పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉద్యోగులదే. కాబట్టి ఉద్యోగులు పని సంస్కృతిని అలవర్చుకోవాలి. ఆదర్శవంతమైన తెలంగాణను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. అవసరమైతే అదనపు గంటలు పనిచేయాలి. పని సంస్కృతి పెరగాలి పని సంస్కృతిని పెంచేందుకు రాబోయే ఏడాది వరకు టీఎన్జీవో ప్రత్యేకంగా ప్రచారం చేయాలని యోచి స్తోంది. ఐదేళ్లపాటు ఉద్యో గులు అదనంగా పని చేసేందుకు సిద్ధంగా ఉండా లని విన్నవిస్తున్నాం. ప్ర భుత్వ పథకాలు లబ్దిదా రులకు చేర్చడంలో ఉద్యోగులు వాచ్‌డాగ్‌లా (కాపలా కుక్క లా) ఉండాలన్నదే మా ఉద్దేశం. ప్రభుత్వ కార్యాల యాలకు వచ్చే ప్రజలకు సేవలందించడంలో ఉద్యోగులు మార్గదర్శకంగా ఉండాలి. అందుకోసం ఉద్యోగుల సర్వీసు రూల్స్‌ను మార్పు చేస్తాం. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వ్యవస్థ రద్దు చేయాలి... ప్రభుత్వ పాలన బయటి వ్యక్తుల చేతుల్లో ఉండడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రభుత్వ రహస్యాలు మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్, కమర్షియల్ ట్యాక్స్, ట్రాన్స్‌పోర్టు తదితర ముఖ్య రంగాల్లో బయటి వ్యక్తుల ప్రమేయం తగదు. అందువల్ల కొత్త ప్రభుత్వం ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలి. ప్రస్తుత కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలి. డీఎస్సీలను పునరుద్ధరించాలి.. ఉద్యోగ భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే చేపట్టాలి. అందుకోసం జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ)లను పునరుద్ధరించాలి. తెలంగాణలో ప్రస్తుతం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత జనాభా ప్రకారం ఉద్యోగాల సంఖ్యను పెంచాలి. నిరుద్యోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించాలి. తెలంగాణలో నూతన ఆర్థిక విధానాల అమలును నిలిపివేయాలి. ప్రభుత్వ వ్యవస్థను కాపాడుకోవాలి. అప్పుడే తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరతాయి. విజన్ ఉన్న నాయకత్వం రావాలి తెలంగాణలో 3.30 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 84 వేల మంది హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. అందులో 60 వేల మంది సీమాంధ్రకు చెందినవారే. హైదరాబాద్ కాకుండా తెలంగాణ జిల్లాల్లో మరో 50 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్నారు. జిల్లాల్లో పనిచేసే వారంతా డీఎస్సీల్లో 20 శాతం ఓపెన్ కోటా కింద ఉద్యోగాలు సంపాదించి నాన్‌లోకల్ కోటా కింద కన్వర్ట్ అయ్యారు. మొత్తంగా తెలంగాణలో పనిచేస్తున్న 1.10 లక్షల మంది సీమాంధ్ర ఉద్యోగులను వారి ప్రాంతాలకు పంపాల్సిందే. వాళ్లు వెళ్లకుంటే ఇక తెలంగాణ వచ్చి ఏం ప్రయోజనం ఉంటుంది? అలాగే 2.36 లక్షల మంది పెన్షనర్లు తెలంగాణలో ఉన్నారు. వారిలో 90 వేల మంది హైదరాబాద్‌లో ఉన్నారు. అందులో 60 వేల మంది సీమాంధ్రకు చెందినవారు. ఇక జిల్లాల్లో 15 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తంగా 75 వేల మంది పెన్షనర్లను సీమాంధ్రకు బదిలీ చేయాలి. స్థానికత ఆధారంగా ఉద్యోగులు, పెన్షనర్ల విభజన జరగాలి. తెలంగాణ సెక్రటేరియట్లో నూటికి నూరు శాతం తెలంగాణ ఉద్యోగులే ఉండాలి. ఇక్కడ నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలి. ఇవన్నీ చేయాలంటే విజన్ నాయకత్వం ప్రభుత్వ పాలనలోకి రావాలి. అప్పుడే నవ తెలంగాణ కల సాకారం అవుతుంది. tngonews@gmail.com -
