అన్ని జేఏసీలను ఏకం చేసేందుకు కోదండరాం సిద్ధమేనా?
తెలంగాణ రాష్ట్ర సాధన ఎవరి విజయం? అడుగడుగున ఊపిరులూదిన ఉత్పత్తి శక్తులదా? ఆ శక్తుల త్యాగాలపైనే ఏర్పడ్డ పార్లమెంటరీ వ్యవస్థదా? ఈ ప్రశ్నకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచణ నేత లు జవాబు చెప్పాలి. కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థుల వల్లే తెలంగాణ సాధ్యమనే నిజాన్ని ఒప్పుకుంటే... తెలంగాణ రాజకీయ జేఏసీృఇప్పుడు ఆ వర్గాలకే పరిమితమవ్వాలి. ఆ ఆలోచన ప్రొఫెసర్ కోదండరాంకు ఉందా? అన్ని ఐక్య కార్యాచణలను ఏకం చేసేందుకు సిద్ధమేనా? జనం కోరుకున్న తెలంగాణ పునర్ నిర్మాణానికి ఆయన అడుగులేస్తారా? ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వేదకుమార్ వేస్తున్న ప్రశ్నలివి.
తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది చనిపోవడం దురదృష్టకరమే. దీనికి రాజకీయ జేఏసీనే కారణం. వాళ్ళ నాయకత్వమే పొట్టనబెట్టుకుంది. రాష్ట్ర సాధన కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కో అగ్ని కణమై లేచారు. ఎక్కడికక్కడ జేఎసీలుగా ఏర్పడ్డారు. వీటన్నింటికీ నాయకత్వం వహించేందుకు తెలంగాణ ఐక్య కార్యాచణ కమిటి ముందుకొచ్చింది. కానీ ఆ తర్వాత రాజకీయ పార్టీల పంచన చేరింది. అవకాశ ధోరణితో పార్టీలు అవసరమైనప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపాయి. అవసరం లేనప్పుడు నీరుగార్చాయి. ఈ నైరాశ్యం నుంచే ఆత్మహత్యలు జరిగాయి.
ఆశించినంత పాత్ర లేదు ...
టీజేఏసీ అనుకున్న మేర ముందుకెళ్ళలేదు. ఆంక్షల తెలంగాణ ఎవరు కోరుకున్నారు? పోలవరం ప్యాకేజీ, ముంపు గ్రామాల బదలాయింపు, పదేళ్ళ ఉమ్మడి రాజధాని, గవర్నర్ చేతికి హైదరాబాద్‌పై అధికారం... ఇవన్నీ ఆంక్షలు కావా? జేఏసీ ఏం చేసింది? సొంత ఎజెండాతో ఎందుకు ముందుకెళ్ళలేదు?
ఇప్పుడీ విజయం ఎవరిది?
ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. సాకారమైన తెలంగాణను రాజకీయ పార్టీలు గుప్పిట్లోకి తీసుకుంటున్నాయి. రాష్ట్ర సాధన కోసం నిరంతర పోరు చేసిన ఉత్పత్తి శక్తులు (కవులు, కళాకారులు, ఉద్యోగులు,విద్యార్థులు, రచయితలు, మేధావులు) వెనక్కు తగ్గాయి. అప్పట్లో అని వార్యమై రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలు మద్ధతునిచ్చాయి. ఉద్యమాలతో పాటు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారానే తెలంగాణ సాధ్యమని ఆనాడు భావించాయి. దీన్ని పార్టీలు హైజాక్ చేశాయి. ఉద్యమ శక్తుల త్యాగాలకు గుర్తింపు లేకుండా చేస్తున్నాయి.
ఉద్యమ శక్తులు శాసిస్తాయి...
ఉద్యమశక్తులు పాలించకపోయినా..శాసిస్తాయి. ప్రజలు, ప్రజా సంఘాలిచ్చే సూచనలే జనం మెచ్చేవిగా ఉంటాయి. రాజకీయ జేఏసీ అయినా ప్రజా సంఘాల అభిప్రాయాలు తీసుకుంటుందా? ఇప్పటికైనా కోదండరాం పార్టీల పంచ నుంచి బయటపడాలి. ప్రజా ఉద్యమ సంఘాల చెంతకు రావాలి. యువరక్తం నాయకత్వం వహించాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పుడున్న పార్లమెంటరీ శక్తులపై ప్రజలకు విశ్వాసం లేదు. 44 ఏళ్లలో తెలంగాణ ఎంత దోపిడీకి గురైందో.. ఈ 13 ఏళ్ళలోనూ ఆదే స్థాయిలో దోపిడీ కొనసాగింది. ప్రజా సంఘాలు మద్దతిచ్చి ఎన్నుకున్న పార్టీల చరిత్ర ఇది. వీళ్ళే మళ్ళీ అధికారందక్కించుకునేందుకు ముందుకొస్తున్నారు.