సామాజిక ఎజెండా రావాలి: కె. నాగేశ్వర్
తెలంగాణ వస్తే తమ బతుకులు పూర్తిగా మారిపోతాయని ప్రజలు నమ్మారు. ఉద్యమానికి జై కొట్టారు. ఇపుడు రాష్ట్రం స్వప్నం సాకారమైంది. రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక విధానాల్లో మార్పులు రాకపోతే ప్రజల్లో అసంతృప్తి మొదలవుతుందని, ప్రజల ఆకాంక్షలే తీరనప్పుడు అది తెలంగాణ సమాజానికి పెను సవాలుగా మారనుందని, ప్రముఖ రాజకీయ, సామాజిక ఆర్థిక విశ్లేషకుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అభిప్రాయ పడుతున్నారు. సమస్త రంగాల్లో తెలంగాణ పునరుజ్జీవనంతో పాటు అసమానతలు తొలగినపుడే రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ప్రజల సమస్యలన్నింటికీ సర్వరోగ నివారిణి కాదు. రాజకీయ, ఆర్థిక విధానాలలో మార్పు రాకుండా ప్రజలు జీవితాలలో మార్పు రాదు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల సమస్యలు ఎన్నికల్లో రాజకీయ ఎజెండా కావాలి. - నాగేశ్వర్, ఎమ్మెల్సీ విజ్ఞానం...అభివృద్ధికి మూలం తెలంగాణ ప్రాంతంలో ప్రాథమిక స్థాయిలో బడిమానేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. డాక్టర్లు, ఆస్పత్రి, పడకలకు, జనాభాకు మధ్య నిష్పత్తి చూస్తే సీమాంధ్ర, తెలంగాణ మధ్య తేడా (హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మినహా) పెరుగుతోందని ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు సీహెచ్ హనుమంతరావు విశ్లేషించారు కూడా! సమాచార సాంకేతిక రంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణవారు తక్కువగా ఉన్నారనే అంశం తెలంగాణ ఉద్యమ కాలంలో ముందు కొచ్చింది. విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలో సర్వీసుల రంగంలో నాణ్యమైన ఉపాధికి అవకాశాలున్నాయి. అందుకే ఆధునిక ఆర్థిక వ్యవస్థలో విజ్ఞాన తెలంగాణ లక్ష్యం కావాలి. ‘పరిశ్రమ’తో ప్రగతి హైదరాబాద్ నుంచి ఔషధ కర్మాగారాలు తరలిపోతు న్నాయి. విద్యుత్ సంక్షోభం వల్ల చిన్న తరహా పరిశ్రమలు మూత పడుతున్నాయి. వరంగల్‌లో అజాంజాహీ మిల్లు నుంచి సిర్పూర్లో సర్ సిల్క్ వర కూ రాజధానిలో డీబీఆర్ మిల్లు మొదలుకుని నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీల వరకూ పరిశ్రమలు మూత పడ్డాయి. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమ గందరగోళంగా ఉంది. వీటి పునరుద్ధరణ వల్ల చిన్న పట్టణాలు, నగరాలను అభివృద్ధి చేయవచ్చు. ఆలోచనా పరులు మెదళ్లకు పదును పెట్టాల్సిన సందర్భం ఇది. సమ సమాజం...లక్ష్యం కావాలి కొత్త తెలంగాణ రాష్ట్రంలో సామాజిక పొందికను అర్ధం చేసుకోవాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌గా మిగిలి ఉండే సీమాంధ్ర మొత్తం జనాభాలో 5.3 శాతం మాత్రమే గిరిజనులు ఉంటారు. కానీ తెలంగాణ రాష్ర్టంలో గిరిజన జనాభా 9.3 శాతం ఉంటుంది. ఆమేరకు రాష్ర్ట శాసన సభలో కూడా గిరిజన ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగనుంది. అలాగే 2001 జనాభా లెక్కల ప్రకారం అవశేష ఆంధ్రప్రదేశ్ జనాభాలో 6.9 శాతం మంది ముస్లింలు ఉంటే తెలంగాణ రాష్ట్ర జనాభాలో వారి వాటా 12.5 శాతం. ఇక ఎస్సీల విషయానికి వస్తే మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో వారు 17 శాతం ఉండగా తెలంగాణలో 15.4 శాతం ఉంటారు. అందుకే తెలంగాణలో మైనార్టీ, అణగారిన వర్గాల అభివృద్ధి అంశం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. సుజలాం...సుఫలాం రాష్ట్ర విభజనకు కారణమైన అంశాలలో నీటిపారుదల రంగంలో అసమానతలు ప్రధాన మైనవి. ఐదు దశాబ్దాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో చెరువుల కింద సాగునీటి సదుపాయం గణ నీయంగా పడిపోయింది. మహబూబ్ నగర్ నుంచి రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఎండిన చెరువులు దర్శనమిస్తాయి. మరోవైపు భారీ, మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా సాగు సదుపాయం ఆశించిన స్థాయిలో పెరగలేదు. శ్రీరాం సాగర్‌లో పూడిక వల్ల సాగునీటి విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఇచ్చంపల్లి ముచ్చట మర్చి పోయారు. పాలమూరులో పేదరికం తాండవిస్తున్నా జూరాల ఆర్డీయస్ ప్రాజెక్టుల కింద కేటాయించిన నీరు ఆ జిల్లా ప్రజలు ఏనాడూ పొందలేదు. మంజీరా నది రాజధాని వాసుల దాహార్తి తీరుస్తున్నప్పటికీ మెదక్ జిల్లా ప్రజలకు ఆర్తినే మిగిల్చింది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర జలవిధానం ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు, ప్రతి ఎకరానికీ సాగునీరిచ్చే ఏర్పాటు జరగాలి. గొలుసు చెరువుల పునరుద్ధరణ జరగాలి. పర్యాటకరంగానికి పెద్దపీట వేయాలి ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో, నల్లమల అడవుల్లో పర్యావరణ అనుకూల పర్యాటక రంగాన్ని (ఇకో టూరిజం) అభివృద్ధి చేయవచ్చు. మహబూబ్ నగర్లో ఉన్న కోటలు, చెరువులూ, రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి కొండలూ హైదరాబాద్ నగర వాసులకు సేదదీర్చుకునే ప్రదేశాలు అవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యం గల బౌద్ద, జైన క్షేత్రాలున్నాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం, దేశంలోని అరుదైన బాసర సరస్వతీదేవి ఆలయం, నైజాం నవాబులు, కాకతీయులూ, శాతవాహనుల నాటి చారిత్రక ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. వ్యవసాయం మొదలుకుని అన్ని రంగాల్లోనూ స్థానికపరమైన ప్రత్యేకతలను గుర్తించి, వాటి పునరుద్ధరణ కోసం ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళికను రచించే దార్శనికత నవ తెలంగాణలో అవసరం. వ్యవ‘సాయం’...శ్రేయోదాయకం వ్యవసాయమే కాదు అనుబంధ రంగాల అభివృద్ధి కూడా ఉపాధి కల్పనకు సుస్థిర ఆదాయానికి కీలకం అవుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యం గా రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక వ్యవసాయ, ఉద్యాన వన పంటల ప్రాంతాన్ని స్థానిక రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. హైదరాబాద్ నగర ప్రజలకు పండ్లు, పూలు, పాలు సమృద్ధిగా లభించేందుకు వీలు కలుగుతుంది. అంతరా ్జతీయ విమానాశ్రయం కూడా ఆ సమీపంలో ఉండడం వల్ల ఫ్లోరీకల్చర్ అభివృద్ధికి కూడా అవకాశాలున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా గొర్రెల పెంపకంలో అగ్రభాగాన ఉంది. కృష్ణా నదిలో నీళ్ళ కన్నా ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నాయి. కానీ గోదావరి నదిలో నాలుగు వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. ప్రాణహిత, ఇంద్రావతి కలిసాక గోదావరిలో పుష్కలంగా నీరుంటుంది. అనాడే ఇచ్చంపల్లి ప్రాజెక్టు కనుక కట్టి ఉంటే తెలంగాణలో గణనీయమైన ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది. అయితే చాలా ప్రాంతాల్లో నీటి ప్రవాహం కన్నా దిగువ ప్రాంతంలో భూములుండడం వల్ల గోదావరి జ లాలను ఎత్తిపోతల ద్వారా మాత్రమే వినియోగించుకోవాల్సిన దుస్థితి ఉంది. ఇందుకు గణనీయమైన స్థాయిలో విద్యుత్ అవసరం ఉంటుంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో సమీకృత జల, విద్యుత్ విధానాలను అమలు చేయాల్సిఉంటుంది. తెలంగాణలో విస్తారంగా బొగ్గు నిక్షేపాలున్నప్పటికీ అవసరమైన పరిమాణంలో విద్యుదుత్పత్తి జరగడంలేదు. స్థానికంగా విద్యుత్ ప్లాంట్లను పెడితే ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. -