డబ్బుతో సీట్ల జూదం ఆడుతున్నారు. ప్రజలు చాలా కోరుకుంటున్నారు. నిజానికి ఆ ఆశలు మనమే కల్పించాం. నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని చెప్పాం. హరిజన, గిరిజన అభ్యున్నతికి బాటలు వేస్తామన్నాం. కేంద్రంలో ఎవరు వస్తారో చూసుకుని ప్రణాళికలు తయారు చేస్తే తెలంగాణ ఆశలు ఎలా నెరవేరుతాయి? పోలవరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణకు అవసరం లేదు. గ్రామీణ జీవన విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. చేతి వృత్తులను ప్రోత్సహించాలి. ఇక మీదట హైదరాబాద్ జనాభా పెరిగితే ప్రమాదమే. దీన్ని నివారించాలంటే ముందు గా పట్టణీకరణ ఆపాలి. గ్రామాల్లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఊతం ఇవ్వాలి. ఎక్కడ ఏ పరిశ్రమలు కావాలో ప్రజలే నిర్ణయించాలి. ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ వైద్యశాలలకు మెరుగైన వసతులు కల్పించాలి. ఇప్పుడున్న రాజకీయ పార్టీలతో ఇది సాధ్యం కాదు.
మరెలా?
తెలంగాణ వచ్చిందని, ఇక తమ పనిలేదని నిద్రాణ స్థితిలో ఉన్న మేధావి వర్గం కళ్ళు తెరవాలి. సాకారమైన తెలంగాణను జనాభీష్టం మేరకు తయారు చేసే ఉద్యమ కేంద్రాలు కావాలి. పార్టీల మెడలు వంచి ప్రజల మేనిఫెస్టో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఈ దిశగా ప్రజా సంఘాలు జాగృతం కావాలని కోరుకుందాం.
జన తెలంగాణ
మాట మీద నిలబడే నేత కావాలి...
ఇచ్చిన మాట మీద నిలబడే నాయకున్ని ఎన్నుకోవడమే ఓటర్ల ప్రధాన బాధ్యత. తెలంగాణ నవ నిర్మాణంలో యువత ప్రధాన పాత్ర పోషించాలి. ఇరుప్రాంతాలను అభివృద్ది చేయడం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యం. ఆయన మాత్రమే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సువర్ణయుగాన్ని తేగలరు. ఆరోగ్యశ్రీ, అమ్మఒడి లాంటి పథకాలు రెండు రాష్ట్రాల్లో అమలు కావాలి.
- చింతకింది శ్రీహరి
మన్‌పహాడ్, దేవరుప్పుల మండలం, వరంగల్ జిల్లా
పరిశ్రమలకు టాక్స్ హాలిడే ఇవ్వాలి..
తెలంగాణలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పదేళ్లపాటు పరిశ్రమలకు టాక్స్ హాలిడే ప్రకటించాలి. నిరుద్యోగులకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించాలి. ప్రైవేటు రంగంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించాలి. దీనివల్ల విద్యుత్ సంక్షోభం తీరడంతో పాటు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. వ్యవసాయానికి రాజశేఖర్‌రెడ్డి తరహాలో ప్రోత్సాహం కల్పించాలి. గోదావరి తీరంలో ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేయాలి. చిత విద్యుత్ కొనసాగించాలి. పర్యాటక, దేవాదాయ శాఖల్లో కొత్త ఉద్యోగాల కల్పనకు అవకాశాలున్నాయి. సమసమాజ లక్ష్యంగా ప్రజలు కలలు గన్న తెలంగాణ నిర్మాణం జరగాలి.
- వసంతరాయ్ తోట, రెడ్డి కాలనీ, మిర్యాలగూడ
వనరుల సద్వినియోగం...
సంపదను సక్రమంగా వినియోగించే సమర్థులు అధికారంలోకి రావాలి. అవినీతి, స్వార్థం లేని నాయకుల వల్లనే ఇది సాధ్యం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రవాణా సౌకర్యా లను మెరుగుపర్చాలి. తెలంగాణ మరిం త వేగంగా అభివృద్ధి జరగాలంటే రవా ణా సదుపాయాలు పెరగాలి. ప్రధానం గా రైలుమార్గాల విస్తరణకు కృషి చేయా లి. వ్యవసాయంతో పాటు పాడి పరి శ్రమ అభివృద్ధిమీద దృష్టి సారించాలి. నిర్భంద విద్యను అమలుచేసి పదేళ్లలో నిరక్షరాస్యులు లేని రాష్ట్రంగా తయారు చేయాలి. నైజాం ఆభరణాలను అమ్మి బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఖర్చుచేయాలి.
- మంద నారాయణమూర్తి, హైదరాబాద్
ఇంకెందుకు రాజకీయ పంచన?
Published Thu, Apr 3 2014 1:30 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM
Advertisement