నారి.. చైతన్య భేరి
తెలంగాణ రాష్ర్ట సాధన పోరులో అమోఘ పాత్ర పోషించిన స్త్రీమూర్తులకు తెలంగాణ నవ నిర్మాణంలో సముచిత స్థానం కల్పిం చాలని విమలక్క సూచి స్తున్నారు. నవ తెలంగాణలో మహిళల పాత్రపై ఆమె అంతరంగమిది.. - శ్రీధర్ సూరునేని, మంచిర్యాల తొలి, మలి దశ తెలంగాణ పోరులో సగ భాగం బాధ్యత లను భుజాన ఎత్తుకు న్న స్త్రీలు తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక పాత్ర పోషించారు. పురుషులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో పోరుసల్పుతూ తమదైన ముద్ర వేశారు. గత కాలపు పోరాటాల్లో స్త్రీల పాత్రను అణగదొక్కిన సందర్భాలు న్నారుు. తెలంగాణ ఉద్యవుంలో అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదు. బహుజన తెలంగాణ సాధనలో భాగంగా భూమి కోసం, భుక్తి కోసం, వివుుక్తి కోసం ప్రజలంతా చైతన్యం కావాల్సిన సవుయుమిది. పోరులో అమోఘపాత్ర పోషించిన స్త్రీవుూర్తులకు తెలంగాణ నవ నిర్మాణంలో సవుుచిత ప్రాధాన్యం కల్పించినప్పుడే సవుసవూజ స్థాపన సాధ్యం. నాటి సాయుధ పోరాటం నుంచి నేటి అస్తిత్వ పోరాటం వరకు మహిళలు కీలకపాత్ర పోషించారు. దక్షిణాదిలోనే బలమైన కాకతీయ రాజ్యానికి వ్యతిరేకంగా ఆదివాిసీ స్త్రీలు సమ్మక్క-సారక్క చేసిన పోరాటం అసాధారణం. బహుజన రాజ్యాధికార కాంక్షను సాకారం చేసిన సర్వాయి పాపన్న తన తల్లి దర్వాయి తన మార్గదర్శి అని ప్రకటించిన విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. ఆరుట్ల కమలాదేవి, కామ్రేడ్ రంగవల్లి ఉద్యమంలో స్త్రీల పాత్రను చాటి చెప్పే మహిళామణుల్లో కొందరు మాత్రమే. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్న బతుకమ్మ సైతం ‘అమ్మ’రూపంలో ఉండటం తెలంగాణలో స్త్రీల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్తోంది. మలిదశ ఉద్యమంలో పురుషులకు దీటుగా వందలు, వేలుగా స్త్రీలు గజ్జెకట్టి పోరులో నిలిచి ధూం-ధాంలతో ప్రజల్లో చైతన్యం రగిల్చి ఆంక్షల సంకెళ్లు తెంచడంలో తమ వంతు పాత్ర పోషించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరులో పోలీసుల లాఠీదెబ్బలు ఎదుర్కొనడమే కాకుండా చంటిబిడ్డతో రెండు నెలల పాటు జైలు జీవితం అనుభవించిన కామ్రేడ్ కరుణ వంటి పోరాటయోధుల భాగస్వామ్యం ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉంది. ఉస్మానియా విద్యార్థినులు పోరు దారిలో నిలిచి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. డజన్ల కొద్ది కేసులు ఎదుర్కొని నెలల పాటు తెలంగాణ సాధన కోసం జైల్లో ఉన్న ఆడబిడ్డగా నేను గర్విస్తున్నా. తెలంగాణ సాధన కోసం అమరులయిన తమ బిడ్డల ఆకాంక్ష నెరవేర్చేందుకే ప్రత్యక్ష పోరులో నిలిచిన మాతృమూర్తులకు జోహార్లు. ఆడబిడ్డలం వేదికగా ఏర్పడి అమరుల తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచేందుకు, తెలంగాణవాదులకు మద్దతు అందించేందుకు తెలంగాణలో పర్యటించాం. ఆత్మీయతను పంచేందుకు అమ్మల సంఘంగా ఏర్పడిన మాతృమూర్తులు ఉన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఎప్పటికీ విఫలం కాదని చరిత్ర చెప్తోంది. దానికి నిదర్శనమే తెలంగాణ సాకారం. ఇందులో కొన్ని వర్గాలతో పాటు స్త్రీలే కాకుండా సబ్బండ వర్ణాల సంకల్పం ఉంది. బహుజన బతుకమ్మతో తెలంగాణలో అట్టడుగు వర్గాలకు దక్కాల్సిన ప్రాధాన్యాన్ని చాటి చెప్పాం. చాకలి ఐలమ్మను తెలంగాణ తల్లికి ప్రతీకగా నిలిపి ఆమె పోరాట చరిత్రను జగతికి వెల్లడించాం. తెలంగాణ ఏకమై తన సత్తా చాటిన మిలియన్ మార్చ్, సాగరహారం వంటి పోరు ఘట్టాలలో, సకల జనుల సమ్మెలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక వర్గాలతో పాటు పోరాటంలో మేము సైతం అని నినదించిన తెలంగాణ వీర వనితలు ఉన్నారు. తెలంగాణ కల సాకారమైన వేళ సావూజిక తెలంగాణ సాధనకు అడుగులు వేయూలంటే అందులో ఆడవాళ్లకు అగ్రతాంబూలం ఇవ్వాల్సిందే! -
మహిళలే నిర్ణేతలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మహిళ.. ఆమె ఓ శక్తి. ఆదిపరాశక్తి. ఆమె కన్నెర్ర చేసిందంటే సమాజానికే వణుకు. కానీ ప్రేమ, ఆప్యాయతలను పంచడంలో, కుటుంబ పాలనలో ఆమె చూపించే ఓపిక వర్ణించలేనిది. పితృస్వామ్య సమాజంలో అనేక అవమానాలు, అణచివేతలకు గురవుతున్నా.. సంప్రదాయాలు, విలువలు విస్మరించకుండా నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యమవుతోంది మహిళాలోకం. కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాకుండా కుటుంబ అభివృద్ధిలో, పిల్లల ఆలనాపాలనలో మమేకమై సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో నిమగ్నమైన జిల్లా మహిళా లోకం రానున్న ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడం గమనార్హం. అందుకే మహిళలు ఎటు మొగ్గు చూపితే జిల్లాలో వారే విజయం సాధించడం ఖాయం. నేతల రాతను మార్చి.. వారి భవిష్యత్తును నిర్దేశించే శక్తి జిల్లా మహిళా లోకానికి ఉంది. వైఎస్సార్ హయాంలో ఎంతో అభివృద్ధి జిల్లాలో మహిళల పరిస్థితి పరిశీలిస్తే చంద్రబాబు హయాంలో అడపాదడపా దీపం పథకం కింద గ్యాస్కనెక్షన్లు ఇవ్వడం తప్ప పెద్దగా ఒరిగిందేమీలేదనే చెప్పాలి. స్వయంసహాయక సంఘాలను ఏర్పాటు చేశారే కానీ వారు పొదుపు చేసుకున్న మొత్తాన్నే తిరిగి వారికి రుణం కింద ఇచ్చేవారు. మహిళల రుణాలకు సంబంధించి బాబు హయాంలో ఏ ఒక్క ఏడాదిలో రూ.100 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేదు. వైఎస్సార్ పాలన విషయానికి వస్తే స్వయం ఉపాధి కోసం డ్వాక్రారుణాలు, వృద్ధులు, వితంతు మహిళలకు పింఛన్లు, గ్యాస్‌సబ్సిడీ, పెద్ద చదువుల కలను సాకారం చేసేందుకు విద్యార్థినులకు ఉన్నత చదువులు, ఆర్థిక అభివృద్ధి ఉపకరించే ఐకేపీల ద్వారా ధాన్యం కొనుగోళ్లు, వృద్ధాప్యంలో అసరాగా నిలిచే అభయ హస్తం లాంటి పథకాలు ఎన్నో అమలు చేశారు. బాలికా సంరక్షణ పథకం (జీసీపీఎస్) ద్వారా ఒక ఆడబిడ్డ జన్మిస్తే రూ.లక్ష, ఇద్దరు ఆడపిల్లలయితే రూ.30 వేల చొప్పున బీమా చేసిన ఘనత కూడా వైఎస్‌కే దక్కింది. ఇక, వైఎస్ చనిపోయిన తర్వాత ఈ పథకం కింద జిల్లాకు నిధులే మంజూరు కాలేదు. కొత్త లబ్ధిదారుల మాట అటుంచితే... పాత లబ్ధిదారుల బీమా ప్రీమియం చెల్లింపునకు కూడా కిరణ్ సర్కారు నిధులివ్వలేదు. ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానని చెప్పిన వెఎస్ జిల్లా మహిళల కోసం రూ వేలకోట్లు ఖర్చు చేశారు. తాను అధికారంలోనికి వచ్చిన తర్వాత దాదాపు రూ.1000 కోట్ల రూపాయలు కేవలం మహిళలకు పావలా వడ్డీ రుణాల కిందే అందజేశారు. 2004లో తాను అధికారంలోనికి వచ్చిన ఏడాది జిల్లాకు డ్వాక్రారుణాల బడ్జెట్ 39 కోట్లుంటే దానిని రూ.290 కోట్లకు పెంచారు. వైఎస్ అధికారంలోనికి వచ్చేనాటికి జిల్లాలో ఉన్న స్వయంసహాయక సంఘాల సంఖ్య 12వేలుంటే ఆ సంఘాల సంఖ్యను 32వేలకు పెంచారు. ఇక జిల్లాలోని మహిళలు చైతన్యశీలురనే అభిప్రాయం ఉంది. పోరాటాల పురిటిగ డ్డగా పేరుగాంచిన మెతుకుసీమ జిల్లా వ్యాప్తంగా మహిళలు తమదైన రీతిలో రాణిస్తున్నారు. వంటింటికే పరిమితం కాకుండా కుటుంబ ఆర్థిక, సామాజిక హోదాను పెంచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. రానున్న ఎన్నికలలో వీరు తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనూ మహిళలు కీలకపాత్ర పోషించారు. ఉద్యోగసంఘాలు, రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తెలియజేస్తూ తెలంగాణ కోసం కృషి చేశారు. ఇప్పుడు వీరి దృష్టంతా ‘నవ తెలంగాణ’పైనే ఉంది. ముఖ్యంగా మహిళల స్థితిగతులను సమూలంగా మార్చి వేసే నాయకత్వానికి పట్టం కట్టే ఆలోచనలో జిల్లా మహిళలు ఉన్నారు. ఓ అన్నగా, ఓ తండ్రిగా, ఓ తమ్ముడిగా అక్కున చేర్చుకుని ఆదరించే పాలకులను ఎన్నుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న మహిళా లోకం ఎన్నికల్లో ఎవరికి పట్టం కడుతుందో వేచి చూడాల్సిందే. మారాణులూ... మీదే నిర్ణయం... మీదే భవిష్యత్తు. -
యువత చేతుల్లోనే..
నవ తెలంగాణ నిర్మాణంలో వారిదే కీలక పాత్ర కొత్త రాష్ట్రంలో సామాజిక అనుబంధాలను బలోపేతం చేయడంతో పాటు ఆర్థికాభివృద్ధి, రాజకీయ సుస్థిరతలను నెలకొల్పే నిర్మాణాత్మక ప్రక్రియలో తెలంగాణ ప్రజలందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత తెలంగాణ యువతపై ఉంది. తమ ఆశయాలు ప్రభుత్వ అజెండాలో, విధాన ప్రక్రియలో భాగమ య్యేలా.. వేగంగా మార్పు చెందుతున్న రాజకీయ వ్యవస్థలో తమ వాణి కూడా వినిపించేలా.. సమ్మిళిత, ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ యువత కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉంది. మరో విధంగా చెప్పాలంటే, తమపై ప్రభావం చూపే వ్యవస్థాపరమైన నిర్మాణాల సమగ్ర సంస్కరణల కోసం వారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ‘ప్రెజర్ గ్రూప్’ బాధ్యతను కొనసాగించాల్సి ఉంది. ముఖ్యంగా నూతన ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడే ఆర్థికాభివృద్ధి కోసం.. తమ వాణిని వినిపించే విషయంలో, భాగస్వామ్యాన్ని కోరే విషయంలో తమ డిమాండ్లను పట్టించుకునే వ్యవస్థ కోసం పని చేయాల్సి ఉంది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగావకాశాల్లో తగ్గుదల ఉన్నప్పటికీ.. ఆ ఉద్యోగాల వల్ల లభించే ఉద్యోగ భద్రత, అధిక వేతనాల వల్ల యువత ఆ ఉద్యోగాలు సంపాదించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంది. అదీకాక, ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న కోరిక తామేం చదవాలన్న విషయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతగా ఉండే డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారే కానీ ప్రైవేటు రంగ ఉద్యోగాలకు, స్వయం ఉపాధికి ఉపయోగ పడే డిగ్రీలు, లేదా వృత్తి నైపుణ్యాలు నేర్చుకునేందుకు వారు ప్రయత్నించడం లేదు. దాంతో మార్కెట్ అవసరాలకు.. విద్యార్థులు నేర్చుకుంటున్న నైపుణ్యాలకు మధ్య చాలా అంతరం ఉంటోంది. అందువల్ల ప్రైవేటు రంగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలనిచ్చే కోర్సులను రూపొందించే విధంగా ప్రభుత్వ విధానాలను యువత ప్రభావితం చేయాల్సి ఉంది. సంప్రదాయ విద్యా విధానంలో మార్పులు చేయడం ద్వారా కానీ, కొత్త కోర్సుల రూపకల్పన ద్వారా కానీ విద్యార్థుల వృత్తి నైపుణ్యాలను పెంచే దిశగా ప్రభుత్వంపై యువత ఒత్తిడి తేవాల్సి ఉంది. ప్రపంచీకరణ ప్రయోజనాలను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్యాలను పెంచుకునే విషయంపై తెలంగాణ యువత దృష్టి పెట్టాలి. తెలంగాణ యువతలోని కొన్ని వర్గాల్లో స్వయం ఉపాధిపై, సొంతంగా పరిశ్రమలు స్థాపించడంపై ఆసక్తి ఉంది. దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే విషయంలో కూడా వాస్తవం ఉంది. అయితే, సరైన రుణ సదుపాయాలు కల్పించడంలో కానీ, వ్యాపార నిర్వహణలో సహకారం విషయంలో కానీ ఉన్న అనేక అడ్డంకులు వారిని వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. వ్యాపారావకాశాల్లో, ఉద్యోగ కల్పనలో అభివృద్ధికి అవకాశం ఉన్న ఈ రంగంపై యువత దృష్టి పెట్టాలి. చిన్న, మధ్య తరహ పరిశ్రమల స్థాపనకు నడుం కట్టాలి. దీనివల్ల నిరుద్యోగ సంక్షోభానికి కూడా సమాధానం లభిస్తుంది. ప్రభుత్వ సహాయంపై ఆధారపడటం కాకుండా, తమ జీవితాల్లో నిజమైన మార్పు రావడానికి యువత వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వినూత్న ఆవిష్కరణల అభివృద్ధిని నిరుద్యోగ సంక్షోభానికి పరిష్కారంగా భావించవచ్చు. నూతన అభివృద్ధిదాయక తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం యువత సానుకూల చైతన్యంతో, అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంది. ఆకలి, అభిలాష, స్ఫూర్తి, పట్టుదల, అద్భుత శక్తి కలిగిన యువత.. తెలంగాణ నవ నిర్మాణంలో తన వంతు పాత్ర కచ్చితంగా పోషించగలదు. ఆరు దశాబ్దాల పోరాటం ఫలించింది. 2014 నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మనుగడ మొదలు పెట్టనుంది. ఈ నేపథ్యంలో తమ ఆశలకు, ఆశయాలకు ప్రతిరూపమైన బంగారు తెలంగాణను రూపొందించుకునేందుకు యువత పోషించాల్సిన పాత్ర, అనుసరించాల్సిన వ్యూహం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. - ప్రొఫెసర్ కె.స్టీవెన్సన్ జర్నలిజం విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం మార్పు కోసం పరితపిస్తారు ‘‘వచ్చే ఎన్నికల్లో యువతీ యువకుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 30 ఏళ్ల లోపు యువకుల్లో సహజంగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. సెంటిమెంటుతో కూడిన భావోద్వేగాల ఆధారంగా వారు ఓట్లు వేసే అవకాశముంది. తమలా ఉండే నాయకుని వైపే వారు మొగ్గుతారు. వారికి కులం, మతం పట్టవు. సమాజం కోసం పాటుపడే వారికి మాత్రమే ఓటు వేస్తారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారు. - ఎ.వి.రంగనాథ్, ఎస్పీ, ఖమ్మం జిల్లా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు ‘‘యువ ఓటర్లు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. నమ్మిన పార్టీకే నిర్భయంగా ఓటేస్తారు. సుపరిపాలను, జవాబుదారీతనాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పార్టీ కంటే ముఖ్యంగా నేతను చూసి ఓటేసే అవకాశముంది. అభ్యర్థి నచ్చకపోతే ‘నోటా’ మీట నొక్కేవారిలో యువకులే అధికంగా ఉంటారు’’ - సిద్ధార్థ జైన్, కలెక్టర్, పశ్చిమగోదావరి జిల్లా ఆలోచించి ఓటేస్తారు ‘‘సాధారణ ఓటర్లు ప్రలోభాలకు గురవుతుంటారు. కానీ యువతీ యువకులు మాత్రం అలాగాక మంచీ చెడు ఆలోచిస్తారు. ఎవరు సరైన నాయకుడో పరిశీలించి ఓటేస్తారు. దీనివల్ల మనం సరైన నాయకత్వాన్ని చూసే అవకాశముంటుంది’’ - డాక్టర్ నిఖిత, ఉస్మానియా ఆసుపత్రి, హైదరాబాద్ ‘రెడీమేడ్’తో బతుకు ఛిద్రం వృత్తిపథం: స్వర్ణకారులు మేం చేసే ఆభరణాలు మగువల ఒంటిపై మెరుస్తాయి గానీ మా బతుకులు మాత్రం మెరవడం లేదు. మార్కెట్లోకి వస్తున్న రెడీమేడ్ వస్తువులు మా బతుకులను ఛిద్రం చేస్తున్నాయి. దీనికి తోడు పెద్దపెద్ద కంపెనీలు సైతం నగల దుకాణాలు ప్రారంభించడంతో మా బతుకులు దుర్భరం గా మారుతున్నాయి. ఎవరూ మా సమస్యలను పట్టించు కున్న పాపాన పోవడం లేదు. మా సామాజిక వర్గం నుంచి ఏ పార్టీలోనూ గట్టి ప్రతినిధి లేకపోవడం వల్ల మా సమ స్యలు బయటకు రాకుండా పోతున్నాయి. ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు ఆ తర్వాత మా సమస్యలు చెప్పేందుకు వెళ్తే కనీసం కలవడానికి కూడా ఇష్టపడడం లేదు. మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా వస్తున్న రెడీమేడ్ ఆభరణాలతో మేం పోటీ పడలేక పోతున్నాం. దాంతో పూట గడవక పస్తులుండాల్సి వస్తోంది. ప్రస్తుతం బంగారం పనులు లేక వెండి పనులు చేస్తూ పొట్టపోసు కుంటున్నాం. ఒకప్పుడు పెళ్లిళ్ల సీజన్లో మా దుకాణాలు కిటకిటలాడేవి. కానీ ఇప్పుడు ఒక్కరు కూడా రావడం లేదు. సంప్రదాయ ఆభరణాలపై మోజు తగ్గిన మహిళలు తేలికపాటి మిషన్ తయారీ ఆభరణాలపై మక్కువ చూపుతున్నారు. దాంతో ఉపాధి లేక, వేరే పని చేయలేక రోడ్డన పడాల్సిన దుస్థితి దాపురించింది. ఇంత నరకం అనుభవిస్తున్నా కనీసం మా గురించి మాట్లాడేవారే కరువవడం మాకు బాధగా ఉంది. - టి.వెంకటాచారి, వనపర్తి, మహబూబ్‌నగర్ యూత్ పార్టీ తిరుగుబాటు స్వభావం గల కొందరు యువకులు అమెరికాలో ఈ పార్టీని 1967లో ప్రారంభించారు. ఈ పార్టీ కార్యకర్తలను ‘యిప్పీ’లనే వారు. అమెరికా అధ్యక్ష పదవికి 1968లో జరిగిన ఎన్నికల్లో అడవి పందిని అభ్యర్థిగా బరిలోకి దించి ఈ పార్టీ అందరి దృష్టినీ ఆకర్షించింది. పేరుకు ఇది రాజకీయ పార్టీయే అయినా, చిత్ర విచిత్ర విన్యాసాలతో మీడియాను ఆకట్టుకునే ప్రయత్నాలు, విచిత్రమైన నిరసనల ద్వారానే ప్రచారంలోకి వచ్చింది. పాతికేళ్లకే ఎమ్మెల్యే అప్పుడు ఆమె వయసు కేవలం 25 ఏళ్లు. డాక్టరు కోర్సు చదివి ప్రజా సేవ చేద్దామనుకున్నారు. అనుకోని విధంగా నేతగా మారి ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. దేశంలోనే పిన్నవయసు ఎమ్మె ల్యేగా గుర్తింపు పొందారు. ఆమే డాక్టర్ బాణోతు చంద్రావతి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికలలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తరఫున తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఖమ్మం రూరల్ మండలం పెదతండా ఆమె స్వగ్రామం. లంబాడా (ఎస్టీ) సామాజిక వర్గానికి చెందిన ఆమె కుటుంబం మొదటి నుంచి సీపీఐలో ఉంది. ఆమె తండ్రి రామ్మూర్తి ఆర్టీసీలో డిపో మేనేజర్. తాతయ్య బీక్యా నాయక్ పార్టీలో చురుకుగా పనిచేసేవారు. జిల్లా కమ్యూనిస్టు యోధుడు రజబ్ అలీకి శిష్యుడుగా గుర్తింపు పొందారు. నియోజకవర్గాల పునర్విభజనతో వైరా ఎస్టీ వర్గానికి రిజర్వ్ కావడంతో బీక్యా నాయక్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆ కుటుంబం నుంచి ఎవరికైనా టికెట్ ఇవ్వాలని పార్టీ భావించింది. దాంతో విద్యాధికురాలు అయిన చంద్రావతికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదిం చారు. అప్పుడే ఆమె విశాఖలో మెడిసిన్ ఫైనలియర్ పూర్తి చేశారు. వెంటనే ఆమెను పార్టీ సంప్రదించడం... ఆమె అంగీకరించడం... పార్టీ అభ్యర్థిగా ఖరారు కావడం... విజయం సాధించడం.. అన్నీ చకాచకా జరిగిపోయాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ సురేశ్‌ను ఆమె కులాంతర వివాహం చేసుకున్నారు. - సాక్షి ప్రతినిధి, ఖమ్మం